హైదరాబాద్‌కు లీ చోంగ్ వీ... లక్నోకు సైనా
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భారత స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మేటి క్రీడాకారుడు లీ చోంగ్ వీలకు అత్యధిక మొత్తం దక్కింది. లక్నోకు చెందిన అవధ్ వారియర్స్ సైనాను ... హైదరాబాద్ హంటర్స్ లీ చోంగ్ వీను చెరో లక్ష డాలర్లకు (రూ. 66 లక్షల 69 వేలు) సొంతం చేసుకున్నాయి. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధును 95 వేల డాలర్లకు (రూ. 63 లక్షల 35 వేలు) చెన్నై స్మాషర్స్... శ్రీకాంత్‌ను 80 వేల డాలర్లకు (రూ. 53 లక్షల 35 వేలు) బెంగళూరు టాప్‌గన్స్ జట్లు తీసుకున్నాయి.
సైనా నెహ్వాల్, లీ చోంగ్ వీలను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. దాంతో ఆదివారం రాత్రే లాటరీని నిర్వహించారు. లాటరీలో అవధ్ వారియర్స్‌కు సైనా... హైదరాబాద్ హంటర్స్‌కు లీ చోంగ్ వీ దక్కారు. సోమవారం మిగతా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. పీబీఎల్ జనవరి 2న ముంబైలో మొదలై 17న న్యూఢిల్లీలో ముగుస్తుంది.
మిగతా ఆటగాళ్ల వివరాలు: పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్ హంటర్స్-35 వేల డాలర్లు), సుమీత్ రెడ్డి (బెంగళూరు టాప్‌గన్స్-25 వేల డాలర్లు), మనూ అత్రి (ముంబై రాకెట్స్-25 వేల డాలర్లు), గుత్తా జ్వాల (హైదరాబాద్ హంటర్స్-30 వేల డాలర్లు), అశ్విని పొన్నప్ప (బెంగళూరు టాప్‌గన్స్-30 వేల డాలర్లు), హెచ్‌ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్-47 వేల డాలర్లు), వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా-ముంబై రాకెట్స్, 42 వేల డాలర్లు), రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్-ఢిల్లీ ఏసర్స్, 36 వేల డాలర్లు), టామీ సుగియార్తో (ఇండోనేసియా-ఢిల్లీ ఏసర్స్, 74 వేల డాలర్లు).