
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారత షట్లర్కు సాధ్యంకాని ఫీట్ నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సెమీస్ లో జపాన్ ప్లేయర్ ఒకుహారపై 21-19, 21-10 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు వరుస గేమ్ లను గెలుచుకుని మ్యాచ్ నెగ్గింది. సింధు అద్భుత ఆటతీరుతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తనకు అధికంగా పాయింట్లు సాధించిపెట్టే స్మాష్ షాట్లతో సింధు చెలరేగి పాయింట్లు సాధించింది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు, ఒకుహార నువ్వానేనా అనేలా పోటీపడి మరీ పాయింట్లు సాధించారు. అయితే సింధు స్మాష్ లతో విరుచుకుపడి తొలి గేమ్ ను 30 నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. రెండో గేమ్ లో సింధు జోరును ఒకుహార అడ్డుకోలేకపోయింది. ఓ దశలో 10-10 స్కోరుతో ఉన్న సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ అక్కడి నుంచి ప్రత్యర్థికి మరో పాయింట్ ఇవ్వకుండా మట్టికరిపించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో స్వర్ణ పతకం పోరులో తలపడనుంది.
కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్
బ్యాడ్మింటన్ ఫైనల్లో ప్రవేశించిన పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సెమీఫైనల్ పోరులో సింధు అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని వైఎస్ జగన్ తన ట్వీట్ లో కొనియాడారు. కరోలినా మారిన్తో జరిగే ఫైనల్ పోరులో సింధు స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
Congratulations @Pvsindhu1. Amazing performance. Go for gold. #Rio2016
— YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016