All India Senior Ranking Badminton Tournament
-
గాయత్రి డబుల్ ధమాకా
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్‌పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్‌ను అందుకుంది. డబుల్స్ టైటిల్‌పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్డ్ డబుల్స్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి. -
రాహుల్ యాదవ్‌కు పురుషుల సింగిల్స్ టైటిల్
వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పుణేలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 21–14, 16–21, 21–15తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. ఆర్బీఐ తరఫున బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో మనీషా–సాన్యామ్ శుక్లా (ఎయిరిండియా) ద్వయం 22–20, 21–18తో షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్)–పూజ (ఎయిరిండియా) జంటపై నెగ్గింది. -
ఫైనల్లో రుత్విక శివాని
కొచ్చి: తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని... ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక 21-7, 21-14తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలుపొందింది. మంగళవారం జరిగే ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన రితూపర్ణ దాస్‌తో రుత్విక తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ రితూపర్ణ 21-14, 19-21, 21-16తో తన్వీ లాడ్ (ఎయిరిండియా)పై విజయం సాధించింది. హైదరాబాద్‌కే చెందిన మరో అమ్మాయి శ్రీకృష్ణప్రియ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శ్రీకృష్ణప్రియ 17-21, 21-16, 14-21తో రేష్మా కార్తీక్ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ విభాగంలో మేఘన-మనీషా (ఆంధ్రప్రదేశ్) జోడి ఫైనల్‌కు చేరింది.