సిన్సినాటి (అమెరికా): ఏడు నెలల తర్వాత సింగిల్స్ విభాగంలో పునరాగమనం చేసిన బ్రిటన్ టెన్నిస్ స్టార్, మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ ఆండీ ముర్రేకు నిరాశ ఎదురైంది. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో అతను తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. రిచర్డ్ గాస్కే(ఫ్రాన్స్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 4–6, 4–6తో ఓడిపోయాడు. జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ముర్రే ఆటకు దూరంగా ఉన్నాడు. ఒకానొక దశలో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావించాడు.
అయితే గాయం నుంచి కోలుకోవడంతో జూన్‌లో మళ్లీ ఆటపై దృష్టి పెట్టాడు. డబుల్స్ విభాగంలో ఐదు టోర్నీల్లో ఆడాడు. సిన్సినాటి ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోయినప్పటికీ తాను బాధ పడటంలేదని అన్నాడు. వచ్చే నెలలో జరిగే సీజన్‌లోని చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తాను సింగిల్స్ విభాగంలో పోటీపడటం లేదని స్పష్టం చేశాడు. మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు షరపోవా (రష్యా), వీనస్ విలియమ్స్ (అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 6–3, 7–6 (7/4)తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, వీనస్ 7–5, 6–2తో లారెన్ డేవిస్ (అమెరికా)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment