Serbian tennis star
-
ఎనిమిదోసారి ‘టాప్’ ర్యాంక్‌తో...
టురిన్ (ఇటలీ): సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ తొలి లీగ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7–6 (7/4), 6–7 (1/7) 6–3తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 2023 సీజన్ ముగింపు ‘టాప్’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్ రెండేళ్ల క్రితమే ఏడోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ (అమెరికా; 6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020, 2021లలో నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. ఏటీపీ ఫైనల్స్ ముగిశాక జొకోవిచ్ ఓవరాల్‌గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో 400 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు. సీజన్ ముగింపు నంబర్‌వన్ ర్యాంక్ ట్రోఫీతో జొకోవిచ్ -
Australian Open 2023: ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 7–6 (9/7), 6–3, 6–4తో 27వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 28 విన్నర్స్ కొట్టిన అతడు 22 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఐదుసార్లు దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కథ ముగిసింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్లపాటు పోరాడి గెలిచిన ముర్రే మూడో రౌండ్లో మాత్రం పుంజుకోలేకపోయాడు. బాటిస్టా అగుట్ (స్పెయిన్) 6–1, 6–7 (7/9), 6–3, 6–4తో ముర్రేను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2004 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా నలుగురు అమెరికా ఆటగాళ్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సబలెంకా, గార్సియా ముందంజ మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ ల్లో సబలెంకా 6–2, 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, గార్సియా 1–6, 6–3, 6–3తో లౌరా సీగెముండ్ (జర్మనీ)పై, బెన్‌చిచ్ 6–2, 7–5తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచారు. -
Astana Open 2022: జొకోవిచ్ ఖాతాలో 90వ టైటిల్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ వారం వ్యవధిలో రెండో టైటిల్‌ను సాధించాడు. గతవారం టెల్ అవీవ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ మాజీ నంబర్‌వన్ తాజాగా అస్తానా ఓపెన్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. కజకిస్తాన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. ఈ సీజన్లో జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్‌కాగా కెరీర్లో 90వ టైటిల్. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 3,55,310 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 94 లక్షలు) దక్కింది. చదవండి: వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్ -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్
లండన్: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్తో తలపడాల్సిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ రెండో సెట్ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ నెట్ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు. -
French open 2022: మూడో రౌండ్లోకి నొవాక్ జొకోవిచ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6–2, 6–3, 7–6 (7/4)తో అలెక్స్ మొల్కాన్ (స్లొవేకియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించాడు. మరోవైపు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 3 గంటల 36 నిమిషాల్లో 2–6, 4–6, 6–1, 6–2, 7–5తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్) 4 గంటల 34 నిమిషాల్లో 6–1, 6–7 (7/9), 5–7, 7–6 (7/2), 6–4తో అల్బర్ట్ రామోస్ వినోలస్ (స్పెయిన్)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)–హంటర్ రీస్ (అమెరికా) ద్వయం 7–6 (7/4), 6–3తో అల్ట్మెర్–ఆస్కార్ ఒటి (జర్మనీ) జోడీపై నెగ్గింది. నాలుగో సీడ్ సాకరి ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలనాలు నమోదయ్యాయి. నాలుగో సీడ్, గత ఏడాది సెమీఫైనలిస్ట్ మరియా సాకరి (గ్రీస్), గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) రెండో రౌండ్లో నిష్క్రమించారు. కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–6 (7/4)తో సాకరిపై, అలెగ్జాండ్రా సాస్నోవిచ్ (రష్యా) 3–6, 6–1, 6–1తో రాడుకానుపై గెలుపొంది మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. చదవండి: R Praggnanandhaa: భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం.. -
ఒలింపిక్స్‌లో ఆడడంపై క్లారిటీ ఇచ్చిన నెంబర్ వన్
ఓవైపు కరోనా, మరోవైపు అభిమానులు లేకుండా ఆడడం లాంటి కారణాలతో టోక్యో ఒలింపిక్స్ ఆడేది అనుమానమే అని ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ అనుమానాల్ని పక్కనపెడుతూ.. తాను ఒలింపిక్స్‌కు బయలుదేరుతున్నానని ఈ సెర్బియన్ దిగ్గజం అనౌన్స్ చేశాడు. ఈ మేరకు తన ట్విటర్లో ఒక ట్వీట్ చేసిన 34 ఏళ్ల జొకోవిచ్.. టోక్యోకు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నానని, ఒలింపిక్స్‌కు వెళ్తున్న సెర్బియన్ టీంలో తాను ఉన్నందుకు గర్వంగా ఉందని ట్వీట్లో తెలిపాడు. అంతేకాదు తన చిన్నారి స్నేహం కౌజిరౌను నిరుత్సాహపర్చడం తనకు ఇష్టం లేదంటూ పేర్కొంటూ ఆ చిన్నారి 6వ పుట్టినరోజు శుభాకాంక్షలు వీడియో సందేశం ద్వారా తెలియజేశాడు. Cannot disappoint my little friend Koujirou. I booked my flight for Tokyo and will proudly be joining #TeamSerbia for the Olympics. 🇷🇸 pic.twitter.com/23TmSdvc4x — Novak Djokovic (@DjokerNole) July 15, 2021 ఇదిలా ఉంటే ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి జోరు మీదున్న జొకోవిచ్.. ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక తన కెరీర్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్.. ఆ దఫా కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్
లండన్: ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా ముందడుగు వేస్తున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (9/7)తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటలా 17 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను జొకోవిచ్ అలవోకగానే కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మాత్రం క్వాలిఫయర్ కుడ్లా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఈ సెట్లో తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకున్న కుడ్లా 3–0తో ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే తేరుకున్న జొకోవిచ్ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి... అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 4–4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్ ‘టై బ్రేక్’కు దారి తీసింది. ఇక్కడ కూడా జొకోవిచ్ ఒక దశలో 1–4తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోర్‌ను 4–4 వద్ద సమం చేశాడు. ఇక ఇదే దూకుడులో ‘టై బ్రేక్’ను గెలిచిన జొకోవిచ్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ముగిసిన టియాఫె పోరాటం తొలి రౌండ్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో టియాఫె 3–6, 4–6, 4–6తో కరెన్ కచనోవ్ (రష్యా) చేతిలో ఓడాడు. తొమ్మిదో సీడ్ డియాగో స్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)కు మూడో రౌండ్లో ఊహించని షాక్ తగిలింది. అతను 3–6, 3–6, 7–6 (8/6), 4–6తో అన్‌సీడెడ్ ఆటగాడు మార్టోన్ ఫుక్సోవిక్స్ (హంగేరి) చేతిలో ఓడాడు. మాజీ చాంపియన్ ముగురుజా అవుట్ మహిళల సింగిల్స్‌లో 2017 వింబుల్డన్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)కు చుక్కెదురైంది. మూడో రౌండ్లో ముగురుజా 7–5, 3–6, 2–6తో ఓన్స్ జేబుర్ (ట్యూనీషియా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్), ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్లో సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్లో భారత ద్వయం సానియా మీర్జా– రోహన్ బోపన్న 6–2, 7–6 (7/5)తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్–అంకిత రైనా జంటపై గెలుపొంది రెండో రౌండ్లో ప్రవేశించింది. దివిజ్ శరణ్–సమంత శరణ్ (ఇంగ్లండ్) జోడీ 6–3, 5–7, 6–4 అరియల్ బెహెర్ (ఇజ్రాయెల్)–కలీనా ఒస్కబొయెవా (కజకిస్తాన్) జంటపై నెగ్గింది. -
ఆయన్ని ట్రాప్ చేసి వీడియో తీయమన్నారు : మోడల్
మొనాకొ: టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్ .. సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకు టెన్నిస్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన జొకోవిచ్ వరల్డ్ చాంపియన్‌గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు జొకోవిచ్ కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 82 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. టెన్నిస్ రారాజుగా వెలిగిపోతున్న జొకోవిచ్‌ను చూసి కొందరు గిట్టనివాళ్లు అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నినట్లు సమాచారం. దీనికోసం సెర్బియన్ మోడల్.. ఇన్స్టాగ్రామ్ స్టార్ నటాలియా సెకిచ్ను జొకోవిచ్‌ను తప్పుగా చూపించాలంటూ కొందరు వ్యక్తులు సంప్రదించారు. అయితే సదరు మోడల్ జొకోవిచ్ ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టంలేక వారి ఆఫర్‌ను తిరస్కరించినట్లు తాజాగా ఒక మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది.''జొకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించాలి. అలా చేస్తే 60వేల యూరోలు(భారత కరెన్సీలో రూ. 52 లక్షలు) ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. కానీ జొకోవిచ్ అంటే నాకు ఎనలేని అభిమానం. అతని ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టంలేక వారిచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను.'' అని తెలిపింది. చదవండి: మెద్వెదెవ్ మొదటిసారి... టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
సంప్రాస్ సరసన జొకోవిచ్
పారిస్: ఈ ఏడాది అద్భుతంగా రాణించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు పీట్ సంప్రాస్ సరసన నిలిచాడు. అత్యధికసార్లు పురుషుల టెన్నిస్ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. గతంలో సంప్రాస్ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్లను టాప్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ సరసన చేరాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20 చొప్పున) సాధించిన మేటి క్రీడాకారులు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) గతంలో ఐదుసార్లు చొప్పున సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించారు. గతేడాది వరకు ఫెడరర్, నాదల్ సరసన నిలిచిన జొకోవిచ్ ఈ ఏడాది వారిద్దరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోయాడు. కరోనా వైరస్ కారణంగా కుదించిన ఈ టెన్నిస్ సీజన్లో జొకోవిచ్ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ‘టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి సంప్రాస్‌ను ఆరాధించేవాణ్ని. ఇప్పుడు అతని రికార్డును సమం చేసినందుకు నా కల నిజమైంది’ అని జొకోవిచ్ అన్నాడు. కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ గత సెప్టెంబర్‌లో అత్యధిక వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సంప్రాస్ (286 వారాలు)ను మూడో స్థానానికి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 294 వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్న జొకోవిచ్ వచ్చే సీజన్లోనూ నిలకడగా ఆడితే మార్చి తొలి వారంలో... అత్యధిక వారాలు నంబర్‌వన్ స్థానంలో ఉన్న ప్లేయర్ ఫెడరర్ (310 వారాలు) రికార్డును కూడా బద్దలు కొడతాడు. నవంబర్ 15న లండన్‌లో మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు. -
యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇకపై కొత్త బాధ్యతలో కనిపించబోతున్నాడు. యునిసెఫ్‌కు తను గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే తను యునిసెఫ్‌కు సెర్బియా అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా... ఇకపై ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. యుద్ధం, ఆర్ధిక సంక్షోభం కారణంగా తన చిన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నానని, ప్రపంచంలో ప్రస్తుతం అలాంటి ఇబ్బందుల్లో ఉన్న పిల్లల్లో తాను స్థైర్యం నింపుతానని జొకోవిచ్ చెప్పాడు.