![Leopard Entered in Wedding Ceremony in Lucknow](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/chiruta-main.jpg.webp?itok=DhoL_UlN)
లక్నో: యూపీలోని లక్నోలో ఊహకందని ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా హఠాత్తుగా ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. దానిని చూసినవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
లక్నోలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్డులో గల ఎంఎం లాన్‌లో బుధవారం రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. అతిథులతో వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంది. అయితే ఇంతలో ఊహకందని రీతిలో ఒక చిరుత అతిథుల మధ్యకు ప్రవేశించింది. ఈ ఘటన లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 11.40 నిముషాల సమయంలో ఒక చిరుత పెళ్లి వేడుకల్లోకి చొరబడింది. దానిని చూసి హడలెత్తిపోయిన అతిథులు అ విషయాన్ని పోలీసులకు ఫోన్‌లో తెలియజేశారు. వెంటనే పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ ఘటన గురించి డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ స్థానికుడు దీపక్ కుమార్ సోదరి వివాహం జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందన్నారు. తమకు సమాచారం అందగానే ఒక పోలీసు బృందంతో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నదన్నారు. వెంటనే వారు కల్యాణ వేదికను ఖాళీ చేయించారని, అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అతిథులు విందు ఆరగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు. అటవీశాఖ అధికారులు మ్యారేజ్ హాలులోని రెండవ అంతస్తులో ఒక కుర్చీ వెనుక నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ హాలు తలుపులు మూసివేసి, దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కల్యాణ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామన్నారు.
ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా
Comments
Please login to add a commentAdd a comment