గాయత్రికి ట్రోఫీ అందజేస్తున్న శేఖర్ బజాజ్. చిత్రంలో గోపీచంద్, శ్రీకాంత్
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్‌పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్‌లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్‌ను అందుకుంది.
డబుల్స్ టైటిల్‌పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్‌డ్ డబుల్స్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment