సింధు స్వర్ణ ప్రపంచం | PV Sindhu becomes first Indian to win World Badminton Championships gold | Sakshi
Sakshi News home page

సింధు స్వర్ణ ప్రపంచం

Published Mon, Aug 26 2019 4:47 AM | Last Updated on Mon, Aug 26 2019 12:19 PM

PV Sindhu becomes first Indian to win World Badminton Championships gold - Sakshi

నిరీక్షణ ముగిసింది. పసిడి స్వప్నం సాకారమైంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం అద్భుతం        ఆవిష్కృతమైంది. బ్యాడ్మింటన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విశ్వకిరీటం మన సొంతమైంది. గత రెండు పర్యాయాల్లో పసిడి మెట్టుపై బోల్తా పడిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మూడో ప్రయత్నంలో తన బంగారు కలను నిజం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్‌ అమ్మాయి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో భారత్‌ తరఫున తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఘనతను సాధించింది.

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): ఎట్టకేలకు తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ పసిడి కల నిజమైంది. ప్రత్యర్థిపై చిరుతలా విరుచుకుపడిన సింధు అనుకున్నది సాధించింది. ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై గెలిచింది.

ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్‌ నింగ్‌ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది.  ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు.  

ఆహా... ఏమి ఆట...
తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్‌ నుంచి చివరి పాయింట్‌ వరకు దూకుడుగానే ఆడింది. ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్‌ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే చూపించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్‌ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది.  

ఎక్కడా తగ్గలేదు...
తొలి గేమ్‌ గెల్చుకున్న సింధు రెండో గేమ్‌లోనూ హడలెత్తించింది. ఒకుహారా ఆటతీరుపై పూర్తి హోంవర్క్‌ చేసినట్లు కనిపించిన ఈ హైదరాబాదీ ఆటలో వైవిధ్యం కనబరిచింది. సింధు జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఏదశలోనూ ఒకుహారాకు అంతుచిక్కలేదు. నేరుగా ఒకుహారా శరీరంపై సింధు సంధించిన కొన్ని స్మాష్‌ షాట్‌లకు జపాన్‌ క్రీడాకారిణి వద్ద సమాధానమే లేకపోయింది. సింధు కొట్టిన స్మాష్‌లకు ఒకుహారా రిటర్న్‌ చేసినా ఆ స్మాష్‌ల వేగానికి కొన్నిసార్లు షటిల్స్‌ బయటకు వెళ్లిపోయాయి. ఫలితంగా రెండో గేమ్‌లో విరామానికి సింధు 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది.


ఆ తర్వాత కూడా సింధు ఆధిపత్యం కొనసాగించి క్రమం తప్పకుండా పాయింట్లు సాధించగా... ఒకుహారా పూర్తిగా డీలా పడిపోయింది. స్కోరు 20–7 వద్ద సింధు కొట్టిన స్మాష్‌ షాట్‌ను ఒకుçహారా రిటర్న్‌ చేయలేకపోవడంతో పాయింట్, గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ భారత స్టార్‌ కైవసం చేసుకుంది. 2006లో 21 పాయింట్ల విధానం ప్రవేశ పెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకపక్షంగా ముగిసిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ ఇదే కావడం గమనార్హం.   పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ మొమోటా 21–9, 21–3తో ఆండెర్స్‌  ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)ను ఓడించాడు.

బాయ్‌ నజరానా రూ. 20 లక్షలు
ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాయిప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ‘బాయ్‌’ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.   

ఆ పిలుపు... చెప్పలేని ఆనందం
నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా
సాక్షితో సింధు

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన సింధు... తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలకు రాకెట్‌తో సమాధానమిచ్చింది. ‘గొప్ప టోర్నీలు ఆడగలదు కానీ ఫైనల్స్‌ గెలవలేదు’ అని ధ్వజమెత్తిన విమర్శకుల నోళ్లన్నీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణంతో మూగబోయేలా చేసింది. ఇక నుంచి పట్టిందల్లా బంగారమే అనే స్థాయిలో బరిలో దిగుతానంటూ, గెలవాలనే స్ఫూర్తి తనలో నిరంతరం రగులుతూనే ఉంటుందంటూ  స్విట్జర్లాండ్‌ నుంచి ‘సాక్షి క్రీడా ప్రతినిధి’తో ఫోన్‌లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే...

ఈ విజయం ఎలా అనిపిస్తోంది?
చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనుభూతి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. చివరికి ‘ప్రపంచ చాంపియన్‌’ అనే హోదా దక్కింది. రజతాలు, కాంస్యాలు ఎన్ని సాధించినా ... ‘సింధు ప్రపంచ చాంపియన్‌’ అనే పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది.  

దీన్నిమించిన ఒలింపిక్స్‌ పతకమే ఉందిగా?
ఈ విజయాన్ని ఒలింపిక్స్‌ పతకంతో పోల్చవద్దు. ఒలింపిక్స్‌ అత్యున్నత స్థాయి టోర్నీ అయినప్పటికీ ప్రపంచ ఈవెంట్‌ కూడా దీనికి తక్కువేమీ కాదు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. దేని విలువ దానిదే.

ఈ టోర్నీ కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
కోచ్‌లు గోపీ సర్‌తో పాటు కిమ్‌ జి హ్యూన్‌ టోర్నీ కోసం నన్ను చాలా బాగా సిద్ధం చేశారు. వ్యూహాల్ని పక్కాగా అమలు చేశా. కొత్త ట్రెయినర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో నా ఫిట్‌నెస్‌ మరో స్థాయికి చేరింది. గతంలో ర్యాలీలు ఆడాల్సినప్పుడు చాలా అలసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటున్నా.  

తదుపరి లక్ష్యం?
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. నేనెప్పుడు ఇక చాల్లే అని అనుకోలేదు. ఇంకా గెలవాలి, బాగా ఆడాలనే అనుకుంటా. ప్రతీ గెలుపు మరింత బాగా ఆడాలనే స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌ హోదా వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. నాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి  మరింత బాగా ఆడాలి. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ కూడా సాధించాల్సి ఉంది.  

ప్రశంసల వెల్లువ..
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గిన సింధుకు అభినందనలు. యావత్‌ దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఈ మీ విజయం లక్షలాది మందికి ప్రేరణగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను.  
–రామ్‌నాథ్‌ కోవింద్, రాష్ట్రపతి

నీ ప్రదర్శనతో దేశం మొత్తం మళ్లీ గర్వపడేలా చేశావ్‌. ఆటపట్ల ఉన్న అంకితభావం, గెలవాలన్న కసి భావితరాల క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.
–నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో టైటిల్‌ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన  సింధుకు  అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌కు కూడా శుభాకాంక్షలు.
–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఏపీ సీఎం

సింధుకు శుభాకాంక్షలు. నీ విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి.
–కేసీఆర్, తెలంగాణ సీఎం

సింధు... నీ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్విస్తోంది.  
– నరసింహన్, తెలంగాణ గవర్నర్‌

సింధుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాంపియన్స్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది.
– కిరణ్‌ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో విజయం సాధించిన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి.  
–విశ్వభూషణ్‌ హరిచందన్, ఏపీ గవర్నర్‌

గొప్ప ప్రదర్శన. ప్రపంచ చాంపియన్‌ అయినందుకు అభినందనలు. మరోసారి దేశం గర్వపడేలా చేశావ్‌.
–సచిన్‌ టెండూల్కర్‌

సింధు అభినందనలు. అత్యద్భుత ప్రదర్శన చేశావ్‌. నీ ప్రదర్శన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
– కేటీఆర్, తెలంగాణ, బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు

2.0
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు ఖాతాలో ఉన్నాయి. అంతకుమించి మూడేళ్ల క్రితమే ఒలింపిక్స్‌ రజత మాల తన మెడలో పడింది. ఇక సూపర్‌ సిరీస్‌ టోర్నీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవార్డులు, రివార్డులు... ఆర్జనలో మేటి అని ‘ఫోర్బ్స్‌’ అంకెలు అగ్ర తాంబూలమిస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో ఇన్ని ఘనతల తర్వాత మరో ప్లేయర్‌ అయితే తాము సాధించినదానితో సంతృప్తి పడిపోయేవారేమో... కొత్తగా స్ఫూర్తి పొందడానికి వారికి ఏమీ ఉండకపోయేదేమో. కానీ మన సింధు అలా అనుకోలేదు. ప్రపంచ వేదికపై ఆమె స్వర్ణదాహం తీరలేదు. అందుకే ఈసారి బంగారం పట్టాలని పట్టుదలగా బరిలోకి దిగింది. తై జు యింగ్‌పై క్వార్టర్స్‌లో అద్భుత విజయం తర్వాత ‘ఇంకా నా ఆట పూర్తి కాలేదు’ అంటూ సవాల్‌ విసిరిన సింధు మరో రెండు మ్యాచ్‌లలో అదే జోరు ప్రదర్శించింది. అందకుండా ఊరిస్తున్న పసిడిని తన ఖాతాలో వేసుకొని షటిల్‌ శిఖరాన నిలిచింది.  

‘వరల్డ్‌’ అరంగేట్రంలోనే అదుర్స్‌...
2013లో సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఇద్దరు చైనా స్టార్లపై సాధించిన రెండు విజయాలు సింధు భవిష్యత్తును చూపించాయి. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ వాంగ్‌ యిహాన్‌ను, క్వార్టర్‌ ఫైనల్లో వాంగ్‌ షిజియాన్‌లను ఆమె అలవోకగా ఓడించింది. తర్వాతి ఏడాది కూడా షిజియాన్‌ను చిత్తు చేసి అప్పటి నుంచి చైనా మనకు ఏమాత్రం అడ్డుగోడ కాదని సింధు నిరూపించింది.

టీనేజీ దాటకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్న సింధు తర్వాతి లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోయింది. 2015 కొంత నిరాశపర్చినా... తర్వాతి ఏడాది సింధు గర్జన ‘రియో’లో వినిపించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత ఈ తెలుగు తేజం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె విశ్వ సమరంలో పతకం గెలవకపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే అందులో విశేషం ఏమీ లేని స్థితికి చేరుకుంది! ఇలాంటి లెక్కలను సింధు నిజం చేసి చూపించింది. వరుసగా రెండేళ్లు 2017, 2018లలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరిన సింధు సత్తా వెండి వెన్నెల కురిపించింది.  

లోపాలపై దృష్టి పెట్టి...
సహజంగానే సింధు ఈసారి స్వర్ణానికి గురి పెట్టింది. చెట్టు చిటారు కొమ్మన నిలిచిన పక్షిని కొడితే రజతంతో ఆగిపోవాల్సి వస్తోంది తప్ప బంగారం మెరుపు దక్కడం లేదు. అందుకే ఇప్పుడు పక్షి కన్నుపైకే గెలుపు బాణాన్ని సంధించింది. అందు కోసం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేకంగా తన లోపాలపై దృష్టి పెట్టి సాధన చేసింది. క్వార్టర్స్‌లో తై జుతో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. తొలి గేమ్‌ను చిత్తుగా కోల్పోయినా... తర్వాత చెలరేగింది. మ్యాచ్‌ ఆసాంతం చూస్తే ప్రత్యర్థి శరీరంపైకి స్మాష్‌లను సంధించడం సింధు ఆటలో కొత్త కోణం. చివర్లో ఒత్తిడిలో పడే సమస్య రాకుండా ఆరంభం నుంచే దూకుడుకు ప్రాధాన్యతనిచ్చింది. తన ఎత్తు కారణంగా డ్రాప్‌ షాట్‌లను రిటర్న్‌ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందిని కూడా అధిగమించింది. తనకు స్మాష్‌ కొట్టే అవకాశం వచ్చే వరకు ప్రత్యర్థిని సాధ్యమైనంతగా ర్యాలీలతోనే ఆడించే ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. 360 డిగ్రీల కోణంలో చురుకైన కదలికలతో కోర్టు మొత్తాన్ని కవర్‌ చేస్తూ ఈ మెగా టోర్నీలో సింధు ఆడిన ఆట నిజంగా సూపర్బ్‌.  

తదుపరి స్వర్ణ గురి ‘టోక్యోలో’...
నిజానికి 2019లో సింధుకు గొప్ప ఫలితాలు ఏమీ రాలేదు. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో ఓడగా, ఆల్‌ ఇంగ్లండ్‌లో తొలి రౌండ్‌లోనే ఓడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇండియా ఓపెన్‌లో, సింగపూర్‌ ఓపెన్‌లోనూ సెమీస్‌కే పరిమితం కాగా, మలేసియా ఓపెన్‌లో కనీసం క్వార్ట ర్స్‌ ఆనందం కూడా దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌దీ అదే కథ. ఇండోనేసియాలో రన్నరప్‌గా నిలవడంతో కొంత సంతృప్తి దక్కగా, తర్వాతి వారమే జపాన్‌లో ఆనందం ఆవిరైంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సన్నాహాల కోసం థాయిలాండ్‌ ఓపెన్‌కు దూరమైన ఈ హైదరాబాదీ చివరకు తన లక్ష్యాన్ని చేరింది. తాజా ఫామ్, సర్క్యూట్‌లో ఉన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే మరో ఒలింపిక్‌ పతకం సింధు కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. బ్రెజిల్‌ గడ్డపై చేజారిన కనకపు హారాన్ని టోక్యోలో వరిస్తే భారత అభిమానులకు కావాల్సిందేముంది!   

చాలా గర్వంగా ఉంది
సింధు ఫైనల్స్‌లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్‌ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది.
ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది.
– పీవీ రమణ (సింధు తండ్రి)
 
అమ్మకు అంకితం...
హైదరాబాద్‌కు వచ్చాకే సంబరాలు చేసుకుంటా. ప్రస్తుతం టీమ్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నా. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు. తనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణాన్ని ఆమెకు ఇస్తున్నా. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా.
–పీవీ సింధు

 –సాక్షి క్రీడావిభాగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement