Bianca Andreescu
-
బియాంక ఓటమి... మాజీ విజేతలెవరూ ఇక మిగల్లేదు!
న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. 2019 చాంపియన్ బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగడంతో మాజీ విజేతలెవరూ బరిలోకి మిగల్లేదు. 3 గంటల 29 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 17వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–7 (2/7), 7–6 (8/6), 6–3తో ఆరో సీడ్ బియాంకాపై విజయం సాధించింది. రెండో సెట్ టైబ్రేక్‌లో సాకరి మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. మరోవైపు సంచలనాలతో దూసుకొచ్చిన క్వాలిఫయర్, 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను (బ్రిటన్) తన దూకుడు కొనసాగిస్తూ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రాడుకాను 6–2, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)ను 56 నిమిషాల్లో చిత్తు చేసింది. మూడో రౌండ్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీని ఓడించిన షెల్బీ ఈ మ్యాచ్‌లో బ్రిటన్ టీనేజర్ ధాటికి ఎదురునిలువలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (14/12), 6–3తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను, నాలుగో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో 14వ సీడ్ పావ్లుచెంకోవా (రష్యా)ను ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో టోక్యో ఒలింపిక్ చాంపియన్ బెన్‌చిచ్‌తో రాడుకాను; ప్లిస్కోవాతో సాకరి; స్వితోలినా (ఉక్రెయిన్)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా); సబలెంకా (బెలారస్) తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు. చదవండి: Us Open 2021: క్వార్టర్ ఫైనల్లోకి వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ -
ఆండ్రెస్కూ అవుట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ క్రీడాకారిణి బియాంక ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. 3 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా) 6–7 (1/7), 7–6 (7/2), 9–7తో బియాంక ఆండ్రెస్కూపై అద్భుత విజయం సాధించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. గత రెండేళ్లలో జిదాన్సెక్ ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. జిదాన్సెక్తో జరిగిన మ్యాచ్‌లో బియాంక తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోవడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 63 అనవసర తప్పిదాలు చేసింది. స్వియాటెక్ ముందంజ... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలి రౌండ్లో 6–0, 7–5తో కాజా జువాన్ (స్లొవేనియా)పై... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 4–6, 6–3తో 2017 చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో 16వ సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 1–6, 6–3, 4–6తో పొలానా హెర్కాగ్ (స్లొవేనియా) చేతిలో... 19వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–7 (5/7), 2–6తో సిర్స్టియా (రొమేనియా) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ మెద్వెదేవ్ (రష్యా)... స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ శుభా రంభం చేశారు. మెద్వెదేవ్ 6–3, 6–3, 7–5తో బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలిచి తొలిసారి రెండో రౌండ్‌కు చేరాడు. ఫెడరర్ 6–2, 6–4, 6–3తో ఇస్తోమిన్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. -
Madrid Open: టోర్నీ నుంచి వైదొలిగిన బియాంక
మాడ్రిడ్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మాజీ చాంపియన్, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) కరోనా వైరస్ బారిన పడింది. ఈనెల 29 నుంచి జరిగే మాడ్రిడ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మాడ్రిడ్‌కు బయలుదేరేముందు నిర్వహించిన రెండు పరీక్షల్లో 20 ఏళ్ల ఆండ్రెస్కూకు నెగెటివ్ రాగా... మాడ్రిడ్‌లో అడుగుపెట్టాక పాజిటివ్ రావడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: World Chess Championship: కార్ల్సన్ ప్రత్యర్థి అతడే! -
మయామి ఓపెన్ ఫైనల్లో బియాంక
ఫ్లోరిడా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) ఫైనల్‌కు చేరింది. మరియా సాకరి (గ్రీస్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బియాంక 2 గంటల 42 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 7–6 (7/4)తో విజయం సాధించింది. 2019లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత బియాంక మరో టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో బియాంక తలపడుతుంది. మరో సెమీఫైనల్లో బార్టీ 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. -
ఎవరీ బియాంక..!
ఏడాది క్రితం వరకు టాప్–150లో కూడా లేని బియాంక నేడు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. యూఎస్ ఓపెన్ చాంపియన్ కావాలని మూడేళ్ల క్రితమే బియాంక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2016లో ప్రతిష్టాత్మక జూనియర్ టోర్నీ ఆరెంజ్ బౌల్ టైటిల్ సాధించిన బియాంక... యూఎస్ ఓపెన్ చాంపియన్‌కు ఇచ్చే చెక్ ప్రతిని తయారు చేసుకొని దానిపై తన పేరును రాసుకుంది. మూడేళ్ల తర్వాత బియాంక ఏకంగా నిజమైన చెక్‌నే అందుకోవడం విశేషం. బియాంక తల్లిదండ్రులు మారియా, నికూ 1994లో రొమేనియా నుంచి కెనడాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. 2000 జూన్ 16న టొరంటోలో బియాంక జన్మించింది. ఏడేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టుకున్న బియాంక నాలుగేళ్ల తర్వాత కెనడా జాతీయ టెన్నిస్ ప్రోగ్రామ్‌లో భాగమైంది. కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2016లో రోజర్స్ కప్ టోర్నీ సందర్భంగా సిమోనా హలెప్ సూచనతో ప్రొఫెషనల్‌గా మారింది. తల్లి మారియా పర్యవేక్షణలో 12 ఏళ్ల ప్రాయం నుంచే ధ్యానం చేసే అలవాటు చేసుకున్న బియాంక 2017లో వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టి తొలి రౌండ్లో నిష్క్రమించింది. 2018లో నిలకడగా ఆడిన ఆమె ఈ ఏడాది మరింత రాటుదేలింది. ప్రీమియర్ ఈవెంట్ టోర్నీలైన ఇండియన్ వెల్స్ ఓపెన్, రోజర్స్ కప్ టోర్నీల్లో టైటిల్స్ గెలిచి యూఎస్ ఓపెన్‌లో అడుగు పెట్టింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. గాయాల బారిన పడకుండా... తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటే 2020లో బియాంక ఖాతాలో మరిన్ని టైటిల్స్ చేరే అవకాశముంది. -
భళా బియాంక!
ఒకరి కల నిజమైంది. మరొకరి కల మళ్లీ చెదిరింది. ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే కెనడా టీనేజర్ బియాంకా ఆండ్రీస్కూ అద్భుతం చేసింది. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఆమె సొంతగడ్డపైనే ఓడించింది. మహిళల టెన్నిస్‌లో తన ఎంట్రీని ‘గ్రాండ్’గా చాటుకుంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు వచ్చిన నాలుగో ‘గ్రాండ్’ అవకాశాన్ని సెరెనా విలియమ్స్ చేజార్చుకుంది. న్యూయార్క్: వందలకొద్దీ మ్యాచ్‌ల అనుభవం ఉన్నా... రెండంకెల గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తమ ఖాతాలో ఉన్నా... రెండు దశాబ్దాల ఘనమైన కెరీర్ ఉన్నా... మరోసారి చాంపియన్ కావాలంటే, ట్రోఫీని ఒడిసి పట్టుకోవాలంటే అసలు సిసలు సమరంలో బాగా ఆడాల్సిందే. లేదంటే అనుభవం లేని వారి చేతుల్లోనూ పరాభవం తప్పదని యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వరుసగా రెండో ఏడాదీ రుజువైంది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ... తన జైత్రయాత్ర గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ కెనడా టీనేజర్ బియాంకా ఆండ్రీస్కూ యూఎస్ ఓపెన్‌లో ‘గ్రాండ్ ఫినిష్’ ఇచ్చింది. ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6–3, 7–5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. చాంపియన్ బియాంకాకు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి గేమ్‌లోనే బ్రేక్... ఒక్క యూఎస్ ఓపెన్లోనే 101 విజయాలు సాధించిన సెరెనాతో ఫైనల్ అంటే ఏ ప్రత్యర్థికైనా హడలే. కానీ 19 ఏళ్ల బియాంకా ముఖంలో అలాంటి ఛాయలు కనిపించలేదు. ఫైనల్ వేదిక ఆర్థర్ యాష్ స్టేడియం 26 వేల మంది ప్రేక్షకులతో హౌస్ఫుల్కాగా... అందులో సెరెనా అభిమానులు, ఆమెకు మద్దతు పలుకుతున్న వారే అధికంగా ఉన్నారు. అయితేనేం బియాంకా తొణకలేదు. మ్యాచ్ తొలి సెట్, తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి 19 ఏళ్ల ఈ కెనడా అమ్మాయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన బియాంకా ఆ తర్వాతా ఎక్కడా దూకుడు తగ్గించలేదు. బియాంకా ఆటతీరును పరిశీలిస్తే సెరెనాతో ఫైనల్లో ఎలా ఆడితే గెలుస్తారో అన్న విషయంపై పూర్తి హోంవర్క్ చేసినట్టు కనిపించింది. కచ్చితమైన సర్వీస్‌లు... పదునైన రిటర్న్‌లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు... ఇలా పక్కా ప్రణాళికతో ఆడిన బియాంక చూస్తుండగానే తొలి సెట్లోని తొమ్మిదో గేమ్‌లో మరోసారి సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 6–3తో గెల్చుకుంది. ఒత్తిడికి లోనై... బియాంక పుట్టకముందే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన సెరెనా తన అనుభవమంత వయస్సులేని ప్రత్యర్థి దూకుడు ముందు ఒత్తిడికి లోనైంది. కీలకమైన తొలి సర్వీస్‌లో తడబడటం... రెండో సర్వీస్‌లోనూ నిలకడలేమి... లెక్కలేనన్ని అనవసర తప్పిదాలతో సెరెనా ఆట సాగింది. మరోవైపు ప్రతి పాయింట్లో పూర్తి విశ్వాసంతో ఆడిన బియాంకా రెండో సెట్లోనూ చెలరేగిపోయింది. 5–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సెరెనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేసింది. కానీ బియాంక 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని.. 12వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. నా విజయానుభూతిని మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ ఏడాది నా కలలన్నీ నిజమయ్యాయి. ఈ అత్యున్నత వేదికపై సెరెనాలాంటి దిగ్గజంతో ఫైనల్ ఆడటం అద్భుతం. ఎవరితో, ఏ స్థాయి ప్రత్యర్థితో ఆడుతున్నాననే విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఎప్పటిలాగే నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. ఈ గొప్ప విజయం సాధించిన క్రమంలో ప్రతి అంశాన్ని నేను నియంత్రించిన తీరుపట్ల గర్వపడుతున్నాను. నా లక్ష్యం సాధ్యమైనన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం. ప్రపంచ నంబర్‌వన్ కావడం. ఈ గెలుపుతో వచ్చిన ప్రైజ్‌మనీని ఏంచేయాలో ఇంకా ఆలోచించలేదు. ఇంత భారీ మొత్తాన్ని నా జీవితంలో అందుకోలేదు. –బియాంక ఆండ్రీస్కూ ఈ టోర్నమెంట్ మొత్తంలో నేను ఆడిన చెత్త మ్యాచ్ ఇదే. నేనింకా బాగా ఆడాల్సింది. మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయడానికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నాను. ఇలా జరగడం ఎంతో అసహనం కలిగిస్తోంది. ఆమె రికార్డును అందుకోవడానికి నేను ఆడట్లేదు. గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడానికి ఆడుతున్నాను. తుది ఫలితంతో నేను సంతోషంగా లేను. నిజాయతీగా చెప్పాలంటే ఫైనల్లో నేను బాగా ఆడలేదు. ఫైనల్లో బియాంక చాలా అద్భుతంగా ఆడింది. ఆమె విజయంపట్ల గర్వపడుతున్నాను. –సెరెనా విలియమ్స్ 1: కెనడా తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్ బియాంక. గతంలో యూజిన్ బుషార్డ్ (2014 వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్), మిలోస్ రావ్‌నిచ్ (2016 వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్) రన్నరప్‌గా నిలిచారు. 2: కెరీర్లో ఆడిన నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలిచిన రెండో ప్లేయర్ బియాంక. గతంలో మోనికా సెలెస్ (1990లో ఫ్రెంచ్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించింది. 8: గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో సెరెనాను ఓడించిన ఎనిమిదో క్రీడాకారిణి బియాంక. గతంలో వీనస్ విలియమ్స్ (2 సార్లు–అమెరికా), షరపోవా (రష్యా), సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా), ఎంజెలిక్ కెర్బర్ (2 సార్లు–జర్మనీ), గార్బిన్ ముగురుజా (స్పెయిన్), నయోమి ఒసాకా (జపాన్), సిమోనా హలెప్ (రొమేనియా) ఈ ఘనత సాధించారు. 1: సెరెనా తన కెరీర్లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో (2018– వింబుల్డన్, యూఎస్ ఓపెన్; 2019– వింబుల్డన్, యూఎస్ ఓపెన్) ఓడింది. 5: తాజా విజయంతో నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో బియాంక తన కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌కు చేరుకుంటుంది. 8: తన కెరీర్లో టాప్–10 ర్యాంకింగ్స్‌లోని క్రీడాకారిణులతో తలపడిన ఎనిమిది సార్లూ బియాంకానే గెలుపొందడం విశేషం. ఈ ఏడాది ఓవరాల్‌గా బియాంక 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. -
గ్రాండ్‌స్లామ్ సాధించిన 19 ఏళ్ల సంచలనం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఫైనల్లో సంచలనం నమోదైంది. కెనడియన్ బియాంక ఆండ్రిస్యూ (19) మాజీ వరల్డ్ నెంబర్ వన్, అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించింది. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో బియాంక ఆండ్రిస్యూ 6-3, 7-5 తేడాతో సెరెనాపై గెలిచింది. హోరాహోరి పోరులో ధీటైన ఆటతో విన్నర్‌గా నిలిచిన ఆండ్రిస్యూ ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి కెనడియన్‌గా నిలిచింది. దాంతోపాటు పిన్న వయసులో (19 ఏళ్లు) గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మహిళగా ఆమె రికార్టు సృష్టించింది. ఇదిలాఉండగా.. గత రెండేళ్లలో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొంనేందుకు కూడా ఆండ్రిస్యూ అర్హత సాధించకపోవడం గమనార్హం. ఇక ఈ విజయంతో ఓపెన్ శకంలో అత్యధికంగా యూఎస్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన రికార్డును సొంతం చేసుకోవలానుకున్న సెరెనాకు నిరాశ తప్పలేదు. ఇప్పటివరకూ ఆమె ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది. ఇక 2017 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది సెరెనాకు అందని ద్రాక్షగానే ఉంది. గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్ క్రీడాకారిణి ఒసాకా చేతిలో సెరెనా పరాజయం పాలై రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. 2014లో చివరిసారి యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలిచారు సెరెనా. ఆమె ఇప్పటివరకు 23 మరో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్నారు. మరో టైటిల్ గెలిస్తే.. అత్యధిక సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24 గ్రాండ్ స్లామ్టైటిల్స్) ఆల్ టైమ్ రికార్డును సెరెనా సమం చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)