సింధు సాధించెన్... | PV Sindhu, China Open title, Women's Singles title | Sakshi
Sakshi News home page

సింధు సాధించెన్...

Published Sun, Nov 20 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

సింధు సాధించెన్...

సింధు సాధించెన్...

కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన భారత స్టార్  చైనా ఓపెన్ టైటిల్ హస్తగతం
ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు
ఫైనల్లో సున్ యుపై విజయం  రూ. 35 లక్షల 79 వేల ప్రైజ్‌మనీ సొంతం 

అచిరకాలంలోనే అంతర్జాతీయస్థాయిలో రాకెట్ వేగంతో దూసుకొచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కెరీర్‌లో మరో గొప్ప విజయం చేరింది. ఇన్నాళ్లూ లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను ఈ హైదరాబాద్ అమ్మాయి తన ఖాతాలో జమచేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తిరుగులేని శక్తిగా పేరొందిన చైనా గడ్డపై చైనా ప్లేయర్‌నే ఓడించిన సింధు మరో చిరస్మరణీయ విజయం నమోదు చేసి ఔరా అనిపించింది. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా సింధు గుర్తింపు పొందింది. 

ఫుజు (చైనా): రియో ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకం జ్ఞాపకాలు ఇంకా మదిలో తాజాగా ఉండగానే... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో సంచలనం సృష్టించింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను సాధించి అబ్బురపరిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11తో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)పై విజయం సాధించింది. తద్వారా 30 ఏళ్ల చరిత్ర ఉన్న చైనా ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో చైనాయేతర క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది. గతం లో వోంగ్ మ్యూ చూ (మలేసియా-2007లో), సైనా నెహ్వాల్ (భారత్-2014లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.

రియో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న రెండు సూపర్ సిరీస్ టోర్నీలలో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సింధు మూడో టోర్నీలో మాత్రం మెరిసింది. తాను పూర్తిస్థాయి ఫామ్‌లో ఉంటే గొప్ప విజయాలు సాధించడం కష్టమేమీకాదని మరోసారి నిరూపించింది. విజేత సింధుకు 52,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 79 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆడిన రెండో సూపర్ సిరీస్ ప్రీమియర్ ఫైనల్లోనే సింధుకు టైటిల్ దక్కడం విశేషం. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో తొలిసారి సింధు ఫైనల్‌కు చేరగా... చైనా ప్లేయర్ లీ జురుయ్ చేతిలో ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచింది.

ఆద్యంతం దూకుడు...
సున్ యుతో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోరుున సింధు ఈసారి మాత్రం ఎలాంటి తడబాటుకు లోనుకాలేదు. సొంతగడ్డపై సున్ యు ఆడుతున్నప్పటికీ... సింధు మాత్రం తన సహజశైలిలో దూకుడుగా ఆడుతూ నిలకడగా పారుుంట్లు సాధించింది. అవసరమైనపుడు ర్యాలీలు ఆడిస్తూనే అవకాశం దొరకగానే సింధు కళ్లు చెదిరే స్మాష్‌లతో సున్ యును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలో వరుసగా ఐదు పారుుంట్లు నెగ్గిన సింధు 17-8తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. సింధు 20-8తో ఆధిక్యంలోకి వెళ్లిన దశలో అనవసర తప్పిదాలతో మూడు పారుుంట్లు కోల్పోరుునా... ఆ వెంటనే స్మాష్ షాట్‌తో పారుుంట్ నెగ్గి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాకపోవడం సింధు ఆధిపత్యాన్ని సూచిస్తోంది.

ఆధిక్యం చేజార్చుకొని...
తొలి గేమ్ సాధించిన ఉత్సాహంతో రెండో గేమ్‌లో కూడా సింధు జోరును కొనసాగించింది. తొలుత 6-3తో, ఆ తర్వాత 11-7తో, 14-10తో సింధు ఆధిక్యంలో నిలిచింది. అరుుతే ఈ దశలో సున్ యు తన వ్యూహాలను మార్చుకొని ఆడింది. వరుసగా నాలుగు పారుుంట్లు గెలిచి స్కోరును 14-14తో సమం చేసింది. సింధు కూడా అనవసర తప్పిదాలు చేయడంతో సున్ యు రెండో గేమ్‌ను 21-17తో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది.

మళ్లీ జోరు...
మూడో గేమ్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా ఆడేందుకు ప్రయత్నించింది. విరామ సమయానికి 11-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించడం, సున్ యు కూడా తప్పిదాలు చేయడంతో భారత స్టార్ ఖాతాలో క్రమం తప్పకుండా పారుుంట్లు చేరారుు. దాంతో సింధు 19-11తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు పారుుంట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది.

చైనాకు చేదు ఫలితాలు...
ఈసారి చైనా ఓపెన్ చైనా క్రీడాకారులకు ఏమాత్రం కలిసిరాలేదు. ఐదు విభాగాలకుగాను నాలుగింటిలో చైనా ఆటగాళ్లు ఫైనల్స్‌కు చేరారు. అరుుతే ఒక్క విభాగంలోనూ చైనాకు టైటిల్ దక్కకపోవడం గమనార్హం. 1986లో మొదలైన చైనా ఓపెన్‌లో చైనా క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించకపోవడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) 22-20, 21-13తో చెన్ లాంగ్ (చైనా)పై గెలిచి విజేతగా నిలిచాడు. డబుల్స్ టైటిల్ మార్కస్ గిడియోన్-కెవిన్ సంజయ (ఇండోనేసియా) జంట నెగ్గగా... మహిళల డబుల్స్‌లో చాంగ్ యె నా-లీ సో హీ (కొరియా) జోడీ విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తొంతొవీ అహ్మద్-లిలియానా నాత్సిర్ (ఇండోనేసియా) ద్వయం చాంపియన్‌గా నిలిచింది.

నంబర్‌వన్ ర్యాంక్ మిగిలింది...
తాజా విజయంతో సింధు కెరీర్‌లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్ కూడా చేరిపోరుుంది. దాంతో ఈ 21 ఏళ్ల హైదరాబాద్ అమ్మారుు బ్యాడ్మింటన్‌లో పేరున్న అన్ని టోర్నీల్లోనూ పతకాలు గెలిచినట్టరుుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్‌లో రెండు కాంస్యాలు, ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్‌లో కాంస్యం, కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత కాంస్యం, గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్... ఇప్పుడు సూపర్ సిరీస్ టైటిల్. మొత్తానికి సింధు సీనియర్ అంతర్జాతీయస్థారుులో ఆడటం మొదలుపెట్టిన మూడేళ్లలోనే అద్భుత విజయాలు సాధించింది. ఇక సింధు కెరీర్‌లో మిగిలిన లక్ష్యం ప్రపంచ నంబర్‌వన్ కావడమే. గత నెలలో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరిన సింధు ఆ తర్వాత టాప్-10 నుంచి బయటకు వచ్చేసింది. అరుుతే చైనా ఓపెన్ టైటిల్‌తో సింధు మళ్లీ టాప్-10లోకి వచ్చే అవకాశముంది. 

అభినందనల వెల్లువ
న్యూఢిల్లీ: చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తారుు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘అద్భుతంగా ఆడావు సింధు.. చైనా ఓపెన్ గెలిచినందుకు శుభాభివందనాలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు.  పీవీ సింధు తన కెరీర్‌లో తొలిసారిగా చైనా ఓపెన్ గెలిచి దేశం గర్వించేలా చేసిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అలాగే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె.తారకరామారావు కూడా సింధు విజయాన్ని ట్విట్టర్‌లో అభినందించారు. చైనా ఓపెన్ టైటిల్ అందుకున్న సింధుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. తొలి మ్యాచ్ నుంచి గొప్ప ప్రతిభ కనబరించిందని ప్రశంసించారు. బలమైన ప్రత్యర్థుల నుంచి ఎదురైన పోటీని సమర్థవంతంగా అధిగమించిందని కొనియాడారు. భవిష్యత్‌లోనూ సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సింధు చాలా గొప్ప విజయం సాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్‌తో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ కూడా సింధును కొనియాడారు.

కెరీర్‌లో ఇప్పటి వరకు సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకోలేకపోయానని మనసులో ఏదో ఒక మూల సింధులో కూడా కాస్త వెలితిగా ఉండేది. ఇప్పుడు ఆ లోటు తీరటంతో ఆమెపై భారం తొలగిపోరుుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె చాలా బాగా ఆడింది. ప్రపంచంలో వేర్వేరు వేదికలపై రాణించగలగడం మంచి పరిణామం. ఇందు కోసం ఆమె చాలా కష్టపడింది. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారిణులలో ఒకరిగా నిలవాలంటే నిలకడగా విజయాలు సాధించడం అవసరం. ఆమె ఆటలో ఎదుగుతున్న తీరు సంతోషం కలిగిస్తోంది. గత కొన్ని వారాల్లో విరామం లేకుండా సన్మాన కార్యక్రమాలు ఉన్నా సరే... ప్రాక్టీస్ కోసం కూడా తగినంత సమయం ఇచ్చి శ్రమించింది. ఇందులో సింధు గొప్పతనంతో పాటు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. - పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ 

►  రియో ఒలింపిక్స్ రజతం తర్వాత మళ్లీ ఇప్పుడు సూపర్ సిరీస్ టోర్నీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రియో తర్వాత ఆడిన రెండు టోర్నీల్లోనూ విఫలమయ్యాను. డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో బాగానే ఆడినా కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా మ్యాచ్‌లు కోల్పోవాల్సి వచ్చింది. వాటిని సరిదిద్దుకొని ఈసారి చైనాలో బరిలోకి దిగాను. దాని ఫలితం కనిపించింది. ఇది నా తొలి సూపర్ సిరీస్ టైటిల్ కావడం కూడా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఒలింపిక్స్ స్థారుు గెలుపు తర్వాత తక్కువ వ్యవధిలోనే మరో పెద్ద టైటిల్ గెలుచుకోగలిగాను. ఇందు కోసం చాలా కష్టపడ్డాను. ఫైనల్ ప్రత్యర్థితో చాలా కాలం తర్వాత తలపడ్డాను. రెండో గేమ్ కోల్పోయాక చివరి గేమ్‌లో మరింత బాగా ఆడాల్సి వచ్చింది. విరామం సమయంలో ఆధిక్యం వచ్చిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఫైనల్‌తో పోలిస్తే సుంగ్ జీ హున్‌తో సెమీస్ మ్యాచే కఠినంగా సాగింది.   -ఫుజు నుంచి ‘సాక్షి’తో పీవీ సింధు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement