సిన్సినాటి: నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో స్పెయిన్ సంచలనంగా మారిన కార్లొస్ అల్‌కరాజ్ సిన్సినాటి ఓపెన్‌లో ఓడిపోవడాన్ని ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయాడు. దీంతో కోర్టులోనే ఈ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ తన రాకెట్‌ను విరగ్గొట్టేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ అల్‌కరాజ్ 6–4, 6–7 (5/7), 4–6తో గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం అర్ధరాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది.
తొలి సెట్ గెలుపొందగా, రెండో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఈ దశలో మ్యాచ్ ఆగిపోగా మరుసటి రోజు టైబ్రేక్‌లో పుంజుకొని మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించవచ్చని అల్‌కరాజ్ భావించాడు. కానీ 37 ఏళ్ల వెటరన్ మోన్‌ఫిల్స్ పట్టుదలగా ఆడటంతో రెండో సెట్ అతని వశమైంది.
అదే జోరుతో ఆఖరి సెట్‌నూ నెగ్గిన మోన్‌ఫిల్స్ మ్యాచ్ గెలుపొందాడు. దీంతో తన ప్రదర్శన, మ్యాచ్ ఫలితంతో నిరాశచెందిన స్పెయిన్ స్టార్ రాకెట్ బద్దలుకొట్టాడు. తన కెరీర్‌లోనే ఇదో చెత్తమ్యాచ్ అని, దీన్ని త్వరగా మర్చిపోయి యూఎస్ ఓపెన్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పాడు. న్యూయార్క్‌లో ఈ నెల 26 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment