జొకోవిచ్, బెరెటిని
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏడోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ జొకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో 7–6 (7/3), 7–5, 7–5తో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండటం విశేషం. అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ (31 సార్లు) తర్వాత జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటినితో జొకోవిచ్ తలపడతాడు.
షపోవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన షపోవలోవ్ కీలకదశలో తడబడి పాయి ంట్లు కోల్పోయాడు. మరోవైపు కెరీర్‌లో 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ కీలకదశలో పైచేయి సాధించాడు. ఏడు ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. షపోవలోవ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 11సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా అతను ఒక్కసారి మాత్రమే సఫలమయ్యాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలిచిన జొకోవిచ్ ఆదివారం విజేతగా నిలిస్తే ... అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ప్రస్తుతం సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున) సరసన ఈ సెర్బియా స్టార్ కూడా చేరుతాడు.
1976 తర్వాత...
తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ) 6–3, 6–0, 6–7 (3/7), 6–4తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా అడ్రియానో పనట్టా (1976–ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇటలీ ప్లేయర్‌గా, వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది సార్లు చాంపియన్ ఫెడరర్‌ను వరుస సెట్‌లలో ఓడించిన హుబర్ట్ సెమీఫైనల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బెరెటిని కచ్చితమైన సర్వీస్‌లు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్‌లతో చెలరేగి హుబర్ట్ ఆట కట్టించాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్దకు 25సార్లు దూసుకొచ్చి 16సార్లు పాయింట్లు గెలిచాడు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన హుబర్ట్ 26 అనవసర తప్పిదాలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment