మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదో రోజు పెను సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 14వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అమెరికాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్, 20 ఏళ్ల అమండా అనిసిమోవాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 6–4, 3–6, 6–7 (5/10)తో ఓడిపోయింది.
2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో సెట్‌లో ఒసాకా 5–4తో ఆధిక్యంలో ఉండి, అనిసిమోవా సర్వ్ చేసిన పదో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కూడా సంపాదించింది. అయితే ఈ రెండుసార్లూ మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న అనిసిమోవా తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమై టైబ్రేక్ అనివార్యమైంది.
టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి ఒసాకాను ఇంటిముఖం పట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా తలపడుతుంది. మూడో రౌండ్‌లో బార్టీ 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–0, 6–2తో 15వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–4, 6–4తో ఒస్టాపెంకో (లాత్వియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
శ్రమించిన నాదల్...
పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. 2 గంటల 50 నిమిషాల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 6–3, 6–2, 3–6, 6–1తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment