టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్.. హైదరాబాదీ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యిపై 21-19, 21-9తో ఓడించింది. కాగా మ్యాచ్ ఫలితం 38 నిమిషాల్లోనే పూర్తయింది. కాగా రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన ఆరవ సీడ్ నవోమి ఒకుహరాతో తలపడాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఒకుహరా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్‌కు బై లభించింది. దీంతో మూడో రౌండ్‌లో సైనా నెహ్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య విజేతతో తలపడనుంది.
శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ
ఇక తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ముందంజ వేయగా, మరో భారత ఆటగాడు బి.సాయిప్రణీత్ పోరు మొదటి మ్యాచ్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో కూడా మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది.
2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నాలుగో సీడ్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ) ముందు తలవంచాడు. చెన్ 21–15, 15–21, 21–15 స్కోరుతో సాయిప్రణీత్‌ను ఓడించాడు. 51 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగిన మరో పోరులో 12వ సీడ్ శ్రీకాంత్ 22–20, 21–19 తేడాతో ఎన్‌హట్ గుయెన్ (ఐర్లాండ్)పై విజయం సాధించాడు. 9వ సీడ్ లక్ష్య సేన్ 21–12, 21–11తో క్రిస్టియాన్ సోల్‌బర్గ్ (డెన్మార్క్)ను చిత్తు చేయగా, ప్రణయ్ 21–12, 21–11 స్కోరుతో ల్యూకా రాబర్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 14–21, 12–21తో లైన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైంది.
మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి– అశ్విని పొన్నప్పతో పాటు పూజ దండు–సంజనా సంతోష్ జోడి కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో సిక్కి–అశ్విని 21–7, 21–19తో అమీనత్ నబీహా – ఫాతిమా నబాహా (మాల్దీవులు)ను చిత్తుగా ఓడించారు. పూజ–సంజన 21–6, 10–21, 21–14తో లూసియా సలాజర్–పౌలా రీగల్ (పెరూ)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల జోడి 21–17, 17–21, 22–20తో సుపాక్ జోమ్‌కో– కిటునుపాంగ్ (థాయిలాండ్)ను ఓడించి ముందంజ వేయగా, మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయానికి నిరాశ ఎదురైంది. మను–సుమీత్ 11–21, 21–19, 15–21తో హిరోకి ఒకమురా–మసాయుకి ఒనొడెరా (జపాన్) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో 21–12, 21–13తో ప్యాట్రిక్ షీల్–ఫ్రాన్సిస్కా వోక్‌మన్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment