gold madel
-
ముకేశ్ ఖాతాలో నాలుగో స్వర్ణం
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో 11వ స్వర్ణ పతకం చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నెలవల్లి, రాజ్వర్ధన్ పాటిల్, హర్సిమర్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1722 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ముకేశ్, రాజ్వర్ధన్ 579 పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... హర్సిమర్ 564 పాయింట్లు సాధించాడు. ముకేశ్, రాజ్వర్ధన్ వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ పోటీపడ్డారు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజ్వర్ధన్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ముకేశ్ 10 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ ఈ టోరీ్నలో నిలకడగా రాణించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో భారత్ 11 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
Chess Olympiad 2024: చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో...
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. మన గ్రాండ్ మాస్టర్లు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నా అందని ద్రాక్షగానే ఉన్న బంగారు పతకం ఎట్టకేలకు దక్కే అవకాశం వచి్చంది. టోర్నీ చరిత్రలో తొలిసారి భారత పురుషుల జట్టు విజేతగా నిలవడం దాదాపుగా ఖాయమైంది. అడుగడుగునా హేమాహేమీ గ్రాండ్‌మాస్టర్లు, క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైన ఈ మెగా టోరీ్నలో మన ఆటగాళ్లు చిరస్మరణీయ విజయం సాధించారు. పది రౌండ్ల తర్వాత 19 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా చైనా ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. చివరి రౌండ్లో భారత్ ఓడి చైనా గెలిస్తేనే ఇరు జట్ల సమమై టై బ్రేక్‌కు దారి తీస్తుంది. అయితే మన టీమ్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఓటమి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి స్వర్ణం లాంఛనమే కావచ్చు. బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత పురుషుల జట్టు పది రౌండ్ల తర్వాత అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ కీలకమైన ఆఖరి పోరులో విజయం సాధించడంతో భారత్‌కు పసిడి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత్ బృందం మరో రౌండ్ మిగిలుండగానే విజేతగా మారే స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా ఆడిన పది రౌండ్లలో ఏకంగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఒక్క 9వ రౌండ్లో మాత్రం ఉజ్బెకిస్తాన్ భారత్‌ను డ్రాలతో నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్ 2–2తో ‘టై’గా ముగిసింది. శనివారం జరిగిన పదో రౌండ్లో భారత ఆటగాళ్లు 2.5–1.5తో అమెరికాను ఓడించారు. దీంతో భారత్ 19 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆఖరిరౌండ్ ఉన్నప్పటికీ భారత్‌ను చేరుకునే జట్టే లేకపోవడంతో పసిడి పతకం వశమైంది. దొమ్మరాజు గుకేశ్...ఫాబియానో కరువానాపై గెలిచి మంచి ఆరంభమిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో ఆర్.ప్రజ్ఞానంద... వెస్లి సో చేతిలో ఓడిపోవడంతో స్కోరు సమమైంది. ఈ దశలో విదిత్ గుజరాతి... లెవొన్ అరోనియన్‌తో గేమ్ డ్రా చేసుకోవడంతో మరోసారి 1.5–1.5 వద్ద మళ్లీ స్కోరు టై అయ్యింది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్... లినియార్ పెరెజ్‌పై గెలుపొందడంతో భారత్ ఈ టోరీ్నలో తొమ్మిదో విజయాన్ని సాధించింది. మహిళల విభాగంలో భారత బృందం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చదరంగ క్రీడలో గట్టి ప్రత్యర్థి అయిన చైనాకు భారత మహిళల బృందం ఊహించని షాకిచి్చంది. భారత్ 2.5–1.5తో చైనాను కంగుతినిపించింది. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... జూ జినర్‌తో, వంతిక అగర్వాల్... ల్యూ మియోయితో డ్రా చేసుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్... ని షిఖన్ను ఓడించడంతో భారత్ విజయానికి బాటపడింది. ఆఖరి మ్యాచ్‌లో వైశాలి... గ్యూ కి గేమ్ డ్రా కావడంతో చైనా కంగుతింది. చివరిదైన 11వ రౌండ్ తర్వాతే మహిళల జట్టు స్థానం ఖరారవుతుంది. -
శభాష్ రోజా
సాక్షి, చైన్నె: మద్రాసు వర్సిటీ నుంచి ఎంఏ తెలుగులో ప్రతిభ చాటిన ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు అనే మారుమూల గ్రామానికి చెందిన గంధం రోజా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. రోజా పదో తరగతి వరకు స్థానికంగా చదివారు. ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా ఆమె కళాశాల జీవితం ఒడిదుడుకులతో సాగింది. కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో రెండేళ్లు చదువుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు యజ్ఞశేఖర్ సాయంతో చదువు కొనసాగించారు. చైన్నెలో రాణిమేరీ కళాశాలలో బి.ఎ తెలుగులో చేరి గతంలో సీఎం స్టాలిన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ప్రస్తుతం మద్రాసు యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగులో బంగారు పతకం సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తన తల్లి జన్మనిస్తే చదువు పరంగా పునర్జన్మను ఆచార్యులు డాక్టర్ యజ్ఞశేఖర్ ప్రసాదించారని పేర్కొన్నారు. తన చదువు విషయంలో మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడు విస్తాలి శంకరరావు, రాణి మేరి కళాశాల డాక్టర్ నళిని కృషికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తన గ్రామంలో ఎం.ఏ వరకు చదివిన మొదటి యువతిని తానేనని, పీహెచ్డీ చేయాలన్నది తన ఆశయమని తెలిపారు. మారుతున్న సమాజంలో మగవారితో పోటీపడి అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ తమ గ్రామంతో పాటు పలు మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించకుండా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని, ఈ ధోరణి మారాలని ఆమె ఆకాంక్షించారు. -
విజేత జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్ ప్రొ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్ పియర్స్ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్ రౌండ్లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. -
13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతం: వైరల్ వీడియో
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించగా.. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంతో ఒలింపిక్స్‌లో జాతీయ గీతాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మొదటి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. కాగా రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. అంతే కాకుండా చెక్ రిపబ్లిక్కు చెందిన విటెజ్స్లావ్ వెస్లీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంట వ్యవధిలోనే లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. #IND National Anthem at Olympic Stadium in #Tokyo2020 Thank you @Neeraj_chopra1 #NeerajChopra pic.twitter.com/68zCrAX9Ka — Athletics Federation of India (@afiindia) August 7, 2021 -
భారత్ రెజ్లర్ ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
-
స్వర్ణ సురేఖ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో గొప్ప ఘనత జమ చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖఅభిషేక్ వర్మ (భారత్) జంట 158151 పాయింట్ల తేడాతో యి సువాన్ చెన్చియె లున్ చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఫైనల్లో ఒక్కో జోడీకి లక్ష్యంవైపు 16 బాణాల చొప్పున అవకాశం ఇచ్చారు. విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతి సురేఖ తాను సంధించిన ఎనిమిది బాణాలకు గరిష్టంగా లభించే 80 పాయింట్లను సాధించడం విశేషం. ఆమె సంధించిన ఎనిమిది బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లాయి. అభిషేక్ వర్మ 80 పాయింట్లకుగాను 78 పాయింట్లు స్కోరు చేశాడు. ‘ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. గాలి బాగా వీస్తున్నా స్వర్ణం నెగ్గే ఆఖరి అవకాశాన్ని వదులుకోలేదు’ అని సురేఖ వ్యాఖ్యానించింది. అంతకుముందు జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో భారత జట్టు 215231తో చెవన్ సో, యున్ సూ సాంగ్, డేయోంగ్ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232233తో కేవలం పాయింట్ తేడాతో జేవన్ యాంగ్, యోంగ్హి చోయ్, యున్ క్యు చోయ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. బుధ వారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో కలిపి భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. గురువారం ఇదే వేదికపై టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 2: కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు పది ఆసియా చాంపియన్‌షిప్‌లు జరిగాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జంట స్వర్ణం నెగ్గడం ఇది రెండోసారి. 2013లో అభిషేక్ వర్మలిల్లీ చాను ద్వయం తొలి పసిడి పతకం గెలిచింది. 3: ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో జ్యోతి సురేఖ నెగ్గిన స్వర్ణాల సంఖ్య. సురేఖ 2015లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పసిడి పతకాలు సాధించింది. 30: తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన పతకాలు. ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. -
సింధు స్వర్ణ ప్రపంచం
నిరీక్షణ ముగిసింది. పసిడి స్వప్నం సాకారమైంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బ్యాడ్మింటన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విశ్వకిరీటం మన సొంతమైంది. గత రెండు పర్యాయాల్లో పసిడి మెట్టుపై బోల్తా పడిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మూడో ప్రయత్నంలో తన బంగారు కలను నిజం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్ అమ్మాయి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో భారత్ తరఫున తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఘనతను సాధించింది. బాసెల్ (స్విట్జర్లాండ్): ఎట్టకేలకు తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ పసిడి కల నిజమైంది. ప్రత్యర్థిపై చిరుతలా విరుచుకుపడిన సింధు అనుకున్నది సాధించింది. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఆహా... ఏమి ఆట... తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు దూకుడుగానే ఆడింది. ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే చూపించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది. ఎక్కడా తగ్గలేదు... తొలి గేమ్ గెల్చుకున్న సింధు రెండో గేమ్‌లోనూ హడలెత్తించింది. ఒకుహారా ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసినట్లు కనిపించిన ఈ హైదరాబాదీ ఆటలో వైవిధ్యం కనబరిచింది. సింధు జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఏదశలోనూ ఒకుహారాకు అంతుచిక్కలేదు. నేరుగా ఒకుహారా శరీరంపై సింధు సంధించిన కొన్ని స్మాష్ షాట్లకు జపాన్ క్రీడాకారిణి వద్ద సమాధానమే లేకపోయింది. సింధు కొట్టిన స్మాష్‌లకు ఒకుహారా రిటర్న్ చేసినా ఆ స్మాష్‌ల వేగానికి కొన్నిసార్లు షటిల్స్ బయటకు వెళ్లిపోయాయి. ఫలితంగా రెండో గేమ్‌లో విరామానికి సింధు 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా సింధు ఆధిపత్యం కొనసాగించి క్రమం తప్పకుండా పాయింట్లు సాధించగా... ఒకుహారా పూర్తిగా డీలా పడిపోయింది. స్కోరు 20–7 వద్ద సింధు కొట్టిన స్మాష్ షాట్‌ను ఒకుçహారా రిటర్న్ చేయలేకపోవడంతో పాయింట్, గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ భారత స్టార్ కైవసం చేసుకుంది. 2006లో 21 పాయింట్ల విధానం ప్రవేశ పెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకపక్షంగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ ఇదే కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మొమోటా 21–9, 21–3తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. బాయ్ నజరానా రూ. 20 లక్షలు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాయిప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఆ పిలుపు... చెప్పలేని ఆనందం నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా సాక్షితో సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన సింధు... తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలకు రాకెట్‌తో సమాధానమిచ్చింది. ‘గొప్ప టోర్నీలు ఆడగలదు కానీ ఫైనల్స్ గెలవలేదు’ అని ధ్వజమెత్తిన విమర్శకుల నోళ్లన్నీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణంతో మూగబోయేలా చేసింది. ఇక నుంచి పట్టిందల్లా బంగారమే అనే స్థాయిలో బరిలో దిగుతానంటూ, గెలవాలనే స్ఫూర్తి తనలో నిరంతరం రగులుతూనే ఉంటుందంటూ స్విట్జర్లాండ్ నుంచి ‘సాక్షి క్రీడా ప్రతినిధి’తో ఫోన్లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే... ఈ విజయం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనుభూతి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. చివరికి ‘ప్రపంచ చాంపియన్’ అనే హోదా దక్కింది. రజతాలు, కాంస్యాలు ఎన్ని సాధించినా ... ‘సింధు ప్రపంచ చాంపియన్’ అనే పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. దీన్నిమించిన ఒలింపిక్స్ పతకమే ఉందిగా? ఈ విజయాన్ని ఒలింపిక్స్ పతకంతో పోల్చవద్దు. ఒలింపిక్స్ అత్యున్నత స్థాయి టోర్నీ అయినప్పటికీ ప్రపంచ ఈవెంట్ కూడా దీనికి తక్కువేమీ కాదు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. దేని విలువ దానిదే. ఈ టోర్నీ కోసం ఎలా సన్నద్ధమయ్యారు? కోచ్‌లు గోపీ సర్‌తో పాటు కిమ్ జి హ్యూన్ టోర్నీ కోసం నన్ను చాలా బాగా సిద్ధం చేశారు. వ్యూహాల్ని పక్కాగా అమలు చేశా. కొత్త ట్రెయినర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నా ఫిట్నెస్ మరో స్థాయికి చేరింది. గతంలో ర్యాలీలు ఆడాల్సినప్పుడు చాలా అలసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటున్నా. తదుపరి లక్ష్యం? టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. నేనెప్పుడు ఇక చాల్లే అని అనుకోలేదు. ఇంకా గెలవాలి, బాగా ఆడాలనే అనుకుంటా. ప్రతీ గెలుపు మరింత బాగా ఆడాలనే స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదా వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. నాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి మరింత బాగా ఆడాలి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కూడా సాధించాల్సి ఉంది. ప్రశంసల వెల్లువ.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన సింధుకు అభినందనలు. యావత్ దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఈ మీ విజయం లక్షలాది మందికి ప్రేరణగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. –రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి నీ ప్రదర్శనతో దేశం మొత్తం మళ్లీ గర్వపడేలా చేశావ్. ఆటపట్ల ఉన్న అంకితభావం, గెలవాలన్న కసి భావితరాల క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రపంచ చాంపియన్ షిప్లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌కు కూడా శుభాకాంక్షలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం సింధుకు శుభాకాంక్షలు. నీ విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. –కేసీఆర్, తెలంగాణ సీఎం సింధు... నీ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్విస్తోంది. – నరసింహన్, తెలంగాణ గవర్నర్ సింధుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాంపియన్స్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది. – కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించిన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి. –విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ గొప్ప ప్రదర్శన. ప్రపంచ చాంపియన్ అయినందుకు అభినందనలు. మరోసారి దేశం గర్వపడేలా చేశావ్. –సచిన్ టెండూల్కర్ సింధు అభినందనలు. అత్యద్భుత ప్రదర్శన చేశావ్. నీ ప్రదర్శన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. – కేటీఆర్, తెలంగాణ, బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు 2.0 ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు ఖాతాలో ఉన్నాయి. అంతకుమించి మూడేళ్ల క్రితమే ఒలింపిక్స్ రజత మాల తన మెడలో పడింది. ఇక సూపర్ సిరీస్ టోర్నీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవార్డులు, రివార్డులు... ఆర్జనలో మేటి అని ‘ఫోర్బ్స్’ అంకెలు అగ్ర తాంబూలమిస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో ఇన్ని ఘనతల తర్వాత మరో ప్లేయర్ అయితే తాము సాధించినదానితో సంతృప్తి పడిపోయేవారేమో... కొత్తగా స్ఫూర్తి పొందడానికి వారికి ఏమీ ఉండకపోయేదేమో. కానీ మన సింధు అలా అనుకోలేదు. ప్రపంచ వేదికపై ఆమె స్వర్ణదాహం తీరలేదు. అందుకే ఈసారి బంగారం పట్టాలని పట్టుదలగా బరిలోకి దిగింది. తై జు యింగ్‌పై క్వార్టర్స్‌లో అద్భుత విజయం తర్వాత ‘ఇంకా నా ఆట పూర్తి కాలేదు’ అంటూ సవాల్ విసిరిన సింధు మరో రెండు మ్యాచ్‌లలో అదే జోరు ప్రదర్శించింది. అందకుండా ఊరిస్తున్న పసిడిని తన ఖాతాలో వేసుకొని షటిల్ శిఖరాన నిలిచింది. ‘వరల్డ్’ అరంగేట్రంలోనే అదుర్స్... 2013లో సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఇద్దరు చైనా స్టార్లపై సాధించిన రెండు విజయాలు సింధు భవిష్యత్తును చూపించాయి. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ వాంగ్ యిహాన్‌ను, క్వార్టర్ ఫైనల్లో వాంగ్ షిజియాన్లను ఆమె అలవోకగా ఓడించింది. తర్వాతి ఏడాది కూడా షిజియాన్‌ను చిత్తు చేసి అప్పటి నుంచి చైనా మనకు ఏమాత్రం అడ్డుగోడ కాదని సింధు నిరూపించింది. టీనేజీ దాటకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్న సింధు తర్వాతి లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోయింది. 2015 కొంత నిరాశపర్చినా... తర్వాతి ఏడాది సింధు గర్జన ‘రియో’లో వినిపించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత ఈ తెలుగు తేజం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె విశ్వ సమరంలో పతకం గెలవకపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే అందులో విశేషం ఏమీ లేని స్థితికి చేరుకుంది! ఇలాంటి లెక్కలను సింధు నిజం చేసి చూపించింది. వరుసగా రెండేళ్లు 2017, 2018లలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు సత్తా వెండి వెన్నెల కురిపించింది. లోపాలపై దృష్టి పెట్టి... సహజంగానే సింధు ఈసారి స్వర్ణానికి గురి పెట్టింది. చెట్టు చిటారు కొమ్మన నిలిచిన పక్షిని కొడితే రజతంతో ఆగిపోవాల్సి వస్తోంది తప్ప బంగారం మెరుపు దక్కడం లేదు. అందుకే ఇప్పుడు పక్షి కన్నుపైకే గెలుపు బాణాన్ని సంధించింది. అందు కోసం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేకంగా తన లోపాలపై దృష్టి పెట్టి సాధన చేసింది. క్వార్టర్స్‌లో తై జుతో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. తొలి గేమ్‌ను చిత్తుగా కోల్పోయినా... తర్వాత చెలరేగింది. మ్యాచ్ ఆసాంతం చూస్తే ప్రత్యర్థి శరీరంపైకి స్మాష్‌లను సంధించడం సింధు ఆటలో కొత్త కోణం. చివర్లో ఒత్తిడిలో పడే సమస్య రాకుండా ఆరంభం నుంచే దూకుడుకు ప్రాధాన్యతనిచ్చింది. తన ఎత్తు కారణంగా డ్రాప్ షాట్లను రిటర్న్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందిని కూడా అధిగమించింది. తనకు స్మాష్ కొట్టే అవకాశం వచ్చే వరకు ప్రత్యర్థిని సాధ్యమైనంతగా ర్యాలీలతోనే ఆడించే ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. 360 డిగ్రీల కోణంలో చురుకైన కదలికలతో కోర్టు మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ మెగా టోర్నీలో సింధు ఆడిన ఆట నిజంగా సూపర్బ్. తదుపరి స్వర్ణ గురి ‘టోక్యోలో’... నిజానికి 2019లో సింధుకు గొప్ప ఫలితాలు ఏమీ రాలేదు. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో ఓడగా, ఆల్ ఇంగ్లండ్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇండియా ఓపెన్‌లో, సింగపూర్ ఓపెన్‌లోనూ సెమీస్‌కే పరిమితం కాగా, మలేసియా ఓపెన్‌లో కనీసం క్వార్ట ర్స్ ఆనందం కూడా దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్ ఓపెన్దీ అదే కథ. ఇండోనేసియాలో రన్నరప్‌గా నిలవడంతో కొంత సంతృప్తి దక్కగా, తర్వాతి వారమే జపాన్‌లో ఆనందం ఆవిరైంది. వరల్డ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం థాయిలాండ్ ఓపెన్‌కు దూరమైన ఈ హైదరాబాదీ చివరకు తన లక్ష్యాన్ని చేరింది. తాజా ఫామ్, సర్క్యూట్లో ఉన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే మరో ఒలింపిక్ పతకం సింధు కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. బ్రెజిల్ గడ్డపై చేజారిన కనకపు హారాన్ని టోక్యోలో వరిస్తే భారత అభిమానులకు కావాల్సిందేముంది! చాలా గర్వంగా ఉంది సింధు ఫైనల్స్‌లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. – పీవీ రమణ (సింధు తండ్రి) అమ్మకు అంకితం... హైదరాబాద్‌కు వచ్చాకే సంబరాలు చేసుకుంటా. ప్రస్తుతం టీమ్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నా. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు. తనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని ఆమెకు ఇస్తున్నా. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. –పీవీ సింధు –సాక్షి క్రీడావిభాగం -
మెరిసిన భారత రెజ్లర్లు
సోఫియా (బల్గేరియా): ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఫ్రీస్టయిల్ బాలుర విభాగంలో ఉదిత్ (48 కేజీలు), అమన్ (55 కేజీలు), మనీశ్ గోస్వామి (65 కేజీలు), అనిరుధ్ కుమార్ (110 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. గ్రీకో రోమన్ బాలుర విభాగంలో రూపిన్ (48 కేజీలు) కాంస్యం నెగ్గగా... ప్రవీణ్ పాండురంగ పాటిల్ (55 కేజీలు) రజతం సొంతం చేసుకున్నాడు. భారత గ్రీకో రోమన్ జట్టుకు తెలంగాణకు చెందిన జి.అశోక్ కుమార్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ఫ్రీస్టయిల్ బాలికల విభాగంలో కోమల్ (40 కేజీలు), సోనమ్ (65 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకోగా... హనీ కుమారి (46 కేజీలు) కాంస్యం గెల్చుకుంది. -
శివ థాపా పసిడి పంచ్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్ శివ థాపా కజకిస్తాన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్ (కజకిస్తాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్ లభించింది. స్వర్ణం ఖాయమైంది. పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన దుర్యోధన్ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు. -
హిమ దాస్‌కు రెండో స్వర్ణం
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ వారం వ్యవధిలో అంతర్జాతీయ టోర్నమెంట్లో రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. పోలాండ్‌లో జరిగిన కుట్నో అథ్లెటిక్స్ మీట్లో హిమ దాస్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. హిమ 23.97 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన విస్మయ 24.06 సెకన్లలో రేసును ముగించి రజత పతకం దక్కించుకుంది. గత మంగళవారం పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి మీట్లోనూ హిమ 200 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది. -
'స్వప్న' సాకారం: తల్లి భావోద్వేగం
-
అవినీతిలో మీకు ‘గోల్డ్‌మెడల్’
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తన విమర్శల ధాటిని పెంచారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో ‘గోల్డ్ మెడల్’ సాధించిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలకు అధికారం మత్తు తలకెక్కిందని ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుల్బర్గ, బళ్లారి, బెంగళూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ పాల్గొన్నారు. రాహుల్ వందేమాతరాన్ని అగౌరవపరచటం, సర్జికల్ దాడులను కాంగ్రెస్ ప్రశ్నించటాన్ని ప్రధాని గుర్తుచేశారు. జాతి గర్వించే సైనికుల త్యాగాలనూ కాంగ్రెస్ విస్మరించిందన్నారు. బెంగళూరులో జరిగిన ర్యాలీలో రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మంత్రులకు, వారి శాఖలకు ఎవరెక్కువ అవినీతిపరులో నిరూపించుకునేందుకు పోటీ నెలకొందని ఎద్దేవా చేశారు. అందుకే సిద్దరామయ్య ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు అవినీతిలో గోల్డ్‌మెడలిస్టులని మోదీ పేర్కొన్నారు. ‘బెంగళూరు ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు పనులు, అవినీతి, అక్రమాలపై కోపంగా ఉన్నారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన నగరాన్ని ఐదేళ్లలో పాపపు నగరంగా (వ్యాలీ ఆఫ్ సిన్)గా మార్చేశారు. గార్డెన్ సిటీ (ఉద్యాన నగరి)ని గార్బేజ్ సిటీ (చెత్త నగరం)గా మార్చారు. కంప్యూటర్ రాజధానిని నేరాల రాజధానిగా మార్చారు’ అని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. జేడీఎస్‌ను బీజేపీ ‘బీ’టీమ్‌గా రాహుల్ పేర్కొనటాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జేడీఎస్‌కు ఓటు వేసి ఆ ఓటును వ్యర్థం చేసుకోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ మూడోస్థానంలో నిలుస్తుందన్నారు. మైనింగ్ పాలసీ మరిచారా? గాలి సోదరులకు టికెట్లు ఇవ్వటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మోదీ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా తాము అవినీతికి పాల్పడటం లేదని.. అక్రమ గనుల తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన మైనింగ్ పాలసీ గురించి ముందు తెలుసుకోవాలన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ‘సీధా రూపయ్య గవర్నమెంట్’ (అవినీతి)గా అభివర్ణించారు. ‘సర్కారు బదలిసి.. బీజేపీ గెల్లిసి’ (ఈ సర్కారును మార్చండి.. బీజేపీని గెలిపించండి) అంటూ రెండు చేతులూ పైకెత్తి మోదీ కన్నడలో బిగ్గరగా నినదించారు. -
సైనాకు స్వర్ణం.. సింధుకు రజతం..
-
వహ్వా... అఖిల్
గ్వాడలహారా (మెక్సికో): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత గన్ మళ్లీ గర్జించింది. నాలుగో స్వర్ణంతో మెరిసింది. పురుషుల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో మేటి షూటర్లు బరిలో ఉండగా... కెరీర్లో కేవలం రెండో ప్రపంచకప్ ఆడుతోన్న 22 ఏళ్ల అఖిల్ షెరాన్ అద్భుతమే చేశాడు. ఎలాంటి ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడుతూ అందర్నీ బోల్తా కొట్టించి ఈ మెగా ఈవెంట్లో తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువ షూటర్ గురికి భారత్ ఖాతాలో నాలుగో పసిడి పతకం వచ్చి పడింది. అఖిల్‌తోపాటు భారత్‌కే చెందిన సంజీవ్ రాజ్‌పుత్, స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు చేరారు. అఖిల్ 455.6 పాయింట్లతో విజేతగా నిలువగా... బెర్నాడ్ పికిల్ (ఆస్ట్రియా–452 పాయింట్లు) రజతం, ఇస్త్వాన్ పెని (హంగేరి–442.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. 430.9 పాయింట్లతో సంజీవ్ రాజ్‌పుత్ నాలుగో స్థానంలో... 407.2 పాయింట్లో స్వప్నిల్ ఆరో స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కిది తొమ్మిదో పతకం. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. అంతర్జాతీయ షూటింగ్లో 38 పతకాలు గెలిచిన హంగేరి దిగ్గజం పీటర్ సిడి, రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత అలెక్సిక్ రెనాల్డ్ (ఫ్రాన్స్), ఎయిర్ రైఫిల్‌లో పసిడి పతకం నెగ్గిన ఇస్త్వాన్ పెని (హంగేరి)లాంటి మేటి షూటర్లు బరిలో ఉండగా... అఖిల్ సంయమనంతో షూట్ చేసి అనుకున్న ఫలితం సాధించాడు. క్వాలిఫయింగ్‌లో త్రీ పొజిషన్స్ (మోకాళ్లపై కూర్చోని, ముందుకు వాలి, నిలబడి)లో భాగంగా షూటర్లు ఒక్కో విభాగంలో 40 చొప్పున షాట్లు సంధించారు. 1174 పాయింట్లతో అఖిల్ నాలుగో స్థానంలో, 1176 పాయింట్లతో రాజ్‌పుత్ రెండో స్థానంలో, 1168 పాయింట్లతో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఎనిమిది మందితో కూడిన ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ చివరిదాకా నిలకడగా పాయింట్లు స్కోరు చేశాడు. చివరి షాట్లో అఖిల్ అత్యుత్తమంగా 10.8 స్కోరు చేయడం విశేషం. మరోవైపు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్ ఐదో స్థానంలో నిలిచింది. -
చివరి రోజు నిరాశే
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు భారత రెజ్లర్లకు నిరాశే మిగిలింది. ఆదివారం పతకం కోసం పోటీ పడ్డ ఇద్దరు రెజ్లర్లు ఓటమి పాలవడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరలేదు. ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో ముగించింది. చివరి రోజు పతకం కోసం పోటీ పడ్డ శ్రవణ్ తోమర్, దీపక్ పూనియా నిరాశపరిచారు. 61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ శ్రవణ్ 0–10తో కజుయ కోయాంగి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో మరో అవకాశం దక్కించుకున్న శ్రవణ్ కాంస్యం కోసం జరిగిన పోరులో అబ్బాస్ రఖ్‌మోనొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దీపక్ పునియా (86 కేజీలు) క్వార్టర్స్‌లో 0–7తో ఉతుమెన్ ఉర్గోడొల్ (మంగోలియా) చేతిలో ఓడినా రెప్‌చేజ్ రౌండ్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ 7–2తో శోతె షిరాయి (జపాన్)పై గెలుపొంది కాంస్య పోరుకు అర్హత సాధించాడు. పతక పోరులో 0–10తో షెంగ్‌ఫెంగ్ బి (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
బరిలోకి దిగితే బంగారు పతకమే
బరిలోకి దిగితే బంగారు పతకమే! గుంటూరు స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ట్రాక్‌లో అడుగుపెడితే బంగారు పతకాన్ని సాధించడం ఖాయం. ఆ పసిడి పతకాల విజయపరంపరే ఆయన ఇంటిపేరును సైతం గోల్డ్‌గా మార్చేసింది. ఆయనే గుంటూరుకు చెందిన వెటరన్ అథ్లెట్ తోట సుబ్బారావు అలియాస్ గోల్డ్ సుబ్బారావు. గుడికి వెళ్లడం కంటే గ్రౌండ్‌కు వెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటున్న సుబ్బారావు విజయగాథ ఇదీ... మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన తోట సుబ్బారావు అమినాబాద్లోని స్కూల్లో విద్యనభ్యసిస్తూ అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందారు. స్కూల్ స్థాయి టోర్నమెంట్లో రెండు రజత, ఒక కాంశ్య పతకాలు సాధించడంతోపాటు స్కూల్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పేదరికం వల్ల పదో తరగతితో చదువు ఆపేసి, ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే పేరేచర్లలోని ఎస్‌జీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో సాధన కొనసాగిస్తూ అనేక పతకాలు సాధించారు. ఇటీవల గుంటూరులో స్థిరపడ్డాక స్థానిక ఎన్టీఆర్‌స్టేడియంలో సాధన కొనసాగిస్తున్నారు. సీనియర్ వెటరన్ క్రీడాకారుడు సత్యనారాయణరెడ్డి ప్రొత్సాహంతో 2005 నుంచి రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లలో పాల్గొని 21 బంగారు, ఏడు రజత, ఒక కాంశ్య పతకాలు ఆయన సాధించారు. జాతీయ స్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఒక బంగారు, ఒక కాంస్య పతకాన్ని కైవశం చేసుకున్నారు. వెటరన్ విభాగంలో 200, 400, 800 మీటర్ల పరుగు పందెంలో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈపూరులో జరిగే జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని మరికొన్ని పతకాలు తన ఖాతాలోకి వేసుకొనేందుకు కఠోర సాధన చేస్తున్నారు. ఇదీ ఆశయం.. జయ్‌పూర్‌లో జరిగే జాతీయ స్థాయి వెటరన్ టోర్నమెంట్లో బంగారు పతకాలు సాధించేందుకు నిరంతరం సాధన చేస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కనబర్చిన అండర్-14, 16 విభాగాల్లో 20 మంది అథ్లెట్సిను దత్తత తీసుకుని వారికి అవసరమైన పౌష్టికాహారం, క్రీడా దుస్తులు అందించి, అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది జిల్లాను అథ్లెటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలపాలన్నదే నా ఆశయం. దీనికి త్వరలో శ్రీకారం చుడతాను. - తోట సుబ్బారావు