మెల్‌బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్‌బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్‌బెలాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్‌వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు.
ముర్రే మారథాన్ పోరులో...
మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్‌లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 10 ఏస్‌లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్‌లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు.
మరో మ్యాచ్‌లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్‌లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్‌విలి (జార్జియా)పై విజయం సాధించారు.
ముగురుజాకు షాక్
మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. ఎలైజ్ మెర్‌టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్‌సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్‌కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు.
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
Published Wed, Jan 18 2023 5:54 AM | Last Updated on Wed, Jan 18 2023 9:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment