భళా బియాంక! | Bianca Andreescu beats Serena Williams U.S. Open final | Sakshi
Sakshi News home page

భళా బియాంక!

Published Mon, Sep 9 2019 4:48 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

Bianca Andreescu beats Serena Williams U.S. Open final - Sakshi

బియాంకా ఆండ్రీస్కూ, సెరెనా విలియమ్స్‌

ఒకరి కల నిజమైంది. మరొకరి కల మళ్లీ చెదిరింది. ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనే కెనడా టీనేజర్‌ బియాంకా ఆండ్రీస్కూ అద్భుతం చేసింది. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఆమె సొంతగడ్డపైనే ఓడించింది. మహిళల టెన్నిస్‌లో తన ఎంట్రీని ‘గ్రాండ్‌’గా చాటుకుంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు వచ్చిన నాలుగో ‘గ్రాండ్‌’ అవకాశాన్ని సెరెనా విలియమ్స్‌ చేజార్చుకుంది.

న్యూయార్క్‌: వందలకొద్దీ మ్యాచ్‌ల అనుభవం ఉన్నా... రెండంకెల గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ తమ ఖాతాలో ఉన్నా... రెండు దశాబ్దాల ఘనమైన కెరీర్‌ ఉన్నా... మరోసారి చాంపియన్‌ కావాలంటే, ట్రోఫీని ఒడిసి పట్టుకోవాలంటే అసలు సిసలు సమరంలో బాగా ఆడాల్సిందే. లేదంటే అనుభవం లేని వారి చేతుల్లోనూ పరాభవం తప్పదని యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో వరుసగా రెండో ఏడాదీ రుజువైంది.

అందరి అంచనాలు తారుమారు చేస్తూ... తన జైత్రయాత్ర గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ కెనడా టీనేజర్‌ బియాంకా ఆండ్రీస్కూ యూఎస్‌ ఓపెన్‌లో ‘గ్రాండ్‌ ఫినిష్‌’ ఇచ్చింది. ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనే విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 15వ సీడ్‌ బియాంక 6–3, 7–5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత సెరెనా విలియమ్స్‌ (అమెరికా)పై విజయం సాధించింది. చాంపియన్‌ బియాంకాకు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్‌ సెరెనాకు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

తొలి గేమ్‌లోనే బ్రేక్‌...
ఒక్క యూఎస్‌ ఓపెన్‌లోనే 101 విజయాలు సాధించిన సెరెనాతో ఫైనల్‌ అంటే ఏ ప్రత్యర్థికైనా హడలే. కానీ 19 ఏళ్ల బియాంకా ముఖంలో అలాంటి ఛాయలు కనిపించలేదు. ఫైనల్‌ వేదిక ఆర్థర్‌ యాష్‌ స్టేడియం 26 వేల మంది ప్రేక్షకులతో హౌస్‌ఫుల్‌కాగా... అందులో సెరెనా అభిమానులు, ఆమెకు మద్దతు పలుకుతున్న వారే అధికంగా ఉన్నారు. అయితేనేం బియాంకా తొణకలేదు. మ్యాచ్‌ తొలి సెట్, తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 19 ఏళ్ల ఈ కెనడా అమ్మాయి సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన బియాంకా ఆ తర్వాతా ఎక్కడా దూకుడు తగ్గించలేదు. బియాంకా ఆటతీరును పరిశీలిస్తే సెరెనాతో ఫైనల్లో ఎలా ఆడితే గెలుస్తారో అన్న విషయంపై పూర్తి హోంవర్క్‌ చేసినట్టు కనిపించింది. కచ్చితమైన సర్వీస్‌లు... పదునైన రిటర్న్‌లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లు... ఇలా పక్కా ప్రణాళికతో ఆడిన బియాంక చూస్తుండగానే తొలి సెట్‌లోని తొమ్మిదో గేమ్‌లో మరోసారి సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌ను 6–3తో గెల్చుకుంది.

ఒత్తిడికి లోనై...
బియాంక పుట్టకముందే యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచిన సెరెనా తన అనుభవమంత వయస్సులేని ప్రత్యర్థి దూకుడు ముందు ఒత్తిడికి లోనైంది. కీలకమైన తొలి సర్వీస్‌లో తడబడటం... రెండో సర్వీస్‌లోనూ నిలకడలేమి... లెక్కలేనన్ని అనవసర తప్పిదాలతో సెరెనా ఆట సాగింది. మరోవైపు ప్రతి పాయింట్‌లో పూర్తి విశ్వాసంతో ఆడిన బియాంకా రెండో సెట్‌లోనూ చెలరేగిపోయింది. 5–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సెరెనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేసింది. కానీ బియాంక 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని.. 12వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.  

నా విజయానుభూతిని మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం నేను చాలా  కష్టపడ్డాను. ఈ ఏడాది నా కలలన్నీ నిజమయ్యాయి. ఈ అత్యున్నత వేదికపై సెరెనాలాంటి దిగ్గజంతో ఫైనల్‌ ఆడటం అద్భుతం. ఎవరితో, ఏ స్థాయి ప్రత్యర్థితో ఆడుతున్నాననే విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఎప్పటిలాగే నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. ఈ గొప్ప విజయం సాధించిన క్రమంలో ప్రతి అంశాన్ని నేను నియంత్రించిన తీరుపట్ల గర్వపడుతున్నాను. నా లక్ష్యం సాధ్యమైనన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవడం. ప్రపంచ నంబర్‌వన్‌ కావడం. ఈ గెలుపుతో వచ్చిన ప్రైజ్‌మనీని ఏంచేయాలో ఇంకా ఆలోచించలేదు. ఇంత భారీ మొత్తాన్ని నా జీవితంలో అందుకోలేదు.
–బియాంక ఆండ్రీస్కూ


ఈ టోర్నమెంట్‌ మొత్తంలో నేను ఆడిన చెత్త మ్యాచ్‌ ఇదే. నేనింకా బాగా ఆడాల్సింది. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును సమం చేయడానికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నాను. ఇలా జరగడం ఎంతో అసహనం కలిగిస్తోంది. ఆమె రికార్డును అందుకోవడానికి నేను ఆడట్లేదు. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించడానికి ఆడుతున్నాను. తుది ఫలితంతో నేను సంతోషంగా లేను. నిజాయతీగా చెప్పాలంటే ఫైనల్లో నేను బాగా ఆడలేదు. ఫైనల్లో బియాంక చాలా అద్భుతంగా ఆడింది. ఆమె విజయంపట్ల గర్వపడుతున్నాను.
–సెరెనా విలియమ్స్‌

1: కెనడా తరఫున గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌ బియాంక. గతంలో యూజిన్‌ బుషార్డ్‌ (2014 వింబుల్డన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌), మిలోస్‌ రావ్‌నిచ్‌ (2016 వింబుల్డన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌) రన్నరప్‌గా నిలిచారు.  

2: కెరీర్‌లో ఆడిన నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలిచిన రెండో ప్లేయర్‌ బియాంక. గతంలో మోనికా సెలెస్‌ (1990లో ఫ్రెంచ్‌ ఓపెన్‌) మాత్రమే ఈ ఘనత సాధించింది.  

8: గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో సెరెనాను ఓడించిన ఎనిమిదో క్రీడాకారిణి బియాంక. గతంలో వీనస్‌ విలియమ్స్‌ (2 సార్లు–అమెరికా), షరపోవా (రష్యా), సమంతా స్టోసుర్‌ (ఆస్ట్రేలియా), ఎంజెలిక్‌ కెర్బర్‌ (2 సార్లు–జర్మనీ), గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌), నయోమి ఒసాకా (జపాన్‌), సిమోనా హలెప్‌ (రొమేనియా) ఈ ఘనత సాధించారు.  

1: సెరెనా తన కెరీర్‌లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో (2018– వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌; 2019– వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) ఓడింది.

5: తాజా విజయంతో నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో బియాంక తన కెరీర్‌ బెస్ట్‌ ఐదో ర్యాంక్‌కు చేరుకుంటుంది.

8: తన కెరీర్‌లో టాప్‌–10 ర్యాంకింగ్స్‌లోని క్రీడాకారిణులతో తలపడిన ఎనిమిది సార్లూ బియాంకానే గెలుపొందడం విశేషం. ఈ ఏడాది ఓవరాల్‌గా బియాంక 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement