బెంగళూరు సభలో వేదికపై ప్రధాని మోదీ, అనంత్ కుమార్, సదానంద గౌడ, ఎస్‌ఎం కృష్ణ
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తన విమర్శల ధాటిని పెంచారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో ‘గోల్డ్ మెడల్’ సాధించిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలకు అధికారం మత్తు తలకెక్కిందని ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుల్బర్గ, బళ్లారి, బెంగళూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ పాల్గొన్నారు. రాహుల్ వందేమాతరాన్ని అగౌరవపరచటం, సర్జికల్ దాడులను కాంగ్రెస్ ప్రశ్నించటాన్ని ప్రధాని గుర్తుచేశారు. జాతి గర్వించే సైనికుల త్యాగాలనూ కాంగ్రెస్ విస్మరించిందన్నారు.
బెంగళూరులో జరిగిన ర్యాలీలో
రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మంత్రులకు, వారి శాఖలకు ఎవరెక్కువ అవినీతిపరులో నిరూపించుకునేందుకు పోటీ నెలకొందని ఎద్దేవా చేశారు. అందుకే సిద్దరామయ్య ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు అవినీతిలో గోల్డ్‌మెడలిస్టులని మోదీ పేర్కొన్నారు. ‘బెంగళూరు ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు పనులు, అవినీతి, అక్రమాలపై కోపంగా ఉన్నారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన నగరాన్ని ఐదేళ్లలో పాపపు నగరంగా (వ్యాలీ ఆఫ్ సిన్)గా మార్చేశారు. గార్డెన్ సిటీ (ఉద్యాన నగరి)ని గార్బేజ్ సిటీ (చెత్త నగరం)గా మార్చారు. కంప్యూటర్ రాజధానిని నేరాల రాజధానిగా మార్చారు’ అని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. జేడీఎస్‌ను బీజేపీ ‘బీ’టీమ్‌గా రాహుల్ పేర్కొనటాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జేడీఎస్‌కు ఓటు వేసి ఆ ఓటును వ్యర్థం చేసుకోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ మూడోస్థానంలో నిలుస్తుందన్నారు.
మైనింగ్ పాలసీ మరిచారా?
గాలి సోదరులకు టికెట్లు ఇవ్వటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మోదీ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా తాము అవినీతికి పాల్పడటం లేదని.. అక్రమ గనుల తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన మైనింగ్ పాలసీ గురించి ముందు తెలుసుకోవాలన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ‘సీధా రూపయ్య గవర్నమెంట్’ (అవినీతి)గా అభివర్ణించారు. ‘సర్కారు బదలిసి.. బీజేపీ గెల్లిసి’ (ఈ సర్కారును మార్చండి.. బీజేపీని గెలిపించండి) అంటూ రెండు చేతులూ పైకెత్తి మోదీ కన్నడలో బిగ్గరగా నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment