Naomi Osaka
-
అతడితో బంధం ముగిసింది: టెన్నిస్ స్టార్
జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన భాగస్వామి కోర్డె అమరి బ్రూక్స్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై అతడితో సంబంధం లేదు. అంతా ముగిసినట్లే’ అని ఒసాకా సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టం చేసింది. వేర్వేరు దారుల్లో పయనంఈ మేరకు.. ‘పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అతడిపై విమర్శలు చేసేందుకు కూడా లేదు.కోర్డె గొప్ప వ్యక్తి. అంతకుమించి అద్భుతమైన తండ్రి. వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో నేర్చుకున్నా. నా కుమార్తె అతిపెద్ద ఆశీర్వాదం’ అని ఒసాకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఒసాకా ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక తాజా సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019 నుంచి కోర్డె- నయోమి ఒసాకా సహజీవనం చేస్తున్నారు. ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోర్డెతో కలిసి 27 ఏళ్ల ఒసాకా 2023లో ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా జనవరి 12 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ మొదలుకానుంది. మరిన్నిక్రీడా వార్తలుసహజ శుభారాంభంసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 6–3, 7–5తో పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.ఒక గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఏడు ఏస్‌లు సంధించింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 76 పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.అయితే, డబుల్స్ విభాగంలో సహజ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సహజ (భారత్)–దరియా అస్తకోవా (రష్యా) ద్వయం 3–6, 3–6తో నయీమా కరామోకు (స్విట్జర్లాండ్)–ఇనెస్ ఇబు (అల్జీరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. కళింగ లాన్సర్స్ చేతిలో బెంగాల్ టైగర్స్ చిత్తు రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో కళింగ లాన్సర్స్ భారీ విజయాన్ని అందుకుంది. లాన్సర్స్ 6–0 గోల్స్‌తో బెంగాల్ టైగర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా... 2 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. లాన్సర్స్ తరఫున థియరీ (3వ నిమిషం, 47వ నిమిషం), సంజయ్ (4వ నిమిషం), హెన్డ్రిక్ (6వ నిమిషం), బండూరన్ (29వ నిమిషం), బాబీ సింగ్ ధామీ (49వ నిమిషం) గోల్స్ సాధించారు.తొలి క్వార్టర్స్‌లో 3 గోల్స్‌తో ముందంజ వేసిన లాన్సర్స్‌ను తర్వాతి రెండు క్వార్టర్లలో కొంత వరకు నిలువరించడంలో టైగర్స్ సఫలమైంది. అయితే చివరి క్వార్టర్లో కూడా మరో రెండు గోల్స్‌తో కళింగ తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లలో తమిళనాడు డ్రాగన్స్‌తో గోనాసిక వైజాగ్...యూపీ రుద్రాస్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడతాయి. -
కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా ఉన్నాడు. ఒకప్పుడు సచిన్, ధోనిలు చూసిన సంపద వైభోగాన్ని ఇప్పుడు కోహ్లి చూస్తున్నాడు. లెక్కలేనన్ని ఎండార్స్మెంట్లు, యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఆసియా ఖండంలో మాత్రం కోహ్లి రెండో ధనవంతమైన ఆటగాడిగా నిలిచాడని స్పోర్టికో అనే సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది. 2022 ఏడాదిలో రూ.277 కోట్లు సంపాదించిన కోహ్లి.. ఓవరాల్‌గా అత్యంత ధనవంతమైన ఆటగాళ్ల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్-100 లిస్ట్‌లో కోహ్లి మినహా ఏ క్రికెటర్ చోటు సంపాదించలేకపోయాడు. మరి ఆసియా ఖండం నుంచి టాప్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరని ఆరా తీస్తే జపాన్‌కు మహిలా టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అని తేలింది. 2022 ఏడాదిలో ఈ మాజీ యూఎస్ ఓపెన్ ఛాంపియన్ రూ. 434 కోట్లకు పైగా అర్జించినట్లు రిపోర్టులో వెల్లడించింది. రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ఎన్బీఏ స్టార్ లెబ్రన్ జేమ్స్ రూ.1037 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. లియోనల్ మెస్సీ రూ.997 కోట్లతో రెండో స్థానం, క్రిస్టియానో రొనాల్డో రూ. 939 కోట్లతో మూడో స్థానం, నెయ్మర్ రూ. 843 కోట్లతో నాలుగో స్థానం.. ఇక టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్ రూ.727 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్‌ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు మాజీ విజేత దూరం
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు మరో దెబ్బ పడింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, 2022 యూఎస్ ఓపెన్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా) వైదొలగగా.. ఈ జాబితాలో తాజాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా చేరింది. జపాన్‌కు చెందిన 25 ఏళ్ల ఒసాకా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదని నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. అయితే ఒసాకా వైదొలగడానికి కారణం మాత్రం వారు వెల్లడించలేదు. 2019, 2021లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఒసాకా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ టోర్నీలోనూ ఆడలేదు. ప్రస్తుతం ఆమె 42వ ర్యాంక్‌కు పడిపోయింది. 2018, 2020 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన ఒసాకా 2021 ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో వైదొలిగింది. ఆ తర్వాత తాను మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నానని తెలిపి రెండునెలలపాటు ఆట నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత పలు టోర్నీలలో ఆమె బరిలోకి దిగినా టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. -
ఫోర్బ్స్ టాప్-25 జాబితాలో పీవీ సింధు
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించింది. ఫోర్బ్స్ టాప్ 25 స్పోర్ట్స్‌వుమెన్ జాబితాలో పీవీ సింధు చోటు సంపాదించింది. మహిళల అథ్లెట్లలో అత్యధికంగా సంపాదిస్తున్న 25 క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ శుక్రవారం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో షట్లర్ పీవీ సింధు 12వ స్థానంలో ఉంది. జపాన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయర్ నవోమీ ఒసాకా తొలి స్థానంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్, కామన్వెల్త్గేమ్స్ సింగ్సిల్‌లో గోల్డ్, డబుల్స్‌లో సిల్వర్ గెలిచిన సింధు.. ఈ ఏడాది ఏడు మిలియన్ల డాలర్లు అర్జించినట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి ఒసాకా ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఈ జాబితాలో ఎక్కువ శాతం మంది టెన్నిస్ ప్లేయర్లే ఉన్నారు. టాప్ 10 లిస్టులో ఒసాకాతో పాటు సెరీనా, ఎమ్మా రాడుకాన, ఇగా స్వియాటెక్, వీనస్, కోకో గౌఫ్, జెస్సికా పెగులాలు ఉన్నారు. -
రఫ్పాడించిన స్పెయిన్ బుల్; ఒసాకాకు బిగ్‌షాక్
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దిగ్విజయంగా అధిగమించాడు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్లో నాదల్.. ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రింకీ హిజికాటాను 4-6, 6-2, 6-3, 6-3తో ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో నాదల్ తొలి సెట్‌ను 4-6తో హిజికాటాకు కోల్పోయాడు. అయితే ఇక్కడి నుంచి నాదల్ తన గేర్ మార్చాడు. రెండో గేమ్ నుంచి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన వరుసగా మూడు సెట్లను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. Photo Credit: US Open Twitter ఇక 22 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన నాదల్.. ఇటీవలే వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు ముందు గాయంతో దూరమయ్యాడు. అయితే ఈసారి మాత్రం నాదల్‌లో ఫిట్నెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్ దూరం కాగా.. నాదల్ మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. ఇక రెండో రౌండ్లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడనున్నాడు. 2019లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నాదల్ ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఆడడం ఇదే. ఇప్పటికవరకు నాదల్ ఖాతాలో నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. #USOpen night sessions carry. Just ask @RafaelNadal pic.twitter.com/llcuqtIA7F — US Open Tennis (@usopen) August 31, 2022 HOLY MATCH POINT RAFA pic.twitter.com/sHsyYmPBAK — US Open Tennis (@usopen) August 31, 2022 తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నవోమి ఒసాకా Photo Credit: US Open Twitter యూఎస్ ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టగా.. తాజాగా జపాన్ టెన్నిస్ స్టార్.. మాజీ చాంపియన్ 44వ సీడ్ నవోమి ఒసాకా అమెరికాకు చెందిన 19వ సీడ్ డేనియల్ కాలిన్స్ చేతిలో 7-6(7-5), 6-3 తేడాతో ఓడి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న ఒసాకా 2018, 2020లో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. Danielle Collins is into Round 2 of the #USOpen pic.twitter.com/rUZa0hWKHx — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: Emma Raducanu: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్ Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
మయామి ఓపెన్ చాంపియన్ స్వియాటెక్
పోలాండ్ టెన్నిస్ స్టార్ స్వియాటెక్ మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీ ఫైనల్లో 6–4, 6–0తో మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో స్వియాటెక్‌కిది వరుసగా మూడో ప్రీమియర్ టైటిల్ (ఖతర్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, మయామి ఓపెన్) కావడం విశేషం. సెరెనా (అమెరికా–2013లో), వొజ్నియాకి (డెన్మార్క్–2010లో) తర్వాత ఒకే సీజన్లో వరుసగా మూడు డబ్ల్యూటీఏ–1000 టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. -
అయ్యో ఒసాకా...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదో రోజు పెను సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 14వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అమెరికాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్, 20 ఏళ్ల అమండా అనిసిమోవాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 6–4, 3–6, 6–7 (5/10)తో ఓడిపోయింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో సెట్లో ఒసాకా 5–4తో ఆధిక్యంలో ఉండి, అనిసిమోవా సర్వ్ చేసిన పదో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కూడా సంపాదించింది. అయితే ఈ రెండుసార్లూ మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న అనిసిమోవా తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమై టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి ఒసాకాను ఇంటిముఖం పట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా తలపడుతుంది. మూడో రౌండ్లో బార్టీ 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–0, 6–2తో 15వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–4, 6–4తో ఒస్టాపెంకో (లాత్వియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శ్రమించిన నాదల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. 2 గంటల 50 నిమిషాల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 6–3, 6–2, 3–6, 6–1తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచాడు. -
ఒసాకా అలవోకగా...
మానసిక ఆందోళనతో గత ఏడాది ఇబ్బంది పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కొత్త సంవత్సరంలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా దాటింది. అనవసర తప్పిదాలు చేసినా నిరాశకు లోనుకాకుండా నవ్వుతూ ఆడిన ఈ 14వ ర్యాంకర్ కెరీర్లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. మెల్బోర్న్: తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించిన నయోమి ఒసాకా (జపాన్), యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్, 13వ సీడ్ ఒసాకా 6–3, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై, టాప్ సీడ్ బార్టీ 6–0, 6–1తో క్వాలిఫయర్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)పై గెలిచారు. ఒసోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 68 నిమిషాల్లో గెలిచింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఒసాకా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచిన ఒసాకా 28 అనవసర తప్పిదాలు చేసింది. సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో బార్టీ కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయింది. నాదల్ బోణీ... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై నెగ్గగా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న జ్వెరెవ్ 7–6 (7/3), 6–1, 7–6 (7/1)తో అల్టామెర్ (జర్మనీ)పై గెలిచాడు. గిరోన్తో మ్యాచ్‌లో నాదల్ ఏడు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. 34 విన్నర్స్ కొట్టిన నాదల్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న సెబాస్టియన్ కోర్డా (అమెరికా) 6–3, 6–0, 6–4తో నోరిపై గెలిచాడు. ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 4–6, 6–2, 7–6 (7/5), 6–3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–2, 7–6 (7/3), 6–7 (5/7), 6–3తో జెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గారు. కెనిన్‌కు షాక్... మహిళల సింగిల్స్‌లో తొలి రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2020 చాంపియన్, 11వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), 18వ సీడ్ కోకో గాఫ్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 7–5తో కెనిన్‌ను ఓడించగా... ప్రపంచ 112వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ (చైనా) 6–4, 6–2తో కోకో గాఫ్‌పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–4, 7–6 (7/2)తో తాత్యానా మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–4, 6–0తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి'
మహిళల టెన్నిస్ సూపర్ స్టార్ నయామి ఒసాకా తన బ్రేక్టైమ్ను ఫుల్ స్వింగ్‌తో ఆస్వాధిస్తోంది. ఇటీవలే జరిగిన యూఎస్ ఓపెన్‌లో మూడోరౌండ్లోనే ఇంటిబాట పట్టిన ఒసాకా కొంతకాలం టెన్నిస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దొరికిన సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్న ఒసాకా తనకిష్టమైన వంటల్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వాటికి గమ్మత్తైన పేర్లు పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాగ్యూ కాస్తూ అనే జపనీస్ కర్రీనీ వండిన ఒసాకా దానిని ఇన్‌స్టాలో పంచుకుంటే.. ఈరోజు మీ ముందుకు వాగ్యా కాస్తూ జపనీస్ కర్రీనీ తీసుకొచ్చాడు.. కానీ అది సరిగా కుదిరిందో లేదో చూడాలి.. ఇకపై నన్ను ''చెఫ్ బొయార్డీ'' అని పిలవండి. అంటూ క్యాప్షన్ జత చేసింది. చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా... బ్రేకప్ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్! ఇక ఈ ఏడాది ఒసాకాకు పెద్దగా కలిసిరాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రెండోసారి గెలిచిన ఒసాకా 2021 ఏడాదిని ఘనంగానే ఆరంభించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఆరోగ్య సమస్యలతో వింబుల్డన్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మూడోరౌండ్లోనే వెనుదిరిగి నిరాశ పరిచింది. ఇక 24 ఏళ్ల ఒసాకా తన టెన్నిస్ కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ అందుకుంది. ఇటీవలే టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ''2021లో అత్యంత ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు'' జాబితాలో నయామి ఓసాకా చోటు దక్కించుకోవడం విశేషం. -
Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం
టోక్యో: వచ్చే నెలలో జరిగే ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి మాజీ చాంపియన్ నయోమి ఒసాకా వైదొలిగింది. ఇటీవల యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా అనూహ్యంగా మూడో రౌండ్లో కెనడాకు చెందిన లేలా ఫెర్నాండెజ్ చేతిలో ఓడింది. ఆ ఓటమి అనంతరం మళ్లీ తాను రాకెట్ పట్టేది ఎప్పుడో తనకు కూడా తెలీదంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత ఒసాకా ఆటకు నిరవధిక విరామాన్ని ప్రకటించింది. ఇండియన్ వెల్స్ టోర్నీ అక్టోబర్ 4 నుంచి 17 వరకు జరగనుంది. Ostrava Tennis Tournament: ఒస్ట్రావా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా–షుయె జాంగ్ (చైనా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చెక్ రిపబ్లిక్ లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో సానియా–షుయె జంగ్ ద్వయం 6–7 (3/7), 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇమీనా బెక్టాస్ (అమెరికా)–తారా మూర్ (బ్రిటన్) జోడీపై నెగ్గింది. చదవండి: Ind W Vs Aus W 2nd ODI: నిలవాలంటే గెలవాల్సిందే! -
US Open 2021: లేలా మరో సంచలనం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ మరో సంచలనం సృష్టించింది. మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకాను ఇంటిముఖం పట్టించిన 19 ఏళ్ల ఈ కెనడా అమ్మాయి... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్, మాజీ వరల్డ్ నంబర్‌వన్, 16వ సీడ్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లేలా 4–6, 7–6 (7/5), 6–2తో కెర్బన్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెట్ కోల్పోయి రెండో సెట్లో 2–4తో వెనుకబడ్డ లేలా ఎనిమిదో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించి రెండో సెట్‌ను దక్కించుకుంది. అదే జోరులో నిర్ణాయక మూడో సెట్లోనూ దూకుడుగా కెర్బర్ ఆట కట్టించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–6 (7/4)తో మాజీ వరల్డ్ నంబర్‌వన్, తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–1తో ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అల్కారజ్ జోరు పురుషుల సింగిల్స్‌లో 18 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఐదు సెట్లలో ఓడించిన అల్కారజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ ఐదు సెట్లలో గెలిచాడు. పీటర్ గొజోవిక్ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో అల్కారజ్ 5–7, 6–1, 5–7, 6–2, 6–0తో నెగ్గాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–3, 6–4, 6–3తో ఇవాన్స్ (బ్రిటన్)పై, 12వ సీడ్ ఫీలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా) 4–6, 6–2, 7–6 (8/6), 6–4తో టియాఫో (అమెరికా)పై, జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్) 6–3, 6–4, 5–7, 5–7, 6–1తో 11వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. చదవండి: IND Vs ENG 4th Test Day 5:50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం -
US Open: సంచలనాల మోత
న్యూయార్క్: కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ తన జీవితంలోనే గొప్ప విజయాన్ని సాధించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై లేలా జయభేరి మోగించింది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో లేలా 5–7, 7–6 (7/2), 6–4తో ఒసాకాను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి సెట్ సొంతం చేసుకొని, రెండో సెట్ లో 6–5తో ఆధిక్యంలో ఉండి విజయం కోసం సర్వీస్ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన లేలా స్కోరును 6–6తో సమం చేసి... టైబ్రేక్‌లోనూ పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లోనే ఒసాకా సరీ్వస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను కాపాడుకొని లేలా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత లేలా తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో లేలా ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు ఆరుసార్లు దూసుకొచ్చి ఐదుసార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు 2018, 2020లలో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఒసాకా 15 ఏస్‌లు సంధించినా 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో మరియా సాకరి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో స్వితోలినా, సబలెంకా ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–2తో కసత్కినా (రష్యా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో రఖిమోవా (రష్యా)పై, తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–4, 3–6, 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. మెద్వెదేవ్ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మూడో రౌండ్లోనే ని్రష్కమించగా... రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మెద్వెదేవ్ 6–0, 6–4, 6–3తో పాబ్లో అందుహార్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరోవైపు స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ 4 గంటల 7 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/2), 0–6, 7–6 (7/5)తో సిట్సిపాస్‌ను ఓడించగా... 23 ఏళ్ల అమెరికా యువతార టియాఫో 3 గంటల 45 నిమిషాల్లో 4–6, 6–3, 7–6 (8/6), 4–6, 6–1తో రుబ్లెవ్‌పై గెలిచాడు. తాజా విజయంతో అల్కారజ్ 1989లో పీట్ సంప్రాస్ (అమెరికా), మైకేల్ చాంగ్ (అమెరికా) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సిట్సిపాస్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కారజ్ కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్ షాట్లతో హడలెత్తించాడు. సిట్సిపాస్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రుబ్లెవ్తో జరిగిన మ్యాచ్‌లో టియాఫో 24 ఏస్‌లు సంధించడం విశేషం. టెన్నిస్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో నేను గెలిస్తే సంతోషం కలిగేది కాదు. ఊరట లభించినట్టు అనిపించేది. ఇక ఓడిపోతే తీవ్రంగా నిరాశ కలిగేది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేను. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ నేను ఎప్పుడు రాకెట్ పట్టి కోర్టులోకి దిగుతానో నాకే తెలియదు. –ఒసాకా మిక్స్‌డ్‌లోనూ సానియా ఓటమి యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా... మిక్స్డ్ డబుల్స్‌లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. భారత సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ రాజీవ్ రామ్ కలిసి సానియా మిక్స్డ్ డబుల్స్‌లో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం 3–6, 6–7 (7/10)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)–డయానా యా్రస్టెమ్స్కా (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జంట 3–6, 6–3, 7–6 (7/1)తో డక్‌వర్త్–థాంప్సన్ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
Tokyo Olympics: నవోమి ఒసాకాకు షాక్; మూడో రౌండ్లో ఓటమి
టోక్యో: ఒలింపిక్స్‌లో జపాన్ టెన్నిస్ స్టార్.. ప్రపంచ రెండో ర్యాంకర్ నవోమి ఒసాకాకు షాక్ తగిలింది. టెన్నిస్ సింగిల్స్ విభాగం నుంచి ఆమె నిష్క్రమించింది. కాగా తాను ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా కష్టపడకుండానే విజయాలు సాధించిన ఒసాకా మూడవ రౌండ్లో మాత్రం ఎవరు ఊహించిన విధంగా వరుస సెట్లలో ఓటమి పాలయ్యింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వండ్రోసోవాతో జరిగిన మ్యాచ్‌లో 6-1, 6-4 స్కోర్ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒకాసా 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కాగా మ్యాచ్ ప్రారంభం నుంచి ఈ జపాన్ ప్లేయర్ తడబడుతూనే ఆడింది. కాగా లోకల్ ప్లేయర్‌గా మంచి అంచనాలతో బరిలోకి దిగిన ఒసాకా పతకం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకముందు టెన్నిస్ మహిళల నెంబర్‌వన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్లోనే ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
నాదల్ బాటలోనే మరో స్టార్ ప్లేయర్
టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదెల్ వింబుల్డన్-2021, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోనని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జపాన్ టెన్నిస్ స్టార్, యువ సంచలనం నయోమి ఒసాకా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడబోనని తెలిపింది. ఈ మేరకు ఒసాకా ఏజెంట్ స్టువర్ట్ డుగుయిడ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె ఆడే అవకాశాలున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. కాగా, వ్యక్తిగత కారణాలతో నయోమి ఒసాకా వింబుల్డన్ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. సన్నిహితులు, కుటుంబంతో కొద్దిరోజులు ఆమె గడపాలనుకుంటోంది. తద్వారా కొత్త ఉత్సహాంతో తర్వాతి టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనే అవకాశాలు కొద్ది రోజుల తర్వాత పరిశీలిస్తాం అంటూ స్టువర్ట్ పేరు మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. చూడండి: జపన్ యువసంచలనం ఫొటోలు ఇదిలా ఉంటే గత నెలలో ఫ్రెంచ్ టోర్నీ నుంచి నాటకీయ పరిణామాల తర్వాత నెంబర్ వన్ ప్లేయర్ నయోమి ఒసాకా వైదొలగిన విషయం తెలిసిందే. మీడియా సమావేశం తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుందని పేర్కొంటూ ప్రెస్ మీట్‌కు ఆమె విముఖత వ్యక్తం చేసింది. ఈ చర్యపై టోర్నీ నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానా విధించడంతో పాటు వేటు హెచ్చరిక చేశారు. అయితే ఈ లోపే 23 ఏళ్ల యువ సంచలనం టోర్నీ నుంచి నిష్క్రమించి టెన్నిస్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఒసాకాకు భారీ ఝలక్ -
మహిళా క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం..
ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం ఎంతైనా ఉందని, అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు తానెప్పుడూ డుమ్మా కొట్టాలని అనుకోనని భారత మహిళల టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు. సమాజంలో మీడియా ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి క్రీడారంగానికి చెందిన వారందరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. క్రీడారంగానికి చెందిన వారెవరికైనా క్వారంటైన్లో గడపడం కష్టమేనని, ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టాక ఆ కష్టాలు వాటంతటవే కనుమరుగవుతాయని ఒసాకాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మహిళా క్రికెట్ అభ్యున్నతి కోసం తనతో పాటు ప్రతి ఒక్క మహిళా క్రికెటర్ కలిసి రావాలని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరు మీడియాతో హుందాగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడేది లేదంటూ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మిథాలీ ఈ మేరకు స్పందించారు. కాగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ నంబర్ 2 టెన్నిస్క్రీడాకారిణి ఒసాకా ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె తీసుకున్న నిర్ణయంతో అభిమానులందరూ నిరాశ చెందడమే కాకుండా, టోర్నీ కూడా కళావిహీనంగా మారిపోయింది. మీడియాతో మాట్లాడేది లేదంటూ, ప్రెస్ కాన్ఫరెన్స్‌ను బాయ్‌కాట్ చేసిన ఒసాకాకు ఆదివారం మ్యాచ్ రిఫరీ ఫైన్ విధించారు. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాను సహజమైన పబ్లిక్ స్పీకర్‌ను కాకపోవడం వల్ల ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతానని, నిజానికి 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను కుంగుబాటులో ఉన్నానని, అందుకే మీడియా సమావేశానికి ఒప్పుకోలేదని ఆమె వివరణ ఇవ్వడం కొసమెరుపు. చదవండి: డీకే తిట్టుకున్న బ్యాట్‌తో తొలి ఫిఫ్టీ కొట్టిన రోహిత్.. -
Naomi Osaka: ఫ్రెంచ్ టోర్నీలో ఊహించని ట్విస్ట్!
‘మీడియా సమావేశాల్లో పాల్గొనను. ఈ నిర్ణయం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం’... ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభానికి ముందు జపాన్ స్టార్ నయోమి ఒసాకా చేసిన ప్రకటన ఇది. వారం రోజులు కూడా గడవక ముందే ఆమె అంచనా నిజమైంది. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు భారీ జరిమానా వేసి కఠినంగా వ్యవహరించగా... తాను కూడా వెనక్కి తగ్గనంటూ ఒసాకా కఠిన నిర్ణయం తీసుకుంది. మున్ముందు తనపై చర్యలు తీసుకునే అవకాశం ఎలాగూ ఉండటంతో టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మీడియా కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతున్న తన దృష్టిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లెక్క కాదన్నట్లుగా ఆమె వ్యవహరించింది. పారిస్: నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ నయోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆట నుంచి విరామం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్లో విజయం సాధించిన ఒసాకా... బుధవారం జరిగే రెండో రౌండ్లో రొమేనియాకు చెందిన అనా బొగ్డన్తో తలపడాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందే ఆమె క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌కు గుడ్‌బై చెప్పేసింది. తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఒసాకా ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేసింది. 23 ఏళ్ల ఒసాకా తన కెరీర్లో మొత్తం ఏడు సింగిల్స్ టైటిల్స్ సాధించగా... అందులో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉండటం విశేషం. 2018లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా 2019, 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను... 2020లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరమని, వచ్చే ఏడాది ఆమె ఈ టోర్నీలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించిన ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ చీఫ్ గైల్స్ మోరెటాన్... ఆటగాళ్ల ఆరోగ్యం, మంచీ చెడూ చూసుకునే బాధ్యతను తాము ఎప్పుడూ విస్మరించలేదని స్పష్టం చేశారు. నేపథ్యమిదీ... మీడియా సమావేశాల్లో విలేకరులు అర్థం పర్థం లేని ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి తమను ఇబ్బంది పెడుతుంటారని... పలు సందర్భాల్లో ఆటగాళ్లను బాధపెట్టడమే లక్ష్యంగా ఇలా చేస్తుంటారని ఆరోపిస్తూ ఒసాకా రాబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో జరిగే మీడియా సమావేశాల్లో పాల్గొననని టోర్నీకి ముందు ప్రకటించింది. ఓడినప్పుడైతే తమ మానసిక స్థితిని పట్టించుకోకుండా విలేకరులు వేధిస్తారంటూ వ్యాఖ్యానించిన ఆమె... తాను ఇవన్నీ తట్టుకోలేనంటూ చెప్పింది. అయితే గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు కచ్చితంగా మీడియా సమావేశానికి హాజరు కావాల్సిందే. ఊహించినట్లుగానే తొలి రౌండ్ విజయం తర్వాత ఒసాకా తన మాటపై నిలబడటంతో నిర్వాహకులు ఆమెపై 15 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. దీంతో పాటు అవసరమైతే గ్రాండ్‌స్లామ్‌లలో ఆడకుండా నిషేధం కూడా విధిస్తామంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు హెచ్చరించారు కూడా. ఇలాంటి స్థితిలో టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడమే సరైందిగా ఆమె భావించింది. మీడియా గురించి కొద్ది రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు ఇలాంటి స్థితి వస్తుందని ఊహించలేదు. అయితే నాపై అనవసర దృష్టి పడుతున్న కారణంగా అందరి మేలు కోరి టోర్నీ నుంచి తప్పుకోవడమే సరైనదిగా భావిస్తున్నా. ఇది తగిన సమయం కాదని తెలిసినా తప్పడం లేదు. నా దృష్టిలో మానసిక ఆరోగ్య సమస్య చిన్నదేమీ కాదు. నిజం చెప్పాలంటే 2018లో యూఎస్ ఓపెన్ గెలిచిన నాటి నుంచే మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తున్నాను. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాదని నా సన్నిహితులందరికీ తెలుసు. జనంలో ఉన్నప్పుడు ఆందోళనను తగ్గించుకునే క్రమంలోనే ఎక్కువ సమయం హెడ్ ఫోన్లు ధరిస్తూ ఉంటాను కూడా. నిజానికి టెన్నిస్ మీడియా నన్ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోయినా, మీడియా సమావేశానికి రాగానే తీవ్రంగా ఆందోళనకు లోనవుతూ ఉంటాను. పారిస్‌లో ఇప్పటికే పరిస్థితి నన్ను మరీ భయపెట్టేలా ఉంది. అందుకే నా మేలు కోసం మీడియాకు దూరంగా ఉండాలని భావించా. ఇక్కడ ఉన్న కొన్ని పాతకాలపు నిబంధనలను అందరి దృష్టికీ తీసుకురావాలని ప్రయత్నించా. నిర్వాహకులకు క్షమాపణ చెబుతూ టోర్నీ ముగిసిన తర్వాత మాట్లాడతా అని కూడా విడిగా చెప్పా. ప్రస్తుతానికి మైదానం నుంచి విరామం తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఏమేం చేయవచ్చో నేనూ చర్చిస్తా. –నయోమి ఒసాకా చదవండి: ర్యాప్ అండ్ లవ్‌స్టోరీ -
ప్రెస్‌మీట్ వివాదం.. ఒసాకాకు ఝలక్
పారిస్: జపనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ నయోమి ఒసాకా చెప్పినట్లే చేసింది. ఫ్రెంచ్ టోర్నీలో భాగంగా మ్యాచ్ తర్వాత ప్రెస్మీట్లో పాల్గొనకుండా వెళ్లిపోయింది. దీంతో మ్యాచ్ రిఫరీ ఆమెకు ఫైన్ విధించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే టోర్నీ నుంచి డిస్క్వాలిఫై చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, రూల్స్ తెలిసి కూడా ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఒసాకా ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా ఆదివారం రొమేనియన్ ప్లేయర్ ప్యాట్రికాతో మ్యాచ్ తర్వాత(ఒసాకానే గెలిచింది) ఆమె మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీంతో ఈ వరల్డ్ నెంబర్ టు ర్యాంకర్‌కి 15 వేల డాలర్ల జరిమానా విధించారు. అంతేకాదు మళ్లీ ఇలా జరిగితే అనర్హత వేటు తప్పదని మ్యాచ్ రిఫరీ రొనాల్డ్ గారోస్ హెచ్చరించారు. 23 ఏళ్ల వయసున్న ఒసాకా నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెల్చుకోవడంతో పాటు.. స్పోర్ట్స్‌లో అత్యధికంగా సంపాదించే ఫిమేల్ ప్లేయర్ కూడా.: చూడండి: నయోమి ఒసాకా ఫొటోలు మీరేం స్పెషల్ కాదు ఇక ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే నయోమి ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెబుతూ ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసింది. గ్రాండ్‌స్లామ్ రూల్స్ ప్రకారం.. మీడియా సమావేశాన్ని ఎగ్గొడితే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఆమె బాయ్‌కాట్ చేయడం నిర్వాహకులకు మరింత కోపం తెప్పించింది. దీంతో మీరేం స్పెషల్ కాదని, నిబంధనలను ఆటగాళ్లందరికీ వర్తిస్తాయని పేర్కొంటూ ‘వింబుల్డన్, ఫ్రెంఛ్ ఓపెన్, ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నిర్వాహ కమిటీలు సంయుక్తంగా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మ్యాచ్ ముగిశాక ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆమె మీడియాతో ఇంటెరాక్ట్ కావడం విశేషం. anger is a lack of understanding. change makes people uncomfortable. — NaomiOsaka大坂なおみ (@naomiosaka) May 30, 2021 -
మీడియాతో మాట్లాడేది లేదు!
ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జపాన్ స్టార్ నవోమీ ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కానని ప్రకటించింది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉండగా...అందుకు తాను సిద్ధమని ప్రకటించింది. -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నయోమి ఒసాకా ఫోటోలు
-
ర్యాప్ అండ్ రాకెట్ లవ్ స్టోరీ
ఇష్టం లేని పనుల్ని కూడా కూర్చోబెట్టి మరీ చేయిస్తుంది ప్రేమ! తాజా గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో విజేత అయిన నయోమీకి.. కార్డీ అని ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె కోసం ఆమె ఆటని ప్రతిసారీ ఏడ్చుకుంటూ చూస్తుంటాడు. నయోమీ గెలుపు, ఓటమి లెక్క కాదు అతడికి. ఆటను త్వరగా ముగించేస్తే ఇద్దరూ వెళ్లి ఎక్కడైనా డిన్నర్ చేస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం అతడికి ఇష్టం. రెండేళ్ల నుంచీ రిలేషన్లో ఉన్నారు. ఆమెలో అతడికి నచ్చింది ఆమే. ఆమె ఆట కాదు. అతడిలో ఆమెకు నచ్చింది అతడొక్కడే కాదు. అతడి ‘ర్యాప్’ కూడా. ఎలా కుదిరింది? ఎలా కుదురుతుంది? నయోమీ ఒసాకా.. టెన్నిస్ స్టార్. కార్డే అమరీ.. ర్యాప్ స్టార్. ఆమె నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్. అతడు గ్రామీ–నామినేటెడ్ ర్యాపర్. ఇద్దరూ యూఎస్‌లోనే ఉంటారు. అయితే ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఆమెకు ‘ర్యాప్’ పనిగట్టుకునేమీ ఇష్టం లేదు. అతడికి ఈ లోకంలో టెన్నిస్ అనే ఆట ఒకటుందనే స్పృహే లేదు. అలాంటి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీళ్లు పడ్డారు సరే. వీళ్ల ప్రేమ నిలబడుతుందా? అది మన సందేహం మాత్రమే. వాళ్ల సమాధానం వేరుగా ఉంది. ‘‘నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటే మన ప్రేమకు కాళ్లలో శక్తి లేదనే’’ అని నవ్వుతూ అనేస్తారు. ఆమె రాకెట్ శక్తి, అతడి ర్యాప్ శక్తి కలిపి ఎప్పటికప్పుడు పునఃస్థాపించుకోవలసిన స్థితిలోనైతే వారి ప్రేమ లేదనే అనిపిస్తోంది. దానిక్కారణం ఉంది. ఇద్దరి లో ఒకరు ఇంకొకరి కోసం ‘ట్రై’ చేస్తే జనించిన ప్రేమ కాదు వాళ్లది. తనకై తను ఆవిర్భవించిన ప్రేమ! ∙∙ మొదట నయోమీ దృష్టే కార్డే మీద పడింది. అప్పటికే ఆమె తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ (యు.ఎస్. ఓపెన్) సాధించి ఉన్న టెన్నిస్ ప్లేయర్. లాస్ ఏంజెలిస్ క్లిప్పర్స్ బాస్కెట్ బాల్ గేమ్ చూడ్డానికి వెళ్లింది. అక్కడే కార్డే కూడా ఉన్నాడు. అతడూ ఆట చూడ్డానికే వచ్చాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు ఫొటోల కోసం చుట్టుముట్టడం, కార్డే పసి పిల్లాడిలా నవ్వుతూ అడిగిన వారందరితో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం నయోమీ దూరాన్నుంచి చూసింది. వెళ్లి పలకరించింది. ‘హాయ్’ అన్నాడు. ‘నేను నయోమీ. టెన్నిస్ ప్లేయర్’ అంది. ‘నువ్వు టెన్నిస్ ప్లేయర్ ఎలా అవుతావు? సెరెనా సిస్టర్స్ కదా టెన్నిస్ ప్లేయర్స్’ అన్నట్లు చూసి.. ‘‘టెన్నిస్ గురించి నాకేమీ తెలీదు’’ అన్నాడు. ‘‘నాకు కార్డే ర్యాప్ గురించి కొంచెం తెలుసు’’ అని నవ్వింది. కార్డే మాత్రం ఇప్పటికీ అదే మాట చెబుతుంటాడు. ‘‘నయోమీ మాత్రమే నాకు తెలుసు. నయోమీ ఆట గురించి తెలీదు. కానీ ఆమె కోసం ఆమె ఆటను చూస్తూ కూర్చుంటాను’’ అంటాడు. జంటగా నయోమీ, కార్డే ; జీక్యూ మ్యాగజీన్ తాజా సంచికపై నయోమీ, కార్డే మొన్నటితో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది నయోమీ. 2018లో యూ.ఎస్. ఓపెన్. అప్పటికి ఇద్దరికీ పరిచయం లేదు. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్. అదే తొలిసారి టెన్నిస్ ఆటను చూడటం కార్డే. ‘కూర్చొని చూడు’ అని నయోమీ అంటే కూర్చొని చూశాడు. 2020లో యు.ఎస్. ఓపెన్. కరోనా టైమ్‌లో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నయోమీ.. ‘‘నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది’’ అని ఫోన్ చేస్తే న్యూయార్క్ నుంచి ఫ్లయిట్లో దిగి ఆమె మ్యాచ్‌కి గ్యాలరీలో కూర్చొని గెలిపించాడు. ‘అవును. కార్డే వచ్చినందు వల్లనే నేను గెలిచాను’ అంటుంది నయోమీ. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడే.. ‘ఇది నా ప్లేస్ కాదు. కానీ నయోమీ కోసం నాది కాని ప్లేస్‌లోకి వచ్చాను’ అన్నాడు కార్డే. మొన్న శనివారం నయోమీ 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవగానే యూఎస్ పత్రికలన్నీ ఈ జంటను చుట్టేశాయి.. పెళ్లెప్పుడని. ఇద్దరూ ఈడూ జోడు. ఒకే ఏడాది పుట్టినవారు. వయసు 23. ∙∙ పెళ్లా! అసలు ఈ రెండేళ్లుగానే నయోమీ, కార్డే కాస్త దగ్గరగా ఉండటం. ప్రారంభంలో వాళ్లిద్దరి మధ్యా కుదురుకోడానికి వాళ్ల ప్రేమ చాలా తిప్పలు పడింది. ఆమె ఉండటం కాలిఫోర్నియాలో. అతడు ఉండటం నార్త్ కరోలినాలో. కలుసుకోడానికి పెద్ద దూరం ఏమీ కాదు. కలుసుకున్నాక మాట్లాడుకోడానికే టైమ్ ఉండదు. చీకటింకా పోక ముందే రాకెట్ పట్టుకుని ప్రాక్టీస్‌కి వెళ్లిపోతుంది నయోమీ. ఆ ప్రాక్టీస్ మధ్యాహ్నం దాటిపోయేవరకు, కొన్నిసార్లు చిన్న చిన్న బ్రేకులతో సాయంత్రం వరకు సాగుతుంది. కార్డేదీ సాయంత్రం నుంచి, కొన్నిసార్లు మధ్యాహ్నం నుంచే రాత్రంతా సాగే కచేరీ కార్యక్రమం. ఒకరిది పగటి ప్రపంచం. ఇంకొకరిది రాత్రి ప్రపంచం. అయినా చంద్రుడు, సూర్యుడు అప్పుడపుడు ఉదయం, సాయంత్రం ఆకాశంలో ఒకే సమయం లో కనిపించినట్లు వీళ్లు భూమ్మీద సంధ్యా సమయాల్లో కలుసుకుంటూనే ఉన్నారు. కలిసి డిన్నర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా.. ‘నిన్ను చూడాలని ఉంది’ అంటే వచ్చి వాలిపోతాడు కార్డే. అతడికి చూడాలనిపిస్తే చెప్పాపెట్టకుండా వచ్చి, కళ్ల నిండా చూసుకుని వెళ్లిపోతాడు. మొన్నటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవడానికి ముందు జీక్యూ మ్యాగజీన్ వీళ్లను జంటగా చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ మాత్రమైనా వీళ్ల ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసింది. లేకుంటే ఇప్పటికీ గుట్టుగా ఉండిపోయేవాళ్లే. ‘కార్డేలో మీకు ఏం నచ్చింది?’ అంటే.. ‘క్వయిట్ రొమాంటిక్ డూడ్’ అంటుంది నయోమీ. ‘నయోమీలో మీకేం నచ్చింది’ అంటే.. ‘నయోమీలో కాదు, నయోమీ మొత్తం నచ్చింది’ అని తన హిప్హాప్ స్టెయిల్లో ధ్వనిహాసం చేస్తాడు కార్డే. -
Australian Open 2021: ఒసాకాదే ధమాకా
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఆరంభ రౌండ్లలో సంచలనాలు నమోదైనా... చివరకు ఫైనల్లో మాత్రం కొత్త చాంపియన్గానీ, కొత్త చరిత్రగానీ లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. అమెరికన్ బ్రాడీ సంచలనానికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెండే సెట్లలో ఆటను ముగించింది. నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం మహిళల సింగిల్స్‌లో తుదిపోరు జరిగింది. కానీ చూసేవాళ్లెవరికీ ఇది ఫైనల్‌గా కనిపించనే లేదు. ఓ సాదాసీదా మ్యాచ్‌లా ఏకపక్షంగా ముగిసింది. జపాన్ స్టార్ మూడో సీడ్ నయోమి ఒసాకా టైటిల్ పోరుకు తన రాకెట్ పవర్‌తో వన్‌సైడ్ వార్‌గా మార్చేసింది. ఫైనల్లో ఆమె 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. గంటా 17 నిమిషాల్లోనే బ్రాడీ పనైపోయింది. ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. జపనీస్ భామ 2019లో కూడా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఫటాఫట్‌గా ముగించింది... ఒసాకా బుల్లెట్లా దూసుకొచ్చే ఏస్‌లతో బ్రాడీని చేష్టలుడిగేలా చేసింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని ఒక పాయింట్ అయినా గెలువనీయలేదు. మరుసటి గేమ్‌లో బ్రాడీ శ్రమించి సర్వీస్‌ను నిలబెట్టుకుంది. కానీ తర్వాత జపాన్ స్టార్ సర్వీస్‌తో పాటు బ్రేక్ పాయింట్ సాధించింది. బ్రాడీ కూడా తర్వాతి గేముల్లో దీటుగా బదులివ్వడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ దశలో ఒసాకా చకచకా రెండు పాయింట్లు సాధించి 41 నిమిషాల్లో 6–4 స్కోరుతో తొలిసెట్‌ను ముగించింది. ఇక రెండో సెట్లో ఒసాకా పదునైన షాట్లకు బదులివ్వలేకపోయిన బ్రాడీ సర్వీస్‌లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఒసాకా 4–0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌నే కోల్పోయే దశలో ఉన్నప్పటికీ అమెరికా స్టార్ కుంగిపోలేదు. ఐదో గేమ్‌లో చక్కని పోరాటం చేసి ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ గేమ్ సుదీర్ఘంగా సాగింది. తర్వాత తన సర్వీస్‌ను కొనసాగించిన బ్రాడీ కేవలం రెండు నిమిషాల్లోపే రెండో పాయింట్ సాధించింది. జాగ్రత్త పడిన ఒసాకా ఏడు, తొమ్మిదో గేముల్ని గెలుపొందడం ద్వారా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. రెండో సెట్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. ఓవరాల్‌గా 6 ఏసుల్ని సంధించిన ఒసాకా రెండు సార్లు డబుల్ ఫాల్ట్ చేసింది. 16 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన బ్రాడీ ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేయడంతో మ్యాచ్‌లో చిత్తయింది. మెర్టెన్స్–సబలెంక జంటకు ‘డబుల్స్’ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్ జోడీ 6–2, 6–3తో చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో టైటిల్ మెట్టుపై చతికిల బడిన క్రెజికొవా మిక్స్డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది. జొకోవిచ్ వర్సెస్ మెద్వెదెవ్ ► నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ ►మ.గం.2 నుంచి సోనీలో ప్రత్యక్షప్రసారం రెండేళ్లుగా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ నిలబెట్టుకుంటున్న టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఇప్పుడు ‘హ్యాట్రిక్’ వేటకు సిద్ధమయ్యాడు. ఆసీస్ ఓపెన్‌లో ఈ టాప్‌సీడ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఓవరాల్‌గా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో దాదాపు సగం (8) టైటిల్స్ ఇక్కడే గెలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డును, సూపర్ ఫామ్‌లో ఉన్న మేటి ఆటగాడైన నొవాక్‌ను ఓడించడం రష్యన్ స్టార్ మెద్వెదెవ్కు అంత సులువేమీ కాదు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. నాలుగో సీడ్ మెద్వెదెవ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడేదే మొదటిసారి. సెర్బియన్ దిగ్గజానికి ఎందులోనూ సరితూగని ప్రత్యర్థి. అయితే ఫైనల్ చేరేందుకు అతను బాగానే కష్టపడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను, సెమీస్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్లను ఓడించి టైటిల్ బరిలో నిలిచాడు. కానీ కొండంత ప్రత్యర్థి ముందు ఈ కష్టం ఏమాత్రం నిలుస్తుందో మరి... ఎందుకంటే టైటిళ్ల పరంగా చూసినా... ఫైనల్స్ పరంగా చూసినా కూడా నొవాక్... మెద్వెదెవ్ కంటే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్నాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నయోమి ఒసాకా
మెల్బోర్న్: జపనీస్ టెన్నీస్ స్టార్ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బార్డీ(22వ సీడ్)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఒసాకా(3వ సీడ్) కెరీర్లో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. అందులో రెండు యూఎస్ ఓపెన్(2018, 2020)టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్(2019,2021) టైటిల్స్ ఉన్నాయి. కాగా నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది. 𝒯𝒽𝒶𝓉 𝓂𝑜𝓂𝑒𝓃𝓉. When @naomiosaka became our 2021 Women's Singles champion 🏆#AO2021 | #AusOpen pic.twitter.com/Id3ZZhaJHh — #AusOpen (@AustralianOpen) February 20, 2021 -
మహిళల సింగిల్స్ తుది పోరు నేడే
ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ విజేత ఎవరో నేడు తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్, జపాన్ స్టార్ నయోమి ఒసాకాతో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) తలపడుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఒసాకా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే చాలు... ఫైనల్‌ను లాంఛనంగా ముగించేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో ఇక్కడ టైటిల్ గెలిచిన ఒసాకా గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అయితే కఠినమైన ప్రత్యర్థుల్ని, దిగ్గజాన్ని ఓడించి మరీ తుదిపోరుకు చేరుకుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన జపాన్ స్టార్... సెమీస్‌లో అమెరికా దిగ్గజం సెరెనాకు చెక్ పెట్టింది. నేటి మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఒసాకానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు బ్రాడీ ఓడించిందంతా అనామక క్రీడాకారిణిలనే. 25 ఏళ్ల అమెరికన్‌కు అసలు ఫైనల్ చేరిన అనుభవమే లేదు. -
ముగ్గురి వల్ల ఆ దేశం మరోసారి వార్తల్లోకెక్కింది..
భూకంపాలో, సునామీలో వస్తే తప్ప జపాన్ సాధారణంగా వార్తల్లో ఉండదు. తన మానాన తను ఉంటుంది. అయితే ఇప్పుడా జపాన్ని ముగ్గురు మహిళలు వార్తల్లోకి తెచ్చారు. ఆ ముగ్గురూ.. సికొ హషిమొటొ (56), మమొకొ నొజొ (22), నవోమి ఒసాక (23). షహిమొటో రాజకీయ నాయకురాలు. మమొకొ నొజొ విద్యార్థిని. నవొమి ఒసాక టెన్నిస్ ప్లేయర్. ఒక ఆర్డర్లో అయితే ముందుగా నవొమి ఒసాక గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇవాళ ఉమెన్స్ సింగిల్ ఫైనల్స్ ఆడుతున్నారు ఆమె. అంటే ఫైనల్ వరకు వచ్చారని గొప్పగా చెప్పుకోవడం కాదు. శుక్రవారం నాడు టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ని ఓడించి మరీ ఆమె ఫైనల్స్‌కి చేరున్నారు. ఈ రోజు ఆమె తలపడుతున్నది అమెరికన్ ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీ మీద. జెన్నిఫర్ ర్యాకెట్ శక్తీ తక్కువేమీ కాదు. పైగా ఒక అమెరికన్ (సెరెనా) ని ఒసాక ఓడించినందుకు బదులుగా ఇంకో అమెరికన్ (జెన్నిఫర్) ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని యూఎస్ లోని సెరెనా అభిమానులు కోరుకుంటున్నారు. వారికంటే ఎక్కువగా.. టైటిల్‌ను ఒసాక గెలుచుకోవాలని జపాన్ క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సెరెనానే ఓడించిందంటే జెన్నిఫర్ ఎంత అనే అనుమానాలూ అమెరికాలో ఉన్నాయి. ఒసాక జపాన్ దేశస్థురాలే అయినా ఉండటం అమెరికాలోనే. సికొ హషిమొటొ ఇప్పుడిక రాజకీయ నేత హషిమొటో గానీ, విద్యార్థిని మమొకో గానీ.. ఈ ఇద్దరిలో మొదట ఎవరి గురించి చెప్పుకున్నా రెండోవారిని తక్కువ చెయ్యడం కాదు. వేర్వేరు రంగాల వారైనా ఇద్దరూ ఒకే విషయమై వార్తల్లోకి వచ్చినవారు. వయసులో పెద్ద కనుక హషిమొటోకే ప్రాధాన్యం ఇద్దాం. గురువారం ఆమె ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వం నుంచి వస్తుంది ఆ ఆర్డర్. ఇంకో ఐదు నెలల్లో జపాన్‌లో ఒలింపిక్ గేమ్స్ ఉండగా.. జరిగిన నియామకం ఇది. కమిటీకి చీఫ్‌గా ఇటీవలి వరకు ఉన్న యషిరో మొరి (83) గత శుక్రవారం ఆ పదవికి తప్పనిసరై రాజీనామా చేయవలసి వచ్చింది. జపాన్ మాజీ ప్రధాని కూడా యహిరో మొరి. ఆయనంతటి వారు రాజీనామా చేయవలసి రావడానికి కారణం.. మహిళలపై ఆయన చేసిన కామెంట్లే. ‘‘మీటింగ్స్‌లో ఈ ఆడవాళ్లు ఓవర్‌గా మాట్లాడతారబ్బా.. అదేం అలవాటో’’ అని అన్నారు ఆయన. ఆ మాటలే ఆయన పదవి మీదకు కత్తిని తెచ్చాయచి. అలా ఖాళీ అయిన ఆ సీట్లోకే హషిమొటో వచ్చారు. ప్రస్తుతం ఆమె జపాన్ కేబినెట్లో ‘ఈక్వాలిటీ మినిస్టర్’. ఆ మంత్రి బాధ్యతలకు కొంతకాలం విరామం ఇచ్చి ఒలింపిక్స్ ఏర్పాట్ల విధి నిర్వహణలో ఉండబోతున్నారు. మమొకొ నొజొ అసలు ఆ పెద్దాయన యషిరో మొరి ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌గా నిష్క్రమించడానికి కారణం మమొకొ నొజొ విద్యార్థిని. ‘ఆ స్థాయిలో ఉండి మహిళలపై అలాంటి కామెంట్స్ చేయడం తగని పని. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’ అని నొజొ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే లేవదీశారు.‘డోంట్ బి సైలెంట్’ అంటూ ఆన్లైన్లో లక్షా 50 వేల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. టోక్యోలోని కియో యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం అర్థశాస్త్రం చదువుతున్నారు ఆమె. చదువే కాకుండా.. ‘నో యూత్ నో జపాన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, సామాజిక అంశాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. జపాన్‌లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉందని అంటున్న నొజొ.. స్త్రీ పురుష అసమానతలపై స్పందించే వారు జపాన్‌లో నానాటికీ తగ్గిపోతున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్ కమిటీ చీఫ్‌ని మార్చేలా చేయడం ద్వారా నొజొ విజయం సాధించారు. ఒలింపిక్ కమిటీకి కొత్తగా వచ్చిన హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చిన ఒక మహిళగా విజేతగా నిలిచారు. ఈరోజు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో ఒసాకా తన ప్రత్యర్థిని ఓడిస్తే అదొక విజయం అవుతుంది. ముగ్గురూ ముగ్గురే. -
శ్రమించి... సాధించి
మెల్బోర్న్: తొలి మూడు రౌండ్లలో అంతగా కష్టపడకుండానే విజయాలు నమోదు చేసుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), సిమోనా హలెప్ (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్)లకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. అయితే ఈ ‘గ్రాండ్‌స్లామ్ విన్నర్స్’ కీలకదశలో తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పదో సీడ్ సెరెనా 2 గంటల 9 నిమిషాల్లో 6–4, 2–6, 6–4తో ఏడో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రెండో సీడ్ హలెప్ గంటా 50 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై... మూడో సీడ్ ఒసాకా గంటా 55 నిమిషాల్లో 4–6, 6–4, 7–5తో గత ఏడాది రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)పై అద్భుత విజయాలు సాధించారు. ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో ఒసాకా 3–5తో వెనుకబడింది. రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాచుకున్న ఆమె వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–4, 6–2తో 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, 19వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సె సువె సింగిల్స్ విభాగంలో మాత్రం తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో సీడ్ థీమ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన థీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 4–6, 0–6తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో థీమ్ ఏకంగా 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పది ఏస్‌లు సంధించడంతోపాటు థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన దిమిత్రోవ్ ఈ గెలుపుతో నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. జొకోవిచ్ @ 300 మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), క్వాలిఫయర్ అస్లాన్ కరాత్సెవ్ (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 7–6 (7/4), 4–6, 6–1, 6–4తో 14వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మరో మ్యాచ్‌లో కరాత్సెవ్ 3–6, 1–6, 6–3, 6–3, 6–4తో 20వ సీడ్ ఉజెర్ ఆలియాసిమ్ (కెనడా)ను ఓడించి అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారుడిగా ఘనత వహించాడు. మరో మ్యాచ్‌లో జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–3తో లజోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్: బియాంక, క్విటోవా అవుట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను 2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన బియాంక రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బియాంక ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో సొరానా కిర్‌స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెరెనా జోరు... కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–3తో కసత్కినా (రష్యా)పై, 15వ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్తాన్) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. అయ్యో వావ్రింకా... పురుషుల సింగిల్స్ విభాగంలో 17వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్ 11–9తో టైబ్రేక్‌లో గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా), 14వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా), 15వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్), 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–బెన్ మెక్లాలన్ (జపాన్) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ఒసాకా దూరం
పారిస్: గతవారమే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండోసారి నెగ్గిన జపాన్ యువతార, ప్రపంచ మూడో ర్యాంకర్ నయోమి ఒసాకా... ఈనెల 27 నుంచి మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈసారి నేను ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడటంలేదు. తొడ కండరాల గాయం ఇంకా తగ్గలేదు. ఈ మెగా టోర్నీకి నిర్ణీత సమయంలోపు సిద్ధం కాలేను’ అని ఒసాకా ట్విట్టర్లో ప్రకటించింది. ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైన రెండో స్టార్‌గా ఒసాకా నిలిచింది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను నిర్వాహకులు కుదించారు. గతంలో రోజుకు 11,500 మంది ప్రేక్షకులను అనుమతించాలని భావించినా నిర్వాహకులు ఇప్పుడు ఆ సంఖ్యను 5000 పరిమితం చేయనున్నారు. -
నమో నయోమి
ఏ లక్ష్యంతో న్యూయార్క్‌లో అడుగుపెట్టిందో ఆలక్ష్యాన్ని అందుకుంది జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి లేదా జాతి వివక్ష కారణంగా తమ ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయులకు ఒసాకా తన విజయంతో ఘనమైన నివాళులు అర్పించింది. పోలీసుల చేతుల్లో లేదంటే జాతి వివక్ష కారణంగా మరణించిన పలువురు నల్లజాతీయుల్లో ఏడుగురిని (ఏడు రౌండ్లలో గెలిస్తే విజేత అవుతారు) ఎంచుకున్న ఒసాకా ఆ ఏడుగురి పేర్లు రాసి ఉన్న మాస్క్‌లను ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడతానని... ఆ ఏడుగురికీ నివాళులు ఇవ్వాలంటే టైటిల్ గెలవాల్సి ఉంటుందని టోర్నీ ప్రారంభానికి ముందు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే ప్రతి మ్యాచ్‌లో ఒక్కో బాధితుడి పేరు రాసి ఉన్న మాస్క్‌ను ధరించి ఆడింది. ఆఖరికి తన వద్ద ఉన్న చివరిదైన ఏడో మాస్క్‌ను ధరించి ఆడి విజేతగా నిలిచింది. తాను అనుకున్న రెండు లక్ష్యాలనూ సాధించి ఒసాకా ఔరా అనిపించింది. మరో వైపు యూఎస్ ఓపెన్ ఫైనల్లో మూడో సారి ఓడిన అజరెంకా తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల కోల్పోకుండా ఆడిన జపాన్ యువతార నయోమి ఒసాకా తన కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగో సీడ్ ఒసాకా చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 22 ఏళ్ల ఒసాకా గంటా 53 నిమిషాల్లో 1–6, 6–3, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 27వ ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై విజయం సాధించింది. ఒసాకా కెరీర్లో ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఆమె 2018లోనూ చాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ అజరెంకాకు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి సెట్ కోల్పోయినా... 26 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో నెగ్గిన అజరెంకా ఆ తర్వాత రెండో సెట్లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అజరెంకా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఉంటే సెట్‌తోపాటు, మ్యాచ్‌నూ సొంతం చేసుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడేది. కానీ ఒసాకా అలా జరగనీయలేదు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడి... మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌లో 30–40తో గేమ్‌ను కోల్పోయే దశ నుంచి ఒసాకా కోలుకుంది. గేమ్ కోల్పోయే స్థితి నుంచి తేరుకున్న ఒసాకా మూడో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–2తో స్కోరును సమం చేసింది. అనంతరం అదే జోరులో ఒసాకా రెండో సెట్‌ను 41 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్ నాలుగో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జపాన్ అమ్మాయి తన సర్వీస్‌ను కాపాడుకొని 4–1తో ముందంజ వేసింది. అయితే అజరెంకా కూడా తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. ఏడో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అజరెంకా ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. అయితే ఒసాకా వెంటనే ఎనిమిదో గేమ్‌లోనే అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్‌నూ కాపాడుకొని 46 నిమిషాల్లో మూడో సెట్‌ను కైవసం చేసుకొని చాంపియన్‌గా నిలిచింది. ఆ ఏడుగురు... అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న వివక్ష పట్ల ఓ క్రీడాకారిణిగా నయోమి యూఎస్ ఓపెన్‌లో అద్భుత రీతిలో స్పందించింది. కొన్నేళ్లుగా పోలీసుల చేతుల్లో బలైన నల్ల జాతీయుల్లో ఏడుగురిని ఎంచుకొని వారి పేర్లను తన మాస్క్‌పై రాసుకొని మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత వాటిని ధరించి సంఘీభావం తెలిపింది. తొలి రౌండ్లో బ్రెనా టేలర్... రెండో రౌండ్లో ఎలిజా మెక్లెయిన్... మూడో రౌండ్లో జార్జి ఫ్లాయిడ్... నాలుగో రౌండ్లో అహెమౌద్ ఆర్బెరీ... క్వార్టర్ ఫైనల్లో ట్రెవన్ మార్టిన్... సెమీఫైనల్లో ఫిలాండో క్యాజిల్ బాధితుల పేర్లు రాసి ఉన్న మాస్క్‌లు ధరించిన ఒసాకా... ఫైనల్లో మాత్రం 2014లో క్లీవ్‌లాండ్‌లో పోలీసుల చేతుల్లో చనిపోయిన 12 ఏళ్ల బాలుడు తామిర్ రైస్‌కు నివాళిగా మాస్క్‌ను ధరించింది. తమను వీడి వెళ్లిపోయిన వారిని ఒసాకా మరోసారి గుర్తు చేసిందని ఈ సందర్భంగా ఆయా బాధితుల తల్లిదండ్రులు జపాన్ క్రీడాకారిణిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. నయోమి ఒసాకా తల్లి తమాకి జపాన్ దేశస్థురాలు కాగా తండ్రి లెనార్డ్ ఫ్రాన్సువా హైతీ దేశానికి చెందిన వ్యక్తి. ఒసాకా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో నివాసం ఉంటున్నా నయోమి జపాన్ పౌరసత్వం కలిగి ఉంది. తనను అమెరికన్‌గా కాకుండా జపనీయురాలిగానే గుర్తించాలని నయోమి కోరుకుంటోంది. ‘గొప్ప క్రీడాకారులందరూ ఫైనల్లో గెలిచిన వెంటనే కోర్టులో పడిపోయి ఆకాశంవైపు ఎందుకు చూసేవారో ఆలోచించేదాన్ని. వాళ్లకేమి కనిపించేదో తెలుసుకోవాలని గెలిచిన వెంటనే నేనూ అలాగే చేశాను. ఈ టోర్నీ కోసం చాలా కష్టపడ్డాను. శ్రమకు తగ్గ ఫలితం ఎందుకు రాకూడదో ప్రయత్నించి సఫలమయ్యాను. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో వెనుకబడిన దశలో ఆందోళన చెందకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించాను. నేనిక్కడ ఒక లక్ష్యంతో వచ్చాను. ఫైనల్‌కు వచ్చినందుకు 1–6, 0–6తో ఓడిపోయి ఇంటికి వెళ్లకూడదని అనుకున్నాను.’ – నయోమి ఒసాకా ► 3 ఆసియా నుంచి మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్ (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) నయోమి ఒసాకా. నా లీ (చైనా) రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గింది. ► 1 మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1975లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక టాప్–20 క్రీడాకారిణులను ఎదుర్కోకుండా యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణి ఒసాకానే. ► 5 తమ కెరీర్లో ఫైనల్ చేరుకున్న తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ గెలిచిన ఐదో క్రీడాకారిణి ఒసాకా. మోనికా సెలెస్ అయితే వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. ► 3 యూఎస్ ఓపెన్ ఫైనల్లో అత్యధికంగా మూడుసార్లు ఓడిపోయిన రెండో క్రీడాకారిణి అజరెంకా. ఇవాన్ గూలాగాంగ్ (ఆస్ట్రేలియా) అత్యధికంగా నాలుగు యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. -
ఎలా గెలిచిందో.. అలానే ఓడింది!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా జపాన్ క్రీడాకారిణి, నాల్గో సీడ్ నయామి ఒసాకా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. తొలి సెట్‌ను ఒసాకా కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను సాధించింది. ఇది ఒసాకాకు రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. 2018లో యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా.. ఏడాది గ్యాప్లోమరోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకుంది. ఆమెకు ఇది ఓవరాల్‌గా మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆమె గెలుచుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: సూపర్ జ్వెరెవ్) ఈ రోజు జరిగిన తుదిపోరులో ఒసాకా తొలి సెట్‌ను భారీ తేడాతో కోల్పోయింది. ఆమె 1-6 తేడాతో సెట్‌ను చేజార్చుకుంది. అయితే ఆ తర్వాత అజరెంకాకు చుక్కలు చూపించింది. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరసగా గేమ్‌లను కైవసం చేసుకుంటూ ఒసాకా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే రెండో సెట్‌ను సాధించిన ఒసాకా.. అదే ఊపును నిర్ణయాత్మక మూడో సెట్లో కూడా ప్రదర్శించింది. ఫలితంగా ఆమె ఖాతాలో మరో యూఎస్ ఓపెన్ టైటిల్ చేరింది. కాగా, ఈ మ్యాచ్‌లో అజరెంకా ఓడిన తీరు ఆమె ఆడిన సెమీఫైనల్‌ను గుర్తు చేసింది. సెరెనా విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో అజరెంకా ఇలానే గెలిచి ఫైనల్‌కు చేరింది. తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయిన అజరెంకా.. మిగతా రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇప్పుడు అదే అనుభవం అజరెంకాకు ఎదురుకావడం గమనార్హం. -
చేరువై... దూరమై...
టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడు... భవిష్యత్ తారగా పేరు తెచ్చుకుంటున్న ‘గ్రీకు వీరుడు’ స్టెఫానోస్ సిట్సిపాస్... యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 22 ఏళ్ల ఈ యువతారకు శనివారం గుండె పగిలే ఫలితం ఎదురైంది. విజయానికి అతి సమీపంలోకి వచ్చిన సిట్సిపాస్... ఆ తర్వాత నెమ్మదిగా ఆ విజయానికి దూరమై... చివరకు తన కెరీర్లోనే అత్యంత చేదు అనుభవాన్ని చవిచూశాడు. ఒకటా.. రెండా... మూడా... నాలుగా... ఏకంగా ఆరంటే ఆరు మ్యాచ్ పాయింట్లను వదులుకున్న సిట్సిపాస్ చివరకు 4 గంటల 36 నిమిషాల ఆటలో పరాజయ భారంతో బరువెక్కిన హృదయంతో కోర్టును వీడాల్సి వచ్చింది. మరోవైపు సిట్సిపాస్ ప్రత్యర్థి బొర్నా చోరిచ్... ఓటమి అంచుల నుంచి తేరుకొని... ఆరు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని... తన కెరీర్లోనే చిరస్మ రణీయ విజయాన్ని అందుకున్నాడు. న్యూయార్క్: పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా... ప్రత్యర్థి విజయం అంచుల్లో ఉన్నా... చివరి పాయింట్‌ను కూడా సులువుగా ఇవ్వకూడదని పట్టుదల కనబరిచిన క్రొయేషియా యువతార బొర్నా చోరిచ్ చివరకు తన కెరీర్లోనే అద్భుత విజయం సాధించాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 23 ఏళ్ల చోరిచ్ ఓటమి బాట నుంచి గెలుపు బాట పట్టి విజయకేతనం ఎగురవేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్, నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ చోరిచ్ 6–7 (2/7), 6–4, 4–6, 7–5, 7–6 (7/4)తో గెలుపొందాడు. 4 గంటల 36 నిమిషాలపాటు సాగిన ఈ సమరంలో సిట్సిపాస్ 16 ఏస్‌లు సంధించాడు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన అతను ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడంతోపాటు 43 అనవసర తప్పిదాలు చేశాడు. చోరిచ్ కేవలం నాలుగు ఏస్‌లు సంధించినా... 50 అనవసర తప్పిదాలు చేసినా... కీలకదశలో సిట్సిపాస్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి అనుకున్న ఫలితం సాధించాడు. నాలుగో సెట్లో సిట్సిపాస్ ఒకదశలో 5–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత మూడు గేమ్‌లు కోల్పోయిన సిట్సిపాస్ స్కోరు 5–4తో ఉన్నదశలో తన సర్వీస్‌లో 40–0తో ఆధిక్యం సంపాదించి విజయానికి కేవలం ఒక్క పాయింట్ దూరంలో నిలిచాడు. కానీ దానిని మాత్రం అందుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లు కాచుకున్న చోరిచ్ ఆ తర్వాత మరో మూడుసార్లు ఇలాగే చేశాడు. ఓవరాల్‌గా సిట్సిపాస్ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో ఆరు మ్యాచ్ పాయింట్లను కాచుకున్న చోరిచ్ చివరకు గేమ్ సొంతం చేసుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 12వ గేమ్‌లో మళ్లీ సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి నాలుగో సెట్‌ను 7–5తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో చోరిచ్ ఐదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయి 2–3తో వెనుకబడిన దశలో వెంటనే కోలుకొని సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో చోరిచ్ పైచేయి సాధించగా... ఒత్తిడికి చిత్తయిన సిట్సిపాస్ చేతులెత్తేశాడు. జొకోవిచ్ 26–0 మరోవైపు టాప్ సీడ్ జొకోవిచ్ ఈ సీజన్లో వరుసగా 26వ గెలుపుతో ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6–3, 6–3, 6–1తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచాడు. ఐదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (4/7), 6–4, 6–2, 6–2తో మనారినో (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–1, 7–6 (7/5), 6–4తో క్రాజినోవిచ్ (సెర్బియా)పై, 12వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 3–6, 6–3, 4–6, 7–6 (7/5), 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–0, 6–4, 6–0తో కరుసో (ఇటలీ)పై గెలిచారు. శ్రమించిన ఒసాకా... మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్లో ఒసాకా 2 గంటల 33 నిమిషాలు పోరాడి 6–3, 6–7 (4/7), 6–2తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)ను ఓడించగా... క్విటోవా 6–4, 6–3తో జెస్సికా (అమెరికా)పై, కెర్బర్ 6–3, 6–4తో యాన్ లీ (అమెరికా)పై నెగ్గారు. 14వ సీడ్ కొంటావె (ఎస్తోనియా) 6–3, 6–2తో మాగ్దా లినెట్టి (పోలాండ్)పై, 15వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–3, 6–1తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట 6–2, 6–4తో ఎస్కోబెడో–రూబిన్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. -
జొకోవిచ్ 24–0
ఇద్దరు దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్ గైర్హాజరీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను మొదలుపెట్టాడు. కరోనా ప్రత్యేక పరిస్థితుల నడుమ ఆరంభమైన యూఎస్ ఓపెన్ టోర్నీలో ఈ సెర్బియా స్టార్ సునాయాస విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న 16 ఏళ్ల అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది. న్యూయార్క్: తన కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) తొలి అడుగు వేశాడు. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–4, 6–1తో దామిర్ జుమూర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై గెలుపొందాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది వరుసగా 24వ విజయం కావడం విశేషం. ఏటీపీ కప్ టీమ్ టోర్నీలో, దుబాయ్ ఓపెన్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్ అజేయంగా నిలిచాడు. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు సాధించాడు. మ్యాచ్ మొత్తంలో ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ రెండో సెట్లో ఏకైకసారి తన సర్వీస్‌ను కోల్పోయాడు. ‘స్టేడియం ఖాళీగా ఉన్నా, నిండుగా ఉన్నా వ్యక్తిగత శిక్షణ, సహాయక సిబ్బంది మనను ఉత్సాహపరుస్తారు. ఈసారి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో బాక్స్‌లో కూర్చున్న నా సహాయక సిబ్బంది పాయింట్లు సాధించినపుడల్లా ఉత్సాహపరిచారు. ప్రత్యర్థి పొరపాట్లు చేస్తే మన బాక్స్‌లోని మద్దతుదారులు చప్పట్లు కొట్టాలని అనుకోను. దామిర్ నా మంచి మిత్రుడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో, టెన్నిస్‌లోనే అతి పెద్ద స్టేడియంలో శుభారంభం చేయాలని ఎవరైనా కోరుకుంటారు’ అని విజయానంతరం జోకోవిచ్ వ్యాఖ్యానించాడు. ఇస్నెర్, ష్వార్ట్‌జ్‌మన్‌లకు షాక్... పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) గెలుపొందారు. అయితే తొమ్మిదో సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)... అమెరికా ఆజానుబాహుడు, 16వ సీడ్ జాన్ ఇస్నెర్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. వరుసగా 14వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న 35 ఏళ్ల ఇస్నెర్ తొలి రౌండ్లో 7–6 (7/5), 3–6, 7–6 (7/5), 3–6, 6–7 (3/7)తో అమెరికాకే చెందిన 64వ ర్యాంకర్ స్టీవ్ జాన్సన్ చేతిలో ఓడిపోయాడు. 2008 తర్వాత ఇస్నెర్ ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువున్న ఇస్నెర్ ఏకంగా 52 ఏస్‌లు సంధించాడు. రెండు సెట్లను టైబ్రేక్‌లలో గెలిచిన ఇస్నెర్ నిర్ణాయక ఐదో సెట్లోని టైబ్రేక్‌లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. అన్‌సీడెడ్ కామెరన్ నోరి (బ్రిటన్) 3–6, 4–6, 6–2, 6–1, 7–5తో ష్వార్ట్‌జ్‌మన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–6 (7/2), 5–7, 6–3, 7–5తో 2017 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, సిట్సిపాస్ 6–2, 6–1, 6–1తో రామోస్ వినోలస్ (స్పెయిన్)పై, గాఫిన్ 7–6 (7/2), 3–6, 6–1, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–4, 4–6, 6–3, 6–2తో సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై గెలిచారు. టీనేజర్ గాఫ్ పరాజయం సంచలనం సృష్టింస్తుందని భావించిన అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ 3–6, 7–5, 4–6తో 31వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 16 ఏళ్ల గాఫ్ 13 డబుల్ ఫాల్ట్‌లు, 46 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. గతేడాది గాఫ్ వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. నాగల్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సుమీత్ నాగల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ పోరులో అతను 6–1, 6–3, 3–6, 6–1తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దాదాపు సమ ఉజ్జీలు (నాగల్ 124, క్లాన్ 129)గా ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య 2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన పోరులో చివరకు భారత ప్లేయర్‌దే పైచేయి అయింది. 2013 (సోమ్‌దేవ్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మెయిన్ డ్రా మ్యాచ్‌లో భారత ఆటగాడు గెలవడం ఇదే మొదటిసారి. శ్రమించిన ఒసాకా... మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) మూడు సెట్ల పోరాటంలో నెగ్గి ముందంజ వేసింది. తొలి రౌండ్లో 2018 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఒసాకా 6–2, 5–7, 6–2తో జపాన్‌కే చెందిన మిసాకి దోయిపై కష్టపడి గెలిచింది. అమెరికా పోలీసుల చేతుల్లో ఇటీవల మృతి చెందిన నల్ల జాతీయుల్లో ఏడుగురి స్మారకార్థం ఒసాకా ఈ టోర్నీలో ఏడు వేర్వేరు మాస్క్‌లు (ఏడు రౌండ్లలో గెలిస్తే విజేత అవుతారు) ధరించి ఆడాలని నిర్ణయించుకుంది. గత మార్చిలో అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నల్ల జాతీయురాలైన మెడికల్ టెక్నిషియన్ బ్రెనా టేలర్ పేరు ఉన్న మాస్క్‌ను మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత ఒసాకా ధరించింది. -
ఇదే నా నిరసన...
న్యూయార్క్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో పట్టపగలే నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పుల ఘటన నిరసన సెగలు టెన్నిస్ ప్రపంచాన్నీ తాకాయి. జేకబ్‌కు మద్దతుగా వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ (సిన్సినాటి ఓపెన్) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ పదో ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) ప్రకటించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన 22 ఏళ్ల ఒసాకా జాతి వివక్షకు వ్యతిరేకంగా తన గళమెత్తింది. అథ్లెట్ కన్నా ముందు నల్లజాతి మహిళగా అన్యాయంపై పోరు కోసమే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు 2018 యూఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ అయిన ఒసాకా ట్విట్టర్లో పేర్కొంది. ‘నేను ఈ మ్యాచ్ ఆడనంత మాత్రాన ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ శ్వేత జాతీయుల ఆధిపత్యం ఉండే టెన్నిస్‌లో నా గళాన్ని వినిపిస్తే కాస్తయినా ఈ అంశంపై కదలిక వస్తుందని భావిస్తున్నా’ అని ఆమె రాసుకొచ్చింది. ఆమెకు సహచరుల నుంచి మద్దతు లభించడంతో నిర్వాహకులు టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేశారు. దీంతో గురువారం జరగాల్సిన సెమీఫైనల్ పోటీలు ఒకరోజు పాటు ఆగిపోయాయి. వర్ణ వివక్షపై పోరు, సామాజిక న్యాయం కోసం పాటుపడే టెన్నిస్ క్రీడ మరోసారి దానికే కట్టుబడి ఉందని పేర్కొన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ), అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) వర్గాలు జేకబ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని ప్రకటించాయి. ఈ టోర్నీ క్వార్టర్స్ ఫైనల్లో ఒసాకా 4–6, 6–2, 7–5తో అనెట్ కొంటావీ (ఎస్తోనియా)పై, యోహానా కొంటా (బ్రిటన్) 6–4, 6–3తో మారియా సాకరి (గ్రీస్)పై గెలుపొందారు. మరోవైపు నల్లజాతీయులకు న్యాయం జరగాలంటూ అథ్లెట్లు డిమాండ్ చేయడంతో బుధవారం నాటి ఎన్బీఏ, డబ్ల్యూఎన్బీఏ, బేస్‌బాల్, సాకర్ లీగ్‌లు మ్యాచ్‌లన్నీ వాయిదా పడ్డాయి. -
ఒసాకా ఆర్జన రూ. 284 కోట్లు
వాషింగ్టన్: ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. గత నాలుగేళ్లుగా టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 3 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 273 కోట్లు) సంపాదనతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో ఒసాకా 29వ ర్యాంక్‌లో, సెరెనా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. 2016 తర్వాత టాప్–100లో ఇద్దరు క్రీడాకారిణులు ఉండటం ఇదే తొలిసారి. 2020 సంవత్సరానికి ఎక్కువ మొత్తం ఆర్జించిన క్రీడాకారుల పూర్తి జాబితాను వచ్చే వారం విడుదల చేస్తామని ‘ఫోర్బ్స్’ పత్రిక తెలిపింది. 2013లో ప్రొఫెషనల్‌గా మారిన ఒసాకా 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను... 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ‘బ్యాక్ టు బ్యాక్’ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో ర్యాంక్‌లో ఉన్న ఒసాకా 15 అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. -
సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో శుక్రవారం సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేతలు సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ ఆశలను చైనాకు చెందిన 28 ఏళ్ల కియాంగ్ వాంగ్ వమ్ము చేసింది. 2 గంటల 41 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 19వ సీడ్ కియాంగ్ వాంగ్ 6–4, 6–7 (2/7), 7–5తో ఆరుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సెరెనాను బోల్తా కొట్టించింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో క్వార్టర్ ఫైనల్లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే నెగ్గి ఘోరంగా ఓడిన కియాంగ్ వాంగ్ తాజా గెలుపుతో అమెరికా స్టార్‌పై ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ మరో అద్భుతం చేసింది. మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకాతో 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో గౌఫ్ 6–3, 6–4తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆన్స్ జెబూర్ (ట్యూని íÙయా) 7–5, 3–6, 7–5తో 2018 చాంపియన్, మాజీ ప్రపంచ నంబర్‌వన్ వొజ్నియాకిని ఓడించింది. మరో మ్యాచ్‌లో మరియా సకారి (గ్రీస్) 6–4, 6–4తో పదో సీడ్ కీస్పై నెగ్గింది. టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) 6–3, 6–2తో రిబకినా (కజకిస్తాన్)పై, ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–2తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై గెలిచారు. జొకోవిచ్ జోరు... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) అతి కష్టమ్మీద... డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సులువుగా మూడో రౌండ్‌ను దాటారు. 38 ఏళ్ల ఫెడరర్ 4 గంటల 3 నిమిషాల పోరులో 4–6, 7–6 (7/2), 6–4, 4–6, 7–6 (10/8)తో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో నిషియోకా (జపాన్)ను ఓడించాడు. మిల్‌మన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి సెట్ సూపర్ టైబ్రేక్‌లో ఫెడరర్ ఒకదశలో 4–8తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే ఫెడరర్ కీలకదశలో అద్భుతంగా ఆడి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్‌కిది 100వ విజయం కావడం విశేషం. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రావ్‌నిచ్ (కెనడా) 7–5, 6–4, 7–6 (7/2)తో ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై, సిలిచ్ (క్రొయేíÙయా) 6–7 (3/7), 6–4, 6–0, 5–7, 6–3తో తొమ్మిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–సితాక్ (న్యూజిలాండ్) జంట 6–7 (2/7), 3–6తో మ్యాట్ పావిచ్ (క్రొయోషీయా)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఫెడరర్ ఫటాఫట్
వయసు పెరిగినా తనలో వన్నె తగ్గలేదని నిరూపిస్తూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ప్రత్యర్థి ప్రపంచ 41వ ర్యాంకర్ అయినప్పటికీ... ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన 38 ఏళ్ల ఫెడరర్ కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయి విజయం దక్కించుకున్నాడు. 2000లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన ఫెడరర్ వరుసగా 21వ ఏడాది కనీసం మూడో రౌండ్‌కు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఎలాంటి సన్నాహక టోర్నీ ఆడకుండానే నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఫెడరర్ ఈ మెగా ఈవెంట్లో గతంలో ఆరుసార్లు చాంపియన్‌గా, ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–1, 6–4, 6–1తో ప్రపంచ 41వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. 92 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. 14 ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు సాధించాడు. 42 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ ను ఒకసారి చేజార్చుకున్నాడు. వరుసగా 21వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్‌కు ఓవరాల్‌గా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 99వ విజయమిది. శుక్రవారం జరిగే మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో ఫెడరర్ ఆడతాడు.ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్ మూడో రౌండ్లో మూడుసార్లు మాత్రమే ఓడిపోయాడు. 2000, 2001లలో అర్నాడ్ క్లెమెంట్ (ఫ్రాన్స్) చేతిలో... 2015లో ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ) చేతిలో ఫెడరర్ పరాజయం చవిచూశాడు. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా మూడో రౌండ్‌కు చేరాడు. రెండో రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–4, 6–2తో తత్సుమా ఇటో (జపాన్)పై నెగ్గగా... ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు తన ప్రత్యర్థి కోల్‌ష్రైబర్ (జర్మనీ) నుంచి వాకోవర్ లభించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) 7–6 (9/7), 6–4, 4–6, 2–6, 7–5తో ఎనిమిదో సీడ్ బెరెటిని (ఇటలీ)పై... ప్రపంచ 80వ ర్యాంకర్ టామీ పాల్ (అమెరికా) 6–4, 7–6 (8/6), 3–6, 6–7 (3/7), 7–6 (10/3)తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, మారిన్ సిలిచ్ (క్రొయేíÙయా) 6–2, 6–7 (6/8), 3–6, 6–1, 7–6 (10/3)తో 21వ పెయిర్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చివరి సెట్లో స్కోరు 6–6 వద్ద సమమైనపుడు ‘సూపర్ టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. తొమ్మిదో సీడ్ అగుట్ (స్పెయిన్), 12వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. అగుట్ 5–7, 6–2, 6–4, 6–1తో మైకేల్ మోమా (అమెరికా)పై, ఫాగ్నిని 7–6 (7/4), 6–1, 3–6, 4–6, 7–6 (10/4)తో థాంప్సన్ (ఆ్రస్టేలియా)పై నెగ్గారు. బార్టీ సునాయాసంగా... మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా), టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) సునాయాస విజయాలతో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో సీడ్ ఒసాకా 6–2, 6–4తో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)పై, సెరెనా 6–2, 6–3తో తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)పై, బార్టీ 6–1, 6–4తో పొలోనా హెర్కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 7–5తో పౌలా బదోసా (స్పెయిన్)పై, పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/3), 6–2తో అరంటా రస్ (నెదర్లాండ్స్)పై, మాజీ చాంపియన్ వొజ్నియాకి (డెన్మార్క్) 7–5, 7–5తో యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, 15 ఏళ్ల అమెరికా టీనేజర్ కోరి గౌఫ్ 4–6, 6–3, 7–5తో సిర్స్టీ (రొమేనియా)పై విజయం సాధించారు. 11వ సీడ్ సాబలెంకా (బెలారస్) 6–7 (6/8), 6–7 (6/8)తో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. రెండో రౌండ్లో దివిజ్ జంట... పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రోహన్ బోపన్న (భారత్)–యాసుటకా ఉచియామ (జపాన్) జోడీ 1–6, 6–3, 3–6తో 13వ సీడ్ మైక్ బ్రయాన్–బాబ్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్ శరణ్ (భారత్)–అర్తెమ్ సితాక్ (న్యూజి లాండ్) ద్వయం 6–4, 7–5తో కరెనో బుస్టా (స్పెయిన్)–జావో సుసా (పోర్చుగల్) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌కు సానియా దూరం.... కాలి పిక్కలో నొప్పి కారణంగా భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగం నుంచి వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉంది. సానియా వైదొలగడంతో ఆమె మహిళల డబుల్స్ భాగస్వామి నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బోపన్న మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో మాత్రం నేడు జరిగే తొలి రౌండ్లో సానియా–నదియా జంట జిన్యున్ హాన్–లిన్ జు (చైనా) జోడీతో ఆడనుంది. -
సెరెనాను ట్రోల్ చేసిన ఒసాకా
మెల్బోర్న్: తల్లి అయ్యాక తొలి టైటిల్‌ను అందుకున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ ఆడటానికి సన్నద్ధమయ్యారు. దీనికంటే ముందుగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. కాగా, జపాన్ స్టార్ క్రీడాకారిణి నయామి ఒసాకా మాత్రం సెరెనాను ట్రోల్ చేసింది. సెరెనాతో కలిసిన దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే సెరెనా తన తల్లి అంటూ ఒసాకా పేర్కొన్నారు. ‘నేను-మా మమ్మీ’ అంటూ ఒసాకా ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఒసాకాకు 22 ఏళ్లు కాగా, సెరెనాకు 39 ఏళ్లు. సెరెనాది తన తల్లి వయసు అనే విషయాన్ని ఒసాకా చెప్పకనే చెప్పేసింది. మరి ఆస్ట్రేలియా ఓపెనర్‌లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. కచ్చితంగా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న సెరెనా.. ఒసాకాకు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఒసాకా డిఫెండింగ్ చాంపియన్‌గా పోరుకు సన్నద్ధం అయ్యింది. ఇదిలా ఉంచితే, 2018 యూఎస్ ఓపెన్‌లో సెరెనా ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను ఒసాకా సాధించారు. ఈ సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి 20వ తేదీ నుంచి ఆరంభం కానుంది. ఇటీవల ఆక్లాండ్ వేదికగా జరిగిన ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సెరెనా సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6–3, 6–4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. -
జొకోవిచ్, ఒసాకా ఇంటిముఖం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్లు జొకోవిచ్ (సెర్బియా), ఒసాకా (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ ఓడిపోయే దశలో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 23వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో అతను 4–6, 5–7, 1–2 స్కోరు వద్ద రిటైర్ట్‌హర్ట్ అయ్యాడు. రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6–3, 3–6, 6–1, 6–2తో సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచాడు. సెమీస్‌లో స్వితోలినా మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–4తో 16వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)పై నెగ్గి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీస్ బెర్త్ సంపాదించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా 5–7, 4–6తో 13వ సీడ్ బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. -
అందర్నీ చూడనివ్వు
గెలిస్తే నీ ట్రోఫీని అందరికీ ఎత్తి చూపుతావు కదా.ఓడితే నీ కన్నీళ్లను ఎందుకు ఎవర్నీ చూడనివ్వవు? జీవితంలో నువ్వేం సాధించావో నీ ట్రోఫీ చెబుతుంది. జీవితాన్నినువ్వెంతగా ప్రేమిస్తున్నావో నీ కన్నీళ్లు చెబుతాయి. ఓడిపోయి ఇప్పుడు కోకో గాఫ్ ఏడ్చినట్లుగా.. పన్నెండు నెలల క్రితం ఇదే యు.ఎస్. ఓపెన్‌లో, ఇదే ఆర్థర్ ఆష్ స్టేడియంలో, ఇదే శనివారం జరిగిన ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ని ఓడించినందుకు నవోమీ ఓసక ఏడుస్తూనే ఉంది. ఆఖరికి టైటిల్ ట్రోఫీ అందుకుంటున్నప్పుడు కూడా! కోకో గాఫ్ పదిహేనేళ్ల పిల్ల. చూడ్డానికి సెరెనా విలియమ్స్‌కి చిట్టి చెల్లెల్లా ఉంటుంది. అమెరికన్ టెన్నిస్ ప్లేయర్. నాలుగేళ్ల వయసులో టీవీ చూస్తున్నప్పుడు సెరెనా ఆమెను గట్టిగా పట్టేసుకుంది. 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో సెరెనా తన ప్రత్యర్థి దినారా సఫీనా (రష్యన్ క్రీడాకారిణి) ను 6–0, 6–3 తేడాతో ఎలా పడగొట్టేసిందీ ఊపిరి బిగబట్టి చూసింది కోకో గాఫ్. అప్పట్నుంచీ టెన్నిసే ఆమె ఊపిరి అయింది. ఆ కోకో గాఫ్ శనివారం యు.ఎస్. ఓపెన్‌లో వరల్డ్ నం.1 నవోమీ ఓసక మీద 6–3, 6–0 తేడాతో ఓడిపోయింది. అదింకా థర్డ్ రౌండే. మొత్త ఏడు రౌండ్లు కదా ఉంటాయి. ఆటలోకి వైల్డ్ కార్డ్‌తో ఎంటర్ అయింది కోకో గాఫ్. ఫస్ట్ రౌండ్లో పద్దెనిమిదేళ్ల రష్యన్ ప్లేయర్‌ని ఓడించింది. రెండో రౌండ్లో ఇరవై ఆరేళ్ల హంగేరియ¯Œ ప్లేయర్‌పై గెలిచింది. మూడో రౌండ్లో ఆ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 21 ఏళ్ల నవోమీ ఓసక ఈ అమ్మాయిని ఓడించింది. కోకో గాఫ్ చెంపల్నిండా జలపాతాలు! ఓటమిని తట్టుకోలేకపోయింది. కళ్లు తుడుచుకుంటోంది, మళ్లీ ఏడుస్తోంది. ఆన్కోర్ట్ ఇంటర్వ్యూ మొదలవగానే కోర్టునుంచి వెళ్లబోయింది కానీ, నవోమీ ఆమెను వెళ్లనివ్వలేదు. ‘నా పక్కనే ఉండు’ అంది. ఉండలేను అంది. ‘‘వాష్‌రూమ్‌కి వెళ్లి ఏడ్వడం కన్నా నయం.. కోర్టులోనే ఏడ్చేయడం. అందర్నీ చూడనివ్వు. ఆటను నువ్వెంత ప్రేమిస్తున్నావో..’’ అంది కోకో గాఫ్ని మృదువుగా హత్తుకుని! ఈమె కళ్లల్లోనూ నీళ్లు ఆ అమ్మాయి బాధ చూసి. గ్యాలరీలో కూర్చొని ఉన్న కోకో అమ్మానాన్నల వైపు తిరిగి ‘‘కోకో అద్భుతంగా ఆడింది. చక్కటి క్రీడాకారిణిగా మీరు తనని తీర్చిదిద్దారు’’ అని చెప్పింది నవోమీ. వాళ్ల కళ్లు మెరిశాయి. కోకో ఏడుపు ఆపకుండానే నవోమీకి థ్యాంక్యూ చెప్పింది. కిందటేడాది యు.ఎస్.ఓపెన్లోనే ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించినందుకు విలపిస్తున్న నవోమీ ఓసక (జపాన్) పన్నెండు నెలల క్రితం ఇదే యు.ఎస్. ఓపెన్‌లో, ఇదే ఆర్థర్ ఆష్ స్టేడియంలో, ఇదే శనివారం జరిగిన ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ని ఓడించినందుకు నవోమీ ఓసక ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది! సెరెనా కెరీర్‌కు అది కీలకమైన ఫైనల్. అది గెలిస్తే సెరెనా 24 టైటిళ్లు గెలిచినట్లవుతుంది. అది గెలిస్తే అప్పటివరకు మార్గరెట్ పేరు మీద ఉన్న 24 టైటిళ్ల రికార్డుకు సెరెనా ఈక్వల్ అవుతుంది. అది గెలిస్తే తల్లయ్యాక కూడా సెరెనా రాకెట్ పవరేం తగ్గలేదన్న సంకేతం ప్రపంచానికి వెళుతుంది. కానీ ఓడిపోయింది! 6–2, 6–4 తేడాతో 20 ఏళ్ల వయసులోని 20వ సీడ్ నవోమీ.. సీనియర్ మోస్ట్ సెరెనాపై గెలిచింది. దీర్ఘకాలం తర్వాత జపాన్‌కు వచ్చిన గ్రాండ్‌స్లామ్ టైటిల్! సెరెనాకు అది పెద్ద ఓటమి అయితే, నవోమీకి పెద్ద గెలుపు. కానీ ఆ పెద్ద గెలుపు సంతోషం ఆమెకు మిగల్లేదు. నవోమీ గెలవగానే గ్యాలరీలో ఉన్న సెరెనా అభిమానులు నవోమీని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ‘సెరెనానే ఓడిస్తావా?’ అన్నారు. ‘వెంటనే మా కళ్ల ముందు నుంచి వెళ్లిపో’ అన్నారు. నవోమీ కళ్లు తుడుచుకుంటూనే స్టేజ్ మీదకు ఎక్కింది. కళ్లు తుడుచుకుంటూనే ట్రోఫీ అందుకుంది. ఎవరూ ఆమెను ఓదార్చలేదు. అందరూ సెరెనాను ఓదార్చేందుకే ప్రయత్నించారు. ఆఖరికి నవోమీ కూడా!! సెరెనా అభిమానుల వైపు చూసి ‘‘సారీ, ఇలా ముగిసింది’’ అని పెద్దగా ఏడుస్తూ చెప్పింది నవోమీ. ఓడిపోయిన ప్లేయర్‌ని తట్టుకోవడం కష్టం. ఓడిపోయిన ప్లేయర్ అభిమానులను తట్టుకోవడం ఇంకా కష్టం. ఇక్కడ ఓడిపోయిన ఈ చిన్న పిల్ల కోకో గాఫ్కూ అభిమానులు లేకపోతారా? ‘సారీ.. ఇంత కఠినంగా ఆడినందుకు’ అని ఆమెను దగ్గరకు తీసుకుంది నవోమీ! నవోమీలోని విజేత.. నవోమీలోని కోకో గాఫ్ అభిమానికి చెప్పిన సారీ ఇది. గతం ఏడాది తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనాను, ఇప్పుడు తననీ ఓడించినందుకు ప్రతీకారంగా కోకో గాఫ్ పెరిగి పెద్దయి భవిష్యత్తులో నవోమీని ఓడిస్తే కనుక దానిని కూడా నవోమీ ఒక గెలుపుగానే తీసుకుంటుందని ఊహించడానికి ఈ ‘సారీ’లు చాలు. అమేజింగ్ ప్లేయర్ నవోమీ! -మాధవ్ శింగరాజు -
హలెప్ ఔట్
యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం. నాలుగో సీడ్ రుమేనియన్ స్టార్ హలెప్ ఔట్... సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్, వింబుల్డన్ చాంపియన్ సిమోనా హలెప్ ఆట రెండోరౌండ్లోనే ముగిసింది. గత రెండేళ్లుగా ఈ టోర్నీ ఆమెకు నిరాశనే మిగిలిస్తోంది. 2017, 2018లలో తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో స్పానిష్ దిగ్గజం నాదల్ ముందంజ వేయగా, జ్వెరెవ్ రెండో రౌండ్లో శ్రమించి గట్టెక్కాడు. న్యూయార్క్: వింబుల్డన్ చాంపియన్ సిమోనా హలెప్ కథ ముగిసింది. యూఎస్ ఓపెన్‌లో ఆమె రెండో రౌండ్లోనే కంగుతింది. టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్) అలవోక విజయంతో ముందంజ వేయగా, పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జ్వెరెవ్ శ్రమించి రెండో రౌండ్ అడ్డంకిని దాటాడు. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఆస్ట్రేలియా ఆటగాడు తనసి కొకినకిస్ నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్‌లో భారత యువ ఆటగాడు దివిజ్ శరణ్ తొలిరౌండ్లోనే నిరాశ పరిచాడు. మూడో రౌండ్లో స్విస్ స్టార్, మూడో సీడ్ రోజర్ ఫెడరర్ 6–2, 6–2, 6–1తో డానియెల్ ఇవాన్స్ (బ్రిటన్)పై సునాయాస విజయం సాధించాడు. కేవలం గంటా 20 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఏడో సీడ్ నిషికొరి (జపాన్)కి 2–6, 4–6, 6–2, 3–6తో డి మినర్ (ఆస్ట్రేలియా) చేతిలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మూడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 4–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యునీషియా)ను ఓడించింది. యూఎస్‌లో ఇంతేనా! అమెరికన్ క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్ ఆరేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడుతోంది. కానీ... ఏ సీజన్లోనూ, ఏ టోర్నీలోనూ ఇప్పటి వరకు రెండో రౌండే దాటలేదు. ఇప్పుడేమో తన గ్రాండ్‌స్లామ్ కెరీర్లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల సింగిల్స్‌లో తాజా వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ హలెప్ (రుమేనియా)ను కంగుతినిపించింది. 116వ ర్యాంకర్ అయిన అమెరికన్ 2–6, 6–3, 7–6(7/4)తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హలెప్ కథ ముగించింది. గత రెండేళ్లుగా మిగతా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో విజేత (ఫ్రెంచ్–2018), రన్నరప్ (ఆస్ట్రేలియా–2018, ఫ్రెంచ్– 2017)గా నిలుస్తున్న హలెప్ యూఎస్ ఓపెన్‌లో మాత్రం తొలిరౌండ్నే దాటలేకపోతోంది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఒసాకా (జపాన్) 6–2, 6–4తో లినెట్ (పోలండ్)పై, 19వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 4–6, 6–3, 6–4తో కొలిన్స్ (అమెరికా)పై, గాఫ్ (అమెరికా) 6–4, 4–6, 6–4తో బబొస్ (హంగేరి)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 6–4, 6–3తో అలిసన్ రిస్కే (అమెరికా)పై విజయం సాధించారు. దివిజ్ జోడి ఔట్: పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ఆటగాడు లియాండర్ పేస్–డ్యురన్ (అర్జెంటీనా) జోడీ 5–7, 2–6తో కెమెనొవిక్ (సెర్బియా)– కాస్పెర్ రుడ్(నార్వే) జంట చేతిలో ఓడింది. దివిజ్ శరణ్–హ్యూగో నిస్ (మొనాకొ) జంట 4–6, 4–6తో రాబర్ట్ కార్బలెస్–ఫెడెరికో డెల్బనిస్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఐదు సెట్లవరకు పోరాటం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 3–6, 6–2, 2–6, 6–3తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. జర్మనీ ఆటగాడు మ్యాచ్ గెలిచేందుకు 3 గంటలకు పైగా పోరాటం చేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో రష్యా ఆటగాడు, 5వ సీడ్ మెద్వెదెవ్ 6–3, 7–5, 5–7, 6–3తో హ్యూగో డెలియన్ (బొలివియా)పై, అమెరికాకు చెందిన 14వ సీడ్ జాన్ ఇస్నెర్ 6–3, 7–6 (7/4), 7–6 (7/5)తో స్ట్రఫ్ (జర్మనీ)పై గెలుపొందారు. 22వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 4–6, 6–3, 7–5, 6–3తో సెడ్రిక్ మార్సెల్ స్టీబ్ (జర్మనీ)ను ఓడించగా, 23వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–4, 6–3, 6–7 (3/7), 6–3తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. 13వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 6–2, 6–2తో మారియస్ కొపిల్ (రుమేనియా)పై, ఆస్ట్రేలియన్ స్టార్, 28వ సీడ్ కిర్గియోస్ 6–4, 6–2, 6–4తో ఆంటోని హోంగ్ (ఫ్రాన్స్)పై వరుస సెట్లలో గెలుపొందారు. నయోమి ఒసాకా -
మళ్లీ నంబర్‌వన్‌గా ఒసాకా
టొరంటో (కెనడా) : మహిళల టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ ప్లేయర్ నయోమి ఒసాకా మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. మాంట్రియల్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఒసాకా 3–6, 4–6తో మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. అయితే ప్రస్తుత నంబర్‌వన్‌గా ఉన్న యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో... సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఒసాకా మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి రానుంది. -
ఒసాకా, సెరెనా ఔట్
తొలి రెండు మ్యాచ్‌ల్లో అతి కష్టమ్మీద గట్టెక్కిన మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా మూడో రౌండ్లో మాత్రం ఆ అద్భుతం చేయలేకపోయింది. డబుల్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న కాటరీనా సినియకోవాతో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలోనే చేతులెత్తేసిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్ వరుస సెట్లలో సెరెనాను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శనివారం పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ... పదో సీడ్, మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. డబుల్స్ నంబర్‌వన్, సింగిల్స్‌లో 42వ ర్యాంకర్ కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ధాటికి ఒసాకా ఇంటిముఖం పట్టింది. 77 నిమిషాల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సినియకోవా 6–4, 6–2తో ఒసాకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 35వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 6–2, 7–5తో సెరెనాను బోల్తా కొట్టించింది. ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి, తర్వాతి రెండు సెట్లు గెలిచి నిలిచింది. కానీ మూడో మ్యాచ్‌లో మాత్రం అది సాధ్యం కాలేదు. ఒసాకా దూకుడుకు పగ్గాలు వేస్తూ సినియకోవా తొలి సెట్లో ఒకసారి... రెండో సెట్లో రెండుసార్లు సర్వీస్ బ్రేక్ సాధించింది. మరోవైపు ఒసాకా ఏకంగా 38 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. సినియకోవా సర్వీస్‌లో బ్రేక్ సాధించేందుకు ఏడు సార్లు అవకాశం వచ్చినా ఈ జపాన్ స్టార్ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేదు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఇగా స్వియాటెక్ (పోలాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. హలెప్ 6–2, 6–1తో సురెంకో (ఉక్రెయిన్)పై, కీస్ 6–3, 6–7 (5/7), 6–4తో బ్లిన్కోవా (రష్యా)పై, స్వియాటెక్ 0–6, 6–3, 6–3తో మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో)పై గెలిచారు. సీడెడ్ ఆటగాళ్ల జోరు... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో కరుసో (ఇటలీ)పై, ఆరో సీడ్ సిట్సిపాస్ 7–5, 6–3, 6–7 (5/7), 7–6 (8/6)తో క్రాజినోవిచ్ (సెర్బియా)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 4–6, 6–2, 7–5తో పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)పై, ఐదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–2, 4–6, 1–6, 6–2తో లాజోవిచ్ (సెర్బియా)పై, తొమ్మిదో సీడ్ ఫాగ్నిని 7–6 (7/5), 6–4, 4–6, 6–1తో అగుట్ (స్పెయిన్)పై గెలిచారు. పదో సీడ్ ఖచనోవ్ (రష్యా), మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఎనిమిదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) జంట 0–6, 6–4, 3–6తో మూడో సీడ్ కబాల్–ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఒసాకా శ్రమించి...
పారిస్: వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. గతేడాది యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఒసాకా 4–6, 7–5, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా ఆరు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఆమె తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి సెట్ చేజార్చుకున్న ఒసాకా రెండో సెట్లో కోలుకుంది. కీలకదశలో తప్పిదాలు చేయకుండా సంయమనంతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 2005లో లిండ్సే డావెన్‌పోర్ట్ (అమెరికా) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయాక విజయం సాధించిన రెండో టాప్ సీడ్ ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. మూడో రౌండ్లో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. రెండో రౌండ్లో సినియకోవా 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 7–6 (7/5), 6–7 (8/10), 6–4తో మరియా సకారి (గ్రీస్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో 17 ఏళ్ల అమెరికా అమ్మాయి అమండా అనిసిమోవా 6–4, 6–2తో 11వ సీడ్ ఆర్యాన సబలెంక (బెలారస్)పై సంచలన విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–2తో కురుమి నారా (జపాన్)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 4–6, 6–4, 6–4తో సీగ్మండ్ (జర్మనీ)పై గెలిచారు. జొకోవిచ్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో థీమ్ 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, జొకోవిచ్ 6–1, 6–4, 6–3తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 7–6 (7/3)తో వైమెర్ (స్వీడన్)పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–అయోయామ (జపాన్) ద్వయం 3–6, 6–2, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. -
గట్టెక్కిన జ్వెరెవ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన అలెగ్జాండర్ జ్వెరెవ్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. 21 ఏళ్ల ఈ జర్మనీ యువతార మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 7–6 (7/4), 6–3, 2–6, 6–7 (5/7), 6–3తో జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. 4 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జ్వెరెవ్ వరుసగా రెండు సెట్లలో నెగ్గినా... ఆ తర్వాతి రెండు సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లో తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతేడాది యూఎస్ ఓపెన్‌లో రోజర్ ఫెడరర్‌ను ఓడించిన మిల్మన్ నాలుగో సెట్లో 2–4తో వెనుకబడిన దశలో పుంజుకొని స్కోరును సమం చేశాడు. టైబ్రేక్‌లో సెట్‌ను గెలిచి జ్వెరెవ్‌కు చెమటలు పట్టించాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లోని ఎనిమిదో గేమ్‌లో మిల్మన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని జ్వెరెవ్ ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా) 3–6, 6–2, 6–1, 6–4తో నికొలస్ జారీ (చిలీ)పై, తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 6–3, 6–0, 3–6, 6–3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై, పదో సీడ్ ఖచనోవ్ (రష్యా) 6–1, 6–1, 6–4తో స్టెబ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు.మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్) రెండో రౌండ్ చేరేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రపంచ 90వ ర్యాంకర్ అనా కరోలినా ష్మెదిలోవా (స్లొవేకియా)తో జరిగిన తొలి రౌండ్లో ఒసాకా 0–6, 7–6 (7/4), 6–1తో నెగ్గింది. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా 38 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకోను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో ఏకంగా 60 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ అనా కొంటావీట్ (ఎస్తోనియా) 6–3, 2–6, 2–6తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. -
రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలిగిన ఫెడరర్
గతవారం మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్... రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్లో వైదొలిగాడు. గ్రీస్ యువతార సిట్సిసాస్తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అతను కుడి కాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ‘నేను వంద శాతం ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను’ అని 2015 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఆడనున్న ఫెడరర్ వ్యాఖ్యానించాడు. -
టాప్ ర్యాంకర్లు ఔట్
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్లకు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లో, మహిళల ఈవెంట్లో నయోమి ఒసాకా (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ 4–6, 4–6తో కోల్‌ష్రైబర్ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 6–1తో స్వాట్జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఫెడరర్ 6–3, 6–4తో తన దేశానికే చెందిన వావ్రింకాపై నెగ్గాడు. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఒసాకా 3–6, 1–6తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. రెండో సీడ్ హలెప్ (రొమేనియా) 2–6, 6–3, 2–6తో మర్కెట (చెక్ రిపబ్లిక్) చేతిలో కంగుతింది. -
కోచ్‌తో ఒసాకా తెగదెంపులు
టోక్యో: ప్రపంచ మహిళల టెన్నిస్ నంబర్‌వన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా (జపాన్) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించేలా తనను తీర్చిదిద్దిన కోచ్ సషా బాజిన్‌తో (జర్మనీ) తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి కారణాలు ఆమె వెల్లడించలేదు. ‘అందరికీ హాయ్. ఇక నుంచి కోచ్ సషా బాజిన్‌తో కలిసి నేను పనిచేయడంలేదు. ఇన్నాళ్లు ఆయన అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని 21 ఏళ్ల ఈ జపాన్ క్రీడాకారిణి తెలిపింది. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌తోపాటు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), విక్టోరియా అజరెంకా (బెలారస్)లకు హిట్టింగ్ పార్ట్నర్గా వ్యవహరించిన సషా బాజిన్ 2018 ఆరంభంలో నయోమి ఒసాకాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి వరకు కెరీర్లో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయిన ఒసాకా... బాజిన్ శిక్షణలో రాటు దేలింది. 2018 మార్చిలో ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలిమయ్స్ను మట్టికరిపించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌నూ గెల్చుకొని ఆసియా నుంచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ‘ధన్యవాదాలు నయోమి. నీతో కలిసి పని చేసిన కాలం అద్భుతంగా సాగింది. దీంట్లో నన్నూ భాగం చేసినందుకు కృతజ్ఞతలు’ అని సషా బాజిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. -
టైటిల్స్ సాధించేలా తీర్చిదిద్దిన కోచ్‌తో తెగదెంపులు
టోక్యో: ప్రపంచ మహిళల టెన్నిస్ నంబర్‌వన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా (జపాన్) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించేలా తనను తీర్చిదిద్దిన కోచ్ సషా బాజిన్‌తో (జర్మనీ) తెగదెంపులు చేసుకు న్నట్లు ప్రకటించింది. ‘అందరికీ హాయ్. ఇక నుంచి కోచ్ సషా బాజిన్‌తో కలసి పనిచేయడంలేదు. ఇన్నాళ్లూ ఆయన అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని 21 ఏళ్ల ఈ జపాన్ క్రీడాకారిణి తెలిపింది. అమెరికా దిగ్గజం సెరెనాతోపాటు గ్రాండ్ స్లామ్ చాంపియన్స్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్), అజరెంకా (బెలారస్)కు హిట్టింగ్ పార్ట్నర్గా వ్యవహరించిన బాజిన్ 2018 ఆరంభంలో ఒసాకాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి వరకు కెరీర్లో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయిన ఒసాకా... బాజిన్ శిక్షణలో రాటు దేలింది. 2018లో యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను మట్టికరిపించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌నూ గెల్చుకొని ఆసియా నుంచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ‘ధన్యవాదాలు నయోమి. నీతో కలిసి పని చేసిన కాలం అద్భుతంగా సాగింది. దీంట్లో నన్నూ భాగం చేసినందుకు కృతజ్ఞతలు’ అని సషా బాజిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. -
నయోమి... నయా నంబర్‌వన్
పారిస్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో జపాన్ ప్లేయర్ నయోమి ఒసాకా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెల్చుకోవడంతో ఒసాకా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. అటు పురుషుల సింగిల్స్లోగాని, ఇటు మహిళల సింగిల్స్లోగాని ఆసియా నుంచి నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్న తొలి ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. 1975లో అధికారికంగా కంప్యూటర్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక నంబర్‌వన్ స్థానానికి చేరిన 26వ మహిళా క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల ర్యాంకింగ్స్‌లో నొవాక్ జొకోవిచ్ 10,955 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మూడు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో స్థానంలో ఉండగా... అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నయోమి ఒసాకా
-
నయోమి నవ్వింది
నాలుగు నెలల క్రితం యూఎస్ ఓపెన్‌లో అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను ఓడించినప్పటికీ జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయింది. నాటి ఫైనల్లో చైర్ అంపైర్‌ను తీవ్రంగా దూషించిన సెరెనా అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేసింది. ఒసాకా విజయంకంటే సెరెనా ప్రవర్తనే అక్కడ హైలైట్ అయ్యింది. ఫైనల్‌ను వీక్షించిన ప్రేక్షకులు కూడా ఒసాకా విజయాన్ని అంగీకరించకుండా ఆమెను గేలి చేశారు. సీన్ కట్ చేస్తే... నాడు సెరెనాపై తాను సాధించిన విజయం గాలివాటమేమీ కాదని ఒసాకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరూపించింది. రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవాపై ఈసారి ఫైనల్లో గెలిచింది. కెరీర్లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ‘గ్రాండ్’ విజయంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ దక్కించుకుంది. విజయానంతరం చిరునవ్వులు చిందిస్తూ, తనివితీరా ఆస్వాదిస్తూ ఈ క్షణాలను నయోమి ఒసాకా చిరస్మరణీయం చేసుకుంది. మెల్బోర్న్: టైటిల్ ఫేవరెట్స్ అందరూ ముందే నిష్క్రమించగా... పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జపాన్ యువతార నయోమి ఒసాకా మళ్లీ అద్భుతం చేసింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. రాడ్ లేవర్ ఎరీనాలో శనివారం 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 7–6 (7/2), 5–7, 6–4తో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. విజేత ఒసాకాకు 41 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్ క్విటోవాకు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ విజయంతో 21 ఏళ్ల ఒసాకా సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. ఈ క్రమంలో ఆసియా నుంచి ఈ ఘనత సాధించనున్న తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించనుంది. మూడు మ్యాచ్ పాయింట్లు చేజార్చుకొని... గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన ఒసాకా ఆ తర్వాత మరో నాలుగు టోర్నీల్లో ఆడినా టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం నిలకడగా ఆడుతూ ఫైనల్ చేరింది. క్విటోవాతో జరిగిన తుది సమరంలోనూ ఆమె తన జోరు కొనసాగించింది. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఒసాకా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఒసాకా... క్విటోవా సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను సంపాదించింది. అయితే క్విటోవా ఈ మూడింటిని కాపాడుకుంది. అనంతరం పదో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది. మళ్లీ 12వ గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ చెక్ రిపబ్లిక్ స్టార్ రెండో సెట్‌ను 7–5తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని మూడో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్విటోవా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా ఒసాకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని ఒసాకా మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ట్రోఫీ ప్రదానోత్సవం జరుగుతున్నంతసేపూ ఇది కలయా నిజమా అన్న భావనలో ఉండిపోయా. రెండో సెట్లో మూడు మ్యాచ్ పాయింట్లు కోల్పోయినపుడు నిరాశచెందా. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దానిపై దృష్టి పెట్టా. అనవసరంగా ఆందోళన చెందకుండా పరిణతితో ఆడాల్సిన అవసరం ఉందని మనసులో అనుకొని దానిని అమలు చేశా. అనుకున్న ఫలితాన్ని సాధించా. – నయోమి ఒసాకా విశేషాలు జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా–2001లో) తర్వాత కెరీర్‌లోని తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను వరుసగా నెగ్గిన రెండో క్రీడాకారిణిగా ఒసాకా గుర్తింపు పొందింది. కాప్రియాటి కంటే ముందు క్రిస్ ఎవర్ట్ (అమెరికా), ఇవోన్ గూలగాంగ్ (ఆస్ట్రేలియా), హానా మాండ్లికోవా (చెక్ రిపబ్లిక్), వీనస్ విలియమ్స్ (అమెరికా) ఈ ఘనత సాధించారు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1998లో) తర్వాత బ్యాక్ టు బ్యాక్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా... 2010లో కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) తర్వాత పిన్న వయస్సులో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ నాదల్vsజొకోవిచ్ మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–2లలో ప్రత్యక్ష ప్రసారం -
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
-
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
మెల్బోర్న్ : గతేడాది గ్రాండ్‌స్లామ్ చివరి టోర్నీ యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా.. ఈ ఏడాది సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సైతం అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా 7-6(7/2), 5-7, 6-4 తేడాతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇరువురు క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో ఒసాకానే విజయం వరించింది. తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుపొందిన ఒసాకా.. రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆసక్తికరంగా మారింది. ఓవరాల్‌గా 116 పాయింట్లను ఒసాకా సాధించి విజేతగా నిలవగా, 112 పాయింట్లను క్విటోవా సాధించారు. ఇందులో ఒసాకా 9 ఏస్‌లను సంధించగా, క్విటోవా 5 ఏస్‌లను మాత్రమే సంధించి వెనుకబడింది. ఇక ఇరువురు తలో నాలుగుసార్లు డబుల్ ఫాల్ట్స్ చేయడం గమనార్హం. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాదల్ నిర్దాక్షిణ్యంగా...
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో రోజర్ ఫెడరర్‌నే చిత్తు చేసి సంచలనం సృష్టించిన గ్రీకు వీరుడు సిట్సిపాస్ ఆటలు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ముందు సాగలేదు. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో సిట్సిపాస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తూ నాదల్ చెలరేగాడు. నిర్దాక్షిణ్యమైన ఆటతో విజయాన్ని అందుకొని పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ వేటలో నిలిచాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోని నాదల్ భీకర ఫామ్ ముందు సిట్సిపాస్ పూర్తిగా చేతులెత్తేశాడు. మహిళల విభాగంలో పెట్రా క్విటోవా, నయోమి ఒసాకా ఫైనల్ చేరి ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు. వీరిద్దరిలో ఎవరి గెలిస్తే వారు హలెప్ స్థానంలో కొత్త వరల్డ్ నంబర్‌వన్‌గా నిలుస్తారు. మెల్బోర్న్: కెరీర్లో ఒకే ఒక్క సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) మరో టైటిల్ విజయానికి మరింత చేరువయ్యాడు. నాలుగు సార్లు ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను... మళ్లీ ఇక్కడ విజయం సాధించగలిగితే ఓపెన్ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం రెండేసి సార్లు నెగ్గిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. నాదల్ అద్భుత ఫామ్‌ను చూపించేలా సెమీ ఫైనల్ సాగింది. ఈ మ్యాచ్‌లో అతను 6–2, 6–4, 6–0తో స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్)ను చిత్తుగా ఓడించాడు. 1 గంటా 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఆద్యంతం రాఫెల్ దూకుడు కొనసాగింది. ఫైనల్ చేరే క్రమంలో వరుసగా 63 గేమ్‌లలో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోకపోవడం విశేషం. తొలి సెట్ మూడో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన ధాటిని మొదలు పెట్టిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. పదునైన సర్వీస్‌లతో దూసుకుపోయిన అతను 4–2తో ముందంజ వేశాడు. రెండు డబుల్ ఫాల్ట్‌లతో పాటు పేలవ డ్రాప్షాట్లతో సిట్సిపాస్ తొలి సెట్లో పూర్తిగా వెనుకబడిపోయాడు. రెండో సెట్లో మాత్రం కొంత పోటీనిచ్చిన గ్రీక్ ఆటగాడు 4–4 వరకు సమంగా నిలిచాడు. అయితే బ్రేక్ సాధించిన నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. మూడో సెట్‌లోనైతే తిరుగులేని ఆటతో మూడు సార్లు సర్వీస్ బ్రేక్ చేసిన నాదల్... ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వలేదు. నాదల్ 28 విన్నర్లు కొట్టగా, సిట్సిపాస్ 17కే పరిమితం కావడం ఇద్దరి ఆట మధ్య తేడాను చూపిస్తోంది. ఈ టోర్నీలో హోరాహోరీ మ్యాచ్‌లు ఆడటంతో నాదల్‌తో పోలిస్తే దాదాపు పది గంటలు ఎక్కువగా కోర్టులో గడిపిన సిట్సిపాస్‌పై తీవ్ర అలసట కూడా ప్రభావం చూపించింది. తొలిసారి ఫైనల్‌కు... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్లో మొదటి సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీస్‌లో క్విటోవా 7–6 (7/2), 6–0తో డానియెల్ కొలిన్స్‌ను చిత్తు చేసింది. 1 గంటా 34 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. తొలి సెట్ ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. 4–4తో స్కోరు సమంగా నిలిచిన స్థితిలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోవడంతో రాడ్ లేవర్ ఎరీనా పై కప్పును మూసేశారు. తిరిగొచ్చిన తర్వాత కొలిన్స్ ఆట గతి తప్పింది. సహనం కోల్పోయిన ఆమె రెండో సెట్‌కు ముందు అంపైర్‌తో కూడా వాదనకు దిగింది. రెండో సెట్లో క్విటోవాకు ఎదురు లేకుండా పోయింది. రెండు సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా 2016లో కత్తిపోటుకు గురైంది. పునరాగమనం తర్వాత ఆమె అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మరో సెమీస్‌లో నాలుగో సీడ్, యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 4–6, 6–4తో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో సెరెనాను కంగు తినిపించిన ప్లిస్కోవా గట్టిగా పోరాడినా జపాన్ స్టార్ ముందు తలవంచక తప్పలేదు. -
కొత్త చాంపియన్ ఎవరు?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ మహిళల సింగిల్స్ పోరులో తుది బెర్తులు ఖరారయ్యాయి. ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా, నాల్గో సీడ్ నయోమి ఒసాకాలు టైటిల్ సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత క్విటోవా ఫైనల్ చేరగా, ఆపై మరో సెమీ ఫైనల్లో ఒసాకా విజయం సాధించి అమీతుమీ పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒసాకా 6-2, 4-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయ సాధించారు. ఫలితంగా శనివారం జరిగే అంతిమ సమరంలో ఒసాకా-క్విటోవాలు తలపడనున్నారు. గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఒసాకా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తుది పోరులో సెరెనా విలియమ్సన్‌ను ఓడించి యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్నారు. ఇదే ఆమెకు తొలి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా, క్విటోవా రెండు సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచారు. 2011, 2014ల్లో క్విటోవా వింబుల్డన్ సింగిల్స్ విజేతగా నిలిచారు. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ను వీరిలో ఎవరు గెలిచినా తొలిసారి ఈ టైటిల్‌ను సాధించినట్లవుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కొత్త చాంపియన్ ఎవరు అనే దానిపై ఆసక్తినెలకొంది. -
మళ్లీ రన్నరప్‌గా నయోమి ఒసాకా
స్వదేశంలో తొలిసారి టైటిల్ సాధించాలని ఆశించిన జపాన్ టెన్నిస్ కొత్త సంచలనం నయోమి ఒసాకాకు రెండోసారీ నిరాశే ఎదురైంది. టోక్యోలో ఆదివారం ముగిసిన పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఒసాకా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–4తో ఒసాకాను ఓడించి విజేతగా నిలిచింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఒసాకా ఇటీవలే యూఎస్ ఓపెన్‌లో సెరెనాను ఓడించి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. -
సొంతగడ్డపై తొలి టైటిల్‌కు విజయం దూరంలో...
మహిళల టెన్నిస్‌లో కొత్త కెరటం నయోమి ఒసాకా (జపాన్) స్వదేశంలో తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచింది. టోక్యోలో జరుగుతోన్న పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్లో ఆమె ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఒసాకా 6–2, 6–3తో కామిలా గియోర్గి (ఇటలీ)పై గెలిచింది. నేడు జరిగే తుది పోరులో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. ఇటీవలే యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించిన ఒసాకా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. -
నయోమి... నవ చరిత్ర
మహిళల టెన్నిస్‌లో మరో యువ తార అవతరించింది. తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా విజేతగా నిలిచింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. అయితే సెరెనా అనుచిత ప్రవర్తన ఒసాకా విజయానందాన్ని ఆవిరి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కోచ్ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని చైర్ అంపైర్ సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేయడం... సెరెనా అసహనంతో రాకెట్ విరగ్గొట్టినందుకు రెండో హెచ్చరిక రూపంలో ప్రత్యర్థికి పాయింట్ ఇచ్చేయడం... ఆ తర్వాత తీవ్ర పదజాలంతో చైర్ అంపైర్‌ను దూషించినందుకు.. మూడో హెచ్చరిక రూపంలో సెరెనా గేమ్నే కోల్పోవడం... వెరసి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాకా అద్భుత ఆటతీరు కాకుండా చివరకు సెరెనా అనుచిత ప్రవర్తనే హైలైట్ అయ్యింది. న్యూయార్క్: అద్భుతం జరిగింది. అంచనాలు తలకిందులయ్యాయి. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్ భవిష్యత్ టెన్నిస్ తార చేతిలో బోల్తా పడింది. జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా ధాటికి ఈ అమెరికా టెన్నిస్ దిగ్గజం చేతులెత్తేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 20వ సీడ్ నయోమి ఒసాకా 6–2, 6–4తో 17వ సీడ్, ఆరుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జపాన్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. నా లీ (చైనా; 2011లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఆసియా నుంచి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా 20 ఏళ్ల ఒసాకా గుర్తింపు పొందింది. విజేత ఒసాకాకు 38 లక్షల డాలర్లు (రూ. 27 కోట్ల 40 లక్షలు); రన్నరప్ సెరెనాకు 18 లక్షల 50 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో కేవలం ఒక సెట్ కోల్పోయిన ఒసాకా తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. 36 ఏళ్ల సెరెనాకు ప్రతి విభాగంలో ఆమె గట్టి జవాబు ఇచ్చింది. తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలు అయినప్పటికీ... స్టేడియంలోని 24 వేల మంది ప్రేక్షకులు సెరెనా విజయమే కోరుకుంటునప్పటికీ... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న ఈ జపాన్ అమ్మాయిపై ఆ అంశాలు ఎలాంటి ప్రభావం చూపలేదు. పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన ఒసాకా కచ్చితమైన సర్వీస్‌లు... కళ్లు చెదిరేరీతిలో రిటర్న్ షాట్లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో సెరెనాకు ఊపిరి ఆడకుండా చేసింది. ఒకదశలో ఒసాకా కొట్టిన కొన్ని షాట్లను సెరెనా కూడా ప్రశంసించింది. మరోవైపు సెరెనాకు ఏదీ కలసి రాలేదు. గతి తప్పిన సర్వీస్‌లు.. డబుల్ ఫాల్ట్‌లు... అనవసర తప్పిదాలు... బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకోవడం... ఇలా ఆమె ఏదశలోనూ ఒసాకాకు పోటీ ఇచ్చినట్టు అనిపించలేదు. తొలి సెట్లోని మూడో గేమ్‌లో, ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఒసాకా తన సర్వీస్‌లను కాపాడుకొని 34 నిమిషాల్లో 6–2తో సెట్‌ను దక్కించుకుంది. వివాదం మొదలైందిలా... రెండో సెట్లో తన సర్వీస్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సెరెనా 1–0తో ముందంజ వేసింది. ఈ దశలో గ్యాలరీలో ఉన్న సెరెనా కోచ్ ప్యాట్రిక్ మురాతొగ్లు నిబంధనలకు విరుద్ధంగా సంకేతాల రూపంలో సలహాలు ఇస్తున్నారని గమనించిన చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ (పోర్చుగల్) సెరెనాను హెచ్చరించారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన సెరెనా చైర్ అంపైర్ రామోస్‌తో వాగ్వాదానికి దిగింది. ‘కోచ్ తనకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు. మోసపూరిత పద్ధతులతో గెలిచే బదులు నేను ఓడిపోవడానికి సిద్ధపడతాను’ అని రామోస్‌కు సెరెనా సమాధానం ఇచ్చింది. అనంతరం ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ తర్వాత సెరెనా కూడా గేమ్ నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. గేమ్ పూర్తయ్యాక తన కుర్చీ వద్దకు వెళ్తూ ‘నేను మోసం చేయడంలేదు’ అని చైర్ అంపైర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. కంట కన్నీరు.... జరిమానా రూపంలో గేమ్ ఒసాకాకు ఇవ్వడంతో సెరెనా మరింత రెచ్చిపోయింది. టోర్నీ రిఫరీ కోర్టులోకి రావాలని కోరింది. ‘ఇది అన్యాయం. పురుష ప్లేయర్లు నాకంటే దారుణంగా ఎన్నోసార్లు దూషించారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. నేను మహిళను కాబట్టే నన్ను శిక్షించారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని టోర్నీ రిఫరీతో కన్నీరు కారుస్తూ వాపోయింది. టోర్నీ రిఫరీ చైర్ అంపైర్‌తో మాట్లాడి సెరెనాకు సర్దిచెప్పడంతో మళ్లీ ఆట కొనసాగింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్ నిలబెట్టుకుంది. స్కోరు 5–4 ఉండగా పదో గేమ్‌లో ఒసాకా తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అయితే కోర్టులో జరిగిన పరిణామాలతో కలత చెందినట్లు కనిపించిన ఒసాకా విజయం అనంతరం సంబరాలను కూడా చేసుకోలేదు. ఒసాకాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించిన సెరెనా మళ్లీ చైర్ అంపైర్ వద్దకు వెళ్లి తనకు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఆయన స్పందించలేదు. దాంతో సెరెనా చైర్ అంపైర్‌తో కరచాలనం చేయకుండానే వెనుదిరిగింది. నువ్వో దొంగవి... రెండో సెట్లో ఆరో గేమ్ ముగిశాక సెరెనా చైర్ అంపైర్‌తో మరోసారి వాగ్వాదానికి దిగింది. ‘నేను గ్యాలరీలో నుంచి ఎలాంటి కోచింగ్ తీసుకోవడంలేదు. నేను మోసానికి పాల్పడటం లేదని మీరు మైక్ ద్వారా ప్రకటించాలి. నాకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలి. నా జీవితంలో నేను ఏనాడూ మోసం చేయలేదు’ అని ఆవేశంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో సెరెనా మళ్లీ తన సర్వీస్ చేజార్చుకుంది. ఒసాకా 4–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మళ్లీ చైర్ అంపైర్‌ను సెరెనా దూషించడం మొదలుపెట్టింది. ‘నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. నువ్వో అబద్ధాలకోరువి. నువ్వు బతికినంతకాలం నేను ఆడుతున్న మ్యాచ్‌కు అంపైరింగ్ చేయొద్దు. నన్నెప్పుడు క్షమాపణలు కోరుతావ్? ఇప్పుడే క్షమాపణ చెప్పు. నా నుంచి పాయింట్ లాక్కున్నావు. నువ్వు ఓ దొంగవి’ అని తీవ్ర పదజాలాన్ని వాడింది. సెరెనా దూషణ పర్వానికి జరిమానాగా చైర్ అంపైర్ ఈసారి ఏకంగా ఒక గేమ్‌ను ఒసాకాకు ఇచ్చాడు. దాంతో ఒసాకా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. రాకెట్ విరగ్గొట్టి.... రెండో సెట్ నాలుగో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా 3–1తో ముందంజ వేసింది. అయితే ఐదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాక సెరెనా తన రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టింది. దాంతో క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమెపై చైర్ అంపైర్ పెనాల్టీ విధించారు. ఫలితంగా ఒసాకా ఆరో గేమ్‌ను నేరుగా 15–0తో ప్రారంభించింది. తన సర్వీస్‌ను కాపాడుకుంది. స్కోరు 3–3తో సమమైంది. నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సెరెనా విజయం సాధించాలని కోరుకున్నారని తెలుసు. అయితే ముగింపు ఇలా ఉన్నందుకు క్షమాపణలు కోరుతున్నా. నేనీ స్థాయికి చేరుకోవడానికి అమ్మానాన్న ఎన్నో త్యాగాలు చేశారు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాతో ఆడాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది. –నయోమి ఒసాకా నయోమి చాలా బాగా ఆడింది. ఆమెకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. మీరందరూ నాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారని తెలుసు. విజయార్హత ఉన్నవారికి గుర్తింపు ఇవ్వాలి. గేలి చేయడం మానేసి మీరందరూ నయోమిని అభినందించాలి. కోచ్ ప్యాట్రిక్ నాకు సలహాలు ఇచ్చానని అంగీకరించారు. కానీ సంకేతాలు ఇస్తున్నపుడు నేను ఆయనవైపు చూడలేదు. నాకు కోర్టులో కోచింగ్ తీసుకోవడం అలవాటు కూడా లేదు. గతంలో పురుష ప్లేయర్లు చైర్ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించారు. కానీ వారిపై ఎప్పుడూ గేమ్ పెనాల్టీ విధించలేదు. నేనిక్కడ మహిళల హక్కుల కోసం, వారి సమానత్వం కోసం పోరాడేందుకు ఉన్నాను. నాకు న్యాయం జరగకున్నా భవిష్యత్‌లో ఇతరులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. – సెరెనా