జొకోవిచ్‌ 24–0 | Novak Djokovic Won In US Open Grand Slam Tournament | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ 24–0

Published Wed, Sep 2 2020 3:56 AM | Last Updated on Wed, Sep 2 2020 5:32 AM

Novak Djokovic Won In US Open Grand Slam Tournament - Sakshi

ఇద్దరు దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ గైర్హాజరీలో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటను మొదలుపెట్టాడు. కరోనా ప్రత్యేక పరిస్థితుల నడుమ ఆరంభమైన యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ సెర్బియా స్టార్‌ సునాయాస విజయంతో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. గత ఏడాది వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌లలో, ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న 16 ఏళ్ల అమెరికా టీనేజ్‌ సంచలనం కోకో గాఫ్‌ మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది.

న్యూయార్క్‌: తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తొలి అడుగు వేశాడు. యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్‌ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 6–1, 6–4, 6–1తో దామిర్‌ జుమూర్‌ (బోస్నియా అండ్‌ హెర్జెగోవినా)పై గెలుపొందాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది వరుసగా 24వ విజయం కావడం విశేషం. ఏటీపీ కప్‌ టీమ్‌ టోర్నీలో, దుబాయ్‌ ఓపెన్‌లో, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నీలో జొకోవిచ్‌ అజేయంగా నిలిచాడు.

గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు సాధించాడు. మ్యాచ్‌ మొత్తంలో ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ రెండో సెట్‌లో ఏకైకసారి తన సర్వీస్‌ను కోల్పోయాడు. ‘స్టేడియం ఖాళీగా ఉన్నా, నిండుగా ఉన్నా వ్యక్తిగత శిక్షణ, సహాయక సిబ్బంది మనను ఉత్సాహపరుస్తారు. ఈసారి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో బాక్స్‌లో కూర్చున్న నా సహాయక సిబ్బంది పాయింట్లు సాధించినపుడల్లా ఉత్సాహపరిచారు. ప్రత్యర్థి పొరపాట్లు చేస్తే మన బాక్స్‌లోని మద్దతుదారులు చప్పట్లు కొట్టాలని అనుకోను. దామిర్‌ నా మంచి మిత్రుడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో, టెన్నిస్‌లోనే అతి పెద్ద స్టేడియంలో శుభారంభం చేయాలని ఎవరైనా కోరుకుంటారు’ అని విజయానంతరం జోకోవిచ్‌ వ్యాఖ్యానించాడు.  

ఇస్నెర్, ష్వార్ట్‌జ్‌మన్‌లకు షాక్‌... 
పురుషుల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఏడో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం), నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) గెలుపొందారు. అయితే తొమ్మిదో సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)... అమెరికా ఆజానుబాహుడు, 16వ సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. వరుసగా 14వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న 35 ఏళ్ల ఇస్నెర్‌ తొలి రౌండ్‌లో 7–6 (7/5), 3–6, 7–6 (7/5), 3–6, 6–7 (3/7)తో అమెరికాకే చెందిన 64వ ర్యాంకర్‌ స్టీవ్‌ జాన్సన్‌ చేతిలో ఓడిపోయాడు. 2008 తర్వాత ఇస్నెర్‌ ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి.

3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువున్న ఇస్నెర్‌ ఏకంగా 52 ఏస్‌లు సంధించాడు. రెండు సెట్‌లను టైబ్రేక్‌లలో గెలిచిన ఇస్నెర్‌ నిర్ణాయక ఐదో సెట్‌లోని టైబ్రేక్‌లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. అన్‌సీడెడ్‌ కామెరన్‌ నోరి (బ్రిటన్‌) 3–6, 4–6, 6–2, 6–1, 7–5తో ష్వార్ట్‌జ్‌మన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్‌ 7–6 (7/2), 5–7, 6–3, 7–5తో 2017 రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై, సిట్సిపాస్‌ 6–2, 6–1, 6–1తో రామోస్‌ వినోలస్‌ (స్పెయిన్‌)పై, గాఫిన్‌ 7–6 (7/2), 3–6, 6–1, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా) 6–4, 4–6, 6–3, 6–2తో సెబాస్టియన్‌ కోర్డా (అమెరికా)పై గెలిచారు.  

టీనేజర్‌ గాఫ్‌ పరాజయం 
సంచలనం సృష్టింస్తుందని భావించిన అమెరికా టీనేజ్‌ సంచలనం కోకో గాఫ్‌ 3–6, 7–5, 4–6తో 31వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 16 ఏళ్ల గాఫ్‌ 13 డబుల్‌ ఫాల్ట్‌లు, 46 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. గతేడాది గాఫ్‌ వింబుల్డన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు, యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరింది.    

నాగల్‌ ముందంజ 
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సుమీత్‌ నాగల్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌ పోరులో అతను 6–1, 6–3, 3–6, 6–1తో బ్రాడ్లీ క్లాన్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దాదాపు సమ ఉజ్జీలు (నాగల్‌ 124, క్లాన్‌ 129)గా ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య 2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన పోరులో చివరకు భారత ప్లేయర్‌దే పైచేయి అయింది.  2013 (సోమ్‌దేవ్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ మెయిన్‌ డ్రా మ్యాచ్‌లో భారత ఆటగాడు గెలవడం ఇదే మొదటిసారి.

శ్రమించిన ఒసాకా... 
మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన నాలుగో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) మూడు సెట్‌ల పోరాటంలో నెగ్గి ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో 2018 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఒసాకా 6–2, 5–7, 6–2తో జపాన్‌కే చెందిన మిసాకి దోయిపై కష్టపడి గెలిచింది. అమెరికా పోలీసుల చేతుల్లో ఇటీవల మృతి చెందిన నల్ల జాతీయుల్లో ఏడుగురి స్మారకార్థం ఒసాకా ఈ టోర్నీలో ఏడు వేర్వేరు మాస్క్‌లు (ఏడు రౌండ్‌లలో గెలిస్తే విజేత అవుతారు) ధరించి ఆడాలని నిర్ణయించుకుంది. గత మార్చిలో అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నల్ల జాతీయురాలైన మెడికల్‌ టెక్నిషియన్‌ బ్రెనా టేలర్‌ పేరు ఉన్న మాస్క్‌ను మ్యాచ్‌కు ముందు, మ్యాచ్‌ తర్వాత ఒసాకా ధరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement