‘ట్రంప్’తో జంప్... | PBL kicks off tomorrow, to experiment with Trump match | Sakshi
Sakshi News home page

‘ట్రంప్’తో జంప్...

Published Mon, Jan 4 2016 3:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

‘ట్రంప్’తో జంప్... - Sakshi

‘ట్రంప్’తో జంప్...

* హైదరాబాద్ హంటర్స్ బోణీ
* బెంగళూరు టాప్‌గన్స్‌పై 3-2 పాయింట్ల తేడాతో గెలుపు
* మలుపు తిప్పిన ట్రంప్ మ్యాచ్‌లు
* లీ చోంగ్ వీకి శ్రీకాంత్ షాక్

ముంబై: చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠ ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’ నిబంధన హైదరాబాద్ హంటర్స్ జట్టును గట్టెక్కించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ విజయాన్ని దక్కించుకుంది. బెంగళూరు టాప్‌గన్స్‌తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 3-2 పాయింట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది.

మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరు జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా ఫలితం లేకపోయింది. మరోవైపు హైదరాబాద్ కీలకమైన రెండు ట్రంప్ మ్యాచ్‌ల్లో గెలిచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. బెంగళూరు టాప్‌గన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ హంటర్స్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)ను బోల్తా కొట్టించాడు.

అంతర్జాతీయ సర్క్యూట్‌లో లీ చోంగ్ వీతో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన శ్రీకాంత్ ఐదో ప్రయత్నంలో నెగ్గడం విశేషం.
 తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుపనిద (హైదరాబాద్) 8-15, 11-15తో సుయో ది (బెంగళూరు) చేతిలో ఓడిపోవడంతో హంటర్స్ జట్టు 0-1తో వెనుకపడింది. అయితే పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను తమ ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని కార్‌స్టెన్ మోగెన్‌సన్-మార్కిస్ కిడో (హైదరాబాద్) జంట 13-15, 15-9, 15-14తో హూన్ థీమ్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో హంటర్స్ 2-1 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఈ దశలో బెంగళూరు జట్టు వ్యూహాత్మక తప్పిదం చేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను తమ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించింది. అయితే ఈ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్) 15-14, 15-13తో సమీర్ వర్మ (బెంగళూరు)ను ఓడించాడు. హైదరాబాద్ ఖాతాలో పాయింట్ చేరగా... తమ ట్రంప్ మ్యాచ్‌లో ఓడిన బెంగ ళూరు పాయింట్ కోల్పోయింది. దీంతో హైదరాబాద్ 3-0 ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (బెంగళూరు) జంట 15-13, 15-13తో గుత్తా జ్వాల-మార్కిస్ కిడో (హైదరాబాద్) ద్వయంపై నెగ్గగా... చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో పోటీలో కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15-12, 6-15, 15-7తో లీ చోంగ్ వీ (హైదరాబాద్)పై సంచలన విజయం సాధించాడు. ఈ రెండు విజయాలతో బెంగళూరు ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఓవరాల్‌గా హైదరాబాద్ 3-2తో విజయాన్ని దక్కించుకుంది.
 
పీబీఎల్‌లో నేడు లక్నో x ఢిల్లీ రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
 
చెన్నై స్మాషర్స్ శుభారంభం
మరో మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్ జట్టును ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్‌కాక్-పియా జెబాదియా ద్వయం (చెన్నై) 15-10, 7-15, 15-11తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ బ్రైస్ లెవెర్‌డెజ్ (చెన్నై) 8-15, 11-15తో హెచ్‌ఎస్ ప్రణయ్ (ముంబై) చేతిలో ఓడిపోయాడు. ‘ట్రంప్ మ్యాచ్’ పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో-ఇవనోవ్ (ముంబై) జంట 15-10, 9-15, 15-13తో క్రిస్ అడ్‌కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జోడీని ఓడించి 3-1 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది.

విజేతగా నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై పైచేయి సాధించింది. మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి పీవీ సింధు (చెన్నై) 15-8, 11-15, 15-8తో హాన్ లీ (ముంబై)పై నెగ్గగా... తమ ‘ట్రంప్ మ్యాచ్’లో సిమోన్ సాంతోసో 15-9, 15-12తో గురుసాయిదత్ (ముంబై)ను ఓడించడంతో చెన్నై 4-3తో విజయాన్ని దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement