ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్న ఇటలీ స్టార్
ఫైనల్లో జ్వెరెవ్‌పై వరుస సెట్‌లలో విజయం
మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిన జర్మనీ ప్లేయర్
సినెర్ ఖాతాలో రూ. 19 కోట్ల ప్రైజ్‌మనీ
ఒకరేమో ఇప్పటికే ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలువగా... మరొకరు ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎలా గెలవాలో ఇప్పటికే ఒకరికి అనుభవం ఉండగా... మరొకరికి ఆ అనుభవం లేదు. అయితేనేం ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా ‘గ్రాండ్’ విజయాన్ని అందుకోవాలని ఒకరు... వరుసగా మూడోసారీ ‘గ్రాండ్’ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మరొకరు బరిలోకి దిగారు.
ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ కాగా... మరొకరు ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.... ఈ ఆసక్తికర నేపథ్యంలో ఆదివారం ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావించారు. కానీ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సినెర్ తన ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి పాయింట్ నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచి జ్వెరెవ్ జోరుకు అడ్డుకట్ట వేసిన సినెర్ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు.
మరోవైపు సినెర్ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక జ్వెరెవ్ వరుస సెట్‌లలో చేతులెత్తేసి కెరీర్‌లో మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో, 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్‌కరాజ్ (స్పెయిన్) చేతిలో జ్వెరెవ్ పరాజయం పాలయ్యాడు.
మెల్‌బోర్న్: ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ అవతరించలేదు. గత ఏడాది విజేతగా నిలిచిన ఇటలీ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఈ సంవత్సరం కూడా టైటిల్ నిలబెట్టుకున్నాడు.
ఆదివారం జరిగిన ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 42 నిమిషాల్లో 6-3, 7-6 (7/4), 6ృ3తో రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన సినెర్‌కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 4 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
గతంలో జ్వెరెవ్‌పై రెండుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సినెర్ గత రికార్డును పట్టించుకోకుండా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఏస్‌తో మొదలుపెట్టిన సినెర్ తొలి గేమ్‌లో జ్వెరెవ్ చేసిన మూడు తప్పిదాలతో ఒకటిన్నర నిమిషంలోనే గేమ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 46 నిమిషాల్లో సెట్ గెలిచాడు.
రెండో సెట్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోటీపడ్డారు. దాంతో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6ృ6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సినెర్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో రెండో సెట్‌నూ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లోని ఆరో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్, ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5ృ2తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
ఎనిమిదో గేమ్‌ను జ్వెరెవ్ కాపాడుకోగా, తొమ్మిదో గేమ్‌లో సినెర్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంతోపాటు బ్యాక్‌హాండ్ విన్నర్ షాట్‌తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సినెర్ సర్వీస్‌లో జ్వెరెవ్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సాధించే అవకాశాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం.
4 గత 35 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో బ్రేక్ పాయింట్ ఎదుర్కోని నాలుగో ప్లేయర్ సినెర్. గతంలో పీట్ సంప్రాస్ (బోరిస్ బెకర్‌తో 1995 వింబుల్డన్ ఫైనల్), రోజర్ ఫెడరర్ (ఫిలిప్పోసిస్‌తో 2003 వింబుల్డన్ ఫైనల్), రాఫెల్ నాదల్ (కెవిన్ అండర్సన్‌తో 2017 యూఎస్ ఓపెన్ ఫైనల్) ఈ ఘనత సాధించారు.
5 హార్డ్ కోర్టులపై వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ సినెర్. గతంలో జాన్ మెకన్రో (1979, 1980, 1981 యూఎస్ ఓపెన్), ఇవాన్ లెండిల్ (1985, 1986, 1987 యూఎస్ ఓపెన్), రోజర్ ఫెడరర్ (2005, 2006, 2007 యూఎస్ ఓపెన్), నొవాక్ జొకోవిచ్ (2 సార్లు; 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, 2012 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్; 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు.
1 అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఇటలీ ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నికోలా పిత్రాంజెలి (1959, 1960 ఫ్రెంచ్ ఓపెన్) పేరిట ఉన్న రికార్డును సినెర్ (2024, 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2024 యూఎస్ ఓపెన్) సవరించాడు.
1 జిమ్ కొరియర్ (అమెరికా; 22 ఏళ్ల 5 నెలల 14 రోజులు; 1992ృ1993) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కుడిగా సినెర్ (23 ఏళ్ల 5 నెలల 10 రోజులు) గుర్తింపు పొందాడు.
8 కెరీర్‌లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ విజేతగా నిలిచిన ఎనిమిదో ప్లేయర్ సినెర్. కానర్స్ (అమెరికా), జాన్ బోర్గ్, ఎడ్బర్గ్ (స్వీడన్), కుయెర్టన్ (బ్రెజిల్), ఫెడరర్, వావ్రింకా (స్విట్జర్లాండ్), అల్‌కరాజ్ (స్పెయిన్) ఈ ఘనత సాధించారు.
2019 ఆరేళ్ల తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, రెండో ర్యాంకర్ తలపడ్డారు. ఈసారీ నంబర్‌వన్ ర్యాంకర్ వరుస సెట్‌లలో గెలిచాడు. 2019లో నంబర్‌వన్ జొకోవిచ్ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌పై వరుస సెట్‌లలో నెగ్గాడు.
6 కెరీర్‌లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ప్లేయర్ జ్వెరెవ్. ఈ జాబితాలో అగస్సీ (అమెరికా), ఇవానిసెవిచ్ (క్రొయేషియా), ముర్రే (బ్రిటన్), థీమ్ (ఆ్రస్టియా), రూడ్ (నార్వే) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment