Nozomi Okuhara
-
BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు
టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్.. హైదరాబాదీ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యిపై 21-19, 21-9తో ఓడించింది. కాగా మ్యాచ్ ఫలితం 38 నిమిషాల్లోనే పూర్తయింది. కాగా రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన ఆరవ సీడ్ నవోమి ఒకుహరాతో తలపడాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఒకుహరా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్‌కు బై లభించింది. దీంతో మూడో రౌండ్లో సైనా నెహ్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య విజేతతో తలపడనుంది. శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ ఇక తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ముందంజ వేయగా, మరో భారత ఆటగాడు బి.సాయిప్రణీత్ పోరు మొదటి మ్యాచ్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో కూడా మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నాలుగో సీడ్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ) ముందు తలవంచాడు. చెన్ 21–15, 15–21, 21–15 స్కోరుతో సాయిప్రణీత్‌ను ఓడించాడు. 51 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగిన మరో పోరులో 12వ సీడ్ శ్రీకాంత్ 22–20, 21–19 తేడాతో ఎన్‌హట్ గుయెన్ (ఐర్లాండ్)పై విజయం సాధించాడు. 9వ సీడ్ లక్ష్య సేన్ 21–12, 21–11తో క్రిస్టియాన్ సోల్బర్గ్ (డెన్మార్క్)ను చిత్తు చేయగా, ప్రణయ్ 21–12, 21–11 స్కోరుతో ల్యూకా రాబర్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 14–21, 12–21తో లైన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి– అశ్విని పొన్నప్పతో పాటు పూజ దండు–సంజనా సంతోష్ జోడి కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో సిక్కి–అశ్విని 21–7, 21–19తో అమీనత్ నబీహా – ఫాతిమా నబాహా (మాల్దీవులు)ను చిత్తుగా ఓడించారు. పూజ–సంజన 21–6, 10–21, 21–14తో లూసియా సలాజర్–పౌలా రీగల్ (పెరూ)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల జోడి 21–17, 17–21, 22–20తో సుపాక్ జోమ్కో– కిటునుపాంగ్ (థాయిలాండ్)ను ఓడించి ముందంజ వేయగా, మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయానికి నిరాశ ఎదురైంది. మను–సుమీత్ 11–21, 21–19, 15–21తో హిరోకి ఒకమురా–మసాయుకి ఒనొడెరా (జపాన్) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో 21–12, 21–13తో ప్యాట్రిక్ షీల్–ఫ్రాన్సిస్కా వోక్మన్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది. -
సింధు స్వర్ణ ప్రపంచం
నిరీక్షణ ముగిసింది. పసిడి స్వప్నం సాకారమైంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బ్యాడ్మింటన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విశ్వకిరీటం మన సొంతమైంది. గత రెండు పర్యాయాల్లో పసిడి మెట్టుపై బోల్తా పడిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మూడో ప్రయత్నంలో తన బంగారు కలను నిజం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్ అమ్మాయి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో భారత్ తరఫున తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఘనతను సాధించింది. బాసెల్ (స్విట్జర్లాండ్): ఎట్టకేలకు తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ పసిడి కల నిజమైంది. ప్రత్యర్థిపై చిరుతలా విరుచుకుపడిన సింధు అనుకున్నది సాధించింది. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఆహా... ఏమి ఆట... తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు దూకుడుగానే ఆడింది. ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే చూపించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది. ఎక్కడా తగ్గలేదు... తొలి గేమ్ గెల్చుకున్న సింధు రెండో గేమ్‌లోనూ హడలెత్తించింది. ఒకుహారా ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసినట్లు కనిపించిన ఈ హైదరాబాదీ ఆటలో వైవిధ్యం కనబరిచింది. సింధు జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఏదశలోనూ ఒకుహారాకు అంతుచిక్కలేదు. నేరుగా ఒకుహారా శరీరంపై సింధు సంధించిన కొన్ని స్మాష్ షాట్లకు జపాన్ క్రీడాకారిణి వద్ద సమాధానమే లేకపోయింది. సింధు కొట్టిన స్మాష్‌లకు ఒకుహారా రిటర్న్ చేసినా ఆ స్మాష్‌ల వేగానికి కొన్నిసార్లు షటిల్స్ బయటకు వెళ్లిపోయాయి. ఫలితంగా రెండో గేమ్‌లో విరామానికి సింధు 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా సింధు ఆధిపత్యం కొనసాగించి క్రమం తప్పకుండా పాయింట్లు సాధించగా... ఒకుహారా పూర్తిగా డీలా పడిపోయింది. స్కోరు 20–7 వద్ద సింధు కొట్టిన స్మాష్ షాట్‌ను ఒకుçహారా రిటర్న్ చేయలేకపోవడంతో పాయింట్, గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ భారత స్టార్ కైవసం చేసుకుంది. 2006లో 21 పాయింట్ల విధానం ప్రవేశ పెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకపక్షంగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ ఇదే కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మొమోటా 21–9, 21–3తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. బాయ్ నజరానా రూ. 20 లక్షలు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాయిప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఆ పిలుపు... చెప్పలేని ఆనందం నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా సాక్షితో సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన సింధు... తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలకు రాకెట్‌తో సమాధానమిచ్చింది. ‘గొప్ప టోర్నీలు ఆడగలదు కానీ ఫైనల్స్ గెలవలేదు’ అని ధ్వజమెత్తిన విమర్శకుల నోళ్లన్నీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణంతో మూగబోయేలా చేసింది. ఇక నుంచి పట్టిందల్లా బంగారమే అనే స్థాయిలో బరిలో దిగుతానంటూ, గెలవాలనే స్ఫూర్తి తనలో నిరంతరం రగులుతూనే ఉంటుందంటూ స్విట్జర్లాండ్ నుంచి ‘సాక్షి క్రీడా ప్రతినిధి’తో ఫోన్లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే... ఈ విజయం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనుభూతి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. చివరికి ‘ప్రపంచ చాంపియన్’ అనే హోదా దక్కింది. రజతాలు, కాంస్యాలు ఎన్ని సాధించినా ... ‘సింధు ప్రపంచ చాంపియన్’ అనే పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. దీన్నిమించిన ఒలింపిక్స్ పతకమే ఉందిగా? ఈ విజయాన్ని ఒలింపిక్స్ పతకంతో పోల్చవద్దు. ఒలింపిక్స్ అత్యున్నత స్థాయి టోర్నీ అయినప్పటికీ ప్రపంచ ఈవెంట్ కూడా దీనికి తక్కువేమీ కాదు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. దేని విలువ దానిదే. ఈ టోర్నీ కోసం ఎలా సన్నద్ధమయ్యారు? కోచ్‌లు గోపీ సర్‌తో పాటు కిమ్ జి హ్యూన్ టోర్నీ కోసం నన్ను చాలా బాగా సిద్ధం చేశారు. వ్యూహాల్ని పక్కాగా అమలు చేశా. కొత్త ట్రెయినర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నా ఫిట్నెస్ మరో స్థాయికి చేరింది. గతంలో ర్యాలీలు ఆడాల్సినప్పుడు చాలా అలసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటున్నా. తదుపరి లక్ష్యం? టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. నేనెప్పుడు ఇక చాల్లే అని అనుకోలేదు. ఇంకా గెలవాలి, బాగా ఆడాలనే అనుకుంటా. ప్రతీ గెలుపు మరింత బాగా ఆడాలనే స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదా వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. నాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి మరింత బాగా ఆడాలి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కూడా సాధించాల్సి ఉంది. ప్రశంసల వెల్లువ.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన సింధుకు అభినందనలు. యావత్ దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఈ మీ విజయం లక్షలాది మందికి ప్రేరణగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. –రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి నీ ప్రదర్శనతో దేశం మొత్తం మళ్లీ గర్వపడేలా చేశావ్. ఆటపట్ల ఉన్న అంకితభావం, గెలవాలన్న కసి భావితరాల క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రపంచ చాంపియన్ షిప్లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌కు కూడా శుభాకాంక్షలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం సింధుకు శుభాకాంక్షలు. నీ విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. –కేసీఆర్, తెలంగాణ సీఎం సింధు... నీ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్విస్తోంది. – నరసింహన్, తెలంగాణ గవర్నర్ సింధుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాంపియన్స్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది. – కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించిన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి. –విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ గొప్ప ప్రదర్శన. ప్రపంచ చాంపియన్ అయినందుకు అభినందనలు. మరోసారి దేశం గర్వపడేలా చేశావ్. –సచిన్ టెండూల్కర్ సింధు అభినందనలు. అత్యద్భుత ప్రదర్శన చేశావ్. నీ ప్రదర్శన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. – కేటీఆర్, తెలంగాణ, బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు 2.0 ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు ఖాతాలో ఉన్నాయి. అంతకుమించి మూడేళ్ల క్రితమే ఒలింపిక్స్ రజత మాల తన మెడలో పడింది. ఇక సూపర్ సిరీస్ టోర్నీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవార్డులు, రివార్డులు... ఆర్జనలో మేటి అని ‘ఫోర్బ్స్’ అంకెలు అగ్ర తాంబూలమిస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో ఇన్ని ఘనతల తర్వాత మరో ప్లేయర్ అయితే తాము సాధించినదానితో సంతృప్తి పడిపోయేవారేమో... కొత్తగా స్ఫూర్తి పొందడానికి వారికి ఏమీ ఉండకపోయేదేమో. కానీ మన సింధు అలా అనుకోలేదు. ప్రపంచ వేదికపై ఆమె స్వర్ణదాహం తీరలేదు. అందుకే ఈసారి బంగారం పట్టాలని పట్టుదలగా బరిలోకి దిగింది. తై జు యింగ్‌పై క్వార్టర్స్‌లో అద్భుత విజయం తర్వాత ‘ఇంకా నా ఆట పూర్తి కాలేదు’ అంటూ సవాల్ విసిరిన సింధు మరో రెండు మ్యాచ్‌లలో అదే జోరు ప్రదర్శించింది. అందకుండా ఊరిస్తున్న పసిడిని తన ఖాతాలో వేసుకొని షటిల్ శిఖరాన నిలిచింది. ‘వరల్డ్’ అరంగేట్రంలోనే అదుర్స్... 2013లో సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఇద్దరు చైనా స్టార్లపై సాధించిన రెండు విజయాలు సింధు భవిష్యత్తును చూపించాయి. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ వాంగ్ యిహాన్‌ను, క్వార్టర్ ఫైనల్లో వాంగ్ షిజియాన్లను ఆమె అలవోకగా ఓడించింది. తర్వాతి ఏడాది కూడా షిజియాన్‌ను చిత్తు చేసి అప్పటి నుంచి చైనా మనకు ఏమాత్రం అడ్డుగోడ కాదని సింధు నిరూపించింది. టీనేజీ దాటకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్న సింధు తర్వాతి లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోయింది. 2015 కొంత నిరాశపర్చినా... తర్వాతి ఏడాది సింధు గర్జన ‘రియో’లో వినిపించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత ఈ తెలుగు తేజం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె విశ్వ సమరంలో పతకం గెలవకపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే అందులో విశేషం ఏమీ లేని స్థితికి చేరుకుంది! ఇలాంటి లెక్కలను సింధు నిజం చేసి చూపించింది. వరుసగా రెండేళ్లు 2017, 2018లలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు సత్తా వెండి వెన్నెల కురిపించింది. లోపాలపై దృష్టి పెట్టి... సహజంగానే సింధు ఈసారి స్వర్ణానికి గురి పెట్టింది. చెట్టు చిటారు కొమ్మన నిలిచిన పక్షిని కొడితే రజతంతో ఆగిపోవాల్సి వస్తోంది తప్ప బంగారం మెరుపు దక్కడం లేదు. అందుకే ఇప్పుడు పక్షి కన్నుపైకే గెలుపు బాణాన్ని సంధించింది. అందు కోసం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేకంగా తన లోపాలపై దృష్టి పెట్టి సాధన చేసింది. క్వార్టర్స్‌లో తై జుతో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. తొలి గేమ్‌ను చిత్తుగా కోల్పోయినా... తర్వాత చెలరేగింది. మ్యాచ్ ఆసాంతం చూస్తే ప్రత్యర్థి శరీరంపైకి స్మాష్‌లను సంధించడం సింధు ఆటలో కొత్త కోణం. చివర్లో ఒత్తిడిలో పడే సమస్య రాకుండా ఆరంభం నుంచే దూకుడుకు ప్రాధాన్యతనిచ్చింది. తన ఎత్తు కారణంగా డ్రాప్ షాట్లను రిటర్న్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందిని కూడా అధిగమించింది. తనకు స్మాష్ కొట్టే అవకాశం వచ్చే వరకు ప్రత్యర్థిని సాధ్యమైనంతగా ర్యాలీలతోనే ఆడించే ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. 360 డిగ్రీల కోణంలో చురుకైన కదలికలతో కోర్టు మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ మెగా టోర్నీలో సింధు ఆడిన ఆట నిజంగా సూపర్బ్. తదుపరి స్వర్ణ గురి ‘టోక్యోలో’... నిజానికి 2019లో సింధుకు గొప్ప ఫలితాలు ఏమీ రాలేదు. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో ఓడగా, ఆల్ ఇంగ్లండ్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇండియా ఓపెన్‌లో, సింగపూర్ ఓపెన్‌లోనూ సెమీస్‌కే పరిమితం కాగా, మలేసియా ఓపెన్‌లో కనీసం క్వార్ట ర్స్ ఆనందం కూడా దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్ ఓపెన్దీ అదే కథ. ఇండోనేసియాలో రన్నరప్‌గా నిలవడంతో కొంత సంతృప్తి దక్కగా, తర్వాతి వారమే జపాన్‌లో ఆనందం ఆవిరైంది. వరల్డ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం థాయిలాండ్ ఓపెన్‌కు దూరమైన ఈ హైదరాబాదీ చివరకు తన లక్ష్యాన్ని చేరింది. తాజా ఫామ్, సర్క్యూట్లో ఉన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే మరో ఒలింపిక్ పతకం సింధు కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. బ్రెజిల్ గడ్డపై చేజారిన కనకపు హారాన్ని టోక్యోలో వరిస్తే భారత అభిమానులకు కావాల్సిందేముంది! చాలా గర్వంగా ఉంది సింధు ఫైనల్స్‌లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. – పీవీ రమణ (సింధు తండ్రి) అమ్మకు అంకితం... హైదరాబాద్‌కు వచ్చాకే సంబరాలు చేసుకుంటా. ప్రస్తుతం టీమ్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నా. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు. తనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని ఆమెకు ఇస్తున్నా. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. –పీవీ సింధు –సాక్షి క్రీడావిభాగం -
సింధు... ఈసారి వదలొద్దు
ఇంకొక్క విజయమే... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తోన్న పసిడి కల నెరవేరడానికి... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకోవడానికి! ఇంకొక్క విజయమే... ముచ్చటగా మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రంగు మార్చడానికి... విశ్వవేదికపై మువ్వన్నెలు రెపరెపలాడటానికి! ఇంకొక్కవిజయమే... సింధు పేరు భారత క్రీడాచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు... గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం సింధు పసిడి కాంతులు మాత్రం విరజిమ్మలేకపోయింది. రెండుసార్లు కాంస్యాలతో సరిపెట్టుకోగా... మరో రెండుసార్లు ‘రజత’ హారం మెడలో వేసుకుంది. రెండు ఫైనల్స్‌లో ఓడిన అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకొని... మూడోసారి పతక వర్ణాన్ని పసిడిగా మార్చాలని ఆశిస్తూ... విజయీభవ సింధు...! బాసెల్ (స్విట్జర్లాండ్): జగజ్జేతగా అవతరించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గత ప్రదర్శన ఆధారంగా... ఈసారీ భారీ అంచనాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆఖరి సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 40 నిమిషాల్లో 21–7, 21–14తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ చెన్ యుఫె (చైనా)పై అద్వితీయ విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 8–7తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది వీరిద్దరు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలిచారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఈసారి ప్రతీకారం తీర్చుకొని పసిడి పతకం మెడలో వేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆరంభం నుంచే... రెండో ర్యాంకర్ తై జు యింగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గొప్ప పోరాటపటిమ కనబరిచి అద్భుత విజయాన్ని అందుకున్న సింధు సెమీఫైనల్లో మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన చెన్ యుఫెను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడింది. క్లిష్టమైన కోణాల్లో షటిల్స్‌ను పంపిస్తూ చెన్ యుఫె సత్తాకు పరీక్ష పెట్టింది. అవకాశం వచ్చినపుడల్లా చెన్ యుఫె బలహీన రిటర్న్ షాట్లను అంతేవేగంగా రిటర్న్ చేస్తూ పాయింట్లు గెల్చుకుంది. చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో తొలి గేమ్‌లో విరామానికి 11–3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో చైనా ప్లేయర్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ సింధు ఆరంభంలోనే 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో సింధు పైచేయి సాధిస్తూ తన ఆధిక్యాన్ని 17–9కి పెంచుకుంది. క్రాస్‌కోర్ట్ స్మాష్‌తో 20–12తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచిన సింధు ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయింది. అయితే చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లిపోవడంతో ఈసారి సింధు ఖాతాలో పాయింట్‌తోపాటు గేమ్, విజయం చేరాయి. ఫైనల్ చేరారిలా...సింధు తొలి రౌండ్: బై రెండో రౌండ్: పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై 42 నిమిషాల్లో 21–14, 21–15తో గెలుపు మూడో రౌండ్: బీవెన్ జాంగ్ (అమెరికా)పై 34 నిమిషాల్లో 21–14, 21–6తో గెలుపు క్వార్టర్ ఫైనల్: తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో గెలుపు సెమీఫైనల్: చెన్ యుఫె (చైనా)పై 40 నిమిషాల్లో 21–7, 21–14తో గెలుపు ఒకుహారా తొలి రౌండ్: బై రెండో రౌండ్: ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై 34 నిమిషాల్లో 21–12, 21–14తో విజయం మూడో రౌండ్: సుంగ్ జీ హున్ (కొరియా)పై 47 నిమిషాల్లో 21–18, 21–13తో విజయం క్వార్టర్ ఫైనల్: హి బింగ్ జియావో (చైనా)పై 43 నిమిషాల్లో 21–7, 21–18తో విజయం సెమీఫైనల్: రచనోక్ (థాయ్‌లాండ్)పై 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో విజయం చెన్ యుఫెతో మ్యాచ్‌కు పక్కాగా సిద్ధమై వచ్చాను. తొలి క్షణం నుంచే అనుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టాను. ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి అంతే వేగంతో తొలి గేమ్‌ను ముగించాను. రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలు చేశాను. వరుస పాయింట్లు కోల్పోయాక మళ్లీ పుంజుకొని ఆధిక్యంలోకి వచ్చాను. దాంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను ముగించాను. నేడు జరిగే ఫైనల్లోనూ బాగా ఆడతానని ఆశిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో నా లక్ష్యం ఇంకా నెరవేరలేదు. సంతోషంగా ఉన్నా పూర్తి సంతృప్తిగా లేను. ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఒకుహారాతో తుది పోరు తేలికేం కాదు. ఒకరి ఆటతీరుపై ఒకరికి పూర్తి అవగాహన ఉంది. కీలకదశల్లో ఏకాగ్రతతో, నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడాలి. నేనైతే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. – పీవీ సింధు -
ఇండోనేసియా ఓపెన్ : సెమీస్‌లోకి సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 21–7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా రెండో సెట్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించిన సింధు మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యంతో 21–7తో ఒకహారా పతనాన్ని శాసించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచిన విషయం తెలిసిందే. ఇక సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది. -
సింధు ఆశలు ఆవిరి
సింగపూర్: ఈ సీజన్లో ఇంకా టైటిల్ బోణీ కొట్టలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లోనూ చుక్కెదురైంది. జపాన్‌కు చెందిన రెండో సీడ్ నొజోమి ఒకుహారాతో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు వరుస గేముల్లో 7–21, 11–21తో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఈ మ్యాచ్ ముందు వరకు జపాన్ ప్రత్యర్థిపై మన తెలుగుతేజానిదే పైచేయి. ముఖాముఖి పోరులో 7–6తో ఆధిక్యంలో నిలిచింది. చివరిసారిగా తలపడిన రెండు సార్లూ సింధుదే విజయం. అయితే శనివారంనాటి పోటీలో ఆ ఆధిపత్యం కొనసాగలేదు. కేవలం 37 నిమిషాల్లోనే జపాన్ స్టార్ నాలుగో సీడ్ సింధును ఓడించింది. చిత్రంగా ఈ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ రన్నరప్ సింధు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదు. తొలిగేమ్‌లో అయితే కనీస పోరాటం లేకుండానే తలవంచింది. రెండో గేమ్ కూడా భిన్నంగా జరగలేదు. ఆరంభంలో కాస్త పోరాడినట్లు కనిపించినా... క్రమంగా ప్రత్యర్థి వేగాన్ని సింధు అందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఒకుహారా ముఖాముఖి రికార్డును 7–7తో సమం చేసింది. -
విజయం అంచుల నుంచి...
సియోల్: ఒక్క పాయింట్ సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిని చేజేతులా వదులుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్ నుంచి భారంగా నిష్క్రమించింది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా అనూహ్యంగా ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 21–15, 15–21, 20–22తో ఒకుహారా చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్ నుంచి హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో ఇద్దరు చెరో గేమ్ గెలిచి సమఉజ్జీగా నిలిచారు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో కాస్త దూకుడు పెంచిన సైనా 4–1తో అధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న ప్రత్యర్థి వరుస పాయింట్లు సాధించడంతో సైనా ఆధిక్యం 11–10కు తగ్గింది. ఆ తర్వాత భారత షట్లర్ కూడా వరుసగా 5 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సైనా మరింత జోరు పెంచి నాలుగు పాయింట్లు నెగ్గింది. 20–16తో విజయం అంచుల్లో నిలిచింది. ఒక్క పాయింట్ సాధించి విజయం ఖాయం చేసుకోవాల్సిన స్థితిలో సైనా తడబడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వరుసగా ఆరు పాయింట్లు ఒకుహారాకు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ గెలిచిన సైనా... ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సహచర క్రీడాకారిణి సింధును ఓడించి స్వర్ణం గెలిచింది. ఇటీవల ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
రన్నరప్ సింధు
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 15–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో ఓడిపోవడం సింధుకిది మూడోసారి. ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లోనూ సింధు ఓటమి చవిచూసింది. విజేత ఒకుహారాకు 26,250 డాలర్ల (రూ. 17 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ, 9,200 పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 11 వేలు), 7800 పాయింట్లు లభించాయి. -
పీవీ సింధుకు మరోసారి నిరాశే
-
తెలుగు తేజానికి అందని ద్రాక్షగా టైటిల్
బ్యాంకాక్ : ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ కోసం చేసిన ప్రయత్నంలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎందురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో 21-15, 21-18 తేడాతో ఓటమి పాలైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీని కోల్పోయిన సింధు.. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం సింధు శ్రమ కొనసాగుతోంది. తొలి గేములో ఒకుహారా దూకుడును ప్రదర్శించి సులువుగానే నెగ్గింది. రెండో గేములో తొలుత 6-2తో సింధు ఆధిపత్యం కొనసాగించినా చివరివరకూ అదే అధిక్యాన్ని కాపాడుకోలేక పోయింది. దీంతో పుంజుకున్న జపాన్ షట్లర్ 18-18తో సింధు స్కోరును సమయం చేసింది. కీలకదశలో మూడు వరుస పాయింట్లు సాధించిన సింధు ప్రత్యర్థి ఒకుహారా గేమ్‌తో పాటు థాయ్‌లాండ్ ఓపెన్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సింధుకి ఇది మూడో రజత పతకం కాగా, ఇప్పటివరకూ 11 సార్లు సింధుతో తలపడిన జపాన్ షట్లర్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గింది. -
తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ సెమీఫైనల్లోకి
-
శభాష్ సింధు...
తొలి రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయిన తెలుగు తేజం పీవీ సింధు అసలు సిసలు పోరులో మాత్రం అబ్బురపరిచింది. తన ముందు ప్రపంచ చాంపియన్ ప్రత్యర్థిగా ఉన్నా... మ్యాచ్‌లో పలుమార్లు వెనుకబడినా... తన వ్యూహాలకు దీటుగా ప్రత్యర్థి జవాబు ఇస్తున్నా... ఏదశలోనూ తొణకకుండా... విజయంపై ఆశలు వదులుకోకుండా... చివరి పాయింట్ వరకు పోరాడిన సింధు ఆఖరికి విజయనాదం చేసి ఔరా అనిపించింది. బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై భారత స్టార్ పీవీ సింధు మరోసారి పైచేయి సాధించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ విజయంతో తెలుగు తేజం సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 84 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 20–22, 21–18, 21–18తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ ఒకుహారాను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో ఆరో ప్రయత్నంలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సింధు, ఒకుహారా 10 సార్లు తలపడగా... ఇద్దరూ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ టోర్నీలో సింధు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌లు ఆడి విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. యామగుచితో ముఖాముఖి రికార్డులో సింధు 6–3తో ఆధిక్యంలో ఉంది. గతేడాది ఒకుహారాతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండు ఓడిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం పట్టుదలతో పోరాడింది. మూడు గేమ్‌లూ నువ్వా నేనా అన్నట్లు సాగాయి. తన ఎత్తు కారణంగా పదునైన స్మాష్‌లు సంధించే వీలున్న సింధుకు ఒకుహారా ఆ అవకాశం ఇవ్వలేదు. ర్యాలీ సుదీర్ఘంగా కొనసాగేలా చూస్తూ అవకాశం దొరకగానే డ్రాప్ షాట్లు సంధిస్తూ పాయింట్లు రాబట్టింది. సింధు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ ఆమె వ్యూహాలకు తగినరీతిలో జవాబిచ్చింది. దాంతో స్కోరు పలుమార్లు సమమైంది. తొలి గేమ్‌లో స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్ చేజార్చుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే తప్పనిసరిగా రెండో గేమ్‌లో నెగ్గాల్సిన స్ధితిలో సింధు ఆరంభంలోనే 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 6–4తో.. 9–7తో... 11–9తో...14–11, 16–13తో సింధు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ దశలో సింధు తప్పిదాలతో స్కోరు 18–18 వద్ద సమమైంది. కానీ ఈ హైదరాబాద్ అమ్మాయి సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మూడుసార్లు (1–4, 11–14, 12–16)తో వెనుకబడినా... ఒత్తిడి దరిచేరనీయకుండా ఆడింది. 12–16తో వెనుకంజలో ఉన్నపుడు సింధు వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ రెండేసి పాయింట్లు సాధించడంతో మళ్లీ 18–18 వద్ద స్కోరు సమమైంది. ఈ దశలో సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా మూడు పాయింట్లు గెలిచి ఒకుహారాను ఇంటిదారి పట్టించింది. శ్రీకాంత్‌కు నిరాశ గురువారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 21–15, 20–22తో అన్‌సీడెడ్ హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 20–18తో విజయానికి చేరువగా వచ్చాడు. అయితే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ఓటమిని మూటగట్టుకున్నాడు. -
సింధుకు నిరాశ
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. ఇటీవల కొరియా ఓపెన్ సిరీస్ టైటిల్ గెలిచి మంచి ఊపుమీద కనిపించిన సింధు.. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి ఆదిలోనే నిష్ర్కమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 18-21,8-21 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వైదొలిగారు. దాంతో కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది. తొలి గేమ్ ను పోరాడి కోల్పోయిన సింధు, రెండో గేమ్ లో మాత్రం ఒకుహారాకు కనీసం పోటీనివ్వలేకపోయారు. రెండో గేమ్ లో ఒకుహారా11-4 తేడాతో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయారు. దాన్ని కడవరకూ కాపాడుకున్న ఒకుహారా రెండో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సొంతం చేసుకుని క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ప్రధానంగా రెండో గేమ్ లో సింధు అనవసర తప్పిదాలు ఎక్కువ చేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -
శాసించి...సాధించి
⇒ఒకుహారాపై ఈసారి సింధు పైచేయి ⇒మూడు గేముల్లో ప్రపంచ చాంపియన్‌పై విజయం ⇒కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ⇒రూ. 28 లక్షల 83 వేల ప్రైజ్‌మనీ సొంతం వేదిక మారింది... టోర్నీ మారింది... పీవీ సింధు, నొజోమి ఒకుహారాల ఆట మాత్రం అబ్బురపరిచేలా సాగింది... ప్రతీ పాయింట్‌కు అసమాన పోరాటం... ఫిట్‌నెస్‌కు పరీక్ష పెట్టేలా సుదీర్ఘ ర్యాలీలు... కళ్లు చెదిరే స్మాష్‌లు... ఆధిక్యం దోబూచులాట... చివరకు ఒత్తిడికి ఎదురునిలిచిన సింధు విజేతగా అవతరించింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. తాజా గెలుపుతో మూడు వారాల క్రితం గ్లాస్గో నగరంలో ఒకుహారా చేతిలో ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ఈ తెలుగు అమ్మాయి ప్రతీకారం తీర్చుకుంది. తన కెరీర్లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సియోల్ (దక్షిణ కొరియా): భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అనుకున్నది సాధించింది. 110 నిమిషాలపాటు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఓటమి ఎదురయ్యాక ‘నా సమయం కూడా వస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే మూడు వారాల్లోనే ఒకుహారాతో లెక్క సరిచేసింది. వేదిక, టోర్నీ మారిందంతే. ఆదివారం ముగిసిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో 83 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 22–20, 11–21, 21–18తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల (రూ. 28 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించింది. సింధు కెరీర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ (2016), ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ (2017)లో టైటిల్స్ గెలిచింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 4–4తో సమఉజ్జీగా నిలిచారు. పోటాపోటీ: ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా ఆద్యంతం హోరాహోరీగా జరిగింది. సుదీర్ఘ ర్యాలీలు సాగడం, ఇద్దరిలో ఒకరు తప్పిదం చేయడంతో పాయింట్లు వచ్చాయి. తొలి గేమ్‌లో ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడింది. చివర్లో సింధు 18–20తో వెనుకబడిన దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధు ఆటతీరు ఒక్కసారిగా గాడి తప్పింది. పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి పాయింట్లు కోల్పోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆడుతూ 11–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరు పాయింట్లతో వెనుకబడిన ఒకుహారా ఏమాత్రం పట్టువిడవకుండా పోరాడటంతో ఒకదశలో వీరిద్దరి మధ్య తేడా రెండు పాయింట్లకు చేరుకుంది. స్కోరు 20–18 వద్ద ఇద్దరి మధ్య 56 షాట్ల మారథాన్ ర్యాలీ జరగడం... చివరకు ఒకుహారా కొట్టిన షటిల్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. ప్రశంసల వర్షం: కొరియా ఓపెన్ టైటిల్ నెగ్గిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. ‘కొరియా ఓపెన్‌లో విజేతగా నిలిచినందుకు అభినందనలు. ఈ విజయంపట్ల దేశం మొత్తం గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సింధును ప్రశంసించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. రెండో గేమ్‌లో నేను షటిల్‌ను నియంత్రించలేకపోయాను. ఇక మూడో గేమ్‌లో నేను ఆధిక్యంలో ఉన్నా ఒకుహారా పోరాటాన్ని ఆపలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో గేమ్‌లో నేను 19–17తో ముందంజలో ఉన్నా ఓడిపోయాను. అయితే ఈ మ్యాచ్‌లో నేను ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఫలితం గురించి ఆలోచించలేదు. ఈ విజయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున లభించడంతో ఆయనకు అంకితం ఇస్తున్నాను. – సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సింధులో అటాకింగ్ గేమ్ శైలిని మరింతగా పెంచాలని నిర్ణయించాం. ఆ దిశగా ప్రాక్టీస్ చేయించాం. 22 ఏళ్లకే సింధు చాలా గొప్ప విజయాలు సాధిం చింది. ఇదేస్థాయిలో నిలకడగా ఆడితే భవిష్యత్‌లో ఆమె కచ్చితంగా ప్రపంచ నంబర్‌వన్ అవుతుంది. – పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
పోరాడి ఓడిన సింధు.. రజతంతో సరి
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రజతం కైవసం చేసుకుంది. ఇక్కడ ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో స్వర్ణం కోసం తుదివరకూ పోరాడిన సింధుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్ధి, జపాన్ ప్లేయర్ నోజొమి ఓకుహర చేతిలో 19-21, 22-20, 20-22 తేడాతో సింధు ఓటమి చవిచూసింది. దీంతో మూడో యత్నంలోనూ ఆమె స్వర్ణం సొంతం చేసుకోలేకపోయింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు, రెండో గేమ్ లో విజృంభించి ఆడి గేమ్ సొంతం చేసుకోవడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ కు మ్యాచ్ వెళ్లింది. అయితే మూడో గేమ్ చివర్లో 19-19 పాయింట్లు దశలో ఉండగా.. సింధు ప్రత్యర్ధి ఒకుహర పుంజుకుని రెండు వరుస పాయింట్లు సాధించడంతో సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకూ ప్రపంచ ఛాంపియన్ షిప్లో పీవీ సింధు ఇప్పటివరకు రెండుసార్లు(2013, 2014) కాంస్య పతకాలు సాధించారు. ఈసారి భారత్‌కు బంగారు పతకం సాధించిపెట్టాలన్న ధీమాతో పోరాడినా చివరి నిమిషంలో చేసిన తప్పిదంతో గేమ్ తో పాటు మ్యాచ్ ను కోల్పోయింది. -
సైనాకు చుక్కెదురు.. కాంస్యంతో సరి!
గ్లాస్గో: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు చుక్కెదురైంది. మహిళల సెమీఫైనల్స్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ నిరాశ పరిచింది. జపాన్ షట్లర్ నొజోమి ఒకుహర చేతిలో పరాజయం పాలైంది. దీంతో సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలి గేమ్‌లోని దూకుడును మిగిలిన రెండు గేమ్ ల్లో ప్రదర్శించలేక ప్రత్యర్ధికి మ్యాచ్ అప్పగించింది. తొలి గేమ్‌లో 21-12తో విజయం సాధించిన సైనా ఆ తర్వాత కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో రెండో గేమ్ ను 17-21తో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా మరింత నిరాశపరుస్తూ 10-21తో గేమ్ తో పాటు మ్యాచ్ ను కోల్పోయింది. క్వార్టర్స్ లో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించిన సైనా సెమీస్ లో మాత్రం తడబాటుకు గురై కాంస్యంతో సరిపెట్టుకుంది. మరో సెమీస్ కోసం సిద్ధంగా ఉన్న భారత షట్లర్ పీవీ సింధుపై కూడా ఎన్నో అంచనాలున్నాయి. -
జపాన్ ప్లేయర్ ఒకుహారకు కాంస్యం
జపాన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒకుహార చాలా అదృష్టవంతురాలు. మ్యాచ్ ఆడకుండానే కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం.. రియో ఒలింపిక్స్ లో భాగంగా కాంస్యం కోసం నేటి సాయంత్రం చైనా స్టార్ షట్లర్ లీ ఝురయ్తో మ్యాచ్‌లో ఒకహార తలపడాల్సి ఉంది. అయితే గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో ఆడుతున్న సందర్భంగా లీ ఝురయ్ స్వల్పంగా గాయపడింది. మ్యాచ్ నుంచి వైదొలగకుండా ఝురయ్ అలాగే పోరాడి 21-14, 21-16 తేడాతో మారిన్ చేతితో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని ఝురయ్ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎలాంటి పోరు లేకుండానే ఒకుహార కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చేతిలో 21-19, 21-10తో ఓటమిపాలైన ఒకుహారకు కాంస్యం దక్కడం ఊరటనిచ్చే అంశమే. ఒకవేళ చైనా స్టార్ ఝరయ్ ఫిట్ గా ఉన్నట్లయితే ఒకుహార కాంస్యం నెగ్గడం అంత తేలిక కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారత షట్లర్‌కు సాధ్యంకాని ఫీట్ నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సెమీస్ లో జపాన్ ప్లేయర్ ఒకుహారపై 21-19, 21-10 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు వరుస గేమ్ లను గెలుచుకుని మ్యాచ్ నెగ్గింది. సింధు అద్భుత ఆటతీరుతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తనకు అధికంగా పాయింట్లు సాధించిపెట్టే స్మాష్ షాట్లతో సింధు చెలరేగి పాయింట్లు సాధించింది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు, ఒకుహార నువ్వానేనా అనేలా పోటీపడి మరీ పాయింట్లు సాధించారు. అయితే సింధు స్మాష్ లతో విరుచుకుపడి తొలి గేమ్ ను 30 నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. రెండో గేమ్ లో సింధు జోరును ఒకుహార అడ్డుకోలేకపోయింది. ఓ దశలో 10-10 స్కోరుతో ఉన్న సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ అక్కడి నుంచి ప్రత్యర్థికి మరో పాయింట్ ఇవ్వకుండా మట్టికరిపించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో స్వర్ణ పతకం పోరులో తలపడనుంది. కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ప్రవేశించిన పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సెమీఫైనల్ పోరులో సింధు అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని వైఎస్ జగన్ తన ట్వీట్ లో కొనియాడారు. కరోలినా మారిన్‌తో జరిగే ఫైనల్ పోరులో సింధు స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. Congratulations @Pvsindhu1. Amazing performance. Go for gold. #Rio2016 — YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016 -
హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూసింది. జపనీస్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాతో గంటపైగా సాగిన మ్యాచ్ లో 17-21, 21-13, 11-21తో సింధు పరాజయం పాలైంది. నోజోమీతో సింధు తలపడడం ఇది రెండోసారి. 2012లో ఆసియా యూత్ బ్యాడ్మింటన్ అండర్-19 టోర్నమెంట్ లో తొలిసారిగా వీరిద్దరూ పోటీపడ్డారు.