న్యూయార్క్: గత పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్‌కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు.
మూడు ఏస్‌లు సంధించిన అల్‌కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చిన అతను 28 సార్లు పాయింట్లు గెలిచాడు. నాలుగుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసిన అల్‌కరాజ్ తన సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. 2020లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్‌తో మెద్వెదెవ్ తలపడతాడు. 2021లో చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు.
వొండ్రుసోవాకు కీస్ షాక్
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment