Womens Singles title
-
శ్రీజ ‘డబుల్’ ధమాకా
షిల్లాంగ్ (మేఘాలయ): కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ అందని ద్రాక్షగా ఉన్న జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎట్టకేలకు అందుకుంది. అంతేకాకుండా మహిళల డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. గత ఏడాది సింగిల్స్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్‌గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హైదరాబాద్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్లో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగింది. సోమవారం సాయంత్రం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్ స్టార్ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించింది. బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్ ఐదుసార్లు జాతీయ సింగిల్స్ చాంపియన్‌గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్‌గా గుర్తింపు పొంది ంది. సెమీఫైనల్లో శ్రీజ 12–10, 8–11, 11–8, 11–9, 3–11, 12–10తో అహిక ముఖర్జీ (ఆర్బీఐ) పై నెగ్గింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు చెందిన టకేమి సర్కార్–ప్రాప్తి సేన్ జోడీపై గెలిచింది. తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్ టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత వహించింది. గతంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరా బాద్‌కు చెందిన మీర్ ఖాసిమ్ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్‌గా నిలిచారు. నా కల నిజమైంది... గతంలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జాతీయ టైటిల్స్ సాధించాను. కానీ సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్ కావడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా విజయం త్వరలో మొదలయ్యే అంతర్జాతీయ సీజన్ లో మరింత మెరుగ్గా రాణించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. –‘సాక్షి’తో ఆకుల శ్రీజ -
భళా బార్టీ... 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు యాష్లే బార్టీ తెరదించింది. సొంతగడ్డపై ఆద్యంతం అద్వితీయ ఆటతీరు కనబరిచింది. ఫలితంగా 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆసీస్ క్రీడా కారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా తరఫున ఈ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా క్రిస్టినా ఒనీల్ నిలిచింది. ఆ తర్వాత 1980లో వెండీ టర్న్‌బుల్ ఫైనల్‌కు చేరినా చివరకు ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ ఓపెన్ (2021) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన బార్టీ యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటుంది. మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ స్థాయి... టాప్ సీడ్ హోదాకు తగ్గ ఆటతీరు ప్రదర్శించిన యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరిన తొలిసారే 25 ఏళ్ల బార్టీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 87 నిమిషాల్లో 6–3, 7–6 (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. ఈ టోర్నీ మొత్తంలో బార్టీ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. బార్టీ తన కెరీర్లో చేరిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఫ్రెంచ్, వింబుల్డన్, ఆస్ట్రేలియన్) విజేతగా నిలువడం విశేషం. మరోవైపు 28 ఏళ్ల కొలిన్స్‌కు కెరీర్లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో నిరాశ ఎదురైంది. చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీకి 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ కొలిన్స్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరో గేమ్‌లో బ్రేక్‌తో... ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా ఫైనల్ చేరిన బార్టీ తుది పోరులోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆరంభంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 2–2తో సమంగా నిలిచింది. ఐదో గేమ్‌లో బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం కొలిన్స్‌కు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఏస్‌తో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న బార్టీ ఆరో గేమ్‌లో కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బార్టీ రెండుసార్లు తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెల్చుకుంది. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి... రెండో సెట్లో కొలిన్స్ చెలరేగి రెండో గేమ్‌లో, ఆరో గేమ్‌లో బార్టీ సర్వీస్‌లను బ్రేక్ చేసి 5–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగు గేమ్‌లు వెనుకబడ్డా బార్టీ కంగారు పడలేదు. పట్టువిడవకుండా పోరాడి వరుసగా నాలుగు గేమ్‌లు సాధించి స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత 11వ గేమ్‌లో కొలిన్స్, 12వ గేమ్‌లో బార్టీ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బార్టీ పైచేయి సాధించింది. ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని బార్టీ విజయగర్జన చేసింది. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ మెద్వెదెవ్ (రష్యా) గీ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మధ్యాహ్నం గం. 2:00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 2:నలుగురు అమెరికా క్రీడాకారిణులు అనిసిమోవా, జెస్సికా పెగూలా, మాడిసన్ కీస్, కొలిన్స్లను ఓడించి యాష్లే బార్టీ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలువడం ఇది రెండోసారి. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచే క్రమంలో బార్టీ ఈ నలుగురినే ఓడించడం విశేషం. 7:ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఏడో క్రీడాకారిణి బార్టీ. గతంలో స్టెఫీ గ్రాఫ్ (1988, 1989, 1994), మేరీ పియర్స్ (1995), మార్టినా హింగిస్ (1997), లిండ్సే డావెన్‌పోర్ట్ (2000), షరపోవా (2008), సెరెనా (2017) ఈ ఘనత సాధించారు. 8:ఓపెన్ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ గెలుపుతో నా స్వప్నం సాకారమైంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఆస్ట్రేలియా పౌరురాలు అయినందుకు గర్వపడుతున్నాను. సొంత ప్రేక్షకుల నడుమ ఆడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శంచడానికి అభిమానుల మద్దతు కూడా కారణం. హార్డ్ కోర్టు, మట్టి కోర్టు, పచ్చిక కోర్టులపై మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచినా నా కెరీర్లో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. –యాష్లే బార్టీ -
French Open: క్వీన్ క్రిచికోవా
సింగిల్స్ విభాగంలో ఆడుతున్న ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా అద్భుతం చేసింది. ఎంతోమందికి తమ కెరీర్లో కలగానే మిగిలిపోయే ‘గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్’ను క్రిచికోవా సాకారం చేసుకుంది. డబుల్స్ స్పెషలిస్ట్ అయిన క్రిచికోవా గతంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సింగిల్స్ విభాగంలో ఆడినా నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది. పారిస్: వరుసగా ఆరో ఏడాది ఫ్రెంచ్ కోటలో కొత్త రాణికి కిరీటం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై గెలిచింది. గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. విజేత క్రిచికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే మహిళల డబుల్స్ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిస్తే 2000లో మేరీ పియర్స్ (ఫ్రాన్స్) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా క్రిచికోవా గుర్తింపు పొందుతుంది. పావ్లుచెంకోవాతో జరిగిన ఫైనల్లో క్రిచికోవా కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్ షాట్లు, డబుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్ రిపబ్లిక్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన నాలుగో ప్లేయర్ క్రిచికోవా. ఒస్టాపెంకో (లాత్వియా–2017), స్వియాటెక్ (పోలాండ్–2020) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మూడో క్రీడాకారిణి క్రిచికోవా. ఓవరాల్‌గా క్రిచికోవా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. తన దేశానికే చెందిన సినియకోవాతో కలిసి క్రిచికోవా 2018లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 వింబుల్డన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. -
Australian Open 2021: ఒసాకాదే ధమాకా
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఆరంభ రౌండ్లలో సంచలనాలు నమోదైనా... చివరకు ఫైనల్లో మాత్రం కొత్త చాంపియన్గానీ, కొత్త చరిత్రగానీ లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. అమెరికన్ బ్రాడీ సంచలనానికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెండే సెట్లలో ఆటను ముగించింది. నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం మహిళల సింగిల్స్‌లో తుదిపోరు జరిగింది. కానీ చూసేవాళ్లెవరికీ ఇది ఫైనల్‌గా కనిపించనే లేదు. ఓ సాదాసీదా మ్యాచ్‌లా ఏకపక్షంగా ముగిసింది. జపాన్ స్టార్ మూడో సీడ్ నయోమి ఒసాకా టైటిల్ పోరుకు తన రాకెట్ పవర్‌తో వన్‌సైడ్ వార్‌గా మార్చేసింది. ఫైనల్లో ఆమె 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. గంటా 17 నిమిషాల్లోనే బ్రాడీ పనైపోయింది. ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. జపనీస్ భామ 2019లో కూడా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఫటాఫట్‌గా ముగించింది... ఒసాకా బుల్లెట్లా దూసుకొచ్చే ఏస్‌లతో బ్రాడీని చేష్టలుడిగేలా చేసింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని ఒక పాయింట్ అయినా గెలువనీయలేదు. మరుసటి గేమ్‌లో బ్రాడీ శ్రమించి సర్వీస్‌ను నిలబెట్టుకుంది. కానీ తర్వాత జపాన్ స్టార్ సర్వీస్‌తో పాటు బ్రేక్ పాయింట్ సాధించింది. బ్రాడీ కూడా తర్వాతి గేముల్లో దీటుగా బదులివ్వడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ దశలో ఒసాకా చకచకా రెండు పాయింట్లు సాధించి 41 నిమిషాల్లో 6–4 స్కోరుతో తొలిసెట్‌ను ముగించింది. ఇక రెండో సెట్లో ఒసాకా పదునైన షాట్లకు బదులివ్వలేకపోయిన బ్రాడీ సర్వీస్‌లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఒసాకా 4–0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌నే కోల్పోయే దశలో ఉన్నప్పటికీ అమెరికా స్టార్ కుంగిపోలేదు. ఐదో గేమ్‌లో చక్కని పోరాటం చేసి ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ గేమ్ సుదీర్ఘంగా సాగింది. తర్వాత తన సర్వీస్‌ను కొనసాగించిన బ్రాడీ కేవలం రెండు నిమిషాల్లోపే రెండో పాయింట్ సాధించింది. జాగ్రత్త పడిన ఒసాకా ఏడు, తొమ్మిదో గేముల్ని గెలుపొందడం ద్వారా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. రెండో సెట్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. ఓవరాల్‌గా 6 ఏసుల్ని సంధించిన ఒసాకా రెండు సార్లు డబుల్ ఫాల్ట్ చేసింది. 16 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన బ్రాడీ ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేయడంతో మ్యాచ్‌లో చిత్తయింది. మెర్టెన్స్–సబలెంక జంటకు ‘డబుల్స్’ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్ జోడీ 6–2, 6–3తో చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో టైటిల్ మెట్టుపై చతికిల బడిన క్రెజికొవా మిక్స్డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది. జొకోవిచ్ వర్సెస్ మెద్వెదెవ్ ► నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ ►మ.గం.2 నుంచి సోనీలో ప్రత్యక్షప్రసారం రెండేళ్లుగా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ నిలబెట్టుకుంటున్న టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఇప్పుడు ‘హ్యాట్రిక్’ వేటకు సిద్ధమయ్యాడు. ఆసీస్ ఓపెన్‌లో ఈ టాప్‌సీడ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఓవరాల్‌గా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో దాదాపు సగం (8) టైటిల్స్ ఇక్కడే గెలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డును, సూపర్ ఫామ్‌లో ఉన్న మేటి ఆటగాడైన నొవాక్‌ను ఓడించడం రష్యన్ స్టార్ మెద్వెదెవ్కు అంత సులువేమీ కాదు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. నాలుగో సీడ్ మెద్వెదెవ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడేదే మొదటిసారి. సెర్బియన్ దిగ్గజానికి ఎందులోనూ సరితూగని ప్రత్యర్థి. అయితే ఫైనల్ చేరేందుకు అతను బాగానే కష్టపడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను, సెమీస్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్లను ఓడించి టైటిల్ బరిలో నిలిచాడు. కానీ కొండంత ప్రత్యర్థి ముందు ఈ కష్టం ఏమాత్రం నిలుస్తుందో మరి... ఎందుకంటే టైటిళ్ల పరంగా చూసినా... ఫైనల్స్ పరంగా చూసినా కూడా నొవాక్... మెద్వెదెవ్ కంటే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్నాడు. -
భళా బియాంక!
ఒకరి కల నిజమైంది. మరొకరి కల మళ్లీ చెదిరింది. ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే కెనడా టీనేజర్ బియాంకా ఆండ్రీస్కూ అద్భుతం చేసింది. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఆమె సొంతగడ్డపైనే ఓడించింది. మహిళల టెన్నిస్‌లో తన ఎంట్రీని ‘గ్రాండ్’గా చాటుకుంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు వచ్చిన నాలుగో ‘గ్రాండ్’ అవకాశాన్ని సెరెనా విలియమ్స్ చేజార్చుకుంది. న్యూయార్క్: వందలకొద్దీ మ్యాచ్‌ల అనుభవం ఉన్నా... రెండంకెల గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తమ ఖాతాలో ఉన్నా... రెండు దశాబ్దాల ఘనమైన కెరీర్ ఉన్నా... మరోసారి చాంపియన్ కావాలంటే, ట్రోఫీని ఒడిసి పట్టుకోవాలంటే అసలు సిసలు సమరంలో బాగా ఆడాల్సిందే. లేదంటే అనుభవం లేని వారి చేతుల్లోనూ పరాభవం తప్పదని యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వరుసగా రెండో ఏడాదీ రుజువైంది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ... తన జైత్రయాత్ర గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ కెనడా టీనేజర్ బియాంకా ఆండ్రీస్కూ యూఎస్ ఓపెన్‌లో ‘గ్రాండ్ ఫినిష్’ ఇచ్చింది. ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6–3, 7–5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. చాంపియన్ బియాంకాకు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి గేమ్‌లోనే బ్రేక్... ఒక్క యూఎస్ ఓపెన్లోనే 101 విజయాలు సాధించిన సెరెనాతో ఫైనల్ అంటే ఏ ప్రత్యర్థికైనా హడలే. కానీ 19 ఏళ్ల బియాంకా ముఖంలో అలాంటి ఛాయలు కనిపించలేదు. ఫైనల్ వేదిక ఆర్థర్ యాష్ స్టేడియం 26 వేల మంది ప్రేక్షకులతో హౌస్ఫుల్కాగా... అందులో సెరెనా అభిమానులు, ఆమెకు మద్దతు పలుకుతున్న వారే అధికంగా ఉన్నారు. అయితేనేం బియాంకా తొణకలేదు. మ్యాచ్ తొలి సెట్, తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి 19 ఏళ్ల ఈ కెనడా అమ్మాయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన బియాంకా ఆ తర్వాతా ఎక్కడా దూకుడు తగ్గించలేదు. బియాంకా ఆటతీరును పరిశీలిస్తే సెరెనాతో ఫైనల్లో ఎలా ఆడితే గెలుస్తారో అన్న విషయంపై పూర్తి హోంవర్క్ చేసినట్టు కనిపించింది. కచ్చితమైన సర్వీస్‌లు... పదునైన రిటర్న్‌లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు... ఇలా పక్కా ప్రణాళికతో ఆడిన బియాంక చూస్తుండగానే తొలి సెట్లోని తొమ్మిదో గేమ్‌లో మరోసారి సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 6–3తో గెల్చుకుంది. ఒత్తిడికి లోనై... బియాంక పుట్టకముందే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన సెరెనా తన అనుభవమంత వయస్సులేని ప్రత్యర్థి దూకుడు ముందు ఒత్తిడికి లోనైంది. కీలకమైన తొలి సర్వీస్‌లో తడబడటం... రెండో సర్వీస్‌లోనూ నిలకడలేమి... లెక్కలేనన్ని అనవసర తప్పిదాలతో సెరెనా ఆట సాగింది. మరోవైపు ప్రతి పాయింట్లో పూర్తి విశ్వాసంతో ఆడిన బియాంకా రెండో సెట్లోనూ చెలరేగిపోయింది. 5–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సెరెనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేసింది. కానీ బియాంక 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని.. 12వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. నా విజయానుభూతిని మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ ఏడాది నా కలలన్నీ నిజమయ్యాయి. ఈ అత్యున్నత వేదికపై సెరెనాలాంటి దిగ్గజంతో ఫైనల్ ఆడటం అద్భుతం. ఎవరితో, ఏ స్థాయి ప్రత్యర్థితో ఆడుతున్నాననే విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఎప్పటిలాగే నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. ఈ గొప్ప విజయం సాధించిన క్రమంలో ప్రతి అంశాన్ని నేను నియంత్రించిన తీరుపట్ల గర్వపడుతున్నాను. నా లక్ష్యం సాధ్యమైనన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం. ప్రపంచ నంబర్‌వన్ కావడం. ఈ గెలుపుతో వచ్చిన ప్రైజ్‌మనీని ఏంచేయాలో ఇంకా ఆలోచించలేదు. ఇంత భారీ మొత్తాన్ని నా జీవితంలో అందుకోలేదు. –బియాంక ఆండ్రీస్కూ ఈ టోర్నమెంట్ మొత్తంలో నేను ఆడిన చెత్త మ్యాచ్ ఇదే. నేనింకా బాగా ఆడాల్సింది. మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయడానికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నాను. ఇలా జరగడం ఎంతో అసహనం కలిగిస్తోంది. ఆమె రికార్డును అందుకోవడానికి నేను ఆడట్లేదు. గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడానికి ఆడుతున్నాను. తుది ఫలితంతో నేను సంతోషంగా లేను. నిజాయతీగా చెప్పాలంటే ఫైనల్లో నేను బాగా ఆడలేదు. ఫైనల్లో బియాంక చాలా అద్భుతంగా ఆడింది. ఆమె విజయంపట్ల గర్వపడుతున్నాను. –సెరెనా విలియమ్స్ 1: కెనడా తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్ బియాంక. గతంలో యూజిన్ బుషార్డ్ (2014 వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్), మిలోస్ రావ్‌నిచ్ (2016 వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్) రన్నరప్‌గా నిలిచారు. 2: కెరీర్లో ఆడిన నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలిచిన రెండో ప్లేయర్ బియాంక. గతంలో మోనికా సెలెస్ (1990లో ఫ్రెంచ్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించింది. 8: గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో సెరెనాను ఓడించిన ఎనిమిదో క్రీడాకారిణి బియాంక. గతంలో వీనస్ విలియమ్స్ (2 సార్లు–అమెరికా), షరపోవా (రష్యా), సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా), ఎంజెలిక్ కెర్బర్ (2 సార్లు–జర్మనీ), గార్బిన్ ముగురుజా (స్పెయిన్), నయోమి ఒసాకా (జపాన్), సిమోనా హలెప్ (రొమేనియా) ఈ ఘనత సాధించారు. 1: సెరెనా తన కెరీర్లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో (2018– వింబుల్డన్, యూఎస్ ఓపెన్; 2019– వింబుల్డన్, యూఎస్ ఓపెన్) ఓడింది. 5: తాజా విజయంతో నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో బియాంక తన కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌కు చేరుకుంటుంది. 8: తన కెరీర్లో టాప్–10 ర్యాంకింగ్స్‌లోని క్రీడాకారిణులతో తలపడిన ఎనిమిది సార్లూ బియాంకానే గెలుపొందడం విశేషం. ఈ ఏడాది ఓవరాల్‌గా బియాంక 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. -
సింధు స్వర్ణ ప్రపంచం
నిరీక్షణ ముగిసింది. పసిడి స్వప్నం సాకారమైంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బ్యాడ్మింటన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విశ్వకిరీటం మన సొంతమైంది. గత రెండు పర్యాయాల్లో పసిడి మెట్టుపై బోల్తా పడిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మూడో ప్రయత్నంలో తన బంగారు కలను నిజం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్ అమ్మాయి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో భారత్ తరఫున తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఘనతను సాధించింది. బాసెల్ (స్విట్జర్లాండ్): ఎట్టకేలకు తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ పసిడి కల నిజమైంది. ప్రత్యర్థిపై చిరుతలా విరుచుకుపడిన సింధు అనుకున్నది సాధించింది. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఆహా... ఏమి ఆట... తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు దూకుడుగానే ఆడింది. ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే చూపించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది. ఎక్కడా తగ్గలేదు... తొలి గేమ్ గెల్చుకున్న సింధు రెండో గేమ్‌లోనూ హడలెత్తించింది. ఒకుహారా ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసినట్లు కనిపించిన ఈ హైదరాబాదీ ఆటలో వైవిధ్యం కనబరిచింది. సింధు జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఏదశలోనూ ఒకుహారాకు అంతుచిక్కలేదు. నేరుగా ఒకుహారా శరీరంపై సింధు సంధించిన కొన్ని స్మాష్ షాట్లకు జపాన్ క్రీడాకారిణి వద్ద సమాధానమే లేకపోయింది. సింధు కొట్టిన స్మాష్‌లకు ఒకుహారా రిటర్న్ చేసినా ఆ స్మాష్‌ల వేగానికి కొన్నిసార్లు షటిల్స్ బయటకు వెళ్లిపోయాయి. ఫలితంగా రెండో గేమ్‌లో విరామానికి సింధు 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా సింధు ఆధిపత్యం కొనసాగించి క్రమం తప్పకుండా పాయింట్లు సాధించగా... ఒకుహారా పూర్తిగా డీలా పడిపోయింది. స్కోరు 20–7 వద్ద సింధు కొట్టిన స్మాష్ షాట్‌ను ఒకుçహారా రిటర్న్ చేయలేకపోవడంతో పాయింట్, గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ భారత స్టార్ కైవసం చేసుకుంది. 2006లో 21 పాయింట్ల విధానం ప్రవేశ పెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకపక్షంగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ ఇదే కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మొమోటా 21–9, 21–3తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. బాయ్ నజరానా రూ. 20 లక్షలు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాయిప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఆ పిలుపు... చెప్పలేని ఆనందం నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా సాక్షితో సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన సింధు... తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలకు రాకెట్‌తో సమాధానమిచ్చింది. ‘గొప్ప టోర్నీలు ఆడగలదు కానీ ఫైనల్స్ గెలవలేదు’ అని ధ్వజమెత్తిన విమర్శకుల నోళ్లన్నీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణంతో మూగబోయేలా చేసింది. ఇక నుంచి పట్టిందల్లా బంగారమే అనే స్థాయిలో బరిలో దిగుతానంటూ, గెలవాలనే స్ఫూర్తి తనలో నిరంతరం రగులుతూనే ఉంటుందంటూ స్విట్జర్లాండ్ నుంచి ‘సాక్షి క్రీడా ప్రతినిధి’తో ఫోన్లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే... ఈ విజయం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనుభూతి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. చివరికి ‘ప్రపంచ చాంపియన్’ అనే హోదా దక్కింది. రజతాలు, కాంస్యాలు ఎన్ని సాధించినా ... ‘సింధు ప్రపంచ చాంపియన్’ అనే పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. దీన్నిమించిన ఒలింపిక్స్ పతకమే ఉందిగా? ఈ విజయాన్ని ఒలింపిక్స్ పతకంతో పోల్చవద్దు. ఒలింపిక్స్ అత్యున్నత స్థాయి టోర్నీ అయినప్పటికీ ప్రపంచ ఈవెంట్ కూడా దీనికి తక్కువేమీ కాదు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. దేని విలువ దానిదే. ఈ టోర్నీ కోసం ఎలా సన్నద్ధమయ్యారు? కోచ్‌లు గోపీ సర్‌తో పాటు కిమ్ జి హ్యూన్ టోర్నీ కోసం నన్ను చాలా బాగా సిద్ధం చేశారు. వ్యూహాల్ని పక్కాగా అమలు చేశా. కొత్త ట్రెయినర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నా ఫిట్నెస్ మరో స్థాయికి చేరింది. గతంలో ర్యాలీలు ఆడాల్సినప్పుడు చాలా అలసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటున్నా. తదుపరి లక్ష్యం? టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. నేనెప్పుడు ఇక చాల్లే అని అనుకోలేదు. ఇంకా గెలవాలి, బాగా ఆడాలనే అనుకుంటా. ప్రతీ గెలుపు మరింత బాగా ఆడాలనే స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదా వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. నాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి మరింత బాగా ఆడాలి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కూడా సాధించాల్సి ఉంది. ప్రశంసల వెల్లువ.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన సింధుకు అభినందనలు. యావత్ దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఈ మీ విజయం లక్షలాది మందికి ప్రేరణగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. –రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి నీ ప్రదర్శనతో దేశం మొత్తం మళ్లీ గర్వపడేలా చేశావ్. ఆటపట్ల ఉన్న అంకితభావం, గెలవాలన్న కసి భావితరాల క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రపంచ చాంపియన్ షిప్లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌కు కూడా శుభాకాంక్షలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం సింధుకు శుభాకాంక్షలు. నీ విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. –కేసీఆర్, తెలంగాణ సీఎం సింధు... నీ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్విస్తోంది. – నరసింహన్, తెలంగాణ గవర్నర్ సింధుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాంపియన్స్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది. – కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించిన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి. –విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ గొప్ప ప్రదర్శన. ప్రపంచ చాంపియన్ అయినందుకు అభినందనలు. మరోసారి దేశం గర్వపడేలా చేశావ్. –సచిన్ టెండూల్కర్ సింధు అభినందనలు. అత్యద్భుత ప్రదర్శన చేశావ్. నీ ప్రదర్శన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. – కేటీఆర్, తెలంగాణ, బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు 2.0 ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు ఖాతాలో ఉన్నాయి. అంతకుమించి మూడేళ్ల క్రితమే ఒలింపిక్స్ రజత మాల తన మెడలో పడింది. ఇక సూపర్ సిరీస్ టోర్నీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవార్డులు, రివార్డులు... ఆర్జనలో మేటి అని ‘ఫోర్బ్స్’ అంకెలు అగ్ర తాంబూలమిస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో ఇన్ని ఘనతల తర్వాత మరో ప్లేయర్ అయితే తాము సాధించినదానితో సంతృప్తి పడిపోయేవారేమో... కొత్తగా స్ఫూర్తి పొందడానికి వారికి ఏమీ ఉండకపోయేదేమో. కానీ మన సింధు అలా అనుకోలేదు. ప్రపంచ వేదికపై ఆమె స్వర్ణదాహం తీరలేదు. అందుకే ఈసారి బంగారం పట్టాలని పట్టుదలగా బరిలోకి దిగింది. తై జు యింగ్‌పై క్వార్టర్స్‌లో అద్భుత విజయం తర్వాత ‘ఇంకా నా ఆట పూర్తి కాలేదు’ అంటూ సవాల్ విసిరిన సింధు మరో రెండు మ్యాచ్‌లలో అదే జోరు ప్రదర్శించింది. అందకుండా ఊరిస్తున్న పసిడిని తన ఖాతాలో వేసుకొని షటిల్ శిఖరాన నిలిచింది. ‘వరల్డ్’ అరంగేట్రంలోనే అదుర్స్... 2013లో సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఇద్దరు చైనా స్టార్లపై సాధించిన రెండు విజయాలు సింధు భవిష్యత్తును చూపించాయి. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ వాంగ్ యిహాన్‌ను, క్వార్టర్ ఫైనల్లో వాంగ్ షిజియాన్లను ఆమె అలవోకగా ఓడించింది. తర్వాతి ఏడాది కూడా షిజియాన్‌ను చిత్తు చేసి అప్పటి నుంచి చైనా మనకు ఏమాత్రం అడ్డుగోడ కాదని సింధు నిరూపించింది. టీనేజీ దాటకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్న సింధు తర్వాతి లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోయింది. 2015 కొంత నిరాశపర్చినా... తర్వాతి ఏడాది సింధు గర్జన ‘రియో’లో వినిపించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత ఈ తెలుగు తేజం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె విశ్వ సమరంలో పతకం గెలవకపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే అందులో విశేషం ఏమీ లేని స్థితికి చేరుకుంది! ఇలాంటి లెక్కలను సింధు నిజం చేసి చూపించింది. వరుసగా రెండేళ్లు 2017, 2018లలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు సత్తా వెండి వెన్నెల కురిపించింది. లోపాలపై దృష్టి పెట్టి... సహజంగానే సింధు ఈసారి స్వర్ణానికి గురి పెట్టింది. చెట్టు చిటారు కొమ్మన నిలిచిన పక్షిని కొడితే రజతంతో ఆగిపోవాల్సి వస్తోంది తప్ప బంగారం మెరుపు దక్కడం లేదు. అందుకే ఇప్పుడు పక్షి కన్నుపైకే గెలుపు బాణాన్ని సంధించింది. అందు కోసం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేకంగా తన లోపాలపై దృష్టి పెట్టి సాధన చేసింది. క్వార్టర్స్‌లో తై జుతో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. తొలి గేమ్‌ను చిత్తుగా కోల్పోయినా... తర్వాత చెలరేగింది. మ్యాచ్ ఆసాంతం చూస్తే ప్రత్యర్థి శరీరంపైకి స్మాష్‌లను సంధించడం సింధు ఆటలో కొత్త కోణం. చివర్లో ఒత్తిడిలో పడే సమస్య రాకుండా ఆరంభం నుంచే దూకుడుకు ప్రాధాన్యతనిచ్చింది. తన ఎత్తు కారణంగా డ్రాప్ షాట్లను రిటర్న్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందిని కూడా అధిగమించింది. తనకు స్మాష్ కొట్టే అవకాశం వచ్చే వరకు ప్రత్యర్థిని సాధ్యమైనంతగా ర్యాలీలతోనే ఆడించే ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. 360 డిగ్రీల కోణంలో చురుకైన కదలికలతో కోర్టు మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ మెగా టోర్నీలో సింధు ఆడిన ఆట నిజంగా సూపర్బ్. తదుపరి స్వర్ణ గురి ‘టోక్యోలో’... నిజానికి 2019లో సింధుకు గొప్ప ఫలితాలు ఏమీ రాలేదు. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో ఓడగా, ఆల్ ఇంగ్లండ్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇండియా ఓపెన్‌లో, సింగపూర్ ఓపెన్‌లోనూ సెమీస్‌కే పరిమితం కాగా, మలేసియా ఓపెన్‌లో కనీసం క్వార్ట ర్స్ ఆనందం కూడా దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్ ఓపెన్దీ అదే కథ. ఇండోనేసియాలో రన్నరప్‌గా నిలవడంతో కొంత సంతృప్తి దక్కగా, తర్వాతి వారమే జపాన్‌లో ఆనందం ఆవిరైంది. వరల్డ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం థాయిలాండ్ ఓపెన్‌కు దూరమైన ఈ హైదరాబాదీ చివరకు తన లక్ష్యాన్ని చేరింది. తాజా ఫామ్, సర్క్యూట్లో ఉన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే మరో ఒలింపిక్ పతకం సింధు కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. బ్రెజిల్ గడ్డపై చేజారిన కనకపు హారాన్ని టోక్యోలో వరిస్తే భారత అభిమానులకు కావాల్సిందేముంది! చాలా గర్వంగా ఉంది సింధు ఫైనల్స్‌లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. – పీవీ రమణ (సింధు తండ్రి) అమ్మకు అంకితం... హైదరాబాద్‌కు వచ్చాకే సంబరాలు చేసుకుంటా. ప్రస్తుతం టీమ్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నా. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు. తనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని ఆమెకు ఇస్తున్నా. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. –పీవీ సింధు –సాక్షి క్రీడావిభాగం -
గాయత్రి డబుల్ ధమాకా
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్‌పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్‌ను అందుకుంది. డబుల్స్ టైటిల్‌పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్డ్ డబుల్స్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి. -
ముగురుజా మురిసె...
♦ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం ♦ ఫైనల్లో వీనస్‌పై విజయం ♦ రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం అనుభవంపై పట్టుదల గెలిచింది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఐదుసార్లు చాంపియన్, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల ముగురుజా కళ్లు చెదిరే ఆటతీరును ప్రదర్శించింది. ఆరోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సాధించడంతోపాటు ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించాలని ఆశించిన వీనస్‌కు నిరాశే మిగిలింది. లండన్: తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలైనా... వింబుల్డన్ గ్రాస్‌కోర్టులపై అద్భుత రికార్డు కలిగినా... అవేమీ పట్టించుకోకుండా స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా ఒక వ్యూహం ప్రకారం ఆడింది. వీనస్‌ను ఎక్కువ భాగం బేస్‌లైన్‌కే పరిమితం చేస్తూ... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ... అనవసర తప్పిదాలు చేసేలా ఆడుతూ ముగురుజా అనుకున్న ఫలితాన్ని సాధించింది. రెండేళ్ల క్రితం వింబుల్డన్ సెంటర్ కోర్టులో సెరెనా విలియమ్స్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి... ఈసారి అదే వేదికపై సెరెనా అక్క వీనస్‌పై ముగురుజా ప్రతీకారం తీర్చుకుంది. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్ ముగురుజా 7–5, 6–0తో పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్ ఆడిన వీనస్ నాలుగోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తాజా విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లను ఓడించిన ఏకైక క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి ముగురుజా చాంపియన్‌గా నిలిచింది. కొంచిటా మార్టినెజ్ (1994లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా ఘనత వహించింది. ఈ టోర్నీలో ముగురుజాకు కొంచిటా కోచ్‌గా ఉండటం మరో విశేషం. బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో తొలి సెట్ ఆసక్తికరంగా సాగింది. స్కోరు 5–4 వద్ద ఉన్నపుడు ముగురుజా సర్వీస్‌లో వీనస్‌కు రెండు సెట్ పాయింట్లు లభించాయి. అయితే ముగురుజా కచ్చితమైన సర్వీస్‌లు చేసి ఈ గేమ్‌ను కాపాడుకుంది. దాంతో స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో ముగురుజా పూర్తి ఆధిపత్యం చలాయించింది. మూడుసార్లు వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌లను కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తం లో ముగురుజా 14 విన్నర్స్ కొట్టి, 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు వీనస్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. సిలిచ్ @ ఫెడరర్ నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సింధు సాధించెన్...
► కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ చైనా ఓపెన్ టైటిల్ హస్తగతం ► ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు ► ఫైనల్లో సున్ యుపై విజయం రూ. 35 లక్షల 79 వేల ప్రైజ్‌మనీ సొంతం అచిరకాలంలోనే అంతర్జాతీయస్థాయిలో రాకెట్ వేగంతో దూసుకొచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కెరీర్లో మరో గొప్ప విజయం చేరింది. ఇన్నాళ్లూ లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను ఈ హైదరాబాద్ అమ్మాయి తన ఖాతాలో జమచేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తిరుగులేని శక్తిగా పేరొందిన చైనా గడ్డపై చైనా ప్లేయర్‌నే ఓడించిన సింధు మరో చిరస్మరణీయ విజయం నమోదు చేసి ఔరా అనిపించింది. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా సింధు గుర్తింపు పొందింది. ఫుజు (చైనా): రియో ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకం జ్ఞాపకాలు ఇంకా మదిలో తాజాగా ఉండగానే... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో సంచలనం సృష్టించింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను సాధించి అబ్బురపరిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11తో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)పై విజయం సాధించింది. తద్వారా 30 ఏళ్ల చరిత్ర ఉన్న చైనా ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో చైనాయేతర క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది. గతం లో వోంగ్ మ్యూ చూ (మలేసియా-2007లో), సైనా నెహ్వాల్ (భారత్-2014లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. రియో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న రెండు సూపర్ సిరీస్ టోర్నీలలో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సింధు మూడో టోర్నీలో మాత్రం మెరిసింది. తాను పూర్తిస్థాయి ఫామ్‌లో ఉంటే గొప్ప విజయాలు సాధించడం కష్టమేమీకాదని మరోసారి నిరూపించింది. విజేత సింధుకు 52,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 79 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆడిన రెండో సూపర్ సిరీస్ ప్రీమియర్ ఫైనల్లోనే సింధుకు టైటిల్ దక్కడం విశేషం. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో తొలిసారి సింధు ఫైనల్‌కు చేరగా... చైనా ప్లేయర్ లీ జురుయ్ చేతిలో ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచింది. ఆద్యంతం దూకుడు... సున్ యుతో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోరుున సింధు ఈసారి మాత్రం ఎలాంటి తడబాటుకు లోనుకాలేదు. సొంతగడ్డపై సున్ యు ఆడుతున్నప్పటికీ... సింధు మాత్రం తన సహజశైలిలో దూకుడుగా ఆడుతూ నిలకడగా పారుుంట్లు సాధించింది. అవసరమైనపుడు ర్యాలీలు ఆడిస్తూనే అవకాశం దొరకగానే సింధు కళ్లు చెదిరే స్మాష్‌లతో సున్ యును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలో వరుసగా ఐదు పారుుంట్లు నెగ్గిన సింధు 17-8తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. సింధు 20-8తో ఆధిక్యంలోకి వెళ్లిన దశలో అనవసర తప్పిదాలతో మూడు పారుుంట్లు కోల్పోరుునా... ఆ వెంటనే స్మాష్ షాట్‌తో పారుుంట్ నెగ్గి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాకపోవడం సింధు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఆధిక్యం చేజార్చుకొని... తొలి గేమ్ సాధించిన ఉత్సాహంతో రెండో గేమ్‌లో కూడా సింధు జోరును కొనసాగించింది. తొలుత 6-3తో, ఆ తర్వాత 11-7తో, 14-10తో సింధు ఆధిక్యంలో నిలిచింది. అరుుతే ఈ దశలో సున్ యు తన వ్యూహాలను మార్చుకొని ఆడింది. వరుసగా నాలుగు పారుుంట్లు గెలిచి స్కోరును 14-14తో సమం చేసింది. సింధు కూడా అనవసర తప్పిదాలు చేయడంతో సున్ యు రెండో గేమ్‌ను 21-17తో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మళ్లీ జోరు... మూడో గేమ్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా ఆడేందుకు ప్రయత్నించింది. విరామ సమయానికి 11-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించడం, సున్ యు కూడా తప్పిదాలు చేయడంతో భారత స్టార్ ఖాతాలో క్రమం తప్పకుండా పారుుంట్లు చేరారుు. దాంతో సింధు 19-11తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు పారుుంట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. చైనాకు చేదు ఫలితాలు... ఈసారి చైనా ఓపెన్ చైనా క్రీడాకారులకు ఏమాత్రం కలిసిరాలేదు. ఐదు విభాగాలకుగాను నాలుగింటిలో చైనా ఆటగాళ్లు ఫైనల్స్‌కు చేరారు. అరుుతే ఒక్క విభాగంలోనూ చైనాకు టైటిల్ దక్కకపోవడం గమనార్హం. 1986లో మొదలైన చైనా ఓపెన్‌లో చైనా క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించకపోవడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) 22-20, 21-13తో చెన్ లాంగ్ (చైనా)పై గెలిచి విజేతగా నిలిచాడు. డబుల్స్ టైటిల్ మార్కస్ గిడియోన్-కెవిన్ సంజయ (ఇండోనేసియా) జంట నెగ్గగా... మహిళల డబుల్స్‌లో చాంగ్ యె నా-లీ సో హీ (కొరియా) జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో తొంతొవీ అహ్మద్-లిలియానా నాత్సిర్ (ఇండోనేసియా) ద్వయం చాంపియన్‌గా నిలిచింది. నంబర్‌వన్ ర్యాంక్ మిగిలింది... తాజా విజయంతో సింధు కెరీర్లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్ కూడా చేరిపోరుుంది. దాంతో ఈ 21 ఏళ్ల హైదరాబాద్ అమ్మారుు బ్యాడ్మింటన్‌లో పేరున్న అన్ని టోర్నీల్లోనూ పతకాలు గెలిచినట్టరుుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్లో రెండు కాంస్యాలు, ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో కాంస్యం, కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత కాంస్యం, గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్... ఇప్పుడు సూపర్ సిరీస్ టైటిల్. మొత్తానికి సింధు సీనియర్ అంతర్జాతీయస్థారుులో ఆడటం మొదలుపెట్టిన మూడేళ్లలోనే అద్భుత విజయాలు సాధించింది. ఇక సింధు కెరీర్లో మిగిలిన లక్ష్యం ప్రపంచ నంబర్‌వన్ కావడమే. గత నెలలో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరిన సింధు ఆ తర్వాత టాప్-10 నుంచి బయటకు వచ్చేసింది. అరుుతే చైనా ఓపెన్ టైటిల్‌తో సింధు మళ్లీ టాప్-10లోకి వచ్చే అవకాశముంది. అభినందనల వెల్లువ న్యూఢిల్లీ: చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తారుు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘అద్భుతంగా ఆడావు సింధు.. చైనా ఓపెన్ గెలిచినందుకు శుభాభివందనాలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. పీవీ సింధు తన కెరీర్లో తొలిసారిగా చైనా ఓపెన్ గెలిచి దేశం గర్వించేలా చేసిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అలాగే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె.తారకరామారావు కూడా సింధు విజయాన్ని ట్విట్టర్లో అభినందించారు. చైనా ఓపెన్ టైటిల్ అందుకున్న సింధుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. తొలి మ్యాచ్ నుంచి గొప్ప ప్రతిభ కనబరించిందని ప్రశంసించారు. బలమైన ప్రత్యర్థుల నుంచి ఎదురైన పోటీని సమర్థవంతంగా అధిగమించిందని కొనియాడారు. భవిష్యత్‌లోనూ సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సింధు చాలా గొప్ప విజయం సాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్‌తో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ కూడా సింధును కొనియాడారు. ► కెరీర్లో ఇప్పటి వరకు సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకోలేకపోయానని మనసులో ఏదో ఒక మూల సింధులో కూడా కాస్త వెలితిగా ఉండేది. ఇప్పుడు ఆ లోటు తీరటంతో ఆమెపై భారం తొలగిపోరుుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె చాలా బాగా ఆడింది. ప్రపంచంలో వేర్వేరు వేదికలపై రాణించగలగడం మంచి పరిణామం. ఇందు కోసం ఆమె చాలా కష్టపడింది. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారిణులలో ఒకరిగా నిలవాలంటే నిలకడగా విజయాలు సాధించడం అవసరం. ఆమె ఆటలో ఎదుగుతున్న తీరు సంతోషం కలిగిస్తోంది. గత కొన్ని వారాల్లో విరామం లేకుండా సన్మాన కార్యక్రమాలు ఉన్నా సరే... ప్రాక్టీస్ కోసం కూడా తగినంత సమయం ఇచ్చి శ్రమించింది. ఇందులో సింధు గొప్పతనంతో పాటు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. - పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ► రియో ఒలింపిక్స్ రజతం తర్వాత మళ్లీ ఇప్పుడు సూపర్ సిరీస్ టోర్నీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రియో తర్వాత ఆడిన రెండు టోర్నీల్లోనూ విఫలమయ్యాను. డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్లలో బాగానే ఆడినా కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా మ్యాచ్‌లు కోల్పోవాల్సి వచ్చింది. వాటిని సరిదిద్దుకొని ఈసారి చైనాలో బరిలోకి దిగాను. దాని ఫలితం కనిపించింది. ఇది నా తొలి సూపర్ సిరీస్ టైటిల్ కావడం కూడా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఒలింపిక్స్ స్థారుు గెలుపు తర్వాత తక్కువ వ్యవధిలోనే మరో పెద్ద టైటిల్ గెలుచుకోగలిగాను. ఇందు కోసం చాలా కష్టపడ్డాను. ఫైనల్ ప్రత్యర్థితో చాలా కాలం తర్వాత తలపడ్డాను. రెండో గేమ్ కోల్పోయాక చివరి గేమ్‌లో మరింత బాగా ఆడాల్సి వచ్చింది. విరామం సమయంలో ఆధిక్యం వచ్చిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఫైనల్‌తో పోలిస్తే సుంగ్ జీ హున్‌తో సెమీస్ మ్యాచే కఠినంగా సాగింది. -ఫుజు నుంచి ‘సాక్షి’తో పీవీ సింధు -
నలందా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం
క్రీడలు ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను చైనాకు చెందిన చెన్‌లాంగ్ గెలుచుకున్నాడు. ఆగస్టు 31న కోపెన్‌హెగెన్‌లో జరిగిన ఫైనల్లో మలేషియాకు చెందిన లీచోంగ్‌వీ నిచెన్లాంగ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్ (స్పెయిన్) గెలుచుకుంది. ఫైన ల్లో జురుయ్ లీ (చైనా)ను ఓడించింది. స్పెయిన్ క్రీడాకారిణి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన పి.వి. సింధు వరుసగా రెండో ఏడాదీ కాంస్యం నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది. యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 26న అతుల్‌వర్మ భారత్‌కు రెండో పతకం అందించాడు. వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో అతుల్ కాంస్యం గెలుచుకున్నాడు. క్రీడా పురస్కారాల ప్రదానం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ క్రీడా అవార్డులను ప్రదానం చేశారు. వివరాలు.. 15 మందికి 2014 అర్జున అవార్డులను అందజేశారు. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ (క్రికెట్), పూజారి మమత (కబడ్డీ), సునీల్‌కుమార్ రాణా (రెజ్లింగ్) ఉన్నారు. ద్రోణాచార్యగ్రహీతలు: గురుచరణ్ సింగ్ గోగి (జూడో), మనోహరన్ (బాక్సింగ్), జోసె జాకబ్ (రోయింగ్), లింగప్ప (అథ్లెటిక్స్), మహావీర్ ప్రసాద్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: గుర్మిల్ సింగ్ (హాకీ), కేపీ ఠక్కర్ (స్విమ్మింగ్-డైవింగ్), జీషణ్ అలీ (టెన్నిస్). హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవాన్ని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. జైపూర్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ టైటిల్ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు గెలుచుకుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు చెందిన ఈ జట్టు ఆగస్టు 31న జరిగిన ఫైనల్లో యు ముంబై జట్టును ఓడించింది. పాట్నా పైరేట్స్ మూడో స్థానంలో నిలిచింది. జాతీయం జన్-ధన్ యోజన ప్రారంభం దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమం కింద తొలిరోజే 1.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు కల్పించారు. ఈ పథకం కింద 2015 జనవరి 26లోగా 7.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతా సౌకర్యాలు కల్పిస్తారు. కనీస పెన్షన్ రూ. 1000 ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ రూ. 1,000గా నిర్ణయిస్తూ కేంద్రం ఆగస్టు 29న నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే సామాజిక భద్రత పథకాల కింద ఈపీఎఫ్ చందాదారుల వేతన పరిమితిని రూ. 15,000గా నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. స్మార్ట్ హెరిటేజ్ సిటీగా వారణాసి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాన్ని స్మార్ట్ హెరిటేజ్ సిటీగా రూపొందించేందుకు భారత్-జపాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందంపై ఆగస్టు 30న భారత రాయబారి దీపా వాద్వా, క్యోటో నగర మేయర్ దైసా కడోకోవాలు సంతకాలు చేశారు. దేశంలో 100 స్మార్ట్ సిటీల కార్యాచరణకు వారణాసితో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారణాసిని క్యోటో నగరం తరహాలో స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతారు. కాలదోషం పట్టిన చట్టాల సమీక్ష ప్రభుత్వ పాలనలో ఇబ్బందికరంగా పరిణమించిన.. నిరుపయోగ, కాలదోషం పట్టిన చట్టాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 27న కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని కార్యాలయ కార్యదర్శి ఆర్.రామానుజం, పాలనా విభాగం మాజీ కార్యదర్శి వీకే భాసిన్ ఇందులో ఉంటారు. ఈ కమిటీ దేశంలోని చట్టాలను పరిశీలించి.. వాటిల్లో గత పది, పదిహేనేళ్లుగా సరిగా అమల్లో లేని, కాలదోషం పట్టిన చట్టాలను గుర్తిస్తుంది. డాట్ భారత్ డొమైన్‌ను ప్రారంభించిన కేంద్రం దేవనాగరి లిపిలో కొత్త డొమైన్ డాట్ భారత్‌ను కేంద్రం న్యూఢిల్లీలో ఆగస్టు 27న ప్రారంభించింది. ఈ డొమైన్ హిందీ, బోడో, డోగ్రీ, కొంకణ్, మైథిలీ, మరాఠీ, నేపాలీ, సింధీ వంటి ఎనిమిది భాషల్లో ఉంటుంది. సామాజిక మీడియాతో ప్రజల్ని అనుసంధానించేందుకు, ముఖ్యంగా ఇంగ్లిష్ పరిచయం లేనివారికి ప్రాంతీయ భాషల్లో విషయాలు అందించడమే లక్ష్యంగా డాట్ భారత్ (.ఆజ్చిట్చ్ట) ను సృష్టించారు. నలందాలో తరగతులు ప్రారంభం ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలు దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో 821 సంవత్సరాల తర్వాత మళ్లీ లాంఛనంగా సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వర్సిటీని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. పార్లమెంటు ఆమోదించిన నలందా వర్సిటీ చట్టం ద్వారా ఈ వర్సిటీ తిరిగి ఉనికిలోకి వచ్చింది. ఆరో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైన నలందా విశ్వవిద్యాలయాన్ని టర్కీ సైన్యం 1193లో కొల్లగొట్టి ధ్వంసం చేయడంతో మూతపడింది. నలందా యూనివర్సిటీని లాంఛనంగా సెప్టెంబర్ 14న ప్రారంభిస్తారు. అంతర్జాతీయం కంచె నిర్మాణానికి భారత్ నిర్ణయం బంగ్లాదేశ్ జలాల మీద సింగపూర్ నమూనా (స్కిడ్ మెరైన్ హెడ్జ్ మోడల్)లో కంచె నిర్మించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతంలో నదులు, చిత్తడి నేలతో నిండి ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వం ఆ నీటిపై కంచెను ఏర్పాటు చే యాలని భావిస్తోంది. కంచె నిర్మాణం పూర్తయితే దేశంలోకి వలసదారుల చొరబాటుకు అడ్డుకట్ట పడుతుంది. ప్రధాని మోడీ జపాన్ పర్యటన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనలో సెప్టెంబర్ 1న ఆ దేశ ప్రధాని షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ, కాలుష్య రహిత ఇంధనం, రహదారుల నిర్మాణం, ఆరోగ్యం, మహిళా సంక్షేమ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జపాన్ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను రూ. 2,10,000 కోట్లకు పెంచేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని స్మార్ట్‌సిటీల నిర్మాణం, జల సంరక్షణ, గంగా నదితోపాటు ఇతర నదుల ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధి, తయారీ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి రంగా ల్లో పెడతారు. 1998లో అణు పరీక్షల అనంతరం భారత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు జపాన్ ప్రకటించింది. గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ ఇజ్రాయెల్, పాలస్తీనాల అంగీకారంతో గాజాలో ఆగస్టు 26 నుంచి దీర్ఘకాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. గాజాలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు, దాడుల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల పునర్మిణానికి వీలుగా దిగ్బంధాన్ని తొలగించేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ-మెయిల్‌కు 32 ఏళ్లు సమాచార రంగంలో విప్లవాత్మకమై.. నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడకంలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈ-మెయిల్)కు ఈ ఏడాది ఆగస్టు 30తో 32 ఏళ్లు నిండాయి. అవార్డులు పాకిస్థాన్ మహిళకు పీటర్ మాక్లేర్ అవార్డు ధైర్య సాహసాలు, నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి ఇచ్చే పీటర్ మాక్లేర్ అవార్డు-2014 పాకిస్థాన్ తొలి మహిళా వార్ కరస్పాండెంట్, టీవీ వ్యాఖ్యాత అస్మా షిరాజికి లభించింది. షిరాజి 2006 ఇజ్రాయెల్-లెబనాన్ పోరాటం, 2009లో పాక్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో తాలిబన్ యుద్ధం, 2007లో జనరల్ ముషారఫ్ ఎమర్జెన్సీ పాలన వంటి సంఘటనలపై ఆమె వార్తా సమాచారం అందించారు. ఈ అవార్డును 2008లో ఏజెన్సీ ఫ్రాన్సి-ప్రెస్సి జర్నలిస్ట్ పీటర్ మాక్లేర్ పేరిట ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం అందుకున్న రెండో మహిళ షిరాజి. బెలఫాంటెకు హ్యుమానిటేరియన్ ఆస్కార్ అమెరికాకు చెందిన నటుడు, గాయకుడు హ్యారీ బెలఫాంటెకు జీన్ హెర్షాల్ట్ హ్యుమానిటేరియన్ ఆస్కార్ అవార్డు లభించింది. మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ అకాడమీ అందించే మూడు జీవిత కాల సాఫల్య పురస్కారాల్లో ఈ అవార్డు ఒకటి. బెలఫాంటె ఎయిడ్స్ నివారణ, విద్య, పౌర హక్కుల రక్షణతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ నిర్వహించిన లాంగ్‌మార్చ్‌కు మద్దతు తెలిపారు. 1987లో యూనిసెఫ్ సౌహార్థ్ర రాయబారి (గుడ్‌విల్ అంబాసిడర్)గా వ్యవహరించారు. రాజీవ్‌గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులు 2012 సంవత్సరానికి రాజీవ్‌గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆగస్టు 26న ప్రకటించింది. వివరాలు.. బెస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు (అన్నింటా ఉత్తమం)ను రైలు చక్రాల కర్మాగారానికి(బెంగళూరు) దక్కింది. పెద్ద సేవా సంస్థల కేటగిరీలో టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-హైదరాబాద్, పెద్ద తరహా ఉత్పత్తి పరిశ్రమ విభాగంలో శక్తి మసాలా ప్రైవేట్ లిమిటెడ్ -తమిళనాడు, చిన్న తరహా ఉత్పత్తి పరిశ్రమ కేటగిరీలో ఎలీన్ గృహోపకరణాల లిమిటెడ్ -హిమాచల్ ప్రదేశ్‌లకు అవార్డులు లభించాయి. యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , పాకిస్థాన్ జర్నలిస్టు రీమా అబాసీ సహా 24 మంది ఐదో రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికయ్యారు. కేన్సర్ నివారణ ప్రచారంలో విశేష కృషికి గాను యువరాజ్ స్థాపించిన ‘యువీకెన్’ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ అవార్డు లభించింది. ‘హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ పాకిస్థాన్: ఏ కాల్ టు కాన్సైన్స్(పాకిస్థాన్‌లో చారిత్రక దేవాలయాలు: అంతరాత్మకు పిలుపు)’ అనే గ్రంథం ద్వారా పాకిస్థాన్‌లోని దేవాలయాల ఖ్యాతిని చాటినందుకు రీమా అబాసీని ఈ అవార్డు వరించింది. వార్తల్లో వ్యక్తులు ఈయూ అధ్యక్షుడిగా డోనాల్డ్ టుస్క్ పోలెండ్ ప్రధాన మంత్రి డోనాల్డ్ టుస్క్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్షుడిగా ఆగస్టు 30న ఎన్నికయ్యారు. ఇటలీ విదేశాంగ మంత్రి ఫెడరికా మొగెరినీని విదేశాంగ విధాన అధిపతిగా వ్యవహరిస్తారు. మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు రాజస్థాన్ గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వాజూభాయ్ రూడాభాయ్‌వాలాను కర్ణాటక, మృదులా సిన్హాను గోవా గవర్నర్లుగా నియమితులయ్యారు. బిపిన్ చంద్ర మృతి ఆధునిక భారతదేశ చరిత్రను సాధారణ ప్రజలకు చేరువ చేసిన ప్రముఖ చరిత్ర కారుడు బిపిన్ చంద్ర(86) అనారోగ్యంతో ఆగస్టు 30న గుర్గావ్లో తుదిశ్వాస విడిచారు. 1928లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో జన్మించారు. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ’, ‘ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం’, ‘నేషనలిజం అండ్ కలోనియలిజం ఇన్ మోడరన్ ఇండియా’, ‘ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ’, ‘ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్’ తదితరాలు ఆయన రచనల్లో కొన్ని. ఇంటర్ పోల్ అంబాసిడర్‌గా షారుక్‌ఖాన్ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ ఆగస్టు 28న ఎంపికయ్యారు. దీంతో ఇంటర్‌పోల్ ప్రచారకర్తగా ఎంపికైన తొలి భారతీయ నటుడిగా ఖాన్ గుర్తింపు పొందారు. బీబీసీకి తొలి మహిళా చైర్ పర్సన్ రోనా బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కు తొలి మహిళాచైర్ పర్సన్‌గా రోనా ఫెయిర్ హెడ్ ఆగస్టు 30న నియమితులయ్యారు. రాష్ట్రీయంబాపు మృతి ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాపు (81) చెన్నైలో ఆగస్టు 31న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని కంతేరు. బాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిచిత్రం సాక్షి (1967). 2013లో బాపుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఏపీ రాజధానిపై హోంశాఖకు నివేదిక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 27న న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక అందించింది. కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి వివిధ ప్రాంతాల్లో పలువురి అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది. రాజధాని ఏర్పాటుపై ఆయా ప్రాంతాల్లో అనుకూల, ప్రతికూలత నివేదికలను సిద్ధం చేసింది.