న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ స్వర్ణం లేకుండానే ముగించింది. స్లొవేకియాలో ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో చివరి రోజు భారత్‌కు మరో రజతం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా రన్నరప్‌గా నిలిచాడు. టర్కీ రెజ్లర్ ఆరిఫ్ ఓజెన్‌తో జరిగిన ఫైనల్లో దీపక్ 1–2 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో కేవలం తన ప్రత్యర్థులకు రెండు పాయింట్లు మాత్రమే సమర్పించుకున్న దీపక్ కీలక పోరులో మాత్రం దూకుడుగా ఆడలేకపోయాడు.
తొలి సెషన్‌లోనే రెండు పాయింట్లు చేజార్చుకున్న దీపక్ బౌట్ ముగియడానికి రెండు సెకన్లు ఉందనగా ఒక పాయింట్ సంపాదించాడు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఇదే టోర్నీలో 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నవీన్ సిహాగ్ కూడా రజతం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో విజయ్ (57 కేజీలు) కాంస్యం నెగ్గగా... విజయ్ (60 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) రజతాలు గెలిచారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మాన్సి (57 కేజీలు), అన్షు (59 కేజీలు)లు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment