రోజాకు బంగారు పతకం అందిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, చైన్నె: మద్రాసు వర్సిటీ నుంచి ఎంఏ తెలుగులో ప్రతిభ చాటిన ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు అనే మారుమూల గ్రామానికి చెందిన గంధం రోజా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. రోజా పదో తరగతి వరకు స్థానికంగా చదివారు. ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా ఆమె కళాశాల జీవితం ఒడిదుడుకులతో సాగింది. కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో రెండేళ్లు చదువుకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఆ తర్వాత మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు యజ్ఞశేఖర్ సాయంతో చదువు కొనసాగించారు. చైన్నెలో రాణిమేరీ కళాశాలలో బి.ఎ తెలుగులో చేరి గతంలో సీఎం స్టాలిన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ప్రస్తుతం మద్రాసు యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగులో బంగారు పతకం సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తన తల్లి జన్మనిస్తే చదువు పరంగా పునర్జన్మను ఆచార్యులు డాక్టర్ యజ్ఞశేఖర్ ప్రసాదించారని పేర్కొన్నారు.
తన చదువు విషయంలో మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడు విస్తాలి శంకరరావు, రాణి మేరి కళాశాల డాక్టర్ నళిని కృషికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తన గ్రామంలో ఎం.ఏ వరకు చదివిన మొదటి యువతిని తానేనని, పీహెచ్‌డీ చేయాలన్నది తన ఆశయమని తెలిపారు. మారుతున్న సమాజంలో మగవారితో పోటీపడి అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ తమ గ్రామంతో పాటు పలు మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించకుండా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని, ఈ ధోరణి మారాలని ఆమె ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment