Cincinnati Open Tennis
-
ఎదురులేని సినెర్
మేసన్ (అమెరికా): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఐదో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మంగళవారం ముగిసిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో 23 ఏళ్ల సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో సినెర్ 7–6 (7/4), 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. సినెర్‌కు 10,49,460 డాలర్ల (రూ. 8 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టియాఫోతో గంటా 36 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ 13 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండుసార్లు టియాఫో సర్విస్‌ను బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చిన సినెర్ 11 సార్లు పాయింట్లు గెలిచాడు. టియాఫో ఓటమితో సిన్సినాటి ఓపెన్ టోర్నీలో అమెరికా ప్లేయర్‌ను విజేతగా చూసేందుకు మరో ఏడాది వేచి చూడాలి. చివరిసారి ఆండీ రాడిక్ రూపంలో 2006లో అమెరికా ప్లేయర్ సిన్సినాటి ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది సినెర్ ఫైనల్ చేరిన ఐదు టోర్నీల్లోనూ విజేతగా నిలువడం విశేషం. ఈ టోర్నీకి ముందు సినెర్ ఆ్రస్టేలియన్ ఓపెన్, మయామి మాస్టర్స్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, హాలె ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. డోపింగ్‌లో దొరికినా... ఈ ఏడాది మార్చిలో సినెర్ డోపింగ్‌లో పట్టుబడ్డాడని అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ వెల్లడించింది. సినెర్ నుంచి రెండుసార్లు సేకరించిన యూరిన్ శాంపిల్స్‌లో నిషేధిత ఉ్రత్పేరకం క్లోస్టెబోల్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో అతనిపై ఏప్రిల్ 4 నుంచి 5 వరకు... ఏప్రిల్ 17 నుంచి 20 వరకు సస్పెన్షన్ విధించారు. ఈ రెండుసార్లూ వెనువెంటనే సినెర్ సస్పెన్షన్ తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాడు. తాను ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉ్రత్పేరకం తీసుకోలేదని ... సహాయక సిబ్బంది గాయం తగ్గడానికి స్ప్రే చేయగా... అది తన శరీరంలోకి వచ్చి0దని ఇండిపెండెంట్ ప్యానెల్ ముందు సినెర్ వాదనలు వినిపించాడు. సినెర్ సమాధానాలతో సంతృప్తి చెందిన ప్యానెల్ సినెర్‌పై సస్పెన్షన్ విధించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. అయితే మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ లో అతను గెల్చుకున్న ప్రైజ్‌మనీని, ర్యాంకింగ్ పాయింట్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. సబలెంకా సూపర్... మరోవైపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో బెలారస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా కూడా తొలిసారి విజేతగా అవతరించింది. గతంలో మూడుసార్లు సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా ఈసారి మాత్రం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సబలెంకా 6–3, 7–5తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. సబలెంకాకు 5,23,485 డాలర్ల (రూ. 4 కోట్ల 38 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సబలెంకా ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా సబలెంకా కెరీర్లో ఇది 15వ సింగిల్స్ టైటిల్. తాజా విజయంతో సబలెంకా సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. -
స్వియాటెక్‌పై సబలెంకా పైచేయి
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ నుంచి మహిళల టెన్నిస్ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) నిష్క్రమించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వియాటెక్‌తో 12వ సారి తలపడిన సబలెంకా నాలుగోసారి విజయాన్ని అందుకుంది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ సీజన్లో ఐదో టోర్నీలో ఫైనల్ చేరిన సబలెంకా తదుపరి ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకుంటుంది. జెస్సికా పెగూలా (అమెరికా), పౌలా బదోసా (స్పెయిన్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో సబలెంకా తలపడతుంది. -
అల్కరాజ్ అనూహ్య పరాజయం
సిన్సినాటి: నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో స్పెయిన్ సంచలనంగా మారిన కార్లొస్ అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్‌లో ఓడిపోవడాన్ని ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయాడు. దీంతో కోర్టులోనే ఈ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ తన రాకెట్‌ను విరగ్గొట్టేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ అల్కరాజ్ 6–4, 6–7 (5/7), 4–6తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం అర్ధరాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. తొలి సెట్ గెలుపొందగా, రెండో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఈ దశలో మ్యాచ్ ఆగిపోగా మరుసటి రోజు టైబ్రేక్‌లో పుంజుకొని మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించవచ్చని అల్కరాజ్ భావించాడు. కానీ 37 ఏళ్ల వెటరన్ మోన్ఫిల్స్ పట్టుదలగా ఆడటంతో రెండో సెట్ అతని వశమైంది. అదే జోరుతో ఆఖరి సెట్‌నూ నెగ్గిన మోన్ఫిల్స్ మ్యాచ్ గెలుపొందాడు. దీంతో తన ప్రదర్శన, మ్యాచ్ ఫలితంతో నిరాశచెందిన స్పెయిన్ స్టార్ రాకెట్ బద్దలుకొట్టాడు. తన కెరీర్లోనే ఇదో చెత్తమ్యాచ్ అని, దీన్ని త్వరగా మర్చిపోయి యూఎస్ ఓపెన్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పాడు. న్యూయార్క్‌లో ఈ నెల 26 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జరుగుతుంది. -
తొలి రౌండ్లోనే సుమిత్ పరాజయం
సిన్సినాటి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం క్వాలిఫయింగ్‌లోనే ముగిసింది. తొలి రౌండ్లో ప్రపంచ 74వ ర్యాంకర్ సుమిత్ 2–6, 4–6తో ప్రపంచ 119వ ర్యాంకర్ మెకంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్విస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.. సుమిత్‌కు 7,290 డాలర్ల (రూ. 6 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
55 ఏళ్ల తర్వాత మరో టీనేజ్ చాంపియన్‌గా చరిత్ర.. ఆమె ఎవరంటే?
సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల కోకో గాఫ్ 6–3, 6–4తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి తన కెరీర్లో తొలి మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కోకో గాఫ్‌కు 4,54,500 డాలర్ల (రూ. 3 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది ఈ గెలుపుతో 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన టీనేజ్ ప్లేయర్‌గా కోకో గుర్తింపు పొందింది. 1968లో అమెరికాకే చెందిన 17 ఏళ్ల లిండా టుయెరో విజేతగా నిలిచింది. లెక్క సరిచేసిన జొకోవిచ్ ఒహాయో: సెర్బియా టెన్నిస్ యోధుడు జొకోవిచ్ తన కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు. రెండో సెట్ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి జొకోవిచ్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది 95వ సింగిల్స్ టైటిల్‌కాగా, కెరీర్లో 1,069వ విజయం. -
చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్
టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు. Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8 — Bleacher Report (@BleacherReport) August 21, 2023 3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది. One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6 — Tennis TV (@TennisTV) August 20, 2023 ఈ మ్యాచ్‌లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు. -
Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 7–6 (7/1), 6–3తో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2019లో ఈ టోర్నీ టైటిల్ సాధించిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)తో తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్ 7–6 (7/5), 5–7, 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో కామెరాన్ నోరీ (బ్రిటన్) 7–6 (7/4), 6–7 (4/7), 6–4తో మూడో సీడ్ అల్కారజ్ (స్పెయిన్)పై, బోర్నా చొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గారు. -
రాఫెల్ నాదల్కు నిరాశ
సిన్సినాటి: గాయం నుంచి కోలుకొని ఆరు వారాల తర్వాత బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు పునరాగమనంలో షాక్ తగిలింది. సిన్సిపాటి ఓపెన్ తొలి మ్యాచ్‌లోనే నాదల్ వెనుదిరిగాడు. క్రొయేషియాకు చెందిన బోర్నా కొరిక్ 7–6 (9), 4–6, 6–3 స్కోరుతో నాదల్‌ను ఓడించాడు. 2 గంటల 51 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. పొత్తి కండరాల్లో చీలికతో వింబుల్డన్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు తప్పుకున్న నాదల్ యూఎస్ ఓపెన్ సన్నాహకాల్లో భాగంగా ఈ టోర్నీలో ఆడాడు. -
Cincinnati Open 2022: తొలి రౌండ్లోనే సెరెనాకు చుక్కెదురు
సిన్సినాటి: తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్ టీనేజర్, గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. 19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్‌గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్‌ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్ (రొమేనియా), అనాబెల్ మెదీనా గారిగెస్ (స్పెయిన్), వీనస్ విలియమ్స్ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్ (బెల్జియం), జెలెనా జంకోవిచ్ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్ (అమెరికా), అలెక్సియా డెషామ్ బాలెరెట్ (ఫ్రాన్స్) కూడా సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచారు. -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
పరాజయంతో పునరాగమనం
సిన్సినాటి (అమెరికా): ఏడు నెలల తర్వాత సింగిల్స్ విభాగంలో పునరాగమనం చేసిన బ్రిటన్ టెన్నిస్ స్టార్, మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ ఆండీ ముర్రేకు నిరాశ ఎదురైంది. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. రిచర్డ్ గాస్కే(ఫ్రాన్స్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 4–6, 4–6తో ఓడిపోయాడు. జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ముర్రే ఆటకు దూరంగా ఉన్నాడు. ఒకానొక దశలో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావించాడు. అయితే గాయం నుంచి కోలుకోవడంతో జూన్‌లో మళ్లీ ఆటపై దృష్టి పెట్టాడు. డబుల్స్ విభాగంలో ఐదు టోర్నీల్లో ఆడాడు. సిన్సినాటి ఓపెన్‌లో తొలి రౌండ్లో ఓడిపోయినప్పటికీ తాను బాధ పడటంలేదని అన్నాడు. వచ్చే నెలలో జరిగే సీజన్‌లోని చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తాను సింగిల్స్ విభాగంలో పోటీపడటం లేదని స్పష్టం చేశాడు. మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు షరపోవా (రష్యా), వీనస్ విలియమ్స్ (అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 6–3, 7–6 (7/4)తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, వీనస్ 7–5, 6–2తో లారెన్ డేవిస్ (అమెరికా)పై విజయం సాధించారు. -
ఫైనల్లో ఫెడరర్
సిన్సినాటి (అమెరికా): కెరీర్ లో 99వ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్... కెరీర్లో 70వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకునేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో ఉన్నారు. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ ఇద్దరూ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/3), 1–1తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, జొకోవిచ్ 6–4, 3–6, 6–3తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. ఫెడరర్‌తో జరిగిన మ్యాచ్‌లో గాఫిన్ తొలి సెట్లో ఓడిపోయాక, రెండో సెట్లో స్కోరు 1–1 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా వైదొలిగాడు. -
సెమీస్‌లో సానియా జంటకు నిరాశ
ఒహాయో: సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా–షుయె పెంగ్ (చైనా) జంట సెమీఫైనల్లో నిష్క్రమించగా... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌ల్లో సానియా–షుయె పెంగ్ జంట 4–6, 6–7 (4/7)తో సు వీ సెయి (చైనీస్ తైపీ)–మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–షుయె పెంగ్లకు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను 6 సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా ఒక్కసారి మాత్రమే సఫలమయ్యారు. సానియా జంటకు 37, 278 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 91 వేలు)తోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. బోపన్న–డోడిగ్ జోడీ 1–6, 7–6 (7/5), 7–10తో లుకాజ్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బోపన్న జంటకు 37, 250 డాలర్ల (రూ. 23 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.