novak djokovich
-
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్‌వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 10 ఏస్‌లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్‌లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
Australian Open 2023: నాదల్, జొకోవిచ్లపైనే దృష్టి
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్)... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలనే పట్టుదలతో నొవాక్ జొకోవిచ్... రేపటి నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్‌తో ఆడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 75వ ర్యాంకర్ రొబెర్టో బేనా (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. జొకోవిచ్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గగా అందులో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న జొకోవిచ్ ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా ఏడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. -
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి జొకోవిచ్ దూరం
న్యూయార్క్: కోవిడ్ టీకా తీసుకోని కారణంతో... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కూ దూరమయ్యాడు. కరోనా టీకా వేసుకోకపోవడంతో ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఆడనివ్వలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి మాత్రం ఈ సెర్బియా స్టార్ స్వయంగా తప్పుకున్నాడు. ‘డ్రా’ విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అతను వెల్లడించాడు. ‘యూఎస్ ఓపెన్ ఆడేందుకు నేను న్యూయార్క్‌కు వెళ్లట్లేదు. ఇది బాధాకరమే కాని తప్పలేదు. ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఆశావహ దృక్పథంతో వచ్చే సీజన్లో ఆడేందుకు కృషి చేస్తా’ అని ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటిల్స్) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమతించడం లేదు. అందువల్లే జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియన్ క్వార్టర్స్‌లో నాదల్ చేతిలో ఓడాడు. కానీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్
లండన్: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్తో తలపడాల్సిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ రెండో సెట్ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ నెట్ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు. -
Wimbledon 2022: జొకోవిచ్ అలవోకగా...
లండన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6–0, 6–3, 6–4తో 25వ సీడ్ కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–3తో బెరాన్కిస్ (లిథువేనియా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. రెండో రౌండ్లో క్వాలిఫయర్ జాక్ సాక్ (అమెరికా) 6–4, 6–4, 3–6, 7–6 (7/1)తో మాక్సిమి క్రెసీ (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. దాంతో 1995 తర్వాత వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరిన అమెరికా ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. హీతెర్, జబర్ ముందంజ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) 6–2, 6–3తో డయానా పెరీ (ఫ్రాన్స్)పై, హీతెర్ వాట్సన్ (బ్రిటన్) 7–6 (8/6), 6–2తో కాజా జువాన్ (స్లొవేనియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. హీతెర్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. -
Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ నేడు ప్రారంభంకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సోమవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో కొరియా ప్లేయర్ సూన్‌వూ క్వాన్‌తో ఆడనున్నాడు. ఈ సీజన్లో తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన స్పెయిన్ స్టార్ నాదల్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. అయితే నాదల్కు ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ నుంచి అసలు సవాలు ఎదురుకానుంది ‘డ్రా’ ప్రకారం వీరిద్దరు ఫైనల్లో తలపడే అవకాశముంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత ఈ టోర్నీతో పునరాగమనం చేయనుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే వైదొలిగింది. అనంతరం ఆమె సింగిల్స్ విభాగంలో ఏ టోర్నీలోనూ ఆడలేదు. -
ATP Belgrade: సెమీ ఫైనల్లో జొకోవిచ్
సొంతగడ్డపై జరుగుతున్న ఏటీపీ 250 టోర్నీ బెల్గ్రేడ్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ దూసుకుపోతున్నాడు. ఈ టోర్నీలో సెర్బియా స్టార్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జొకోవిచ్ 4–6, 6–3, 6–3 తేడాతో కెక్మనోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. తన దేశానికే చెందిన ఆటగాడినుంచి పోటీ ఎదుర్కొని తొలి సెట్ కోల్పోయినా...2 గంటల 18 నిమిషాల ఈ పోరులో చివరకు జొకోవిచ్ తన అనుభవంతో ముందంజ వేశాడు. -
నయా నంబర్‌వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్‌వన్ ర్యాంకర్‌గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
నేనింతే... టీకా తీసుకోను.. అవసరమైతే..
లండన్: ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వ్యాక్సినేషన్‌పై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీకా తీసుకునే ప్రసక్తేలేదని, ఇది తప్పనిసరంటే ఏ మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని, గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు దూరమైనా సరేనని ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇంకా జొకోవిచ్ ఏమన్నాడంటే... ‘వ్యాక్సినేషన్‌పై స్వేచ్ఛ ఉండాల్సిందే. నా శరీరానికి ఏది అవసరమో అందరికంటే నాకే బాగా తెలుసు. కోవిడ్ వ్యాక్సిన్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. నా వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించే నేను టీకా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా నిర్ణ యం వల్ల కలిగే పర్యావసనాలు తెలుసు. దీనివల్ల ఎన్నో టోర్నీలకు దూరంకావోచ్చు. అయినా సరే నా నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఇలా ఏ టోర్నీకి అనుమతించకపోయినా, ఆడనివ్వకపోయినా సరే అన్నింటికి సిద్ధం. నా శరీరం కోసం నేను తీసుకునే నిర్ణయం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఏ టైటిల్ ఎక్కువా కాదు. అయితే చాలామంది నేను వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకినని భావిస్తున్నారు. ఇది సరికాదు. టీకా వద్దనే హక్కూ సదరు వ్యక్తికి ఉండాలని అంటున్నాను తప్ప టీకా వ్యతిరేకిని కాదు. అలాంటి ఉద్యమానికి మద్దతివ్వలేదు. మాట్లాడిందీ లేదు’ అని జొకోవిచ్ వివరించాడు. -
కరోనా పాజిటివ్ వచ్చినందుకే జకోవిచ్‌ను..
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్గ్రేడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది. -
శోకోవిచ్... వరల్డ్ నంబర్‌వన్ కల చెదిరె
అవును... జొకోవిచ్ ఓడిపోయాడు! అరుదైన ఫామ్‌తో, ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శనతో ఆడుతూ వచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ఆఖరి మెట్టుపై అయ్యో అనిపించాడు! మెల్బోర్న్, పారిస్, లండన్ సమరాలను దిగ్విజయంగా దాటిన సెర్బియా స్టార్‌కు న్యూయార్క్ మాత్రం అనూహ్యంగా నిరాశను మిగిల్చింది. 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అత్యంత అరుదైన ఘనత సాధించే, ఇరవై ఒకటవ ‘మేజర్’ టైటిల్‌తో అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ముంగిట బరిలోకి దిగిన జొకో చివరకు ఓటమితో కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించాడు. జొకోవిచ్‌తో తలపడటం, అదీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అంటే ఓటమికి సిద్ధం కావడమే అనే స్థితి కనిపిస్తున్న దశలో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్ పెను సంచలనంతో సత్తా చాటాడు. మైదానం మొత్తం ప్రత్యర్థికి అనుకూలంగా హోరెత్తుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఆడిన అతను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో చిరునవ్వులు చిందించాడు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా... చివరి వరకు పోరాడుతానని మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన మెద్వెదెవ్ అంతకు మించిన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. న్యూయార్క్: 2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరే వరకు 27–0 మ్యాచ్‌ల విజయాలతో జోరు ప్రదర్శించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు భంగపాటు ఎదురైంది. యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. . మెద్వెదెవ్ జోరు... గతంలో జొకోవిచ్‌తో తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలోనూ ఓడిన మెద్వెదెవ్ ఈసారి పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చాడు. తొలి సెట్లో 8 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. రెండో సెట్లో జొకో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా... తొలి రెండు గేమ్‌లలో 5 బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న రష్యన్, ప్రత్యర్థి సరీ్వస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేయగలిగాడు. మూడో సెట్లోనూ ఇదే జోరు చూపించిన అతను డబుల్ బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. జొకో కొత్త చరిత్రను చూసేందుకు తరలివచ్చిన దిగ్గజ ఆటగాళ్లు, హాలీవుడ్ స్టార్లూ మెద్వెదెవ్ ఆటతో ఆశ్చర్యపోయారు. మ్యాచ్ చివర్లో స్టేడియంలోని అభిమానులంతా మెద్వెదెవ్‌ను గేలి చేయడం మొదలు పెట్టారంటే వారి దృష్టిలో ఈ ఫలితం ఎంత అనూహ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్లో 5–2 వద్ద డబుల్ ఫాల్ట్ చేసినా... చివరకు పదో గేమ్‌లో సరీ్వస్ నిలబెట్టుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తమ పెళ్లి రోజున తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్షణాన మెద్వెదెవ్... ‘డెడ్ ఫిష్’ సంబరాన్ని ప్రదర్శించాడు. జొకో అసహనం... మ్యాచ్‌లో కొన్ని కీలక సమయాల్లో లభించిన అవకాశాలను జొకోవిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సెట్లో రెండు సార్లు మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచి్చనా అది చేజారింది. ఒక దశలో 40–0తో ముందంజలో ఉన్నా చివరకు గేమ్ దక్కలేదు. దాంతో తీవ్ర అసహనంతో తన రాకెట్‌ను మూడు సార్లు నేలకేసి విరగ్గొట్టిన అతను అంపైర్ హెచ్చరికకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్లీ కోలుకోలేకపోయాడు. ఈ టోర్నీ మూడో రౌండ్ నుంచి సెమీస్ వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ జొకో తొలి సెట్ కోల్పోయాడు. ఫైనల్లోనూ అలాగే జరుగుతుందని అంతా ఆశించినా రష్యన్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి చేంజ్ ఓవర్ సమయంలో జొకో టవల్ మధ్యలో మొహం దాచుకొని ఏడ్చేశాడు! జొకో, అతని అభిమానులకు నా క్షమాపణలు. అతను గెలిస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. నా కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవగలనా అనుకునేవాడిని. గెలవకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉండాలనుకున్నా. ఇప్పుడు తొలి ‘గ్రాండ్’ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మరొకటి గెలిచినా ఇంతగా స్పందిస్తానో లేదు తెలీదు. జొకో ప్రతీ మ్యాచ్‌కు వ్యూహం మారుస్తాడు. అన్నింటికీ సన్నద్ధమై వచ్చా. పెళ్లి రోజు నా శ్రీమతికి ఈ టైటిల్‌ను బహుమతిగా ఇచ్చా. –మెద్వెదెవ్ ఈ రోజు గెలవకపోయినా మీ అభిమానం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా గుండెను తడిమిన మీ ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తిని నేనే అనిపిస్తోంది. అద్భుతంగా ఆడిన మెద్వెదెవ్కే గెలిచే అర్హత ఉంది. ఫలితం నిరాశ కలిగించినా... ఇన్ని రోజులుగా రికార్డు వేటలో నాపై ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడి, అంచనాల భారం తొలగిపోయినందుకు ప్రశాంతంగా అనిపిస్తోంది. –జొకోవిచ్ ► రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడు మెద్వెదెవ్. గతంలో కఫెలి్నకోవ్ (1996 ఫ్రెంచ్ ఓపెన్, 1999 ఆ్రస్టేలియన్ ఓపెన్), మరాత్ సఫిన్ (2000 యూఎస్ ఓపెన్, 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్) రెండేసి ట్రోఫీలు గెలిచారు. ► ఒకే గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో కొత్త చాంపియన్స్ అవతరించడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గాస్టన్ గాడియో (అర్జెంటీనా), అనస్తాసియా మిస్కినా (రష్యా) తొలిసారి ‘గ్రాండ్’ విజేతలుగా నిలిచారు. ► ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది. ► జొకోవిచ్ కెరీర్లో 11సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్ (11), ఇవాన్ లెండిల్ (11) సరసన జొకోవిచ్ కూడా చేరాడు. -
స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్.. గెలిస్తే..
-
రికార్డుల దిశగా జొకోవిచ్ అడుగులు
ఎదురు లేకుండా సాగుతున్న జొకోవిచ్ అడుగులు రికార్డుల దిశగా పడుతున్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌లో నంబర్‌వన్ సెర్బియన్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక రెండంటే రెండే మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్స్) గెలిస్తే జొకో క్యాలెండర్ స్లామ్‌తో పాటు 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్)లను అధిగమిస్తాడు. న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లను గెలిచిన సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తాజాగా యూఎస్ ఓపెన్ గెలిచే పనిలో పడ్డాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ టాప్ సీడ్ ప్లేయర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 5–7, 6–2, 6–2, 6–3తో ఆరో సీడ్ మటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–0, 4–6, 7–5తో నెదర్లాండ్స్‌కు చెందిన బొటిక్ వాన్ డె జండ్ష్చల్ప్పై గెలుపొందగా, నాలు గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (8/6), 6–3, 6–4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు. మహిళల క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)కు 4–6, 4–6తో మరియా సకారి (గ్రీస్) చేతిలో చుక్కెదురైంది. తొలి సెట్ కోల్పోగానే... జొకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్‌ల దాకా ఇద్దరు సరీ్వస్‌ను నిలబెట్టుకోవడంతో 5–5తో సమంగా నిలిచారు. సెర్బియన్ సర్వీస్ చేసిన 11వ గేమ్‌ను బ్రేక్ చేయడం ద్వారా బెరెటిని 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. తదుపరి గేమ్‌లో తన సరీ్వస్‌ను నిలబెట్టుకోవడంతో తొలిసెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ సెట్ కోల్పోగానే జొకో జాగ్రత్త పడ్డాడు. తర్వాత వరుసగా మూడు సెట్లను అవలీలగానే చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన సెర్బియన్ స్టార్ 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్ద 19 పాయింట్లు సాధించిన జొకోవిచ్ 44 విన్నర్లు కొట్టాడు. 28 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 5 బ్రేక్ పాయింట్లు సాధించి ప్రత్యరి్థపై పైచేయి సాధించాడు. మరోవైపు ఇటలీ స్టార్ బెరెటిని... జొకో కంటే అత్యధికంగా 17 ఏస్‌లు సంధించినప్పటికీ ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. 42 విన్నర్లు కొట్టాడు. ఇప్పటివరకు మూడు సార్లు (2011, 2015, 2018) యూఎస్ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్ ఇక్కడ సెమీస్ చేరుకోవడం ఇది 12వ సారి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సెర్బియన్ స్టార్... జర్మనీకి చెందిన నాలుగో సీడ్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ సీజన్ వింబుల్డన్ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా 4–6, 4–6తో వరుస సెట్లలో సకారి ధాటికి చేతులెత్తేసింది. 2016లో యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ స్టార్‌ను కేవలం గంటా 22 నిమిషాల్లోనే సకారి ఇంటిదారి పట్టించింది. 2015 నుంచి యూఎస్ ఓపెన్ ఆడుతున్న గ్రీస్ ప్లేయర్ సకారి తన కెరీర్లో తొలిసారి సెమీస్ చేరింది. సెమీస్‌లో ఎవరితో ఎవరు జొకోవిచ్ (1) గీ జ్వెరెవ్ (4) మెద్వెదెవ్ (2) గీ ఫెలిక్స్ అగర్ (12) -
క్వార్టర్ ఫైనల్లోకి వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా శిఖరాన నిలిచేందుకు... క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్‌తో అరుదైన ఘనతను అందుకునేందుకు వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కేవలం మూడు విజయాల దూరంలో నిలిచాడు. ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో తన సత్తా చాటుతూ జొకో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడంతో చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యాడు. అమెరికా యువ ఆటగాడు బ్రూక్స్‌బీ కొంత పోటీనిచ్చినా, తన స్థాయిని ప్రదర్శిస్తూ సెర్బియా స్టార్ ముందంజ వేయగా... 1880 నుంచి ఈ టోర్నీ చరిత్రలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో ఒక్క అమెరికన్ కూడా క్వార్టర్స్ చేరకపోవడం ఇదే తొలిసారి. న్యూయార్క్: వరల్డ్ నంబర్‌వన్, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 1–6, 6–3, 6–2, 6–2తో జెన్సన్ బ్రూక్స్ బీ (అమెరికా)ను ఓడిం చాడు. 2 గంటల 59 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్ ను అనూహ్యంగా బ్రూక్స్‌బీ గెలుచుకున్నా ... ఆ తర్వాత జొకోవిచ్ పదునైన ఆట ముందు అతను తలవంచాల్సి వచ్చింది. బ్రూక్స్‌బీ ఓటమితో ఈ టోర్నీలో అమెరికా ఆటగాళ్లందరి పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో మెద్వెదేవ్ రష్యా స్టార్ ప్లేయర్, రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ మెద్వెదేవ్ 6–3, 6–0, 4–6, 7–5తో ప్రపంచ 117వ ర్యాంకర్ బొటిక్ జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఇతర ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లలో బెరెటిని 6–4, 3–6, 6–3, 6–2తో ఆస్కార్ ఒటే (జర్మనీ)పై, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 7–6 (9/7)తో సిన్నర్ (ఇటలీ)పై, లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) 6–7 (6/8), 6–4, 6–1, 6–3తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. చదవండి: టాప్ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ -
మ్యాచ్ ఓడిపోయానన్న బాధ.. రాకెట్‌ను నేలకేసి కొట్టి
టోక్యో: కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ స్వర్ణ పతకంతో పాటు క్యాలెండర్ సంవత్సరంలో ‘గోల్డెన్ స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో టోక్యోకు వచ్చిన టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఓడిన అతను ... మూడో స్థానం కోసం ఆడాల్సిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఆడకుండానే తప్పుకున్నాడు. దాంతో అతనికి ఈ ఒలింపిక్స్‌లో శూన్య హస్తం దక్కింది. శనివారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్) 6–4, 6–7 (6/8), 6–3తో జొకోవిచ్‌ను ఓడించాడు. మ్యాచ్‌లో పలుమార్లు జొకోవిచ్ సహనం కోల్పోయాడు. ఒకసారి రాకెట్‌ను ప్రేక్షకుల్లోకి విసిరేసిన అతను, మరోసారి తన రాకెట్‌తో నెట్‌పై బలంగా పదే పదే కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం జొకోవిచ్.. జొకోవిచ్‌కు ఏమైంది.. ఇప్పటికే కెరీర్లో చాలా సాధించావు.. ఒలింపిక్స్ పోతే పోయింది.. మరేం పర్లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. If djokovic throwing and smashing his racquet in a third place match just for losing points isn’t the lack of the Olympic spirit idk what is . Losing your shit does not suit a world champion. That’s why he’ll never reach Federer and Nadal’s level.#TokyoOlympics2020 pic.twitter.com/mliSmPZYdz — Nilay (@wyanilay) July 31, 2021 -
అయ్యో... జొకోవిచ్
టోక్యో: పురుషుల టెన్నిస్ చరిత్రలో అరుదైన ‘గోల్డెన్ స్లామ్’ ఘనతను సాధించాలని ఆశించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అద్భుత ఆటతీరుతో 1–6, 6–3, 6–1తో జొకోవిచ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ పరాజయంతో జొకోవిచ్ కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) నెగ్గడంతోపాటు ఒలింపిక్ స్వర్ణాన్ని సాధిస్తే దానిని ‘గోల్డెన్ స్లామ్’ ఘన తగా పరిగణిస్తారు. గతంలో మహిళల విభా గంలో స్టెఫీ గ్రాఫ్ (1988లో) మాత్రమే ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది జొకోవిచ్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
ఒలింపిక్స్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదు: జొకోవిచ్
లండన్: ఈ నెల 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ఆడాలా... వద్దా అనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ పేర్కొన్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచాక ఒలింపిక్స్‌పై జొకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒలింపిక్స్ గురించి ఇంకా ఆలోచించాల్సి ఉంది. నేనెప్పుడూ అందులో పాల్గొనాలనే కోరుకుంటా. కానీ, కోవిడ్–19, క్వారంటైన్ నిబంధనలు, అభిమానులు లేకుం డా గేమ్స్ జరగనుండటం వంటి అంశాల వల్ల అందులో నేను పాల్గొనేది 50–50గా ఉంది’ అని జొకోవిచ్ అన్నాడు. 2008 బీజింగ్ ఒలిం పిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్ కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
చరిత్రకు చేరువగా...
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏడోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ జొకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో 7–6 (7/3), 7–5, 7–5తో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండటం విశేషం. అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ (31 సార్లు) తర్వాత జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటినితో జొకోవిచ్ తలపడతాడు. షపోవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన షపోవలోవ్ కీలకదశలో తడబడి పాయి ంట్లు కోల్పోయాడు. మరోవైపు కెరీర్లో 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ కీలకదశలో పైచేయి సాధించాడు. ఏడు ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. షపోవలోవ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 11సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా అతను ఒక్కసారి మాత్రమే సఫలమయ్యాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలిచిన జొకోవిచ్ ఆదివారం విజేతగా నిలిస్తే ... అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ప్రస్తుతం సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున) సరసన ఈ సెర్బియా స్టార్ కూడా చేరుతాడు. 1976 తర్వాత... తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ) 6–3, 6–0, 6–7 (3/7), 6–4తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా అడ్రియానో పనట్టా (1976–ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇటలీ ప్లేయర్‌గా, వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది సార్లు చాంపియన్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన హుబర్ట్ సెమీఫైనల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బెరెటిని కచ్చితమైన సర్వీస్‌లు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగి హుబర్ట్ ఆట కట్టించాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్దకు 25సార్లు దూసుకొచ్చి 16సార్లు పాయింట్లు గెలిచాడు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన హుబర్ట్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. -
వీరోచితం... ‘జొకో’ విజయం
‘క్లే కోర్టు కింగ్’ రాఫెల్ నాదల్‌నే ఓడించినోడికి సిట్సిపాస్ ఓ లెక్కా! వన్డే మ్యాచ్ కాస్తా టి20లా ఆడేయడా ఏంటి! అని జొకోవిచ్ విజయం గురించే మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ మొదలయ్యాకే తెలిసింది... ఇది ఫైనల్ అని! టైటిల్ అంత ఈజీ కాదని!! కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సిట్సిపాస్ వరల్డ్ నంబర్‌వన్‌కు ఏమాత్రం తీసిపోని ఆట ఆడాడు. అయితే తొలి రెండు సెట్లు ఓడిపోయినా జొకోవిచ్ ఏదశలోనూ పట్టుదల కోల్పోకుండా ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనతో తన కెరీర్లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలువడంతోపాటు 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. పారిస్: ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్’ గత అనుభవం అక్కరకొచ్చింది. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 4 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్ నెగ్గాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు సెట్లు ‘పాస్’అయ్యాడు కానీ... ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి దీటుగా సిట్సిపాస్ పోరాటం మొదలుపెట్టాడు. దీంతో సెర్బియన్‌కు ఫైనల్ అంత ఈజీ కాదని తెలిసిపోయింది. టైబ్రేక్‌కు దారితీసిన తొలి సెట్లో సిట్సిపాస్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. తొలి సెట్ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ తొలి గేమ్‌లో సెర్బియన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తర్వాత టాప్ సీడ్ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్ తన సర్వీస్‌ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్ కూడా సిట్సిపాస్ వశమైంది. ఇక సమరమే... దెబ్బకు స్కోరు సమమే! టైటిల్ సాధించాలంటే వరుసగా మూడు సెట్లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్ తన గేరు మార్చాడు. జోరు పెంచాడు. ఒత్తిడిని పక్కన బెట్టాడు. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్ ప్రత్యర్థికి ప్రతీ గేమ్‌లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్ మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించిన జొకోవిచ్ తన సర్వీస్‌లను కాపాడుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు ఇదేమాత్రం సరిపోలేదు. పురుషుల టెన్నిస్‌లో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమో దు చేసిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా–1969), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా–1967) మాత్రమే ఈ ఘనత సాధించారు. జొకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్–9; ఫ్రెంచ్ ఓపెన్–2; వింబుల్డన్–5; యూఎస్ ఓపెన్–3). ఫెడరర్, రాఫెల్ నాదల్ (20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచిన ఏడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో బెర్నార్డ్ (1946), రాడ్ లేవర్ (1962), బోర్గ్ (1974), లెండిల్ (1984), అగస్సీ (1999), గాడియో (2004) ఈ ఘనత సాధించారు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ సిట్సిపాస్ 5 ఏస్‌లు 14 3 డబుల్ ఫాల్ట్‌లు 4 19/30 నెట్ పాయింట్లు 19/31 5/16 బ్రేక్ పాయింట్లు 3/8 56 విన్నర్స్ 61 41 అనవసర తప్పిదాలు 44 164 మొత్తం పాయింట్లు 147 -
‘దశ ధీర’ నాదల్
రోమ్: మట్టికోర్టులపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 7–5, 1–6, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ స్పెయిన్ స్టార్ 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019లలో కూడా ఇక్కడ టైటిల్ సాధించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. నాదల్ 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను... బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీని 11 సార్లు గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్ (36 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును నాదల్ (36 టైటిల్స్) సమం చేశాడు. అంతేకాకుండా జొకోవిచ్‌తో ముఖాముఖి రికార్డులో ఆధిక్యాన్ని 28–29కి తగ్గించాడు. రోమ్ ఓపెన్ విజేత హోదాలో నాదల్కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ జొకోవిచ్ ఖాతాలో 1,45,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 29 లక్షలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఐదుసార్లు విజేతగా నిలిచి, ఆరుసార్లు రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో తొలి సెట్ హోరాహోరీగా జరిగింది. 75 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లోని 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి నాదల్ సెట్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో జొకోవిచ్ దూకుడుకు నాదల్ తడబడ్డాడు. అనవసర తప్పిదాలు చేసి కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచి సెట్‌ను కోల్పోయాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో నాదల్ మళ్లీ లయలోకి వచ్చాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘ఈ టోర్నీలో నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా షపవలోవ్తో జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కాను. ఓవరాల్‌గా ఈ టోర్నీలో బాగా ఆడాను.’ –రాఫెల్ నాదల్ -
గట్టెక్కిన జొకోవిచ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అమెరికా యువతార, 27వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/1), 6–4, 3–6, 4–6, 6–2తో గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్ మూడో సెట్ తొలి గేమ్ సందర్భంగా జొకోవిచ్ జారి పడ్డాడు. మెడికల్ టైమ్అవుట్ తీసుకొని కోర్టులోనే చికిత్స చేయించుకొని జొకోవిచ్ ఆట కొనసాగించాడు. నొప్పితోనే ఆడిన జొకోవిచ్ మూడో సెట్, నాలుగో సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్ ఐదో సెట్లోని ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 4–6, 4–6, 6–3, 6–4, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గగా... ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 3–6, 3–6, 3–6తో క్వాలిఫయర్ కరాత్సెవ్ (రష్యా) చేతిలో... 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 5–7, 5–7, 3–6తో ఆలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయారు. సెరెనా ముందుకు... మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–6 (7/5), 6–2తో పొటపోవా (రష్యా)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–3తో కుదర్మెతోవా (రష్యా)పై, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో ఆన్స్ జబుయెర్ (ట్యూనిసియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో ఆన్ లీ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సంప్రాస్ సరసన జొకోవిచ్
పారిస్: ఈ ఏడాది అద్భుతంగా రాణించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు పీట్ సంప్రాస్ సరసన నిలిచాడు. అత్యధికసార్లు పురుషుల టెన్నిస్ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. గతంలో సంప్రాస్ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్లను టాప్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ సరసన చేరాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20 చొప్పున) సాధించిన మేటి క్రీడాకారులు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) గతంలో ఐదుసార్లు చొప్పున సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించారు. గతేడాది వరకు ఫెడరర్, నాదల్ సరసన నిలిచిన జొకోవిచ్ ఈ ఏడాది వారిద్దరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోయాడు. కరోనా వైరస్ కారణంగా కుదించిన ఈ టెన్నిస్ సీజన్లో జొకోవిచ్ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ‘టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి సంప్రాస్‌ను ఆరాధించేవాణ్ని. ఇప్పుడు అతని రికార్డును సమం చేసినందుకు నా కల నిజమైంది’ అని జొకోవిచ్ అన్నాడు. కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ గత సెప్టెంబర్‌లో అత్యధిక వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సంప్రాస్ (286 వారాలు)ను మూడో స్థానానికి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 294 వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్న జొకోవిచ్ వచ్చే సీజన్లోనూ నిలకడగా ఆడితే మార్చి తొలి వారంలో... అత్యధిక వారాలు నంబర్‌వన్ స్థానంలో ఉన్న ప్లేయర్ ఫెడరర్ (310 వారాలు) రికార్డును కూడా బద్దలు కొడతాడు. నవంబర్ 15న లండన్‌లో మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు. -
నాదల్ సరసన జొకోవిచ్
పారిస్: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రాఫెల్ నాదల్ ఒక్కడే అత్యధికంగా 14 సార్లు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. అయితే నాదల్ రికార్డును టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ సోమవారం సమం చేశాడు. ఈ సెర్బియా స్టార్ కూడా 14వ సారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని నాదల్ సరసన చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 6–3తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. ఈ టోర్నీలో వరుసగా 11వసారి క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఖచనోవ్‌తో 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన పోరులో జొకోవిచ్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. 28 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈసారి జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) రెండుసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 7–6 (11/9), 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 7–5, 6–4, 7–6 (7/3)తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి తమ కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. క్విటోవా 2012 తర్వాత... మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి లౌరా సిగెముండ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్విటోవా 6–2, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై, లౌరా సిగెముండ్ 7–5, 6–2తో పౌలా బడోసా (స్పెయిన్)పై గెలిచారు. కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న లౌరా తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. మరోవైపు క్విటోవా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 2–6, 6–2, 6–1తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్)పై నెగ్గింది. -
జొకోవిచ్ 24–0
ఇద్దరు దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్ గైర్హాజరీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను మొదలుపెట్టాడు. కరోనా ప్రత్యేక పరిస్థితుల నడుమ ఆరంభమైన యూఎస్ ఓపెన్ టోర్నీలో ఈ సెర్బియా స్టార్ సునాయాస విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న 16 ఏళ్ల అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది. న్యూయార్క్: తన కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) తొలి అడుగు వేశాడు. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–4, 6–1తో దామిర్ జుమూర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై గెలుపొందాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది వరుసగా 24వ విజయం కావడం విశేషం. ఏటీపీ కప్ టీమ్ టోర్నీలో, దుబాయ్ ఓపెన్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్ అజేయంగా నిలిచాడు. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు సాధించాడు. మ్యాచ్ మొత్తంలో ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ రెండో సెట్లో ఏకైకసారి తన సర్వీస్‌ను కోల్పోయాడు. ‘స్టేడియం ఖాళీగా ఉన్నా, నిండుగా ఉన్నా వ్యక్తిగత శిక్షణ, సహాయక సిబ్బంది మనను ఉత్సాహపరుస్తారు. ఈసారి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో బాక్స్‌లో కూర్చున్న నా సహాయక సిబ్బంది పాయింట్లు సాధించినపుడల్లా ఉత్సాహపరిచారు. ప్రత్యర్థి పొరపాట్లు చేస్తే మన బాక్స్‌లోని మద్దతుదారులు చప్పట్లు కొట్టాలని అనుకోను. దామిర్ నా మంచి మిత్రుడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో, టెన్నిస్‌లోనే అతి పెద్ద స్టేడియంలో శుభారంభం చేయాలని ఎవరైనా కోరుకుంటారు’ అని విజయానంతరం జోకోవిచ్ వ్యాఖ్యానించాడు. ఇస్నెర్, ష్వార్ట్‌జ్‌మన్‌లకు షాక్... పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) గెలుపొందారు. అయితే తొమ్మిదో సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)... అమెరికా ఆజానుబాహుడు, 16వ సీడ్ జాన్ ఇస్నెర్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. వరుసగా 14వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న 35 ఏళ్ల ఇస్నెర్ తొలి రౌండ్లో 7–6 (7/5), 3–6, 7–6 (7/5), 3–6, 6–7 (3/7)తో అమెరికాకే చెందిన 64వ ర్యాంకర్ స్టీవ్ జాన్సన్ చేతిలో ఓడిపోయాడు. 2008 తర్వాత ఇస్నెర్ ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువున్న ఇస్నెర్ ఏకంగా 52 ఏస్‌లు సంధించాడు. రెండు సెట్లను టైబ్రేక్‌లలో గెలిచిన ఇస్నెర్ నిర్ణాయక ఐదో సెట్లోని టైబ్రేక్‌లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. అన్‌సీడెడ్ కామెరన్ నోరి (బ్రిటన్) 3–6, 4–6, 6–2, 6–1, 7–5తో ష్వార్ట్‌జ్‌మన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–6 (7/2), 5–7, 6–3, 7–5తో 2017 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, సిట్సిపాస్ 6–2, 6–1, 6–1తో రామోస్ వినోలస్ (స్పెయిన్)పై, గాఫిన్ 7–6 (7/2), 3–6, 6–1, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–4, 4–6, 6–3, 6–2తో సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై గెలిచారు. టీనేజర్ గాఫ్ పరాజయం సంచలనం సృష్టింస్తుందని భావించిన అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ 3–6, 7–5, 4–6తో 31వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 16 ఏళ్ల గాఫ్ 13 డబుల్ ఫాల్ట్‌లు, 46 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. గతేడాది గాఫ్ వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. నాగల్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సుమీత్ నాగల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ పోరులో అతను 6–1, 6–3, 3–6, 6–1తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దాదాపు సమ ఉజ్జీలు (నాగల్ 124, క్లాన్ 129)గా ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య 2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన పోరులో చివరకు భారత ప్లేయర్‌దే పైచేయి అయింది. 2013 (సోమ్‌దేవ్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మెయిన్ డ్రా మ్యాచ్‌లో భారత ఆటగాడు గెలవడం ఇదే మొదటిసారి. శ్రమించిన ఒసాకా... మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) మూడు సెట్ల పోరాటంలో నెగ్గి ముందంజ వేసింది. తొలి రౌండ్లో 2018 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఒసాకా 6–2, 5–7, 6–2తో జపాన్‌కే చెందిన మిసాకి దోయిపై కష్టపడి గెలిచింది. అమెరికా పోలీసుల చేతుల్లో ఇటీవల మృతి చెందిన నల్ల జాతీయుల్లో ఏడుగురి స్మారకార్థం ఒసాకా ఈ టోర్నీలో ఏడు వేర్వేరు మాస్క్‌లు (ఏడు రౌండ్లలో గెలిస్తే విజేత అవుతారు) ధరించి ఆడాలని నిర్ణయించుకుంది. గత మార్చిలో అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నల్ల జాతీయురాలైన మెడికల్ టెక్నిషియన్ బ్రెనా టేలర్ పేరు ఉన్న మాస్క్‌ను మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత ఒసాకా ధరించింది.