ముగురుజా మురిసె...
♦ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం
♦ ఫైనల్లో వీనస్‌పై విజయం
♦ రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
అనుభవంపై పట్టుదల గెలిచింది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఐదుసార్లు చాంపియన్, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల ముగురుజా కళ్లు చెదిరే ఆటతీరును ప్రదర్శించింది. ఆరోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సాధించడంతోపాటు ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించాలని ఆశించిన వీనస్‌కు నిరాశే మిగిలింది.
లండన్: తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలైనా... వింబుల్డన్ గ్రాస్‌కోర్టులపై అద్భుత రికార్డు కలిగినా... అవేమీ పట్టించుకోకుండా స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా ఒక వ్యూహం ప్రకారం ఆడింది. వీనస్‌ను ఎక్కువ భాగం బేస్‌లైన్‌కే పరిమితం చేస్తూ... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ... అనవసర తప్పిదాలు చేసేలా ఆడుతూ ముగురుజా అనుకున్న ఫలితాన్ని సాధించింది. రెండేళ్ల క్రితం వింబుల్డన్ సెంటర్ కోర్టులో సెరెనా విలియమ్స్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి... ఈసారి అదే వేదికపై సెరెనా అక్క వీనస్‌పై ముగురుజా ప్రతీకారం తీర్చుకుంది.
తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్ ముగురుజా 7–5, 6–0తో పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్ ఆడిన వీనస్ నాలుగోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
తాజా విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లను ఓడించిన ఏకైక క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి ముగురుజా చాంపియన్‌గా నిలిచింది. కొంచిటా మార్టినెజ్ (1994లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా ఘనత వహించింది. ఈ టోర్నీలో ముగురుజాకు కొంచిటా కోచ్‌గా ఉండటం మరో విశేషం.
బ్రేక్ పాయింట్లు కాపాడుకొని...
ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో తొలి సెట్ ఆసక్తికరంగా సాగింది. స్కోరు 5–4 వద్ద ఉన్నపుడు ముగురుజా సర్వీస్‌లో వీనస్‌కు రెండు సెట్ పాయింట్లు లభించాయి. అయితే ముగురుజా కచ్చితమైన సర్వీస్‌లు చేసి ఈ గేమ్‌ను కాపాడుకుంది. దాంతో స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌లో ముగురుజా పూర్తి ఆధిపత్యం చలాయించింది. మూడుసార్లు వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌లను కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తం లో ముగురుజా 14 విన్నర్స్ కొట్టి, 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు వీనస్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది.
సిలిచ్ @ ఫెడరర్
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం