ఒసాకా అలవోకగా... | Australian Open: Naomi Osaka showcases power game in opener | Sakshi
Sakshi News home page

ఒసాకా అలవోకగా...

Published Tue, Jan 18 2022 5:04 AM | Last Updated on Tue, Jan 18 2022 5:04 AM

Australian Open: Naomi Osaka showcases power game in opener - Sakshi

మానసిక ఆందోళనతో గత ఏడాది ఇబ్బంది పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నయోమి ఒసాకా కొత్త సంవత్సరంలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా తొలి రౌండ్‌ అడ్డంకిని అలవోకగా దాటింది. అనవసర తప్పిదాలు చేసినా నిరాశకు లోనుకాకుండా నవ్వుతూ ఆడిన ఈ 14వ ర్యాంకర్‌ కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించింది.

మెల్‌బోర్న్‌: తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించిన నయోమి ఒసాకా (జపాన్‌), యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ చాంపియన్, 13వ సీడ్‌ ఒసాకా 6–3, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై, టాప్‌ సీడ్‌ బార్టీ 6–0, 6–1తో క్వాలిఫయర్‌ లెసియా సురెంకో (ఉక్రెయిన్‌)పై గెలిచారు.

ఒసోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 68 నిమిషాల్లో గెలిచింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఒసాకా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. నెట్‌ వద్దకు 15సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచిన ఒసాకా 28 అనవసర తప్పిదాలు చేసింది. సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో బార్టీ కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయింది.

నాదల్‌ బోణీ...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో మాజీ చాంపియన్, ఆరో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన నాదల్‌ తొలి రౌండ్‌లో 6–1, 6–4, 6–2తో మార్కోస్‌ గిరోన్‌ (అమెరికా)పై నెగ్గగా... కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉన్న జ్వెరెవ్‌ 7–6 (7/3), 6–1, 7–6 (7/1)తో అల్టామెర్‌ (జర్మనీ)పై గెలిచాడు. గిరోన్‌తో మ్యాచ్‌లో నాదల్‌ ఏడు ఏస్‌లు సంధించాడు.

నెట్‌ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. 34 విన్నర్స్‌ కొట్టిన నాదల్‌ 26 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12వ సీడ్‌ కామెరాన్‌ నోరి (బ్రిటన్‌) తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతోన్న సెబాస్టియన్‌ కోర్డా (అమెరికా) 6–3, 6–0, 6–4తో నోరిపై గెలిచాడు. ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ) 4–6, 6–2, 7–6 (7/5), 6–3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌) 6–2, 7–6 (7/3), 6–7 (5/7), 6–3తో జెరాసిమోవ్‌ (బెలారస్‌)పై నెగ్గారు.

కెనిన్‌కు షాక్‌...
మహిళల సింగిల్స్‌లో తొలి రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2020 చాంపియన్, 11వ సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా), 18వ సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 7–6 (7/2), 7–5తో కెనిన్‌ను ఓడించగా... ప్రపంచ 112వ ర్యాంకర్‌ కియాంగ్‌ వాంగ్‌ (చైనా) 6–4, 6–2తో కోకో గాఫ్‌పై గెలిచింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–0తో పెట్కోవిచ్‌ (జర్మనీ)పై, ఐదో సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) 6–4, 7–6 (7/2)తో తాత్యానా మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌) 6–4, 6–0తో ఐలా తొమ్లాజనోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement