జొకోవిచ్, రన్నరప్ ట్రోఫీతో సిట్సిపాస్
‘క్లే కోర్టు కింగ్’ రాఫెల్ నాదల్‌నే ఓడించినోడికి సిట్సిపాస్ ఓ లెక్కా! వన్డే మ్యాచ్ కాస్తా టి20లా ఆడేయడా ఏంటి! అని జొకోవిచ్ విజయం గురించే మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ మొదలయ్యాకే తెలిసింది... ఇది ఫైనల్ అని! టైటిల్ అంత ఈజీ కాదని!! కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సిట్సిపాస్ వరల్డ్ నంబర్‌వన్‌కు ఏమాత్రం తీసిపోని ఆట ఆడాడు.
అయితే తొలి రెండు సెట్‌లు ఓడిపోయినా జొకోవిచ్ ఏదశలోనూ పట్టుదల కోల్పోకుండా ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనతో తన కెరీర్‌లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలువడంతోపాటు 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
పారిస్: ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్’ గత అనుభవం అక్కరకొచ్చింది. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 4 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్ నెగ్గాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
రెండు సెట్లు ‘పాస్’అయ్యాడు కానీ...
ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి దీటుగా సిట్సిపాస్ పోరాటం మొదలుపెట్టాడు. దీంతో సెర్బియన్‌కు ఫైనల్ అంత ఈజీ కాదని తెలిసిపోయింది. టైబ్రేక్‌కు దారితీసిన తొలి సెట్‌లో సిట్సిపాస్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. తొలి సెట్ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ తొలి గేమ్‌లో సెర్బియన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తర్వాత టాప్ సీడ్ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్ తన సర్వీస్‌ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్ కూడా సిట్సిపాస్ వశమైంది.
ఇక సమరమే... దెబ్బకు స్కోరు సమమే!
టైటిల్ సాధించాలంటే వరుసగా మూడు సెట్‌లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్ తన గేరు మార్చాడు. జోరు పెంచాడు. ఒత్తిడిని పక్కన బెట్టాడు. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్ ప్రత్యర్థికి ప్రతీ గేమ్‌లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్ మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించిన జొకోవిచ్ తన సర్వీస్‌లను కాపాడుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు ఇదేమాత్రం సరిపోలేదు.
పురుషుల టెన్నిస్‌లో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమో దు చేసిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా–1969), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా–1967) మాత్రమే ఈ ఘనత సాధించారు.
జొకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్–9; ఫ్రెంచ్ ఓపెన్–2; వింబుల్డన్–5; యూఎస్ ఓపెన్–3). ఫెడరర్, రాఫెల్ నాదల్ (20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచిన ఏడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో బెర్నార్డ్ (1946), రాడ్ లేవర్ (1962), బోర్గ్ (1974), లెండిల్ (1984), అగస్సీ (1999), గాడియో (2004) ఈ ఘనత సాధించారు.
ఫైనల్ గణాంకాలు
జొకోవిచ్ సిట్సిపాస్
5 ఏస్‌లు 14
3 డబుల్ ఫాల్ట్‌లు 4
19/30 నెట్ పాయింట్లు 19/31
5/16 బ్రేక్ పాయింట్లు 3/8
56 విన్నర్స్ 61
41 అనవసర తప్పిదాలు 44
164 మొత్తం పాయింట్లు 147
Comments
Please login to add a commentAdd a comment