ఈ ఏడాది ఐదో టైటిల్ సొంతం
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచిన నంబర్‌వన్
రెండుసార్లు డోపింగ్‌లో దొరికి బయటపడ్డ ఇటలీ స్టార్
మేసన్ (అమెరికా): ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఐదో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మంగళవారం ముగిసిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో 23 ఏళ్ల సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో సినెర్ 7–6 (7/4), 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు.
సినెర్‌కు 10,49,460 డాలర్ల (రూ. 8 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టియాఫోతో గంటా 36 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ 13 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండుసార్లు టియాఫో సర్విస్‌ను బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చిన సినెర్ 11 సార్లు పాయింట్లు గెలిచాడు.
టియాఫో ఓటమితో సిన్సినాటి ఓపెన్ టోర్నీలో అమెరికా ప్లేయర్‌ను విజేతగా చూసేందుకు మరో ఏడాది వేచి చూడాలి. చివరిసారి ఆండీ రాడిక్ రూపంలో 2006లో అమెరికా ప్లేయర్ సిన్సినాటి ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది సినెర్ ఫైనల్ చేరిన ఐదు టోర్నీల్లోనూ విజేతగా నిలువడం విశేషం. ఈ టోర్నీకి ముందు సినెర్ ఆ్రస్టేలియన్ ఓపెన్, మయామి మాస్టర్స్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, హాలె ఓపెన్‌లలో టైటిల్స్ గెలిచాడు.
డోపింగ్‌లో దొరికినా...
ఈ ఏడాది మార్చిలో సినెర్ డోపింగ్‌లో పట్టుబడ్డాడని అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ వెల్లడించింది. సినెర్ నుంచి రెండుసార్లు సేకరించిన యూరిన్ శాంపిల్స్‌లో నిషేధిత ఉ్రత్పేరకం క్లోస్టెబోల్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో అతనిపై ఏప్రిల్ 4 నుంచి 5 వరకు... ఏప్రిల్ 17 నుంచి 20 వరకు సస్పెన్షన్ విధించారు. ఈ రెండుసార్లూ వెనువెంటనే సినెర్ సస్పెన్షన్ తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాడు.
తాను ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉ్రత్పేరకం తీసుకోలేదని ... సహాయక సిబ్బంది గాయం తగ్గడానికి స్ప్రే చేయగా... అది తన శరీరంలోకి వచ్చి0దని ఇండిపెండెంట్ ప్యానెల్ ముందు సినెర్ వాదనలు వినిపించాడు. సినెర్ సమాధానాలతో సంతృప్తి చెందిన ప్యానెల్ సినెర్‌పై సస్పెన్షన్ విధించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. అయితే మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ లో అతను గెల్చుకున్న ప్రైజ్‌మనీని, ర్యాంకింగ్ పాయింట్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
సబలెంకా సూపర్...
మరోవైపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో బెలారస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా కూడా తొలిసారి విజేతగా అవతరించింది. గతంలో మూడుసార్లు సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా ఈసారి మాత్రం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సబలెంకా 6–3, 7–5తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది.
సబలెంకాకు 5,23,485 డాలర్ల (రూ. 4 కోట్ల 38 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సబలెంకా ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా సబలెంకా కెరీర్‌లో ఇది 15వ సింగిల్స్ టైటిల్. తాజా విజయంతో సబలెంకా సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
Comments
Please login to add a commentAdd a comment