ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఆరంభ రౌండ్లలో సంచలనాలు నమోదైనా... చివరకు ఫైనల్లో మాత్రం కొత్త చాంపియన్‌గానీ, కొత్త చరిత్రగానీ లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. అమెరికన్ బ్రాడీ సంచలనానికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెండే సెట్లలో ఆటను ముగించింది. నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శనివారం మహిళల సింగిల్స్‌లో తుదిపోరు జరిగింది. కానీ చూసేవాళ్లెవరికీ ఇది ఫైనల్‌గా కనిపించనే లేదు. ఓ సాదాసీదా మ్యాచ్‌లా ఏకపక్షంగా ముగిసింది. జపాన్ స్టార్ మూడో సీడ్ నయోమి ఒసాకా టైటిల్ పోరుకు తన రాకెట్ పవర్‌తో వన్‌సైడ్ వార్‌గా మార్చేసింది. ఫైనల్లో ఆమె 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. గంటా 17 నిమిషాల్లోనే బ్రాడీ పనైపోయింది. ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. జపనీస్ భామ 2019లో కూడా మెల్‌బోర్న్ పార్క్‌లో టైటిల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఫటాఫట్‌గా ముగించింది...
ఒసాకా బుల్లెట్‌లా దూసుకొచ్చే ఏస్‌లతో బ్రాడీని చేష్టలుడిగేలా చేసింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని ఒక పాయింట్ అయినా గెలువనీయలేదు. మరుసటి గేమ్‌లో బ్రాడీ శ్రమించి సర్వీస్‌ను నిలబెట్టుకుంది. కానీ తర్వాత జపాన్ స్టార్ సర్వీస్‌తో పాటు బ్రేక్ పాయింట్ సాధించింది. బ్రాడీ కూడా తర్వాతి గేముల్లో దీటుగా బదులివ్వడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ దశలో ఒసాకా చకచకా రెండు పాయింట్లు సాధించి 41 నిమిషాల్లో 6–4 స్కోరుతో తొలిసెట్‌ను ముగించింది. ఇక రెండో సెట్‌లో ఒసాకా పదునైన షాట్లకు బదులివ్వలేకపోయిన బ్రాడీ సర్వీస్‌లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఒసాకా 4–0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌నే కోల్పోయే దశలో ఉన్నప్పటికీ అమెరికా స్టార్ కుంగిపోలేదు. ఐదో గేమ్‌లో చక్కని పోరాటం చేసి ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ గేమ్ సుదీర్ఘంగా సాగింది. తర్వాత తన సర్వీస్‌ను కొనసాగించిన బ్రాడీ కేవలం రెండు నిమిషాల్లోపే రెండో పాయింట్ సాధించింది. జాగ్రత్త పడిన ఒసాకా ఏడు, తొమ్మిదో గేముల్ని గెలుపొందడం ద్వారా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. రెండో సెట్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. ఓవరాల్‌గా 6 ఏసుల్ని సంధించిన ఒసాకా రెండు సార్లు డబుల్ ఫాల్ట్ చేసింది. 16 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన బ్రాడీ ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేయడంతో మ్యాచ్‌లో చిత్తయింది.
మెర్టెన్స్–సబలెంక జంటకు ‘డబుల్స్’
మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్ జోడీ 6–2, 6–3తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో టైటిల్ మెట్టుపై చతికిల బడిన క్రెజికొవా మిక్స్‌డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది.
జొకోవిచ్ వర్సెస్ మెద్వెదెవ్
► నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
►మ.గం.2 నుంచి సోనీలో ప్రత్యక్షప్రసారం
రెండేళ్లుగా మెల్‌బోర్న్ పార్క్‌లో టైటిల్ నిలబెట్టుకుంటున్న టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఇప్పుడు ‘హ్యాట్రిక్’ వేటకు సిద్ధమయ్యాడు. ఆసీస్ ఓపెన్‌లో ఈ టాప్‌సీడ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఓవరాల్‌గా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో దాదాపు సగం (8) టైటిల్స్ ఇక్కడే గెలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డును, సూపర్ ఫామ్‌లో ఉన్న మేటి ఆటగాడైన నొవాక్‌ను ఓడించడం రష్యన్ స్టార్ మెద్వెదెవ్‌కు అంత సులువేమీ కాదు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. నాలుగో సీడ్ మెద్వెదెవ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడేదే మొదటిసారి. సెర్బియన్ దిగ్గజానికి ఎందులోనూ సరితూగని ప్రత్యర్థి. అయితే ఫైనల్ చేరేందుకు అతను బాగానే కష్టపడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను, సెమీస్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్‌లను ఓడించి టైటిల్ బరిలో నిలిచాడు. కానీ కొండంత ప్రత్యర్థి ముందు ఈ కష్టం ఏమాత్రం నిలుస్తుందో మరి... ఎందుకంటే టైటిళ్ల పరంగా చూసినా... ఫైనల్స్ పరంగా చూసినా కూడా నొవాక్... మెద్వెదెవ్ కంటే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment