కోచ్‌తో ఒసాకా తెగదెంపులు | Naomi Osaka in shock split with German coach Sascha Bajin | Sakshi
Sakshi News home page

కోచ్‌తో ఒసాకా తెగదెంపులు

Published Wed, Feb 13 2019 3:42 AM | Last Updated on Wed, Feb 13 2019 3:42 AM

Naomi Osaka in shock split with German coach Sascha Bajin - Sakshi

టోక్యో: ప్రపంచ మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌ క్రీడాకారిణి నయోమి ఒసాకా (జపాన్‌) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించేలా తనను తీర్చిదిద్దిన కోచ్‌ సషా బాజిన్‌తో (జర్మనీ) తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి కారణాలు ఆమె వెల్లడించలేదు. ‘అందరికీ హాయ్‌. ఇక నుంచి కోచ్‌ సషా బాజిన్‌తో కలిసి నేను పనిచేయడంలేదు. ఇన్నాళ్లు ఆయన అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని 21 ఏళ్ల ఈ జపాన్‌ క్రీడాకారిణి తెలిపింది. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌తోపాటు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్స్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌), విక్టోరియా అజరెంకా (బెలారస్‌)లకు హిట్టింగ్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరించిన సషా బాజిన్‌ 2018 ఆరంభంలో నయోమి ఒసాకాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

అప్పటి వరకు కెరీర్‌లో ఒక్క టైటిల్‌ కూడా సాధించలేకపోయిన ఒసాకా... బాజిన్‌ శిక్షణలో రాటు దేలింది. 2018 మార్చిలో ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనా విలిమయ్స్‌ను మట్టికరిపించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌నూ గెల్చుకొని ఆసియా నుంచి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ‘ధన్యవాదాలు నయోమి. నీతో కలిసి పని చేసిన కాలం అద్భుతంగా సాగింది. దీంట్లో నన్నూ భాగం చేసినందుకు కృతజ్ఞతలు’ అని సషా బాజిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement