
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్‌లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు.
అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్‌పై చర్యలు చేపట్టింది.
గతనెల భారత్‌కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్‌ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు.