లండన్: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై విజయం సాధించాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్‌తో తలపడాల్సిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు.
తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ రెండో సెట్ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ నెట్ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment