![Novak Djokovic was granted vaccine exemption after testing positive for Covid-19 in December - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/9/NOVAK-DEC-17B.jpg.webp?itok=oHeosPjl)
కోవిడ్ పాజిటివ్ వచ్చాక బెల్‌గ్రేడ్‌లో జరిగిన కార్యక్రమంలో జొకోవిచ్
మెల్‌బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు.
జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్‌గ్రేడ్‌లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్‌బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment