శాసించి...సాధించి
⇒ఒకుహారాపై ఈసారి సింధు పైచేయి
⇒మూడు గేముల్లో ప్రపంచ చాంపియన్‌పై విజయం
⇒కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం
⇒రూ. 28 లక్షల 83 వేల ప్రైజ్‌మనీ సొంతం
వేదిక మారింది... టోర్నీ మారింది... పీవీ సింధు, నొజోమి ఒకుహారాల ఆట మాత్రం అబ్బురపరిచేలా సాగింది... ప్రతీ పాయింట్‌కు అసమాన పోరాటం... ఫిట్‌నెస్‌కు పరీక్ష పెట్టేలా సుదీర్ఘ ర్యాలీలు... కళ్లు చెదిరే స్మాష్‌లు... ఆధిక్యం దోబూచులాట... చివరకు ఒత్తిడికి ఎదురునిలిచిన సింధు విజేతగా అవతరించింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. తాజా గెలుపుతో మూడు వారాల క్రితం గ్లాస్గో నగరంలో ఒకుహారా చేతిలో ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ఈ తెలుగు అమ్మాయి ప్రతీకారం తీర్చుకుంది. తన కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
సియోల్ (దక్షిణ కొరియా): భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అనుకున్నది సాధించింది. 110 నిమిషాలపాటు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఓటమి ఎదురయ్యాక ‘నా సమయం కూడా వస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే మూడు వారాల్లోనే ఒకుహారాతో లెక్క సరిచేసింది. వేదిక, టోర్నీ మారిందంతే. ఆదివారం ముగిసిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో 83 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 22–20, 11–21, 21–18తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల (రూ. 28 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించింది. సింధు కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ (2016), ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ (2017)లో టైటిల్స్ గెలిచింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 4–4తో సమఉజ్జీగా నిలిచారు.
పోటాపోటీ: ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా ఆద్యంతం హోరాహోరీగా జరిగింది. సుదీర్ఘ ర్యాలీలు సాగడం, ఇద్దరిలో ఒకరు తప్పిదం చేయడంతో పాయింట్లు వచ్చాయి. తొలి గేమ్‌లో ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడింది. చివర్లో సింధు 18–20తో వెనుకబడిన దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధు ఆటతీరు ఒక్కసారిగా గాడి తప్పింది. పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి పాయింట్లు కోల్పోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆడుతూ 11–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరు పాయింట్లతో వెనుకబడిన ఒకుహారా ఏమాత్రం పట్టువిడవకుండా పోరాడటంతో ఒకదశలో వీరిద్దరి మధ్య తేడా రెండు పాయింట్లకు చేరుకుంది. స్కోరు 20–18 వద్ద ఇద్దరి మధ్య 56 షాట్‌ల మారథాన్ ర్యాలీ జరగడం... చివరకు ఒకుహారా కొట్టిన షటిల్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది.
ప్రశంసల వర్షం: కొరియా ఓపెన్ టైటిల్ నెగ్గిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. ‘కొరియా ఓపెన్‌లో విజేతగా నిలిచినందుకు అభినందనలు. ఈ విజయంపట్ల దేశం మొత్తం గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా సింధును ప్రశంసించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విజయం ఎంతో ప్రత్యేకం. రెండో గేమ్‌లో నేను షటిల్‌ను నియంత్రించలేకపోయాను. ఇక మూడో గేమ్‌లో నేను ఆధిక్యంలో ఉన్నా ఒకుహారా పోరాటాన్ని ఆపలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో గేమ్‌లో నేను 19–17తో ముందంజలో ఉన్నా ఓడిపోయాను. అయితే ఈ మ్యాచ్‌లో నేను ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఫలితం గురించి ఆలోచించలేదు. ఈ విజయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున లభించడంతో ఆయనకు అంకితం ఇస్తున్నాను.
– సింధు
ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సింధులో అటాకింగ్ గేమ్ శైలిని మరింతగా పెంచాలని నిర్ణయించాం. ఆ దిశగా ప్రాక్టీస్ చేయించాం. 22 ఏళ్లకే సింధు చాలా గొప్ప విజయాలు సాధిం చింది. ఇదేస్థాయిలో నిలకడగా ఆడితే భవిష్యత్‌లో ఆమె కచ్చితంగా ప్రపంచ నంబర్‌వన్ అవుతుంది.
– పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్