దీపక్ పూనియా
బిష్‌కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు భారత రెజ్లర్లకు నిరాశే మిగిలింది. ఆదివారం పతకం కోసం పోటీ పడ్డ ఇద్దరు రెజ్లర్లు ఓటమి పాలవడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరలేదు. ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో ముగించింది. చివరి రోజు పతకం కోసం పోటీ పడ్డ శ్రవణ్ తోమర్, దీపక్ పూనియా నిరాశపరిచారు.
61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ శ్రవణ్ 0–10తో కజుయ కోయాంగి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో మరో అవకాశం దక్కించుకున్న శ్రవణ్ కాంస్యం కోసం జరిగిన పోరులో అబ్బాస్ రఖ్‌మోనొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దీపక్ పునియా (86 కేజీలు) క్వార్టర్స్‌లో 0–7తో ఉతుమెన్ ఉర్గోడొల్ (మంగోలియా) చేతిలో ఓడినా రెప్‌చేజ్ రౌండ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ 7–2తో శోతె షిరాయి (జపాన్)పై గెలుపొంది కాంస్య పోరుకు అర్హత సాధించాడు. పతక పోరులో 0–10తో షెంగ్‌ఫెంగ్ బి (చైనా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment