బర్బోర క్రిచికోవా, రన్నరప్ ట్రోఫీతో పావ్లుచెంకోవా
సింగిల్స్ విభాగంలో ఆడుతున్న ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా అద్భుతం చేసింది. ఎంతోమందికి తమ కెరీర్‌లో కలగానే మిగిలిపోయే ‘గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్’ను క్రిచికోవా సాకారం చేసుకుంది. డబుల్స్ స్పెషలిస్ట్ అయిన క్రిచికోవా గతంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సింగిల్స్ విభాగంలో ఆడినా నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది.
పారిస్: వరుసగా ఆరో ఏడాది ఫ్రెంచ్ కోటలో కొత్త రాణికి కిరీటం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై గెలిచింది.
గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. విజేత క్రిచికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే మహిళల డబుల్స్ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిస్తే 2000లో మేరీ పియర్స్ (ఫ్రాన్స్) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా క్రిచికోవా గుర్తింపు పొందుతుంది. పావ్లుచెంకోవాతో జరిగిన ఫైనల్లో క్రిచికోవా కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్ షాట్‌లు, డబుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌లు, ఫోర్‌హ్యాండ్ షాట్‌లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది.
హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్ రిపబ్లిక్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన నాలుగో ప్లేయర్ క్రిచికోవా.
ఒస్టాపెంకో (లాత్వియా–2017), స్వియాటెక్ (పోలాండ్–2020) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన
మూడో క్రీడాకారిణి క్రిచికోవా.
ఓవరాల్‌గా క్రిచికోవా కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. తన దేశానికే చెందిన సినియకోవాతో కలిసి క్రిచికోవా 2018లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 వింబుల్డన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment