deepak punia
-
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
దీపక్‌కు రజతం.. రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట
ఉలాన్బాతర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022లో గతేడాదితో (14) పోలిస్తే భారత్‌కు ఈ సారి 3 పతకాలు అధికంగా వచ్చాయి. ఆఖరి రోజు వచ్చిన రెండు మెడల్స్ కలుపుకుని భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు (1 స్వర్ణం, 5 రజతాలు, 11 కాంస్యాలు) చేరాయి. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా మరోసారి రజతంతో సరిపెట్టుకోగా, విక్కీ చాహర్ (92 కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపక్ కజకిస్థాన్ రెజ్లర్ అజ్మత్ దౌలెత్బెకోవ్ చేతిలో 1-6 తేడాతో ఓడాడు. నిరుడు ఇదే టోర్నీలో దీపక్ రజతంతోనే సరిపెట్టుకున్నాడు. మరోవైపు విక్కీ చాహర్ రజత పోరులో 5-3తో అజినియాజ్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గాడు. ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో జపాన్ అత్యధికంగా 21 పతకాలు (10 స్వర్ణం, 2 రజతాలు, 9 కాంస్యాలు) సాధించగా, ఇరాన్ (15, 10 స్వర్ణం, 2 రజతాలు, 3 కాంస్యాలు), కజకిస్థాన్ (21, 5 స్వర్ణం, 8 రజతాలు, 8 కాంస్యాలు), కిర్కిస్థాన్ (14, 4 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచాయి. భారత్ 17 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. చదవండి: Formula 1: అన్‌స్టాపబుల్ వెర్స్టాపెన్.. కెరీర్లో 22వ విజయం -
Tokyo Olympics: దహియా ధమాకా...
భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో 23 ఏళ్ల రవి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖరారు చేశాడు. పతకం రంగు స్వర్ణమా, రజతమా అనేది నేడు తేలుతుంది. భారత్‌కే చెందిన మరో యువ రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మలిక్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ఆమెను ఓడించిన బెలారస్ ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో రెపిచేజ్ పద్ధతి ప్రకారం అన్షుకు కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం లభించింది. టోక్యో: గత రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో తాను సాధిస్తున్న పతకాలు గాలివాటంగా రాలేదని భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా నిరూపించాడు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా... ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి... మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో స్వర్ణ–రజత ఫైనల్ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ 66 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించాడు. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జవూర్ ఉగుయెవ్తో నేడు జరిగే ఫైనల్లో రవి దహియా గెలిస్తే... షూటర్ అభినవ్ బింద్రా (2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. వెనుకబడినా... నూరిస్లామ్ సనయేవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో రవి అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరాడు. తొలి భాగం ముగిశాక రవి 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని సనయేవ్ నాలుగుసార్లు మ్యాట్‌పై అటుఇటు తిప్పేయడంతో అతనికి 2, 2, 2, 2 పాయింట్ల చొప్పున మొత్తం ఎనిమిది పాయింట్లు వచ్చాయి. సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. స్పష్టమైన ఆధిపత్యం... నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రవి తొలి రౌండ్లో 13–2 పాయింట్ల తేడాతో ఎడువార్డో ఆస్కార్ టిగ్రెరోస్ (కొలంబియా)పై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజయం సాధించాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం దక్కిన వెంటనే బౌట్‌ను నిలిపివేసి ఆ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనిని ‘టెక్నికల్ సుపీరియారిటీ’ విజయంగా పరిగణిస్తారు. ఎడువార్డోతో జరిగిన బౌట్లో రవి మూడు నిమిషాల నిడివి గల తొలి భాగంలో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలో రవి ఒక్కసారిగా విజృంభించి ‘టేక్‌డౌన్’ ఎత్తులతో వరుసగా 2, 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో రవి 13–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించినందుకు రవిని విజేతగా ప్రకటించారు. అదే దూకుడు... తొలి రౌండ్లో గెలుపు తర్వాత క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ జియార్జి వలెంటినో వంజెలోవ్తో తలపడ్డ రవి ఇక్కడా వెనక్కి తగ్గలేదు. మరోసారి తన భుజ బలంతోపాటు బుద్ధి బలం ఉపయోగించి తొలి భాగంలో వరుసగా 2, 2, 2 పాయింట్లు స్కోరు చేసి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలో వంజెలోవ్ 2, 2 పాయింట్లు సాధించినా... రవి తానేం తక్కువ కాదన్నట్లు వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. బౌట్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా 14–4తో ఆధిక్యంలోకి వచ్చాడు. రవి ఆధిక్యం పది పాయింట్లకు చేరడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. చేతిని కొరికినా... ‘బై ఫాల్’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్ రెజ్లర్ సనయేవ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్ రవి చేతిని కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. కాంస్యానికి విజయం దూరంలో దీపక్ ... పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీపక్ తొలి రౌండ్లో 12–1తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అగియోమోర్ (నైజీరియా)ను ఓడించాడు. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దీపక్ 6–3తో లిన్ జుషెన్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. అయితే సెమీఫైనల్లో దీపక్ 0–10తో డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. షబానౌ అలీ (బెలారస్)–నజీమ్ (సాన్మరినో) మధ్య ‘రెపిచేజ్’ బౌట్లో విజేతగా నిలిచిన రెజ్లర్‌తో నేడు జరిగే కాంస్య పతక పోరులో దీపక్ తలపడతాడు. అన్షుకు పతకావకాశం... మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యూరోపియన్ చాంపియన్ ఇరీనా కురాచ్‌కినా (బెలారస్)తో జరిగిన బౌట్లో అన్షు 2–8తో ఓడిపోయింది. అయితే కురాచ్‌కినా ఫైనల్‌కు చేరడంతో ‘రెపిచేజ్’ పద్ధతిలో అన్షుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. ఫైనల్ చేరే క్రమంలో కురాచ్‌కినా చేతిలో ఓడిన వారి మధ్య బౌట్లను నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారు కురాచ్‌కినా చేతిలో సెమీఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో కాంస్యం కోసం తలపడతారు. నేడు జరిగే ‘రెపిచేజ్’ తొలి రౌండ్లో కొబ్లోవా (రష్యా)తో అన్షు ఆడుతుంది. ఇందులో గెలిస్తే నికొలోవా (బల్గేరియా)తో అన్షు కాంస్యం కోసం తలపడుతుంది. గతంలో సనయేవ్‌ను రెండుసార్లు ఓడించాను. దాంతో భారీ ఆధిక్యంతో వెనుకబడినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నా. సనయేవ్కు నేను ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సింది కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు. నేను స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. స్వర్ణం గెలిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది. –రవి దహియా -
రెజ్లర్ దీపక్ పూనియా డిశ్చార్జ్
న్యూఢిల్లీ: ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన భారత స్టార్ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత దీపక్ పూనియా డిశ్చార్జ్ అయ్యాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో పాటు కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (సాయ్)’ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: హామిల్టన్‌కు చుక్కెదురు) అయితే అతడికి ఇంకా కరోనా నెగెటివ్ అని రాకపోవడంతో హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించినట్లు, ఇందుకు జిల్లా కోవిడ్–19 నోడల్ అధికారి కూడా అంగీకరించినట్లు ‘సాయ్’ తెలిపింది. ఈ నెలలో హరియాణాలోని సోనేపట్ వేదికగా పురుషుల జాతీయ శిక్షణ శిబిరం ఆరంభమవుతుండటంతో... దీనికి ఎంపికైన రెజ్లర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో దీపక్‌తో పాటు నవీన్ (65 కేజీల విభాగం), కృషన్ కుమార్ (125 కేజీల విభాగం) కూడా కరోనా పాజిటివ్‌లుగా తేలడం తో ముగ్గురిని ‘సాయ్’ హాస్పిటల్లో చేర్పించారు. ఇప్పటికే దీపక్ 86 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్ బెర్తును సొంతం చేసుకున్నాడు. -
దీపక్ పూనియాకు కరోనా
న్యూఢిల్లీ: క్రికెట్, హాకీ తర్వాత ఇప్పుడు కరోనా సెగ భారత రెజ్లింగ్‌నూ తాకింది. స్టార్ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత దీపక్ పూనియా కోవిడ్–19 బారిన పడినట్లు ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘సాయ్’ గురువారం ప్రకటించింది. అతడితో పాటు నవిన్ (65 కేజీల విభాగం), కృషన్ కుమార్ (125 కేజీల విభాగం)లకు కూడా కరోనా సోకిందని తెలిసింది. హరియాణాలోని సోనేపట్ వేదికగా ఈ నెలలో పురుషుల జాతీయ శిక్షణ శిబిరం మొదలవ్వాల్సి ఉండగా... దీనికి ఎంపికైన రెజ్లర్లు సెప్టెంబర్ 1న అక్కడి ‘సాయ్’ సెంటర్లో రిపోర్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం వారికి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా... దీపక్, నవీన్, కృషన్‌లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ‘ముగ్గురు సీనియర్ రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలింది. వెంటనే వారిని ‘సాయ్’ హాస్పిటల్లో చేర్పించాము. రెండు రోజుల తర్వాత వీరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. నెగెటివ్ అని వస్తే వారిని తిరిగి క్యాంపుకు తీసుకొస్తామం’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పేర్కొన్నారు. రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలినంత మాత్రాన క్యాంపు రద్దయ్యే అవకాశం లేదని అతడు స్పష్టం చేశారు. రెజ్లర్ల 14 రోజుల క్వారంటైన్ ముగిసిన వెంటనే శిక్షణ శిబిరం ఆరంభం అవుతుందని తోమర్ తెలిపారు. దీపక్ ఇప్పటికే 86 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్తును సొంతం చేసుకున్నాడు. -
రెజ్లర్లు... పట్టు పడుతున్నారు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు రవి దహియా, దీపక్ పూనియా శిక్షణ మొదలుపెట్టారు. ఇక్కడి ఛత్రశాల స్టేడియంలో ఇద్దరు పట్టుపట్టే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ప్రాక్టీస్ వీడియోను కోచ్, రెజ్లింగ్ దిగ్గజం సత్పాల్ సింగ్ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవసరమైన ముందు జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ శిక్షణ మొదలు పెట్టామని ఆయన ట్వీట్ చేశారు. గతేడాది ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ (కజకిస్తాన్)లో పతకాలు సాధించడం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన దీపక్ (86 కేజీలు), రవి (57 కేజీలు) ఇన్నాళ్లు కోవిడ్ మహమ్మారి వల్ల శిక్షణకు దూరమయ్యారు. -
దీపక్ పూనియా, రవి దహియాలు క్వాలిఫై
న్యూఢిల్లీ: వచ్చే నెలలలో జరుగనున్న సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌కు రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దహియాలు క్వాలిఫై అయ్యారు. శుక్రవారం జరిగిన రెజ్లింగ్ ట్రయల్స్‌లో దీపక్ పూనియా, రవి దహియాలు తమ తమ కేటగిరిల్లో విజయం సాధించడంతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. 86 కేజీల ఫ్రీ స్టైల్ కేటగిరీలో దీపక్ పూనియా.. కామన్వెల్త్ కాంస్య పతక విజేత పవన్ కుమార్‌పై విజయం సాధించగా, 57 కేజీల వెయిట్ కేటగిరీలో రవి దహియా 10-0 తేడాతో పంకజ్‌పై గెలుపొందాడు. దాంతో ఆసియా చాంపియనషిప్‌కు క్వాలిఫై అయ్యారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వీరిద్దరూ తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌కు సైతం క్వాలిఫై కావడం విశేషం. విజయం తర్వాత దీపక్ దహియా మాట్లాడుతూ.. ‘ ఇదే ఫామ్‌ను కొనసాగించడంపైనే దృష్టి పెట్టా. నా గోల్, నా కల ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే.అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటడానికి వంద శాతం యత్నిస్తా. నా అత్యున్నత ప్రదర్శనను వెలికి తీయడమే నా లక్ష్యం’ అని తెలిపాడు. ‘ నేను రెజ్లింగ్‌ను ఎంజాయ్ చేస్తా. ప్రస్తుతం నా అత్యుత్తమ సమయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నా. భారత్‌కు పతకాలు అందిస్తానని ఆశిస్తున్నా. ఒలింపిక్ పతకం సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో శ్రమిస్తున్నా’ అని రవి దహియా తెలిపాడు. -
ప్రపంచ ఉత్తమ జూనియర్ రెజ్లర్ దీపక్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ రెజ్లర్ దీపక్ పూనియాకు తగిన గుర్తింపు లభించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) వార్షిక పురస్కారాల్లో 18 ఏళ్ల దీపక్ ‘జూనియర్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం దీపక్ జూనియర్‌తోపాటు సీనియర్ విభాగంలోనూ మెరిశాడు. ఆగస్టులో ఎస్తోనియాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో 86 కేజీల విభాగంలో దీపక్ విజేతగా నిలిచి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 18 ఏళ్ల తర్వాత జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా అతను ఘనత సాధించాడు. అనంతరం సెపె్టంబరులో కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్íÙప్లో 86 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. దాంతోపాటు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. ‘చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూనియర్ రెజ్లర్లలో నన్ను మేటి రెజ్లర్‌గా గుర్తించినందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నాలో మరింత ఉత్సాహన్ని పెంచుతుంది’ అని 2016లో క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దీపక్ వ్యాఖ్యానించాడు. -
దీపక్ ‘టాప్’ లేపాడు..
స్విట్జర్లాండ్: ఇటీవల ముగిసిన వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ దీపక్ పూనియా.. తాజాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్యూడబ్యూ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. తన 86 కేజీల కేటగిరీలో దీపక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 20 ఏళ్ల దీపక్ 82 పాయింట్లతో టాప్కు ఎగబాకాడు. అదే సమయంలో మాజీ వరల్డ్ చాంపియన్ యజ్దానిని వెనక్కి నెట్టాడు. ప్రస్తుత యజ్దాని 78 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది యాసర్ దోగు చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన దీపక్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకున్నాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన దీపక్ గాయం కారణంగా తుది బౌట్లో పాల్గొనలేదు. దాంతో రజతంతోనే సంతృప్తి పడ్డాడు. నిలకడగా రాణిస్తున్న దీపక్ తన పాయింట్లను మెరుగుపరుచుకుంటూ ప్రథమ స్థానానికి ఎగబాకాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన మరో భారత రెజ్లర్ బజరంగ్ పూనియా తన 65 కేజీల కేటగిరీలో టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఈ విభాగంలో వరల్డ్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన రష్యన్ రెజ్లర్ రషిదోవ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో భాగంగా 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఫొగట్ రెండో స్థానాన్ని ఆక్రమించారు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఫొగట్.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరారు. -
మన ‘పట్టు’ పెరిగింది
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తమ అత్యుత్తమ పతక ప్రదర్శనతో ఘనతకెక్కింది. ఇంతకుముందెన్నడు లేని విధంగా ఈ పోటీల్లో ఐదు పతకాలను సాధించింది. స్వర్ణం బరిలో నిలిచిన దీపక్ పూనియా (86 కేజీలు) పోటీకి దూరమయ్యాడు. గాయంతో అతను తలపడలేకపోయాడు. దీంతో రజతంతో తృప్తిచెందాల్సి వచ్చింది. రాహుల్ కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీల్లో ఇదివరకే బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), మహిళల కేటగిరీలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా భారత్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 79 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవడం విశేషం. రష్యా (190 పాయింట్లు), కజకిస్తాన్ (103 పాయింట్లు), అమెరికా (94 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గతంలో భారత్ మెరుగైన ప్రదర్శన 3 పతకాలే! 2013 ప్రపంచ రెజ్లింగ్‌లో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గింది. ఈవెంట్‌కు చివరి రోజైన ఆదివారం జరిగిన 61 కేజీల కాంస్య పతక పోరులో రాహుల్ అవారే ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ మహారాష్ట్ర రెజ్లర్ 11–4తో 2017 పాన్ అమెరికా చాంపియన్ టైలర్ గ్రాఫ్ (అమెరికా)ను మట్టికరిపించాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రాహుల్ చాంపియన్‌గా నిలిచాడు. ఆసియా చాంపియన్íÙప్ (2009, 2011)లలో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. 86 కేజీల విభాగం ఫైనల్లో ఇరాన్ రెజ్లర్ హసన్ యజ్దానీతో పోటీపడాల్సిన యువ రెజ్లర్ దీపక్ పూనియా చీలమండ గాయంతో బరిలోకి దిగలేదు. దాంతో యజ్దానిని విజేతగా ప్రకటించగా, దీపక్ ఇప్పటి వరకు భారత్ నుంచి దీపక్ సహా ఐదుగురే రెజ్లర్లు ప్రపంచ పోటీల్లో ఫైనల్ చేరగా... సుశీల్ (2010) మాత్రమే విజేతగా నిలిచాడు. బిషంబర్ సింగ్ (1967), అమిత్ దహియా (2013), బజరంగ్ (2018) ఫైనల్లో ఓడిపోయారు. -
భారత పోరు ‘బెస్ట్’తో ముగిసింది..
నూర్సుల్తాన్(కజికిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఆఖరి రోజు కూడా భారత్ హవా కొనసాగింది. ఆదివారం జరిగిన 61 కేజీల కేటగిరీలో భారత రెజ్లర్ రాహుల్ అవేర్ కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతకం కోసం జరిగిన బౌట్లో రాహుల్ అవేర్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. రాహుల్ అవేర్ 11-4 తేడాతో అమెరికన్ రెజ్లర్ టేలర్ లీ గ్రాఫ్‌ను చిత్తు చేసి కాంస్యం ఒడిసి పట్టుకున్నాడు. నాన్ ఒలింపిక్ కేటగిరీలో జరిగిన ఈ పోరులో రాహుల్ ఆరంభంలో తడబడ్డప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. మొదటి రౌండ్లో తొలుత రెండు పాయింట్లు వెనుకబడ్డ రాహుల్.. వరుసగా పాయింట్లు సాధించి తన ఆధిక్యాన్ని 4-2తో పెంచుకున్నాడు. ఆపై రెండో రౌండ్లో రాహుల్ 10-2 తేడాతో దూసుకుపోయాడు. తన ఆధిక్యాన్ని కడవరకూ ఇలాగే కొనసాగించిన రాహుల్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇది వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ ఐదు పతకాల్లో ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు దీపక్ పూనియా రజతం సాధించగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, రవి కుమార్‌లు కాంస్యాలతో మెరిశారు. -
పాపం దీపక్.. పసిడి పోరును వద్దనుకున్నాడు
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ రెజ్లర్ దీపక్ పూనియా వైదొలిగాడు. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండానే నిష్క్రమించాడు. ఎడమకాలికి గాయం కారణంగా పసిడి పోరు నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో రజతంతోనే సరిపెట్టుకున్నాడు. 86 కేజీల ఫ్రీస్టైయిల్ కేటగిరీలో హసన్ యజ్దాని(ఇరాన్)తో తలపడాల్సి ఉండగా గాయం వేధించింది. ఇక చేసేది లేక ఫైనల్ బౌట్‌ను ఆడలేనని నిర్వాకులకు స్పష్టం చేశాడు. ఫలితంగా యజ్దానికి స్వర్ణం లభించగా, దీపక్ పూనియా రన్నరప్‌గా నిలిచాడు. దీనిపై దీపక్ పూనియా మాట్లాడుతూ.. ‘ నేను స్వర్ణ పతకం కోసం ఫైట్ చేయలేకపోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఓవరాల్‌గా నా ప్రదర్శన బాగున్నా, టైటిల్ ఫైట్‌ను కోల్పోయాను. నా ఎడమ కాలు బాగా బాధించింది. దానిపై ఎక్కువ ఒత్తిడి పడితే ఆ గాయం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాలి గాయంతో రెజ్లింగ్ బౌట్లో పాల్గొనడంలో చాలా కష్టం. యజ్దానితో తుది పోరులో తలపడే అవకాశం నా ముందున్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఇక ఒలింపిక్స్ పతకం సాధించడంపై దృష్టి సారిస్తున్నా’ అని దీపక్ పూనియా పేర్కొన్నాడు. శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో 20 ఏళ్ల దీపక్ 8–2 తేడాతో స్టెఫాన్ రీచ్మత్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్ చేరడంతోనే దీపక్ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్ క్యాడెట్ టైటిల్ గెలుచుకొని వెలుగులోకి వచ్చిన దీపక్ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. -
దీపక్ వెలుగులు
గత నెలలో దీపక్ పూనియా జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. జూనియర్ స్థాయి ఆటగాడు సీనియర్‌కు వచ్చేసరికి ఫలితాలు అంత సులువుగా రావనేది క్రీడా వర్గాల్లో ప్రచారం ఉన్న మాట. కానీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే దానిని దీపక్ తప్పుగా నిరూపించాడు.ఆడుతున్న తొలి సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే సత్తా చాటుతూ 86 కేజీల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. తుది పోరులోనూ ఇదే జోరు కొనసాగిస్తే సుశీల్ కుమార్ తర్వాత విశ్వవిజేతగా నిలిచిన రెండో భారత్ రెజ్లర్‌గా చరిత్రకెక్కుతాడు. 61 కేజీల విభాగం సెమీస్‌లో ఓడిన మరో భారత రెజ్లర్ రాహుల్ అవారే ఆదివారం కాంస్య పతక పోరులో బరిలోకి దిగుతాడు. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ కెరటం దీపక్ పూనియా సత్తా చాటాడు. ఈ పోటీల 86 కేజీల విభాగంలో దీపక్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో 20 ఏళ్ల దీపక్ 8–2 తేడాతో స్టెఫాన్ రీచ్మత్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్ చేరడంతోనే దీపక్ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఇరాన్‌కు చెందిన హసన్ యజ్దానీచరాతితో దీపక్ తలపడతాడు. పోటీ లేకుండా... మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్ క్యాడెట్ టైటిల్ గెలుచుకొని వెలుగులోకి వచి్చన దీపక్ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. తొలి పీరియడ్‌లో 1–0తో ముందంజ వేసిన దీపక్ రెండో పీరియడ్‌లో ప్రత్యరి్థని పడగొట్టి 4–0తో దూసుకుపోయాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయినా... మరోసారి రీచ్మత్పై సంపూర్ణ ఆధిక్యం కనబర్చి 8–2తో బౌట్‌ను ముగించాడు. సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత మరే భారత రెజ్లర్ ఈ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు దీపక్ దానికి విజయం దూరంలో నిలిచాడు. అంతకుముందు హోరాహోరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో దీపక్ 7–6తో కార్లోస్ మెండెజ్ (కొలంబియా)ను ఓడించి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ►4 దీపక్ ఫైనల్ చేరడంతో భారత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినట్లయింది. 2013లో భారత్‌కు అత్యధికంగా మూడు పతకాలు రాగా... ఈసారి నాలుగు ఖాయమయ్యాయి. ఒకవేళ నేటి బౌట్లో రాహుల్ కూడా గెలిస్తే భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరుతాయి. ►5 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫైనల్‌కు అర్హత పొందిన ఐదో భారత రెజ్లర్ దీపక్ పూనియా. గతంలో బిషంబర్ సింగ్ (1967లో), సుశీల్ కుమార్ (2010లో), అమిత్ దహియా (2013లో), బజరంగ్ (2018లో) ఈ ఘనత సాధించారు. ఈ నలుగురిలో సుశీల్ ఫైనల్లో నెగ్గి స్వర్ణం సాధించగా... మిగతా ముగ్గురు రజతం దక్కించుకున్నారు. రాహుల్‌కు నిరాశ 61 కేజీల నాన్ ఒలింపిక్ కేటగిరీలో భారత రెజ్లర్ రాహుల్ అవారే సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. బెకా లోమ్టాదె (జార్జియా) 10–6 స్కోరుతో రాహుల్‌పై గెలిచాడు. నేడు జరిగే కాంస్యపతక పోరులో టైలర్ గ్రాఫ్ (అమెరికా) లేదా మిహై ఇసాను (మాల్డొవా) లతో రాహుల్ తలపడతాడు. ఇతర భారత రెజ్లర్లలో జితేందర్ (79 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, మౌసమ్ ఖత్రీ (97 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
నాల్గో భారత రెజ్లర్‌గా..
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజర్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ దీపక్ పూనియా విజయం సాధించాడు. ఆసక్తిని రేకెత్తించిన బౌట్లో దీపక్ పూనియా 7-6 తేడాతో కార్లోస్ ఈక్విర్డో(కొలంబియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. కాగా, టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫై అయిన నాల్గో రెజ్లర్‌గా దీపక్ పూనియా నిలిచాడు. ఇప్పటికే వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా, రవి కుమార్‌లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు వీరు ముగ్గురు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి కాంస్యాలను గెలుచుకున్నారు.(ఇక్కడ చదవండి: బజరంగ్, రవి కంచు మోత) ఇక నాన్ ఒలింపిక్ 61 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రాహుల్ అవేర్ సెమీస్‌కు చేరాడు. రాహుల్ అవేర్ 10-7 తేడాతో కజికిస్తాన్‌కు చెందిన కైలియెవ్‌పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన బౌట్లో నాల్గో సీడ్‌గా బరిలోకి దిగిన దీపక్ పూనియా ఎక్కడ కూడా పట్టు సడలనివ్వలేదు. కడవరకూ తన త్రోలతో ఆకట్టుకున్న పూనియా ఒక్క పాయింట్ తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. -
దీపక్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల విరామం తర్వాత భారత్‌కు మళ్లీ స్వర్ణ పతకం లభించింది. ఎస్తోనియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా విశ్వవిజేతగా అవతరించాడు. ఫైనల్లో అలిక్ షెబ్‌జుకోవ్ (రష్యా)పై దీపక్ విజయం సాధించాడు. చివరిసారి 2001లో భారత్ తరఫున ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రమేశ్ కుమార్ (69 కేజీలు), పల్విందర్ సింగ్ చీమా (130 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. -
రజతం నెగ్గిన రెజ్లర్ దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ స్వర్ణం లేకుండానే ముగించింది. స్లొవేకియాలో ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరి రోజు భారత్‌కు మరో రజతం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా రన్నరప్‌గా నిలిచాడు. టర్కీ రెజ్లర్ ఆరిఫ్ ఓజెన్‌తో జరిగిన ఫైనల్లో దీపక్ 1–2 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో కేవలం తన ప్రత్యర్థులకు రెండు పాయింట్లు మాత్రమే సమర్పించుకున్న దీపక్ కీలక పోరులో మాత్రం దూకుడుగా ఆడలేకపోయాడు. తొలి సెషన్లోనే రెండు పాయింట్లు చేజార్చుకున్న దీపక్ బౌట్ ముగియడానికి రెండు సెకన్లు ఉందనగా ఒక పాయింట్ సంపాదించాడు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఇదే టోర్నీలో 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నవీన్ సిహాగ్ కూడా రజతం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో విజయ్ (57 కేజీలు) కాంస్యం నెగ్గగా... విజయ్ (60 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) రజతాలు గెలిచారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మాన్సి (57 కేజీలు), అన్షు (59 కేజీలు)లు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. -
ఫైనల్లో దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ దీపక్ పూనియా పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. స్లొవేకియాలో జరుగుతున్న ఈ పోటీల్లో దీపక్ ఫ్రీస్టయిల్ 86 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో దీపక్ 6–2తో ఇవాన్ నెడాల్కో (మాల్డోవా)పై గెలుపొందాడు. అంతకుముందు బౌట్లలో దీపక్ 7–0తో ప్యాట్రిక్ జురోవ్స్కీ (హంగేరి)పై, 11–0తో జాయోంగ్ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఆరిఫ్ ఓజెన్ (టర్కీ)తో దీపక్ తలపడతాడు. మరోవైపు 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన నవీన్ సిహాగ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో నవీన్ 1–12తో అఖ్మెద్ ఇద్రిసోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
సచిన్ రాఠి, దీపక్‌లకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సచిన్ రాఠి, దీపక్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన 74 కేజీల ఫైనల్లో సచిన్ 9–2తో బియంబసురెన్ (మంగోలియా)ను ఓడించగా... 86 కేజీల తుదిపోరులో దీపక్ 10–0తో అజత్ గజ్యెవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. 61 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో సూరజ్ రాజ్ కుమార్ 16–8తో యుతో (జపాన్)ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. 92 కేజీల్లో సోమ్‌వీర్ సింగ్ నిరాశపరిచాడు. అతను మూడో రౌండ్లోనే 2–3తో తకుమా ఒత్సు (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. 125 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక బౌట్లో ఎర్డెనెబాటర్ (మంగోలియా)పై మోహిత్ 10–0తో గెలిచాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్ 173 పాయింట్లతో రెండో స్థానం పొందగా, ఇరాన్ (189)కు అగ్రస్థానం దక్కింది. -
చివరి రోజు నిరాశే
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు భారత రెజ్లర్లకు నిరాశే మిగిలింది. ఆదివారం పతకం కోసం పోటీ పడ్డ ఇద్దరు రెజ్లర్లు ఓటమి పాలవడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరలేదు. ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో ముగించింది. చివరి రోజు పతకం కోసం పోటీ పడ్డ శ్రవణ్ తోమర్, దీపక్ పూనియా నిరాశపరిచారు. 61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ శ్రవణ్ 0–10తో కజుయ కోయాంగి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో మరో అవకాశం దక్కించుకున్న శ్రవణ్ కాంస్యం కోసం జరిగిన పోరులో అబ్బాస్ రఖ్‌మోనొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దీపక్ పునియా (86 కేజీలు) క్వార్టర్స్‌లో 0–7తో ఉతుమెన్ ఉర్గోడొల్ (మంగోలియా) చేతిలో ఓడినా రెప్‌చేజ్ రౌండ్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ 7–2తో శోతె షిరాయి (జపాన్)పై గెలుపొంది కాంస్య పోరుకు అర్హత సాధించాడు. పతక పోరులో 0–10తో షెంగ్‌ఫెంగ్ బి (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
పాలబ్బాయి కొడుకు..వరల్డ్ చాంపియన్
బిలిసి(జార్జియా): దీపక్ పూనియా.. ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియన పేరు. భారత్ కు చెందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు ఇప్పడు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. బిలిసిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో దీపక్ పూనియా విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పసిడి పతకపోరులో భాగంగా 85 కేజీల హెవీ వెయిట్ కేటగిరిలో దీపక్ 9-5 తేడాతో టర్కీకి చెందిన నెయిల్ సెయ్యార్ను ఓడించి యావత్ భారత జాతిని ఆకర్షించాడు. అయితే హర్యానా రాష్ట్రానికి చెందిన దీపక్.. ఒక చిరు పాల వ్యాపారి కొడుకు. స్కూల్ డేస్ నుంచి దీపక్ పతకాల వేటలో ఎప్పుడూ ముందుండే వాడు. ఎక్కడ ఈవెంట్ జరిగిన పాల్గొని ఇంటికి పతకంతోనే తిరిగొచ్చేవాడు. కాగా, సుమారు పది సంవత్సరాల పాటు అఖడ గ్రామంలో శిక్షణ తీసుకున్న దీపక్.. 2015లో అత్యుత్తమ శిక్షణ కోసం న్యూఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ చతర్సాల్ స్టేడియంలో సప్తల్ సింగ్ మార్గదర్శకత్వంలో, కోచ్ సుశీల్ కుమార్ పర్యవేక్షణలో కొంత కాలం శిక్షణ పొందాడు. అయితే హెవీ వెయిట్ రెజ్లర్ కావాలనుకున్న దీపక్‌కు అక్కడ స్వల్ప ఇబ్బందులు రావడమే ఇంటికి తిరిగి వచ్చేసినట్లు దీపక్ పేర్కొన్నాడు. ప్రధానంగా తాను ఎప్పుడూ ఆవు పాలనే ఇష్టపడేవాడినని, ఢిల్లీలో గేదె పాలు మాత్రమే లభించడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు దీపక్ తెలిపాడు. తండ్రికి మాటిచ్చాడు.. గత నెల్లో ఫ్రాన్స్‌లో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో దీపక్ ఒట్టి చేతుల్తో ఇంటికి వచ్చాడు. దీంతో అతనికి ఇష్టమైన ఆవు పాలకు కూడా దీపక్ దూరమయ్యాడు. కొడుకు పతకం తేలేదన్న కోపంతో దీపక్‌కు తండ్రి ఆవు పాలను ఇవ్వడం మానేశాడు. అయితే సెప్టెంబర్ రెండో వారంలో బిలిషి విమానం ఎక్కేముందు తండ్రికి మాటిచ్చాడు. ఈసారి పతకం తేకుండా ఇంటికి రానన్నాడు. దాన్ని సాకారం చేసుకోవడమే కాదు.. పసిడితో మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. 85 కేజీల హెవీ వెయింట్ కేటగిరిలో వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు పుస్తకాల్లో ఎక్కాడు.