
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజు ఆదివారం మహిళల సింగిల్స్‌లో 2016 చాంపియన్, పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిసియా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 46వ ర్యాంకర్ కయా కనెపి (ఎస్టోనియా) 2–6, 6–3, 6–4తో పదో ర్యాంకర్ ముగురుజాను ఓడించగా... ప్రపంచ 52వ ర్యాంకర్ మాగ్దా లినెట్ (పోలాండ్) 3–6, 7–6 (7/4), 7–5తో ఆరో ర్యాంకర్ ఆన్స్ జెబర్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
2011 జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఆన్స్ జెబర్ ఇటీవల మాడ్రిడ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు ఇటాలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. క్లే కోర్టులపై 17 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జెబర్‌ను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా పరిగణించారు. అయితే మాగ్దా లినెట్‌తో 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జెబర్ 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్‌లో 2018, 2019 రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమై 194వ ర్యాంక్‌కు పడిపోయిన థీమ్ 3–6, 2–6, 4–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment