
పోరాడి ఓడిన సింధు.. రజతంతో సరి
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రజతం కైవసం చేసుకుంది. ఇక్కడ ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో స్వర్ణం కోసం తుదివరకూ పోరాడిన సింధుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్ధి, జపాన్ ప్లేయర్ నోజొమి ఓకుహర చేతిలో 19-21, 22-20, 20-22 తేడాతో సింధు ఓటమి చవిచూసింది. దీంతో మూడో యత్నంలోనూ ఆమె స్వర్ణం సొంతం చేసుకోలేకపోయింది.
తొలి గేమ్ కోల్పోయిన సింధు, రెండో గేమ్ లో విజృంభించి ఆడి గేమ్ సొంతం చేసుకోవడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ కు మ్యాచ్ వెళ్లింది. అయితే మూడో గేమ్ చివర్లో 19-19 పాయింట్లు దశలో ఉండగా.. సింధు ప్రత్యర్ధి ఒకుహర పుంజుకుని రెండు వరుస పాయింట్లు సాధించడంతో సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇప్పటివరకూ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పీవీ సింధు ఇప్పటివరకు రెండుసార్లు(2013, 2014) కాంస్య పతకాలు సాధించారు. ఈసారి భారత్‌కు బంగారు పతకం సాధించిపెట్టాలన్న ధీమాతో పోరాడినా చివరి నిమిషంలో చేసిన తప్పిదంతో గేమ్ తో పాటు మ్యాచ్ ను కోల్పోయింది.