
నూర్‌సుల్తాన్(కజికిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఆఖరి రోజు కూడా భారత్ హవా కొనసాగింది. ఆదివారం జరిగిన 61 కేజీల కేటగిరీలో భారత రెజ్లర్ రాహుల్ అవేర్ కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతకం కోసం జరిగిన బౌట్‌లో రాహుల్ అవేర్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. రాహుల్ అవేర్ 11-4 తేడాతో అమెరికన్ రెజ్లర్ టేలర్ లీ గ్రాఫ్‌ను చిత్తు చేసి కాంస్యం ఒడిసి పట్టుకున్నాడు. నాన్ ఒలింపిక్ కేటగిరీలో జరిగిన ఈ పోరులో రాహుల్ ఆరంభంలో తడబడ్డప్పటికీ తర్వాత పుంజుకున్నాడు.
మొదటి రౌండ్‌లో తొలుత రెండు పాయింట్లు వెనుకబడ్డ రాహుల్.. వరుసగా పాయింట్లు సాధించి తన ఆధిక్యాన్ని 4-2తో పెంచుకున్నాడు. ఆపై రెండో రౌండ్‌లో రాహుల్ 10-2 తేడాతో దూసుకుపోయాడు. తన ఆధిక్యాన్ని కడవరకూ ఇలాగే కొనసాగించిన రాహుల్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇది వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ ఐదు పతకాల్లో ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు దీపక్ పూనియా రజతం సాధించగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, రవి కుమార్‌లు కాంస్యాలతో మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment