
సియోల్: ఒక్క పాయింట్ సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిని చేజేతులా వదులుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్ నుంచి భారంగా నిష్క్రమించింది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా అనూహ్యంగా ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 21–15, 15–21, 20–22తో ఒకుహారా చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్ నుంచి హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో ఇద్దరు చెరో గేమ్ గెలిచి సమఉజ్జీగా నిలిచారు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో కాస్త దూకుడు పెంచిన సైనా 4–1తో అధిక్యంలోకి వెళ్లింది.
అయితే వెంటనే తేరుకున్న ప్రత్యర్థి వరుస పాయింట్లు సాధించడంతో సైనా ఆధిక్యం 11–10కు తగ్గింది. ఆ తర్వాత భారత షట్లర్ కూడా వరుసగా 5 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సైనా మరింత జోరు పెంచి నాలుగు పాయింట్లు నెగ్గింది. 20–16తో విజయం అంచుల్లో నిలిచింది. ఒక్క పాయింట్ సాధించి విజయం ఖాయం చేసుకోవాల్సిన స్థితిలో సైనా తడబడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వరుసగా ఆరు పాయింట్లు ఒకుహారాకు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ గెలిచిన సైనా... ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సహచర క్రీడాకారిణి సింధును ఓడించి స్వర్ణం గెలిచింది. ఇటీవల ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment