
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ నుంచి మహిళల టెన్నిస్ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) నిష్క్రమించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వియాటెక్‌తో 12వ సారి తలపడిన సబలెంకా నాలుగోసారి విజయాన్ని అందుకుంది.
గంటా 47 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ సీజన్‌లో ఐదో టోర్నీలో ఫైనల్ చేరిన సబలెంకా తదుపరి ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకుంటుంది. జెస్సికా పెగూలా (అమెరికా), పౌలా బదోసా (స్పెయిన్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో సబలెంకా తలపడతుంది.
Comments
Please login to add a commentAdd a comment