రికార్డుకు చేరువలో లీ చోంగ్ వీ
కౌలాలంపూర్: మరో విజయం సాధిస్తే... ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను అత్యధికసార్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన లీ చోంగ్ వీ నాలుగోసారి ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శనివారం జరిగిన సెమీఫైనల్లో లీ చోంగ్ వీ 21-14, 21-16తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. రికార్డుస్థాయిలో మూడుసార్లు ఈ టైటిల్‌ను సాధించిన మహిళల జోడి వాంగ్ జియోలీ-యూ యాంగ్ (చైనా); పురుషుల జంట మథియాస్ బో-కార్‌స్టెన్ మోగెన్సన్ (డెన్మార్క్) ఈసారి సెమీఫైనల్లోనే నిష్ర్కమించాయి. దాంతో అత్యధికసార్లు ఈ టైటిల్ సాధించనున్న రికార్డుకు లీ చోంగ్ వీ మరో విజయం దూరంలో ఉన్నాడు.