వచ్చే నెలలో లీ చోంగ్ వీ ‘బి' శాంపిల్ పరీక్ష
కౌలాలంపూర్: డోపింగ్‌లో పట్టుబడిన మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ‘బి’ శాంపిల్‌ను వచ్చే నెల 4 లేదా 5న పరీక్షించనున్నారు. ఈ రెండు రోజుల్లో ఏదో ఓ తేదీని నిర్ణయించుకోవాలని అంతర్జాతీయ సమాఖ్య... తమ అసోసియేషన్‌కు సూచించిందని మలేసియా క్రీడల మంత్రి ఖైరీ జమాలుద్దీన్ తెలిపారు. అయితే ఈ అంశంపై అథ్లెట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
తేదీ ఖరారైతే అథ్లెట్ ఓస్లో వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పిన మంత్రి ‘బి’ శాంపిల్‌ను ఆటగాడి ముందరే పరీక్షిస్తారని స్పష్టం చేశారు. ‘లీకి సంబంధించిన ఇటీవలి వైద్య నివేదికలను పరిశీలిస్తాం. అసలు ఆ డ్రగ్ ఎలా వచ్చిందో కనుక్కుంటాం’ అని మంత్రి వెల్లడించారు. కోపెన్‌హగన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా లీ చోంగ్ వీ నిషేధిత ఉత్ప్రేరకం ‘డెక్సామీథసోన్’ను వాడినట్లు తేలింది. అయితే ఈ ఈవెంట్‌కు ముందు తన కండర గాయానికి స్టెమ్ సెల్స్‌తో చికిత్స చేయించుకున్నాడు.