కోచ్ సషా బాజిన్‌తో నయోమి ఒసాకా
టోక్యో: ప్రపంచ మహిళల టెన్నిస్ నంబర్‌వన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా (జపాన్) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించేలా తనను తీర్చిదిద్దిన కోచ్ సషా బాజిన్‌తో (జర్మనీ) తెగదెంపులు చేసుకు న్నట్లు ప్రకటించింది. ‘అందరికీ హాయ్. ఇక నుంచి కోచ్ సషా బాజిన్‌తో కలసి పనిచేయడంలేదు. ఇన్నాళ్లూ ఆయన అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని 21 ఏళ్ల ఈ జపాన్ క్రీడాకారిణి తెలిపింది.
అమెరికా దిగ్గజం సెరెనాతోపాటు గ్రాండ్ స్లామ్ చాంపియన్స్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్), అజరెంకా (బెలారస్)కు హిట్టింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించిన బాజిన్ 2018 ఆరంభంలో ఒసాకాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి వరకు కెరీర్‌లో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయిన ఒసాకా... బాజిన్ శిక్షణలో రాటు దేలింది. 2018లో యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను మట్టికరిపించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌నూ గెల్చుకొని ఆసియా నుంచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ‘ధన్యవాదాలు నయోమి. నీతో కలిసి పని చేసిన కాలం అద్భుతంగా సాగింది. దీంట్లో నన్నూ భాగం చేసినందుకు కృతజ్ఞతలు’ అని సషా బాజిన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment